రుతుక్రమంపై మూఢనమ్మకం : యువతి మృతి

ప్రపంచం అభివృద్ధిలో దూసుకుపోతోంది. మానవ మేధస్సు నింగికి నిచ్చెన వేస్తోంది. విశ్వంలో ఇతర గ్రహాలపై జీవాన్వేషణ కోసం మనిషి జువ్వున దూసుకుపోతున్నాడు. కానీ ఇదంతా నాణేనికి ఓవైపు మాత్రమే. చీకట్లు, వేదనలు, వేధింపులు, మూఢనమ్మకాలు, ఆకలి కేకలు మరో వైపు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సామాజిక దురాచారాలకు మహిళలు ఇంకా బలవుతూనే ఉన్నారు. నేపాల్ లో ఈ ఏడాది జనవరి 31న జరిగిన ఓ ఘటన.. ఈ ప్రపంచంలో లింగ సమానత ఇంకా సుదూరంలో ఉందని చెబుతోంది. నేపాల్ లోని మారుమూల జిల్లా దోతిలో రుతుక్రమంపై కొన్నిజాతుల్లో ఉన్న మూఢనమ్మకం 21 ఏళ్ల యువతి ప్రాణం తీసింది. రుతుక్రమంలో ఉన్న పార్వతి అనే 21 ఏళ్ల యువతిని ఇంటి నుంచి బయటకు పంపించారు. ఊరి చివరన ఉన్న ఓ గుడిసెలో 3 రోజులు ఎవరికి కనపడకుండా ఉండాలి. బహిస్టు రోజుల్లో మహిళలు ఇంట్లో కాకుండా బయట ఒంటరిగా ఉండాలనేది అక్కడి ఆచారం. అయితే ఆ గుడిసెకు కిటికీలు కూడా లేకపోవటంతో.. పార్వతి ఊపిరి ఆడక శ్వాస సంబంధిత ఇబ్బందితో కన్నుమూసింది.

వాస్తవానికి పార్వతి ప్రతి నెలా రుతుక్రమ సమయంలో ఇంటి పక్కనే ఉన్న ఖాళీ గుడిసెలో ఉండేది. అయితే ఈసారి అదే సమయంలో మరో ముగ్గురు మహిళలు ఆ ఇంట్లో ఉండటానికి రావటంతో.. పార్వతి ఊరి చివరన ఉన్న మరో ఇంటికి వెళ్లింది. ఆ ఇళ్లు పూర్తిగా గాలి ఆడకుండా ఉండటంతో ప్రాణాలు కోల్పోయింది. నేపాల్ లో ఉన్న ఈ దురాచారాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు 2005లో నిషేధించింది. అయినా ఇలాంటి ఘటనలు ఆగకపోవటంతో.. 2017లో ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చారు. రుతుక్రమంలో ఉన్న మహిళలను ఇంటి నుంచి బయటకు పంపడాన్ని నేరంగా పరగణించి క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారాన్ని పోలీసులకు ఈ చట్టం కల్పించింది. అయినాఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూ చట్టాలనే సవాలు చేస్తున్నాయి.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments