జాతీయం
☛ స్వచ్ఛతా హై సేవా కార్యక్రమం ప్రారంభం
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 15న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రధాని మోదీ దేశ రాజధాని ఢిల్లీలోని పహాడ్ గంజ్ లో ఉన్న అంబేడ్కర్ మాధ్యమిక పాఠశాలలో చీపురి పట్టుకొని ఆవరణను శుభ్రం చేశారు. అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మహాత్ముడికి నివాళులర్పించడానికి చేపట్టిన అద్భుత కార్యక్రమమిదని మోడీ ట్వీట్ చేశారు.
☛ భారత్ – బంగ్లాదేశ్ పైప్ లైన్ నిర్మాణం ప్రారంభం
భారత్ – బంగ్లాదేశ్ మధ్య పైప్ లైన్ నిర్మాణ పనులు సెప్టెంబర్ 18న ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరు దేశాల మధ్య నిర్మించనున్న 130 కిలో మీటర్ల ఫ్రెండ్ షిప్ పైప్ లైన్ నిర్మాణ పనులని ప్రారంభించారు.
-
ఈ పైప్ లైన్ ద్వారా భారత్ నుంచి బంగ్లాకు ఆయిల్ ను సరఫరా చేస్తారు. ఏడాదికి 10 లక్షల మెట్రిక్ టన్నుల ఆయిల్ ను సరఫరా చేసే సామర్థ్యం ఉంటుంది.
-
పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి, బంగ్లాదేశ్ లోని దినాజ్ పూర్ జిల్లాలోని పర్సతిపూర్ ను ఈ పైప్ లైన్ అనుసంధానం చేస్తుంది.
☛ 5 రాష్ట్రాల్లో 33.5 మిలియన్ డాలర్లతో వ్యవసాయ పథకం
జీవవైవిధ్యం, అటవీ భూములను రక్షించడం ద్వారా వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే లక్ష్యంతో… కేంద్ర వ్యవసాయ శాఖ, ఐరాస అనుబంధ సంస్థ FAO 5 రాష్ట్రాల్లో వ్యవసాయ పథకాన్ని ప్రారంభించాయి. మధ్యప్రదేశ్, మిజోరం, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నాయి.
-
పథకం అమలు కోసం 33.5 మిలియన్ డాలర్ల నిధులను గ్లోబల్ ఎన్విరాన్ మెంట్ ఫెసిలిటీ(GEF) గ్రాంట్ గా ఇచ్చేందుకు అంగీకరించింది. GEF ను 1992లో రియో ఎర్త్ సమ్మిట్ లో ఏర్పాటు చేశారు. పర్యావరణానికి మేలు చేసే ప్రాజెక్టుల అమలు కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ సంస్థ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.
-
FAO – Food and Agriculture Organisation
☛ “ట్రిపుల్ తలాక్” ను నిషేధిస్తూ ఆర్డినెన్స్
ట్రిపుల్ తలాక్ ను నిషేధిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్ కు కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 19న ఆమెదం తెలిపింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దీనిపై సంతకం చేయటంతో వెంటనే ఆర్డినెన్స్ జారీ అయ్యింది. దీని ప్రకారం ముస్లింలకు తక్షణ విడాకులు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి పాల్పడే భర్తకు 3 ఏళ్ల వరకు జైలు శిక్షను ప్రతిపాదించారు. 2017 ఆగస్టు 22న సుప్రీం కోర్టు ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది.
-
సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కేంద్రం ట్రిపుల్ తలాక్ బిల్లుని తీసుకొచ్చింది. ఇది లోక్ సభ ఆమోదం పొంది.. రాజ్యసభలో పెండింగ్ లో ఉంది.
-
తక్షణ ట్రిపుల్ తలాక్ ను భారత్ సహా 22 దేశాలు నిషేధించాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్గనిస్తాన్ లో కూడా ట్రిపుల్ తలాక్ పై నిషేధం ఉంది. పాకిస్తాన్ లో 1961లో చేసిన చట్టం ద్వారా ట్రిపుల్ తలాక్ ను నిషేధించారు.
-
భారత్ లో ట్రిపుల్ తలాక్ నిషేధం కోసం షయారా బానో 2015లో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇష్రత్ జహాన్, ఆప్రీన్ రెహ్మాన్, ఫరా ఫైజ్, అతియా సాబ్రీ, గుల్షన్ పర్వీన్ కూడా ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా పోరాడారు.
☛ “స్వయం ప్రభ” ఫోన్ లో ద్వారా జేఈఈ, నీట్ పాఠాలు
జేఈఈ మెయిన్, అడ్వాన్స్ డ్, నీట్ పాఠ్యాంశాలతో ఐఐటీ ఆచార్యులు రూపొందించిన పాఠాలను నేరుగా విద్యార్థులకు అందించేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ “స్వయం ప్రభ” పేరుతో కొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఐటీ ఢిల్లీ నేతృత్వంలో 600 పాఠాలు తయారు చేశారు. వాటిని యాప్ లో పొందుపరిచారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ ను ఉచితంగా డౌన్ లోడు చేసుకోవచ్చు.
-
స్వయం ప్రభ పేరిట 2017లో కేంద్ర ప్రభుత్వం కొన్ని ఛానెళ్లను ప్రారంభించింది. ఇటీవల స్మార్ట్ ఫోన్ ల వాడకం పెరగటంతో.. యాప్ ను అందుబాటులోకి తెచ్చింది.
-
పోటీ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం నెలకొల్పిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెబ్ సైట్ WWW.NTA.AC.IN లోను పాఠాలు అందుబాటులో ఉన్నాయి.
☛ భారత్, రష్యా వాయుసేన విన్యాసాలు AVIAINDRA – 2018 ప్రారంభం
AVIAINDRA – 2018 పేరుతో భారత్, రష్యా వాయుసేన విన్యాసాలు సెప్టెంబర్ 17న ప్రారంభమయ్యాయి. రష్యాలోని లిపెట్స్ క్ లో జరుగుతున్న ఈ విన్యాసాలు సెప్టెంబర్ 28 వరకు కొనసాగుతాయి. రెండో విడత విన్యాసాలు 2018 డిసెంబర్ 10 నుంచి 22 వరకు రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో జరుగుతాయి.
-
AVIAINDRA పేరుతో భారత్, రష్యా వైమానిక సంయుక్త విన్యాసాలు తొలిసారి 2014లో జరిగాయి. అప్పటి నుంచి ఏటా రెండు సార్లు ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నారు.
☛ లైంగిక వేధింపులపై ఫిర్యాదుకు పోర్టల్ ప్రారంభం
చైల్డ్ పోర్నోగ్రఫీ, ఆన్ లైన్ లో లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్ సైట్ ద్వారా వేదిక కల్పించింది. cybercrime.gov.in పేరుతో పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. సెప్టెంబర్ 20న ఈ పోర్టల్ ను ప్రారంభించారు.
-
చైల్డ్ పోర్నోగ్రఫీ, ఆన్ లైన్ లో లైంగిక వేధింపులపై ఎవరైనా పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసే వారు తమ వివరాలు సమర్పించాల్సిన అవసరం లేదు. ఒక వేళ వెల్లడించినా.. వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు.
☛ లైంగిక నేరస్తుల రిజిస్టర్ – NRSO ప్రారంభం
మహిళలు, చిన్నారులపై లైంగిక నేరాలను అరికట్టడంతో పాటు ఈ కేసుల్లో విచారణ వేగాన్ని పెంచేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం లైంగిక నేరస్తుల జాతీయ రిజిస్టర్ (National Registry of Sexual Offenders – NRSO)ను ప్రారంభించింది. కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ సెప్టెంబర్ 21న న్యూఢిల్లీలో దీన్ని ప్రారంభించారు.
-
ఎన్ఆర్ఎస్ఓలో భాగంగా నేరస్తుల పేర్లు, చిరునామా, వేలిముద్రలు సహా ప్రతి అంశాన్ని రిజిస్టర్ లో పొందుపరుస్తారు.
-
ఇందులో భాగంగా జాతీయ నేర గణాంకాల సంస్థ(National Crime Records Bureau – NCRB) దేశవ్యాప్తంగా జైలల్లో ఉన్న నేరస్తుల వివరాలు సేకరించింది.
-
2005 నుంచి నేరాలకు పాల్పడిన 4.40 లక్షల మంది నేరస్తుల వివరాలతో ఎన్ఆర్ఎస్ఓను ప్రారంభించారు. త్వరలో బాల నేరస్తులను కూడా ఇందులో చేరుస్తారు.
-
NCRB ని 1986 మార్చి 11న ఏర్పాటు చేశారు. కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉంది.
-
NCRB ప్రస్తుత డైరెక్టర్ – డాక్టర్ ఐష్ కుమార్, ఐపీఎస్
☛ యూఎన్ సోలార్ ప్రాజెక్టుకి భారత్ 1 మిలియన్ డాలర్లు
ఐక్యరాజ్య సమితి సోలార్ ప్రాజెక్టుకి భారత్ 1 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. న్యూయార్క్ లోని UN ప్రధాన కార్యాలయం ఆవరణపై సోలార్ ప్యానాళ్ల ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టే.. UN Solar Project.
-
2018 జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన సమావేశంలో… ఐరాస బిల్డింగ్ పై సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గ్యుటెరస్.. ప్రపంచ దేశాల ఆర్థిక సహాయాన్ని కోరారు.
-
ఈ ప్రాజెక్టు కోసం ఆర్థిక సాయాన్ని ప్రకటించిన తొలి దేశం భారత్
***************************************************************
రాష్ట్రీయం
☛ 20 రోజుల పాటు స్టార్టప్ ఇండియా తెలంగాణ యాత్ర
పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని అనుకునే వారు, వినూత్న ఆవిష్కర్తలను కలిసి ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్రంలో స్టార్టప్ యాత్ర సెప్టెంబర్ 15న ప్రారంభమైంది. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో అక్టోబర్ 5 వరకు 20 రోజుల పాటు జరిగే ఈ యాత్రను రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి కే. తారకరామారావు ప్రారంభించారు.
-
ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 200 మంది విద్యార్థుల నుంచి వినూత్న ఆలోచనలను సేకరించి అందులో 20 మందిని ఎంపిక చేస్తారు.
-
12 జిల్లాల మీదుగా ఈ యాత్ర సాగుతుంది.
☛ హైదరాబాద్ లో గర్భస్థ శిశువుకు గుండె శస్త్రచికిత్స
దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రి వైద్యులు గర్భంలోని శిశువుకి విజయవంతంగా గుండె శస్త్రచికిత్స చేశారు. మూసుకుపోయిన గుండె రక్తనాళాలను తెరిచి జన్మించకముందే పునర్జన్మ ప్రసాదించారు.
దేశంలోనే తొలిసారిగా కింది వాటిలోని ఏ నగరంలో గర్భస్థ శిశువుకి గుండె
**************************************************************
అంతర్జాతీయం
☛ చేతులు మారిన టైమ్ మ్యాగజైన్
ప్రతిష్టాత్మక ఇంగ్లీష్ మ్యాగజైన్ టైమ్ యాజమాన్యం మరోసారి మారింది. క్లౌడ్ కంప్యూటింగ్ దిగ్గజం సేల్స్ ఫోర్స్ సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ మార్క్ బెనియాఫ్ టైమ్ కొత్త యజమాని అయ్యారు. ఈ మేరకు ఆయనకు 190 మిలియన్ డాలర్లకు టైమ్ మ్యాగజైన్ ను అమ్ముతున్నట్లు ప్రస్తుత యాజమాన్యం మెరిడిత్ కార్పొరేషన్ వెల్లడించింది.
-
యేల్ యూనివర్సిటీకి చెందిన డిగ్రీ విద్యార్థులు హెన్రీ లూస్, బ్రిటన్ హాడెన్ లు 1923 మార్చిలో టైమ్ మ్యాగజైన్ ను ప్రారంభించారు.
-
2017లో టైమ్ మ్యాగజైన్ సహా పలు ప్రచురణలను టైమ్ కంపెనీ నుంచి మెరిడిత్ కార్పొరేషన్ కొనుగోలు చేసింది.
-
ఇప్పుడు మెరిడిత్ నుంచి ఆ సంస్థ మార్క్ బెనియాఫ్ చేతుల్లోకి వెళ్లింది.
-
ఇది న్యూస్ మ్యాగజైన్.
☛ కమిట్ మెంట్ టు డెవలప్ మెంట్ ఇండెక్స్ – 2018
కమిట్ మెంట్ టు డెవలప్ మెంట్ ఇండెక్స్ (అభివృద్ధి నిబద్ధత సూచీ) – 2018లో స్వీడన్ మొదటి స్థానంలో నిలిచింది. విదేశాలకు ఆర్థిక సాయం, పర్యావరణ విధానాల ఆధారంగా చేసుకొని సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్ మెంట్ (CGD) 27 ధనిక దేశాలతో ఈ జాబితాను విడుదల చేసింది.
-
ఈ జాబితాలో స్వీడన్ తర్వాత 2వ స్థానంలో డెన్మార్, 3వ స్థానంలో జర్మనీ, ఫిన్లాండ్ సంయుక్తంగా నిలిచాయి.
-
అమెరికా 23వ స్థానంలో ఉంది.
-
27వ స్థానంలో జపాన్ ఉంది.
☛ చైనా ఉత్పత్తులపై మరోసారి సుంకం విధించిన ట్రంప్
అమెరికా, చైనా మధ్య మొదైలన వాణిజ్య యుద్ధం ఇంకా తీవ్రమవుతోంది. సుంకాల పెంపుతో వాణిజ్య పోటీకి తెరతీసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్… మరోసారి సుంకాల విధించారు. చైనా నుంచి దిగుమతి అయ్యే 200 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై 10 శాతం సుంకాలు (TARRIF) విధించారు. 2018 చివరి నాటికి ఈ మొత్తాన్ని 25 శాతానికి పెంచనున్నారు. దీనికి ప్రతీకార చర్యగా చైనా సైతం అమెరికాకు చెందిన 60 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది.
-
చైనాకు చెందిన 50 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై అమెరికా గతంలోనే సుంకం విధించింది.
-
దీంతో చైనా సైతం అదే స్థాయిలో అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకం విధించింది.
☛ జపాన్ ప్రధానిగా మరో 3 ఏళ్ల పాటు షింజో అబే
జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ(LDP) అధ్యక్షుడిగా మరో 3 ఏళ్ల కాలానికి ఎన్నికయ్యారు. దీంతో… 2021 ఆగస్టు వరకు ఆయన జపాన్ ప్రధానిగా కొనసాగుతారు. ఈ మేరకు సెప్టెంబర్ 20న జరిగిన పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో 807 ఓట్లకు గాను అబేకు 553 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థి, మాజీ రక్షణమంత్రి షిగెరు ఇషిబాకు 254 ఓట్లు వచ్చాయి.
-
విజయం తర్వాత షింజో అబే మాట్లాడుతూ.. ఇక తన కర్తవ్యం జపాన్ రాజ్యాంగాన్ని సవరించడమే అని ప్రకటించారు.
-
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఒత్తిడితో 1947లో జపాన్ రాజ్యాంగాన్ని రూపొందించారు.
☛ వియత్నాం అధ్యక్షుడు ట్రాన్ డాయ్ క్వాంగ్ కన్నుమూత
వియత్నాం అధ్యక్షుడు ట్రాన్ డాయ్ క్వాంగ్ తీవ్ర అనారోగ్యంతో సెప్టెంబర్ 21న హనోయిలో కన్నుమూశారు. చికిత్స పొందుతు ఆయన కన్నుమూశారని ఆ దేశ అధికారిక మీడియా తెలిపింది.
-
ట్రాన్ డాయ్ క్వాంగ్ 2016లో వియత్నాం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
-
వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు.
☛ “మద్యం” మరణాలు ఏటా 30 లక్షలు : WHO
2016లో మద్యం కారణంగా సంభవించే వ్యాధులు, సమస్యలతో 30 లక్షల మరణాలు సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తెలిపింది. మొత్తం మరణాల్లో ఇది 5.3 శాతమని వెల్లడించింది. ఈ మేరకు సెప్టెంబర్ 21న మద్యం మరణాల గణాంకాల నివేదికను విడుదల చేసింది. ఈ 30 లక్షల మందిలో 75 శాతం మంది పురుషులేనని పేర్కొంది.
-
అలాగే… ప్రపంచవ్యాప్తంగా ఏటా సంభవించే ప్రతి 20 మరణాల్లో ఒక దానికి మద్యమే కారణమని డబ్ల్యూహెచ్ఓ వివరించింది.
-
ఇదే సమయంలో ఎయిడ్స్ 1.8 శాతం, రోడ్డు ప్రమాదాల్లో 2.5 శాతం, హిం స కారణంగా 0.8 శాతం మంది ప్రాణాలు కోల్పోయారు.
-
యూరప్ తో పాటు భారత్, చైనాల్లో మద్యం వినియోగం గణనీయంగా పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
-
WHO ని 1948 ఏప్రిల్ 7న ఏర్పాటు చేశారు. దీని కేంద్ర కార్యాలయం స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉంది.
☛ రష్యా లక్ష్యంగా అమెరికా కాస్టా చట్టం
అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్ – 400ను రష్యా నుంచి కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు తప్పవని అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రూపొందించిన కాస్టా ఆర్డర్ పై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. రష్యాను లక్ష్యంగా చేసుకొని అమెరికా కాస్టా చట్టాన్ని తెచ్చింది.
-
రష్యా నుంచి ఎస్ – 400 ను కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు విధించడమే కాస్టా ఆర్డర్.
-
భారత్ సైతం రష్యా నుంచి ఎస్ – 400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
-
కాగా ఇప్పటికే రష్యా నుంచి సుఖోయ్ యుద్ధ విమానాలు, ఎస్ – 400 లను కొన్న చైనా సంస్థ, దాని డైరెక్టర్ షాంగ్ పూపై అమెరికా ఆంక్షలు విధించింది.
***************************************************************
ఆర్థికం
☛ 3 బ్యాంకుల విలీనం
మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులు.. బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయ బ్యాంక్, దేనా బ్యాంకుల విలీనం చేయాలని సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విలీనం ద్వారా రూ.14.82 లక్షల కోట్ల వ్యాపారంతో దేశీయంగా 3వ అతిపెద్ద బ్యాంక్ ఏర్పాటు అవుతుంది.
-
విలీనంతో బ్యాంకులు మరింత పటిష్టంగా మారతాయని, రుణ వితరణ సామర్థ్యం కూడా పెరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు.
-
2017లో భారతీయ స్టేట్ బ్యాంకులో ఆరు అనుబంధ బ్యాంకులు (స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్, భారతీయ మహిళా బ్యాంక్) విలీనం అయ్యాయి. తద్వారా ఎస్బీఐ ప్రపంచంలోనే టాప్ 50 బ్యాంకుల్లో ఒకటిగా చోటు దక్కించుకుంది.
-
దేశీయంగా 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి.
☛ పరిహారం ఆలస్యం చేస్తే బీమా కంపెనీలకు జరిమానా
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద రైతులకు బీమా పరిహారం క్లెయిమ్స్ చెల్లింపులు చేయడంలో ఆలస్యం జరిగితే బీమా కంపెనీలు, సంబంధిత రాష్ట్రాలకు జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సెప్టెంబర్ 19న మార్గదర్శకాలు విడుదల చేసింది. వాటిని ఆయా రాష్ట్రాలకు పంపింది. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే రబీ సీజన్ నుంచి ఈ మార్గదర్శకాలు అమలవుతాయి.
-
సెటిల్మెంటు చేయడంలో నిర్ణీతకాల పరిమితి రెండు నెలలు దాటితే 12 శాతం వడ్డీ రైతులకు చెల్లించాలని బీమా కంపెనీలకు ఆదేశం.
-
కంపెనీల విన్నపం మేరకు తమ వాటా సబ్సిడీ సొమ్ము చెల్లించడంలో మూడు నెలలకు మించితే రాష్ట్రాలు 12 శాతం వడ్డీ చెల్లించాలని స్పష్టం చేసిన కేంద్రం.
-
రైతులకు సక్రమంగా బీమా సేవలు అందించడంలో విఫలమయ్యే కంపెనీలను రద్దు చేయాలని ఆదేశించింది.
