జాతీయం
☛ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భారత్ పురోగతి
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భారత్ 2017లో గణనీయమైన పురోగతి సాధించిందని.. “ చైల్డ్ లేబర్ అండ్ ఫోర్స్ డ్ లేబర్” పేరుతో అమెరికా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడంలో గతేడాది 132 దేశాలు తీసుకున్న చర్యలను అధ్యయనం చేసిన తర్వాత.. కేవలం 14 దేశాలు ఈ అంశంలో పురోగతి సాధించాయని నివేదిక స్పష్టం చేసింది. ఈ 14 దేశాల్లో భారత్ ఒకటని వెల్లడించింది. భారత్ తో పాటు కొలంబియా, పరాగ్వే దేశాలు నివేదిక ప్రమాణాలను అందుకున్నాయి.
-
International Labour Organisation రూపొందించిన 182, 138 ఒడంబడికలపై భారత్ సంతకం చేసింది. అలాగే దీనికి అనుగుణంగా బాల కార్మిక నిర్మూలన చట్టంలో మార్పులు చేసి… 18 ఏళ్లకు తక్కువ ఉన్న పిల్లలతో పని చేయించడం నేరం కిందకి వస్తుందని పేర్కొంది.
-
International Labour Organisation ను 1919 ను ఏర్పాటు చేశారు. కేంద్ర కార్యాలయం స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉంది.
☛ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ప్రారంభం
కేంద్ర ప్రభుత్వం 2018-19 బడ్జెట్ లో ప్రకటించిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 23న జార్ఖండ్ లోని రాంచీలో అధికారికంగా ప్రారంభించారు. ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన – PM JAY పేరుతో పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దేశంలోని పేదలకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పించడం ఈ పథకం ఉద్దేశం
-
ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ప్రాయోజిత ఆరోగ్య బీమా పథకం
-
పథకం ద్వారా దేశంలోని 10 కోట్ల కుటుంబాల్లోని దాదాపు 50 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం ప్రకటించింది.
-
తాజా సామాజిక, ఆర్థిక కుల గణన (SECC) సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 8.03 కోట్ల కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో 2.33 కోట్ల కుటుంబాలు ఈ పథకాన్ని పొందవచ్చు.
-
పథకంలో నమోదు కోసం ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.
-
రాష్ట్రాల వద్ద ఉన్న దారిద్ర్య రేఖకు దిగవునున్న వారి వివరాలను నేరుగా పథకంలో చేరుస్తారు.
-
దేశవ్యాప్తంగా 445 జిల్లాల్లో ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభమైంది.
-
గుండె సర్జరీ, మూత్రపిండాలు, లివర్ సమస్యలు, మోకాలి చిప్ప మార్పిడి, షుగర్ తదితర 1300కు పైగా వ్యాధులకు ఈ బీమా వర్తిస్తుంది.
-
తెలంగాణ, ఒడిశా, ఢిల్లీ, కేరళ, పంజాబ్ మినహా… మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు… ఈ పథకంలో చేరాయి.
-
పథకం అమలుకు కేంద్రం 60 శాతం నిధులను అందిస్తుంది. మిగతా 40 శాతం ఆయా రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది.
-
71వ జాతీయ సాంపిల్ సర్వే ఆర్గనైజేషన్(NSSO) ప్రకారం.. 85.9 శాతం గ్రామీణ కుటుంబాలు, 82 శాతం పట్టణ కుటుంబాలకు ఆరోగ్య బీమా లేదు.
-
ఆయుష్మాన్ భారత్ CEO – ఇందూ భాషణ్
☛ 5జీ సేవల కోసం జపాన్ సంస్థలతో బీఎస్ఎన్ఎల్ ఒప్పందం
భారత్ లో 5జీ సేవలను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ – BSNL కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా బీఎస్ఎన్ఎల్.. జపాన్ కు చెందిన సాఫ్ట్ బ్యాంక్, ఎన్ టీటీ కమ్యూనికేషన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా చొరవతో ఈ ఒప్పందం జరిగినట్లు బీఎస్ఎన్ఎల్ అధికారులు సెప్టెంబర్ 22న వెల్లడించారు.
☛ డీబీహెచ్ఎస్ వందేళ్ల వేడుకలను ప్రారంభించిన రాష్ట్రపతి
దక్షిణ భారత హిందీ మహాసభ(DBHS) వందేళ్ల వేడుకలను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సెప్టెంబర్ 22న న్యూఢిల్లీలో ప్రారంభించారు. డీబీహెచ్ఎస్ విద్యాలయం కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లతో స్వతంత్ర హోదాలో పనిచేస్తోన్న సంస్థ.
-
దక్షిణ భారతంలో హిందీ భాషా అభివృద్ధి కోసం 1918లో దక్షిణ భారత హిందీ మహాసభను ఏర్పాటు చేశారు.
-
తద్వారా దక్షిణ, ఉత్తర భారత అనుసంధానానికి ఉన్న భాషా బేధాన్ని తొలగించాలన్నది లక్ష్యం.
-
డీబీహెచ్ఎస్ కేంద్ర కార్యాలయం తమిళనాడులోని చెన్నైలో ఉంది.
-
మహాత్మా గాంధీ సహకారంతో అన్నీ బీసెంట్ ఈ సంస్థను నెలకొల్పారు.
-
గాంధీజీ ఈ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించారు.
-
1964లో కేంద్ర ప్రభుత్వం డీబీహెచ్ఎస్ ను జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా గుర్తించింది.
☛ ఒడిశాలో ఝార్సుగూడా ఎయిర్ పోర్టుని ప్రారంభించిన ప్రధాని
ఒడిశాలోని ఝార్సుగూడాలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సెప్టంబర్ 23న ప్రారంభించారు. ప్రాంతీయ అనుసంధాన పథకం(Regional Connectivity Scheme – RCN) UDAN( Ude Deshk Ka Aaam Naagrik) లో భాగంగా నిర్మించిన తొలి ఎయిర్ పోర్టు ఇది.
-
ఈ విమానాశ్రయం ద్వారా ఒడిశాలోని భువనేశ్వర్, రాయ్ పూర్, రాంచీ నగరాలతో ప్రాంతీయ అనుసంధానం ఏర్పడుతుంది.
-
ఒడిశాలోని మరో మూడు నగరాలు.. జైపూర్ (కొరాపుట్ జిల్లా), రూర్ కేలా(సుందర్ ఘర్ జిల్లా), ఉట్కేలా(కాలాహండి జిల్లా) లో విమానాశ్రయాలు నిర్మాణంలో ఉన్నాయి.
