Telangana Dycm Bhatti Vikramarka
Telangana Dycm Bhatti Vikramarka | సీఎండీలు, ఎస్సీ ల వరకు క్షేత్రస్థాయికి వెళ్ళండి
వేసవిలో విద్యుత్ సరఫరా ప్రణాళికలపై అవగాహన కల్పించండి
జనవరి 27 నుంచి ఫిబ్రవరి 4 వరకు అవగాహన కార్యక్రమాలు పూర్తి చేయాలి
విద్యుత్ అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు
Hyderabad : రాష్ట్రంలో వచ్చే సమ్మర్ కాలంలో నిరాటంకంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరాకు అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఈ మేరకు సీఎండీల నుంచి ఎస్సీ స్థాయి అధికారులు వెంటనే రాష్ట్రవ్యాప్తంగా క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ప్రజాభవన్లో సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వేసవిలో ప్రణాళికను సమర్ధవంతంగా అమలు చేయడంలో భాగంగా రాష్ట్రంలోని ట్రాన్స్ కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ అధికారులు, సిబ్బంది కార్యాచరణ ప్రారంభించాలన్నారు. క్షేత్రస్థాయిలో, వేసవి విద్యుత్ ప్రణాళిక అమలుపై సమీక్షలు , అవగాహన సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశాల్లో అధికారులు, సిబ్బందితోపాటు రైతులు, వినియోగదారులు, మీడియా ప్రతిధులను భాగస్వాములను చేయాలని కోరారు. గత వేసవిలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది సమర్థవంతంగా విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఈ సమావేశంలో వివరించాలని తెలిపారు. అలాగే రైతులు, వినియోగదారుల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించాలని సూచించారు.
జనవరి 27 నుంచి ఫిబ్రవరి 4 వరకు వేసవి ప్రణాళికపై క్షేత్రస్థాయిలో విస్తృత సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. జనవరి 27న నోడల్ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు సంబంధించి షెడ్యూల్ ను వెల్లడించి విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు. జనవరి 29న నోడల్ అధికారులు ట్రాన్స్ కో ఉన్నతాధికారులతో కలిసి జిల్లా, సబ్ డివిజన్ స్థాయిలో వేసవి కార్యాచరణ పై సమీక్ష సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ఫిబ్రవరి 4న ఎస్సీలు డివిజన్ స్థాయిలో పూర్తి సిబ్బందితో కలిసి సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై సమీక్ష సమావేశం నిర్వహించాలి, ఈ సమావేశంలో సబ్ స్టేషన్ లో ఓవర్ లోడ్ ఫీడర్లు, డిటిఆర్ లలో గత మూడు సంవత్సరాలుగా ఎదురవుతున్న సమస్యలు, వాటిని ఎలా ఎదుర్కోబోతున్నారో క్షేత్రస్థాయి సమావేశాల్లో వివరించాలని అధికారులను డిప్యూటీ సీఎం స్పష్టంగా తెలిపారు. ముఖ్యంగా వినియోగదారుల నుంచి స్వీకరించే ఫిర్యాదులను సత్వరం పరిష్కరిస్తూ.. నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడం వంటి అంశాలను ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చించాలని కోరారు. సమావేశంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్, ఎస్పీడీసీఎల్ సిఎండి ముషారఫ్ అలీ, ఎన్పీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
* * *
Leave A Comment