☛ దేశంలో జడ్జీలు – ప్రజల నిష్పత్తి 10 లక్షలు : 19.49
భారత్ లో ప్రతి పది లక్షల మందికి దాదాపు 19 మంది చొప్పున న్యాయమూర్తులు ఉన్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం దేశంలోని కింది స్థాయి కోర్టులతో కలిపి మొత్తం 6 వేల మంది న్యాయమూర్తుల కొరత ఉంది. పార్లమెంటులో చర్చ కోసం కేంద్ర న్యాయశాఖ 2018 మార్చిలో ఈ నివేదికను రూపొందించింది.
☛ సిక్కింలో తొలి విమానాశ్రయం ప్రారంభం
సిక్కింలో రాష్ట్రంలోని పాక్ యాంగ్ నగరంలో నిర్మించిన ఆ రాష్ట్ర తొలి ఎయిర్ పోర్టుని ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 24న ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 2014 వరకు దేశంలో 65 విమానాశ్రయాలు ఉన్నాయని.. గత నాలుగేళ్లలో తమ ప్రభుత్వం కొత్తగా 35 ఎయిర్ పోర్టులని నిర్మించిందని… దీంతో పాక్ యాంగ్ ఎయిర్ పోర్ట్ దేశంలోని 100వ ఎయిర్ పోర్టుగా నిలిచిందని ప్రధాని వివరించారు.
-
పాక్ యాంగ్ పట్టణంలో సముద్ర మట్టానికి 4,500 అడుగుల ఎత్తులో కొండలపై ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుని నిర్మించారు.
-
ఎయిర్ పోర్టు 201 ఎకరాల్లో విస్తరించి ఉంది.
-
కొత్తగా ఓ ప్రాంతంలో పూర్తిస్థాయిలో నిర్మించే ఎయిర్ పోర్టుని గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయంగా పిలుస్తారు.
☛ ఢిల్లీలో WAYU పరికరాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి హర్షవర్దన్
గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు ఉద్దేశించిన WAYU(Wind Augmentation Purifying Unit) పరికరాన్ని న్యూఢిల్లీలోని ముకర్బా చౌక్ వద్ద సెప్టెంబర్ 25న కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్దన్ ఆవిష్కరించారు.
-
Council of Scientific and Industrial Research – National Environmental Engineering Research Institute (CSIR-NEERI) రూపొందించిన ఈ పరికరం గాలిలో కాలుష్య కారకాలను పీల్చుకొని స్వచ్ఛమైన గాలిని విడుదల చేస్తుంది.
-
500 చదరపు మీటర్లు పరిధిలో గాలిని పీల్చుకుంటుంది.
-
సగం యూనిట్ విద్యుత్ తో ఈ పరికరం 10 గంటలు పనిచేస్తుంది.
-
దీనికి నెల రోజుల నిర్వహణ వ్యయం కేవలం రూ.1500
☛ ఆధార్ చట్టబద్ధతపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు
ఆధార్ రాజ్యాంగ బద్ధమే అని పేర్కొంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సెప్టెంబర్ 26న చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. దీని ద్వారా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందన్న వాదనలో వాస్తవం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు 12 సంకెల ఆధార్ నంబర్ ను కొన్ని సేవలకు మాత్రమే తప్పనిసరి చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4:1 తో 1,442 పేజీల కీలక తీర్పు వెలువరించింది. ధర్మాసనంలో ఇదర సభ్యులు జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఖన్విల్కర్.
తీర్పులోని ముఖ్యాంశాలు
-
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి
-
ఆదాయ పన్ను దాఖలు, పాన్ నెంబర్ కు ఆధార్ తప్పనిసరి
-
ప్రభుత్వం నుంచి రాయితీ పొందే పథకాలకు ఆధార్ తప్పనిసరి
-
బ్యాంకు ఖాతా తెరవడానికి ఆధార్ అవసరం లేదు
-
టెలికం సంస్థలకు ఆధార్ వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సిమ్ కార్డు పొందడానికి కూడా అవసరం లేదు
-
విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఆధార్ అవసరం లేదు
-
సీబీఎస్ఈ, యూజీసీ, నీట్ వంటి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఆధార్ వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు
ఆధార్ గురించి మరింత సమాచారం
-
ఆధార్ ను 2009లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది
-
2010 సెప్టెంబర్ లో తొలి ఆధార్ నెంబర్ కేటాయించారు
-
2010 డిసెంబర్ లో ఆధార్ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టారు
-
2016 సెప్టంబర్ లో అమల్లోకి వచ్చిన ఆధార్ చట్టం
☛ NDCC కి కేంద్ర కేబినెట్ ఆమోదం
National Digital Communications Policy – 2018(NDCC) కి కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 26న ఆమోదం తెలిపింది. 2022 నాటికి దేశీయ టెలికం రంగంలో 10 వేల కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఈ రంగంలో 40 లక్షల ఉద్యోగాల కల్పన ఈ పాలసీ ముఖ్య లక్ష్యం. కొత్త పాలసీతో స్థూల దేశీయ ఉత్పత్తి(జీడీపీ)లో టెలికం రంగం వాటా ప్రస్తుతం ఉన్న 6 శాతం నుంచి 8 శాతానికి పెరుగుతుందని కేంద్ర టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు.
☛ రాజ్యాంగ ప్రాధాన్యమున్న కేసుల విచారణ లైవ్
కోర్టు విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలన్న ప్రతిపాదనకు సుప్రీం కోర్టు సెప్టెంబర్ 26న అంగీకారం తెలిపింది. పైలెట్ ప్రాజెక్టుగా మొదట సుప్రీంకోర్టులో రాజ్యాంగ ప్రాధాన్యమున్న కేసులను మాత్రమే లైవ్ ఇస్తారని వెల్లడించింది. ఈ మేరకు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేసిన తర్వాత అన్ని కేసులకు లైవ్ అనుమతిస్తామని కోర్టు స్పష్టం చేసింది.
☛ ఇస్మాయిల్ ఫారుఖీ తీర్పుని సమర్థించిన సుప్రీంకోర్టు
ఆయోధ్య రామమందిరం కేసు విషయంలో 1994 నాటి ఇస్మాయిల్ ఫారుఖీ తీర్పుని సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ కేసుని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసేందుకు నిరాకరిస్తూ సెప్టెంబర్ 27న చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం 2 : 1 తేడాతో తీర్పు వెల్లడించింది.
-
ఇస్లాం ప్రకారం ప్రార్థనలు చేసేందుకు మసీదు తప్పనిసరి కాదని 1994లో ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పుని పునర్ సమీక్షించాలంటూ ఎం సిద్ధిఖీ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఇందుకు నిరాకరించింది.
☛ ఐపీసీ సెక్షన్ 497ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
వివాహేతర సంబంధం నేరం కాదని పేర్కొంటు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సెప్టెంబర్ 27న సంచలన తీర్పు వెలువరించింది. ఈ అంశాన్ని నేరంగా పరిగణిస్తున్న ఇండియన్ పీనల్ కోడ్(భారతీయ శిక్షా స్మృతి) సెక్షన్ 497ను కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకాభిప్రాయంతో తీర్పు ఇచ్చింది. రాజ్యాంగ ధర్మాసనంలో ఇతర జడ్జిలు.. జస్టిస్ ఆరఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రా.
తీర్పులోని ముఖ్యాంశాలు
-
ఇష్టపూర్వక శృంగారం మహిళ హక్కు అని, ఈ విషయంలో మహిళకు షరతులు పెట్టలేమని కోర్టు వ్యాఖ్యానించింది. సెక్షన్ 497దీనికి విరుద్ధంగా ఉందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ.. కొట్టివేసింది. వివాహానికి వ్యతిరేకంగా నేరాభియోగాలకు సంబంధించిన క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ లోని 198 సెక్షన్ ను కొట్టివేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.
-
అయితే వివాహేతర సంబంధం నేరం కాకపోయినా.. నైతికంగా తప్పేనని, దీన్ని కారణంగా చూపి వివాహాన్ని రద్దుచేసుకోవచ్చని, విడాకులు కోరవచ్చని పేర్కొంది.
☛ జస్టిస్ రంజనా నేతృత్వంలో లోక్ పాల్ ఎంపిక కమిటీ
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యులతో లోక్ పాల్ ఎంపిక కమిటీని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 27న ఏర్పాటు చేసింది.
-
భారతీయ స్టేట్ బ్యాంక్ మాజీ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య,
-
ప్రసార భారతి చైర్మన్ సూర్య ప్రకాశ్,
-
ఇస్రో మాజీ చైర్మన్ కిరణ్ కుమార్,
-
అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సఖ రామ్ సింగ్ యాదవ్,
-
గుజరాత్ మాజీ డీజీపీ షబ్బీర్ హుస్సనే ఖండ్వాల,
-
రాజస్తాన్ కేడర్ కు చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి లలిత్ పన్వార్,
-
మాజీ సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ లు
ఎంపిక కమిటీలో సభ్యులుగా ఉంటారు.
☛ అవినీతి నిరోధకం కోసం నియమించనున్న లోక్ పాల్ కు చైర్ పర్సన్, ఇతర సభ్యులను ఈ కమిటీ ఎంపిక చేస్తుంది.
☛ లోక్ పాల్ మరియు లోకాయుక్త చట్టం 2013లో ఆమోదం పొందింది. లోక్ పాల్ చట్టం ప్రకారం విపక్ష నేత హోదా ఉన్న వారికి ఎంపిక సంఘంలో అవకాశం ఉంటుంది. లోక్ సభ బలంలో 10 శాతం స్థానాలు కానీ కనీసం 55 స్థానాలు కానీ వచ్చిన పార్టీ నేతకే విపక్ష నేత హోదా లభిస్తుంది. అయితే… 16వ లోక్ సభలో ఏకైక అతిపెద్ద విపక్ష పార్టీగా కాంగ్రెస్ నిలిచినప్పటికీ.. విపక్ష హోదా దక్కేందుకు కావాల్సిన స్థానాలు ఆ పార్టీకి రాలేదు. దీంతో… ఎంపిక సంఘం సమావేశాలకు కాంగ్రెస్ విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ను ప్రత్యేక ఆహ్వానితుడిగా మాత్రమే ఆహ్వానం అందుతోంది. దీంతో… ఖర్గే ఎంపిక సమావేశాలకు హాజరు కావడం లేదు. ఈ నేపథ్యంలోనే… ఆయన పేరు లేకుండానే కేంద్ర ప్రభుత్వం లోక్ పాల్ ఎంపిక కమిటీని ఏర్పాటు చేసింది.
☛ స్త్రీలకు శబరిమల ప్రవేశం కల్పించాలి: సుప్రీంకోర్టు
అన్ని వయసుల స్త్రీలకు శబరిమల ఆలయ ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 28న సంచలన తీర్పు ఇచ్చింది. రుతుస్రావాన్ని కారణంగా చూపుతూ ప్రస్తుతం 10 నుంచి 50 ఏళ్ల మహిళలను ఆలయంలోకి ప్రవేశకుండా నిషేధించడం రాజ్యాంగ విరుద్ధమని వెల్లడించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4: 1 తో తీర్పు వెల్లడించింది. భక్తిలో వివక్ష చూపలేమని పేర్కొంది.
తీర్పుకి అనుకూలం తీర్పుకి ప్రతికూలం
-
జస్టిస్ దీపక్ మిశ్రా జస్టిస్ ఇందు మల్హోత్రా
-
జస్టిస్ నారిమన్
-
జస్టిస్ ఏఎం ఖన్విల్కర్
☛ ఘనంగా పరాక్రమ్ పర్వ్
భారత్ సైన్యం పాకిస్తాన్ తో నియంత్రణ రేఖ వెంట ఆ దేశ సైనిక స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ ( మెరుపు దాడులు) ను విజయవంతంగా పూర్తి చేసి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు పరాక్రమ్ పర్వ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 28న రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో పరాక్రమ్ పర్వ్ ప్రదర్శనలో ప్రధాని నరేంద్ర మోదీ సైనిక వందనం స్వీకరించారు.
-
పరాక్రమ్ పర్వ్ లో భాగంగా సెప్టెంబర్ 28 – 30 వరకు న్యూఢిల్లీలోని రాజ్ పథ్ లాన్స్ లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
-
రాష్ట్రీయం
☛ ఏపీ ఎమ్మెల్యేని కాల్చి చంపిన మావోయిస్టులు
ఆంధ్రప్రదేశ్ విశాఖటపట్నం జిల్లాలోని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు కాల్చి చంపారు. సెప్టెంబర్ 23న డుంబ్రిగూడ మండల కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలోని లివిటిపుట్టులో ఈ ఘటన జరిగింది. గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను అడ్డగించిన మావోయిస్టులు.. వారిపై కాల్పులు జరిపారు.
☛ దేవెందర్ గౌడ్ “మై జర్నీ” పుస్తక ఆవిష్కరణ
“మై జర్నీ” పేరుతో టీడీపీ సీనియర్ నేత తూళ్ల దేవెందర్ గౌడ్ రాసిన తన జీవిత చరిత్ర పుస్తకాన్ని.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సెప్టెంబర్ 23న హైదరాబాద్ లో ఆవిష్కరించారు.
☛ ఈజ్ ఆఫ్ లివింగ్ లో ఆంధ్రప్రదేశ్ కు మొదటి స్థానం
ఈజ్ ఆఫ్ లివింగ్ లో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఒడిశా, 3వ స్థానంలో మధ్యప్రదేశ్ నిలిచాయి. ఈ మేరకు సెప్టెంబర్ 24న న్యూఢిల్లీలో అమృత్ (AMRUT – Atal Mission for Rejuvenation and Urban Transformation) అవార్డులను ప్రదానం చేశారు. కేంద్ర పట్ణణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ పూరి ఈ అవార్డులను అందజేశారు.
-
పట్టణాల వారీగా 2018 ఆగస్టులో ప్రకటించిన ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ లో తిరుపతి 4వ స్థానంలో, విజయవాడ 9వ స్థానంలో నిలిచాయి.
-
అభివృద్ధి కార్యక్రమాల డీపీఆర్ ల రూపకల్పన, కాంట్రాక్టుల కేటాయింపు, ప్రాజెక్టుల పూర్తి, యుటిలైజేషన్ సర్టిఫికెట్ల సమర్పణ వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ర్యాంకులను రూపొందిస్తారు.
-
AMRUT పథకాన్ని 2015లో ప్రారంభించారు.
☛ అమీర్ పేట్ – ఎల్బీనగర్ మెట్రో ప్రారంభం
హైదరాబాద్ మెట్రో కారిడార్ – 1 లోని అమీర్ పెట్ – ఎల్బీనగర్ మార్గం.. సెప్టెంబర్ 24 నుంచి ప్రజలకి అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్.. జెండా ఊపి రైలుని ప్రారంభించారు. 16 కిలోమీటర్ల ఈ మార్గంలో 17 స్టేషన్లు ఉన్నాయి. దీంతో.. 29 కిలోమీటర్ల కారిడార్ – 1 పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లైంది.
-
హైదరాబాద్ మెట్రోని ప్రధాని నరేంద్ర మోదీ 2017 నవంబర్ 28న ప్రారంభించారు. తొలుత మియాపూర్ నుంచి నాగోల్ మార్గాన్ని ప్రధానితో ప్రారంభింపజేశారు.
☛ ప్రకృతి సేద్యం – ఐరాస వేదికపై చంద్రబాబు ప్రసంగం
ప్రకృతి వ్యవసాయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐక్యరాజ్య సమితి వేదికపై ప్రసంగించారు. “సుస్థిరి సేద్యానికి ప్రకృతి చేయూత – ఆర్థిక సవాళ్లు – అవకాశాలు” అనే అంశంపై న్యూయార్క్ లోని ఐరాస కార్యాలయంలో సెప్టెంబర్ 25న జరిగిన సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు.. కీలకోపన్యాసం చేశారు.
ప్రసంగంలోని ముఖ్యంశాలు
-
రాష్ట్రం జీఎస్ డీపీలో వ్యవసాయం వాటా 28 శాతం
-
రాష్ట్రంలో 62 శాతం జనాభాకు వ్యవసాయం, అనుబంధ రంగాలే ఆధారం
-
ఆక్వా రంగంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్
-
2018లో రాష్ట్రంలో 5 లక్షల మంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు
-
2020 నాటికి 1.7 మిలియన్ల రైతులు ప్రకృతి సేద్యం చేయాలన్నది లక్ష్యం
-
2022 నాటికి 4.1మిలియన్ల రైతులని ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాలన్నది లక్ష్యం
-
2024 నాటికి 60 లక్షల మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం చేయించాలన్నది ధ్యేయం.
-
ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందన్న చంద్రబాబు
☛ “ముఖ్యమంత్రి యువనేస్తం“కు దరఖాస్తుల వెల్లువ
ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు భృతి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ముఖ్యమంత్రి యువనేస్తం” పథకానికి దరఖాస్తులు అధికంగా వస్తున్నాయి. సెప్టెంబర్ 14న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెబ్ సైట్ ను అధికారికంగా ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు అంటే.. 12 రోజుల్లో 3,69,864 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇప్పటి వరకు 1,00,004 మందిని అర్హులుగా గుర్తించారు. అర్హులైన వారికి 2018 అక్టోబర్ 2 నుంచి నెలకి రూ.1000 నిరుద్యోగ భృతి చెల్లించనున్నారు. ఈ మొత్తం నేరుగా వారి ఖాతాల్లోకి వస్తుంది.
☛ ఆంధ్రప్రదేశ్ లో చేనేతలకు ఉచిత విద్యుత్
ఆంధ్రప్రదేశ్ లో చేనేతలకు ఉచిత విద్యుత్ విధానం సెప్టెంబర్ 25 నుంచి అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలోని 90,765 చేనేత కుటుంబాలకు ప్రతి నెలా 100 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ ఇస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 7న చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చారు.
☛ కరీంనగర్ – ముంబై వీక్ల ఎక్స్ ప్రెస్ ప్రారంభం
కరీంనగర్ – లోకమాన్య తిలక్ టెర్మినల్ ముంబై వీక్లీ ఎక్స్ ప్రెస్ ను రైల్వే సహాయ మంత్రి రాజెన్ గోహెన్ సెప్టెంబర్ 26న జెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్ స్టేషన్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు రైలుని ప్రారంభించారు. దీంతో… ఇప్పటి వరకు నిజామాబాద్ – ముంబై మధ్య నడుస్తున్న ఈ ఎక్స్ ప్రెస్.. ఇక నుంచి కరీంనగర్ వరకు వెళుతుంది.
-
కాజీపేట – కొండపల్లి మధ్య 3వ లైను నిర్మాణ పనులని మంత్రి ప్రారంభించారు.
☛ హైదరాబాద్ కు “యాంథెమ్” సంస్థ
వైద్య రంగంలో అత్యాధునిక సదుపాయాల కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి మరో అంతర్జాతీయ సంస్థ వస్తోంది. అమెరికాలోని ఇండియానా పోలీస్ కేంద్రంగా హెల్త్ కేర్ సేవలు అందిస్తోన్న “యాంథెమ్” సంస్థ హైదరాబాద్ లో తన కార్యకలాపాలు ప్రారంభించనుంది. దీని ద్వారా 2 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది.
☛ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అనిల్ చంద్ర పునేత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అనిల్ చంద్ర పునేత నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్ దినేష్ కుమార్ పదవి కాలం ముగియటంతో ఆయన స్థానంలో పునేతను నియమిస్తూ సెప్టెంబర్ 28న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1984 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన పునేత తొలుత కడప జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలు మొదలు పెట్టారు. ఆయన 2019 మే నెల వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతల్లో ఉంటారు.
☛ ఏపీలో రేషన్ లో రాగులు, జొన్నలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీపీఎల్ కుటుంబాలకు ప్రతి నెలా అందజేసే రేషన్ లో రాగులు, జొన్నలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఒక్కో కార్డుకి గరిష్టంగా 3 కిలోల చొప్పున రాగులు, జొన్నలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్రంలో చిత్తూరు, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో వీటిని పంపిణీ చేస్తుండగా.. అక్టోబర్ నుంచి రాష్ట్రమంతటా ఇవ్వాలని నిర్ణయించారు.
-
బియ్యం తరహాలోనే కిలో రూపాయికే అందిస్తారు.
-
అంతర్జాతీయం
☛ ఇండోనేషియాలో ప్రకృతి విప్తత్తు.. భారీ ప్రాణ నష్టం
ఇండోనేషియాలో సంభవించిన భూకంపం, సునామీ భారీ విధ్వంసం సృష్టించాయి. సెప్టెంబర్ 28న రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో భూకంపం, ఆ వెంటనే సునామీ విరుచుకుపడటంతో 400 మందికిపైగా మృతి చెందారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
☛ ఐరాస జనరల్ అసెంబ్లీలో సుష్మా ప్రసంగం
న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో సెప్టెంబర్ 29న సాధారణ అసెంబ్లీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారత ప్రతినిధిగా కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రసంగించారు. ఉగ్రవాదం అంశంలో పాకిస్తాన్ తీరుని ఎండగట్టారు. చర్చలు జరుపుతామని చెబుతూనే.. ఇటీవల భారత జవాన్ల చంపడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇంకా సుష్మ తన ప్రసంగంలో.. ప్రపంచానికి పర్యావరణ మార్పులు విసురుతున్న సవాళ్లు, ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన తదితర అంశాలను ప్రస్తావించారు.
-
ఆర్థికం
☛ ఒకే పన్ను రేటుపై ఉత్తరాది రాష్ట్రాల అంగీకారం
ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ తో పాటు మరో రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు ఢిల్లీ, చంఢీగఢ్ … పెట్రో ఉత్పత్తులపై ఒకే పన్ను రేటు విధించేందుకు అంగీకరాం తెలిపాయి. వీటితో పాటు మద్యం అమ్మకాలు, వాహనాల రిజిస్ట్రేషన్లు, రవాణా పర్మిట్లు పై కూడా ఈ రాష్ట్రాల్లో ఒకే పన్ను రేటు ఉండాలని నిర్ణయించాయి. పెట్రోలు, డీజిల్ ధరలు గణనీయంగా పెరుగుతున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీని ద్వారా బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలన్నది లక్ష్యం.
☛ ఆహార శుద్ధి పరిశ్రమలోకి బిలియన్ డాలర్ల పెట్టుబడులు
భారత్ లోని ఆహార శుద్ధి పరిశ్రమల్లోకి 2018 సెప్టెంబర్ వరకు బిలియన్ డాలర్లకు పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(FDI)లు వచ్చాయి. భారత కరెన్సీలో ఆ విలువ రూ.7,200 కోట్లు. ఈ మేరకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి హర్ సిమ్రత్ కౌర్ సెప్టెంబర్ 25న వెల్లడించారు.
☛ MSMEలకి గంటలో రుణం – పోర్టల్ ప్రారంభం
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను నెలకొల్పే పారిశ్రామికవేత్తలకు గంటలో రుణం మంజూరు చేసేందుకు కేంద్ర ఆర్థిక సెప్టెంబర్ 25న ప్రత్యేక పోర్టల్ ప్రారంభించారు. ఈ మేరకు www.psbloansin59minutes.com వెబ్ సైట్ ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లాంఛనంగా ప్రారంభించారు. Small Industries Development Bank(SIDBI), మరో 5 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ రుణాలను మంజూరు చేస్తాయి.
-
అవసరమైన అన్ని పత్రాలతో వెబ్ సైట్లో దరఖాస్తు చేసిన గంట లోపు రుణాన్ని మంజూరు చేస్తారు.
-
ఈ విధానం ద్వారా రూ. కోటి వరకు రుణం ఇస్తారు.
☛ CCS ఆర్థిక స్వేచ్ఛా సూచీలో భారత్ కు 96వ స్థానం
సెంటర్ ఫర్ సివిల్ సొసైటీ(CCS), కెనడా ఫ్రేసర్ ఇన్సిస్టిట్యూట్ లు సంయుక్తంగా విడుదల చేసిన ఆర్థిక స్వేచ్ఛా సూచీ(Economic Freedom Index)-2018 లో భారత్ 96వ స్థానంలో నిలిచింది. 162 దేశాల ర్యాంకింగ్స్ తో ఈ సూచీ విడుదలైంది.
-
హాంకాంగ్ తొలి స్థానంలో నిలవగా, సింగపూర్ రెండో స్థానంలో నిలిచింది.
-
2017కు సంబంధించి ఇదే నివేదికలో భారత్ కు 98వ స్థానం దక్కింది.
-
సైన్స్ అండ్ టెక్నాలజీ
☛ అస్త్ర క్షిపణి ప్రయోగం విజయవంతం
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్డీవో అభివృద్ధి చేసిన అస్త్ర క్షిపణిని శాస్త్రవేత్తలు సెప్టెంబర్ 26న విజయవంతంగా పరీక్షించారు. పశ్చిమబెంగాల్ లోని కలైకుండా ఐఏఎఫ్ స్థావరం నుంచి సుఖోయ్ – 30 యుద్ధ విమానం ద్వారా దీన్ని పరీక్షించారు. క్షిపణి నిర్దేశిత లక్ష్యాలను ఛేదించిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
-
గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించేందుకు ఉద్దేశించిన అస్త్ర క్షిపణిని డీఆర్డీవోతో పాటు మరో 50 ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలిసి అభివృద్ధి చేశాయి.
-
ఈ క్షిపణిని ప్రయోగించేందుకు వీలుగా సుఖోయ్ – 30 యుద్ధ విమానాన్ని ఆధునీకరించారు.
-
ఈ క్షిపణి 20 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వరకు గాలిలో ఉన్న లక్ష్యాలను ఛేదిస్తుంది.
-
అవార్డులు
☛ 2018 ఆస్కార్ బరిలో భారత్ సినిమా “విలేజ్ రాక్ స్టార్స్“
2018 ఆస్కార్ అవార్డుల కోసం నామినేషన్స్ మొదల్యాయాయి. ఈ అవార్డుల కోసం ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో భారత్ నుంచి “విలేజ్ రాక్ స్టార్స్” చిత్రం అధికారికంగా ఎంపిక చేశారు. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 22న ఈ మేరకు వెల్లడించింది.
-
విలేజ్ రాక్ స్టార్స్.. అస్సామీ సినిమా.
-
దర్శకురాలు – రీమా దాస్
-
2018 జాతీయ చలన చిత్ర అవార్డుల్లో.. ఈ సినిమా ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్, ఎడిటింగ్ విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది.
-
భారత్ 1957 నుంచి ఆస్కార్ కు ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో నామినేషన్లు పంపుతోంది.
-
1986లో కే. విశ్వనాథ్ తెరకెక్కించిన స్వాతిముత్యం ఆస్కార్ నామినేషన్ ఎంట్రీ రేసు వరకు వెళ్లింది. కానీ నామినేషన్ దక్కించుకోలేదు.
-
స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్, రసూల్ వూకుట్టికి ఆస్కార్ వచ్చినా… ఆ చిత్రం బ్రిటీష్ సినిమా కింద రావటంతో… భారత్ ఖాతాలోకి అవార్డు రాలేదు.
☛ నరేంద్ర మోదీకి “చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్” అవార్డు
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితి అందించే ప్రతిష్టాత్మక “చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్” అవార్డుకి ఎంపికయ్యారు. మోదీతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్ కూడా ఈ అవార్డుకి ఎంపికయ్యారు. ఈ మేరకు ఐరాస సెప్టెంబర్ 26న ప్రకటించింది. అంతర్జాతీయ సౌర కుటమి ఏర్పాటులో ఇద్దరు నేతలు చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు పొందారు.
-
“చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్” ఐరాస ఇచ్చే అత్యున్నత పర్యావరణ పురస్కారం.
-
సౌర శక్తితో నడుస్తున్న ఏకైక విమానాశ్రయంగా గుర్తింపు పొందిన కొచ్చి విమానాశ్రయానికి కూడా “చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్” అవార్డు దక్కింది.
☛ జీహెచ్ఎంసీకి జాతీయ పర్యాటక అవార్డు
నగరంలో పర్యాటక ప్రాంతాల్లో ఉత్తమ పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి వసతి, రోడ్ల విస్తరణ తదితర కార్యక్రమాల్లో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు గాను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ – జీహెచ్ఎంసీ 2016-17 సంవత్సరానికి జాతీయ పర్యాటక పురస్కారం దక్కించుంది. ఈ మేరకు సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర పర్యాటక శాఖ న్యూఢిల్లీలో అవార్డులు ప్రదానం చేసింది.
☛ విజయ్ పాటిల్ కు లతా మంగేష్కర్ అవార్డు – 2018
మహారాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక “లతా మంగేష్కర్ అవార్డు” 2018కి ప్రముఖ సంగీత దర్శకుడు విజయ్ పాటిల్ ఎంపికయ్యారు. రామ్ – లక్ష్మణ్ గా ప్రసిద్ధి చెందిన ద్వయంలో విజయ్ పాటిల్ లక్ష్మణ్ గా గుర్తింపు పొందారు. అవార్డు కింది రూ.50 వేల నగదు బహుమతిని అందజేస్తారు.
-
భారత రత్న, దిగ్గజ గాయని లతా మంగేష్కర్ పుట్టిన రోజుని పురస్కరించుకొని ఏటా మహారాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డు ప్రదానం చేస్తుంది.
☛ స్వాతిలక్రాకు డాటర్స్ ఇండియా అవార్డు
తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్ లో మహిళా భద్రతా విభాగం ఐజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐపీఎస్ స్వాతిలక్రా… రాజస్థాన్ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక డాటర్స్ ఇండియా అవార్డుకు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 29న రాజస్థాన్ లో జైపూర్ లో జరిగిన హెల్త్ కేర్ సదస్సులో స్వాతి లక్రా ఈ అవార్డు అందుకున్నారు.
-
సేవ్ గర్ల్, ఉమెన్ ఎంపవర్మెంట్ విభాగాల్లో దేశవ్యాప్తంగా కృషి చేస్తున్న సామాజిక వేత్తలకు, అధికారులకు రాజస్థాన్ ప్రభుత్వం ఏటా ఈ అవార్డు అందజేస్తుంది.
☛ భారత యువతి అమికా జార్జ్ కు గోల్ కీపర్స్ ప్రోగ్రెస్ సోషల్ అవార్డు
కేరళకు చెందిన అమికా జార్జ్… బిల్, మెలిండా ఫౌండేషన్ ప్రారంభించిన గోల్ కీపర్స్ ప్రోగ్రెస్ అవార్డుకు ఎంపికయ్యారు. అమికా.. బ్రిటన్ వీధుల్లో ప్రారంభించిన ఫ్రీ పీరియడ్స్ ఉద్యమం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఉద్యమం ఫలితంగా బ్రిటన్ ప్రభుత్వం పేద బాలికల రుతుక్రమ అవసరాలు తీర్చేందుకు ఉచిత శానిటరీ ప్యాడ్స్ కోసం 1.5 మిలియన్ పౌండ్లు వెచ్చించేలా చేసింది. అమికాతో పాటు మరో ఇద్దరు మహిళలకు ఈ అవార్డు దక్కింది.
-
సామాజిక అభివృద్ధి రంగంలో.. గోల్ కీపర్స్ ప్రోగ్రెస్ సోషల్ అవార్డుని ఆస్కార్ అవార్డుతో పోలుస్తారు.
-
క్రీడలు
☛ పాన్ పసిఫిక్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత కరోలినా ప్లిస్కోవా
జపానా రాజధాని టోక్యోలో జరిగిన పాన్ పసిఫిక్ ఓపెన్ – 2018 మహిళల సింగిల్స్ టైటిల్ ను చెక్ రిపబ్లిక్ కు చెందిన కరోలినా ప్లిస్కోవా గెలుచుకుంది. సెప్టెంబర్ 23న జరిగిన ఫైనల్లో కరోలినా… జపాన్ కు చెందిన నయోమి ఒసాకాను ఓడించి టైటిల్ ను కైవసం చేసుకుంది.
-
ఇటీవల జరిగిన యూఎస్ ఓపెన్ – 2018 మహిళల సింగిల్స్ టైటిల్ ను నెగ్గిన ఒసాకా.. గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించిన తొలి జపాన్ క్రీడాకారిణిగా గుర్తింపు సాధించింది.
☛ రాడ్ లేవర్ కప్ – 2018 విజేత యూరప్ జట్టు
అమెరికాలోని షికాగోలో జరిగిన రాడ్ లేవర్ పురుషుల టెన్నిస్ కప్ – 2018ను యూరోప్ జట్టు గెలుచుకుంది. రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), జొకోవిచ్(సెర్పియా), జ్వెరెక్(జర్మనీ), దిమిత్రోవ్(బల్గేరియా), గాఫిన్(బెల్జియం), ఎడ్మండ్(బ్రిటన్)లతో కూడిన యూరప్ జట్టు… 13 – 8 తేడాతో ప్రపంచ జట్టుని ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. తద్వారా రెండో ఏడాది ఈ కప్ ను సొంతం చేసుకుంది.
-
ప్రపంచ జట్టులో అండర్సన్(దక్షిణాఫ్రికా), ఇస్నెర్(అమెరికా), కిరియోస్(ఆస్ట్రేలియా), జాక్ సోక్(అమెరికా), ష్వార్ట్ జ్ మన్(అర్జెంటీనా), టీయాఫో(అమెరికా) ఉన్నారు.
☛ చైనా ఓపెన్ – 2018
చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో పురుషుల సింగిల్స్ టైటిల్ ను ఇండోనేషియా ప్లేయర్ ఆంటోని సినిసుకా, మహిళల సింగిల్స్ టైటిల్ ను స్పెయిన్ దిగ్గజం కరోలినా మారిన్ గెలుచుకున్నారు.
సెప్టెంబర్ 23న పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆంటోని సినిసుకా.. జపాన్ ప్లేయర్ కెంటో మొమొట్టోను ఓడించి టైటిల్ విజేతగా నిలిచారు. మహిళల సింగిల్స్ ఫైనల్లో కరోలినా మారిన్.. చైనా క్రీడాకారిణి చెన్ యూఫీని ఓడించి టైటిల్ గెలుచుకుంది.
☛ శ్రీలంకతో టీ20 సీరీస్ ను 4-0తో నెగ్గిన భారత్ మహిళల జట్టు
-
శ్రీలంకతో జరిగిన 5 మ్యాచ్ లో టీ20 సీరీస్ ను భారత్ మహిళల జట్టు 4 – 0 తేడాతో క్లీన్ స్వీప్ చేసి టైటిల్ గెలుచుకుంది. ఒక మ్యాచ్ వర్ష కారణంగా రద్దయింది.
-
మహిళల టీ20 టీమ్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్
-
ఈ పర్యటనలో వన్డే సీరీస్ ను కూడా టీమ్ ఇండియా 2 – 1తేడాతో గెలుచుకుంది.
☛ ఆసియా క్రికెట్ కప్ – 2018 విజేత భారత్
యూఏఈలోని దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా క్రికెట్ కప్ – 2018 టైటిల్ ను భారత్ గెలుచుకుంది. సెప్టెంబర్ 28న బంగ్లాదేశ్ తో జరిగిన ఫైనల్లో భారత్ 3 వికెట్ల తేడాతో గెలుపొంది… 7వ సారి ఆసియా కప్ ను సొంతం చేసుకుంది.
-
ఈ మ్యాచ్ లో సెంచరీ సాధించిన బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ లితన్ దాస్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
-
సీరీస్ అందరికీ కంటే ఎక్కువ పరుగులు సాధించిన భారత బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ కు మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అవార్డు దక్కింది.
-
ఆసియా కప్ – 2018లో మొత్తం 6 జట్లు పోటీ పడ్డాయి. అవి.. భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, హాంకాంగ్
☛ 37 ఏళ్ల రికార్డుని బద్దలు కొట్టిన అథ్లెట్ అవినాశ్
ఒడిశాలోని భువనేశ్వర్ లో జరిగిన జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో అరుదైన రికార్డు నమోదైంది. చాంపియన్ షిప్ లో భాగంగా సెప్టెంబర్ 28న జరిగిన 3000 మీటర్ల స్టీపుల్ చేజ్ లో సర్వీసెస్ తరపున బరిలో దిగిన అవినాశ్.. 8 నిమిషాల 29.80 సెకన్లలో పూర్తి చేసి 37 ఏళ్ల జాతీయ రికార్డుని తిరిగరాశాడు. 1981 టోక్యో అథ్లెటిక్స్ మీట్ లో గోపాల్ సైనీ 8 నిమిషాల 30.88 సెకన్లలో పూర్తి చేసిన నెలకొల్పిన రికార్డుని అవినాశ్ తుడిచివేశాడు.
☛ ఆర్చరీ ప్రపంచ కప్ లో జ్యోతి సురేఖ జోడికి రజతం
టర్కీలోని సామ్సన్ నగరంలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ లో ఎగ్జిబిషన్ కాంపౌండ్ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్ లో భారత్ జోడి రజతం గెలుచుకుంది. సెప్టెంబర్ 29న జరిగిన ఫైనల్లో తెలుగు ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ్, అర్చర్ అభిషేక్ జోడి 152 – 159 స్కోర్ తేడాతో టర్కీ జట్టు చేతిలో ఓడిపోయింది. దీంతో రజతం దక్కింది.
-
వార్తల్లో వ్యక్తులు
☛ భారత్ లో వాట్సాప్ గ్రీవెన్స్ అధికారిగా కోమల్ లాహిరి
వాట్సాప్ ద్వారా సమాచార దుర్వినియోగం, తప్పుడు వార్తల ప్రచారం ఎక్కువ అవుతోందన్న ఆరోపణలతో.. వాటిని అరికట్టేందుకు సంస్థ ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఈ తరహా ఆరోపణలపై ఫిర్యాదులను స్వీకరించేందుకు అమెరికాలో పనిచేస్తోన్న కోమల్ లాహిరిని గ్రీవెన్స్ అధికారిగా నియమించింది.
-
వినియోగదారులు ఈ – మెయిల్, యాప్ లేదా రాతపూర్వకంగా గ్రీవెన్స్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు.
-
కోమల్ లాహిరి వాట్సాప్ గ్లోబల్ కస్టమర్ ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. అంతకముందు ఆమె ఫేస్ బుక్ డైరెక్టర్ గా ఉన్నారు.
☛ ఫోర్బ్స్ టైకూన్స్ ఆఫ్ టుమారోలో సింధు, ఉపాసన
ప్రముఖ మ్యాగజైన తొలిసారి విడుదల చేసిన టైకూన్స్ ఆఫ్ టుమారోలో హైదరాబాదీ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, అపోలో లైఫ్ ఎండీ ఉపాసన కామినేని స్థానం సంపాదించుకున్నారు. క్రీడా, వ్యాపార, నటనా రంగాల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహించిన 22 మంది యువ అచీవర్స్ తో ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది. ఇది కేవలం భారత్ జాబితానే.
☛ మాల్దీవుల అధ్యక్షుడిగా ఇబ్రహీం మహ్మద్ సోలిహ్
భారత్ కు మంచి మిత్రపక్ష దేశమైన మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్ట్(MDP) సహ వ్యవస్థాపకులు.. ఇబ్రహీం మహ్మద్ సోలిహ్ విజయం సాధించారు. దీంతో.. ఆయన దేశ తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 23న వెలువడ్డ ఫలితాల్లో.. ఇబ్రహీం సోలిహ్ కు 58.3 శాతం ఓట్లు వచ్చాయి. ప్రస్తుత అధ్యక్షుడు, ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ అభ్యర్థి అబ్దుల్లా యామీన్ కు 41.7 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో… యామీన్ తన ఓటమిని అంగీకరించారు.
-
ఎన్నికల్లో ఓటమిపాలైన అబ్దుల్లా యామీన్ భారత్ విరోధిగా పేరుపడ్డారు. ఈయన చైనాకు దగ్గరగా మెలిగారు.
-
కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ఇబ్రహీం మహ్మద్ సోలిహ్ .. భారత్ అనుకూల వాదిగా ముద్రపడ్డారు.
-
మాల్దీవుల రాజధాని – మాలె.
-
కరెన్సీ – మాల్దీవియన్ రుఫియా
ఫేస్ బుక్ ఇండియా ఎండీగా అజిత్ మోహన్
ప్రముఖ వీడియో సేవల సంస్థ హాట్ స్టార్ సీఈవో అజిత్ మోహన్.. ఫేస్ బుక్ ఇండియా వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఈ హోదాని కొత్తగా సృష్టించారు. 2019 జనవరిలో అజిత్ మోహన్.. బాధ్యతలు స్వీకరిస్తారు.
☛ ధోని కెప్టెన్ @ 200వ వన్డే
మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా 200వ వన్డేలు పూర్తి చేసుకున్నాడు. ఆసియా కప్ లో భాగంగా సెప్టెంబర్ 25న ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ ద్వారా ధోని ఈ నంబర్ ను అందుకున్నాడు. వాస్తవానికి ధోని 2016లోనే వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. రెండేళ్ల కిందట విశాఖపట్నంలో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ ధోనికి కెప్టెన్ గా 199వ ది. ఆసియా కప్ లో భాగంగా ఆఫ్గనిస్తాన్ తో మ్యాచ్ కు కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడంతో… ధోని కెప్టెన్ గా అనూహ్యంగా బరిలో దిగాల్సి వచ్చింది.
☛ బార్ క్లేస్ హురున్ ఇండియా – 2018
బార్ క్లేస్ హురున్ ఇండియా 2018 సంవత్సరానికి గాను సెప్టెంబర్ 25న విడుదల చేసిన సంపన్న భారతీయుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తొలి స్థానంలో కొనసాగుతున్నారు. హిందూజా కుటుంబం రెండో స్థానంలో ఉండగా, 3వ స్థానంలో ఎల్ ఎన్ మిట్టల్ ఉన్నారు.
-
తొలి స్థానంలో ముకేశ్ అంబానీ సంపద విలువ రూ. 3,71,000 కోట్లు
-
2వ స్థానంలో ఉన్న హిందూజా కుటుంబం సంపద విలువ రూ.1,59,000 కోట్లు
-
3వ స్థానంలో ఉన్న ఎల్ ఎన్ మిట్టల్ సంపద విలువ రూ. 1,14,500 కోట్లు
☛ భారత గిరిజనుల అంబాసిడర్ గా మేరీకోమ్
భారత గిరిజనుల బ్రాండ్ అంబాసిడర్ గా కేంద్ర గిరిజనుల వ్యవహారాల మంత్రితత్వ శాఖ ఐదు సార్లు ప్రపంచ చాంపియన్ బాక్సర్ మేరీకోమ్ ను ఎంపిక చేసింది. ఈ మేరకు ఆమెను ప్రచారకర్తగా నియమిస్తున్నట్లు సెప్టెంబర్ 27న వెల్లడించింది.
-
మోరీకోమ్ గతంలో రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు.
☛ BSF, SSB లకు కొత్త అధిపతుల నియామకం
సరిహద్దు భద్రతా దళం(Boarder Security Force – BSF), సశస్త్ర సీమా బల్(Sashastra Seema Bal – SSB) లకు కొత్త అధిపతులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 27న ఉత్తర్వులు జారీ చేసింది.
బీఎస్ఎఫ్ అధిపతిగా 1984 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ కేడర్ కు చెందిన రజనీకాంత్ మిశ్రాను నియమించింది. ఈయన 2019 ఆగస్టు వరకు పదవిలో ఉంటారు. ప్రస్తుతం బీఎస్ఎఫ్ చీఫ్ గా ఉన్న కేకే శర్మ సెప్టెంబర్ 30న పదవి విరమణ పొందుతారు.
1984 బ్యార్ హరియాణా కేడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్ఎస్ దేశ్వాల్ ఎస్ఎస్ బీ చీఫ్ గా నియమితులయ్యారు. ఈయన 2021 వరకు కొనసాగుతారు.
☛ CISC అధిపతిగా రాజేశ్వర్
Chief of Intergrated Defence – CISC గా లెఫ్టినెంట్ జనరల్ పి.ఎస్. రాజేశ్వర్ నియమితులయ్యారు. అక్టోబర్ 31న ప్రస్తుత చీఫ్ లెఫ్టినెంట్ జనర్ సతీశ్ దువా పదవీ విరమణ పొందనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో పి.ఎస్. రాజేశ్వర్ బాధ్యతలు చేపడతారు.
-
CISC త్రీవిధ దళాలాతో కూడిన సమీకృత రక్షణ సిబ్బంది విభాగం
-
ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ విభాగాన్ని 2001 నవంబర్ 23న ఏర్పాటు చేశారు
-
దీని కేంద్ర కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది
☛ పీటీఐ చైర్మన్ గా ఎన్. రవి
ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా( PTI) చైర్మన్ గా హిందూ గ్రూపు పేపర్స్ పబ్లిషర్ ఎన్. రవి ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 29న జరిగిన ఎన్నికల్లో రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా పంజాబ్ కేసరి గ్రూపు పత్రికల ప్రధాన సంపాదకుడు విజయ్ కుమార్ చోప్రాను ఎన్నుకున్నారు.
-
PTI అనేది భారత్ లో అతిపెద్ద న్యూస్ ఏజెన్సీ
-
పీటీఐని 1947 ఆగస్టు 27న ఏర్పాటు చేశారు