-
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని 2016 ఫిబ్రవరి 18న ప్రారంభించారు. ఈ పథకంలో నమోదు చేసుకునే రైతులు ఖరీఫ్ బీమా ప్రీమియంలో కేవలం 2 శాతం, రబీ ప్రీమియంలో 1.5 శాతం చెల్లిస్తే సరిపోతుంది.
☛ 2022 నాటికి 5 లక్షల కోట్ల డాలర్లకు భారత జీడీపీ: మోదీ
భారత ఆర్థిక వ్యవస్థ 2022 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 2.5 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న జీడీపీ మరో నాలుగేళ్లలో రెట్టింపు అవుతుందని ప్రకటించారు. సెప్టెంబర్ 20న ఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో సెంటర్ (IICC) ఏర్పాటుకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
-
రూ.25,706 కోట్లతో కన్వెన్షన్ సెంటర్ ను నిర్మిస్తున్నారు. దీని ద్వారా 5 లక్షల ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
☛ మోర్ ఇకపై అమెజాన్ చేతుల్లోకి
అంతర్జాతీయ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. భారత్ లో సుప్రసిద్ధ ఆఫ్ లైన్ రీటైల్ మార్కెట్ మోర్ ను కొనుగోలు చేస్తోంది. సమర ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ తో కలిసి మోర్ ను చేజిక్కించుకోనుంది. ఈ మేరకు సమర సంస్థతో మోర్ మాతృ సంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్ సెప్టెంబర్ 19న ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.4,200 కోట్లు.
-
మోర్ కు దేశవ్యాప్తంగా 509 బ్రాండెడ్ సూపర్ మార్కెట్లు, 20 హైపర్ మార్కెట్లు ఉన్నాయి.
-
గతంలో త్రినేత్ర సూపర్ మార్కెట్ బ్రాండ్ నే ఆదిత్య బిర్లా గ్రూప్ 2007లో కొనుగోలు చేసి మోర్ గా నామకరణం చేసింది.
☛ రూ.750 ప్రీమియం.. ప్రమాద బీమా రూ.15 లక్షలు
వాహన బీమా కవరేజ్ మొత్తాన్ని భారీగా పెంచుతు భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ(Insurance Regulatory and Development Authority – IRDA) సెప్టెంబర్ 21న కీలక నిర్ణయం తీసుకుంది. ఓనర్ – కమ్ – డ్రైవర్ ల ప్రమాద బీమాను రూ.15 లక్షలకు పెంచింది. సంవత్సరానికి కేవలం రూ.750 ప్రీమియంతో ఈ పాలసీని పొందవచ్చు.
-
ఈ నిర్ణయాని కంటే ముందు పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ ద్విచక్ర వాహనాలకు రూ.1 లక్ష, కమర్షియల్ వాహనాలకు రూ.2 లక్షలుగా ఉండేది. దీనికి నెల వారీ ప్రీమియం ద్విచక్ర వాహనాలకు రూ.50, కమర్షియల్ వెహికల్స్ కు రూ.100 రూపాయలుగా ఉండేది.
-
IRDA 1999లో ఏర్పాటు చేశారు. దీని కేంద్ర కార్యాలయం హైదరాబాద్ లో ఉంది.
-
IRDA ప్రస్తుత చైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్ర ఖుంతియా
*************************************************
సైన్స్ అండ్ టెక్నాలజీ
☛ తొలి హైడ్రోజన్ రైలుని ప్రారంభించిన జర్మనీ
ప్రపంచంలో తొలి హైడ్రోజన్ రైలుని జర్మనీ సెప్టెంబర్ 17న ప్రారంభించింది. ఫ్రెంచ్ టీజీవీ గ్రూప్ ఈ రైలుని తయారు చేసింది. 100 కిలోమీటర్ల దూరం ఉన్న నగరాల మధ్య ఈ రైళ్లను నడపాలని జర్మనీ నిర్ణయించింది.
-
ఎలక్ట్రిక్ ట్రాక్ వ్యవస్థ లేని చోట డీజిల్ రైళ్ల స్థానంలో వీటిని వినియోగిస్తారు.
-
హైడ్రోజన్ రైళ్ల నుంచి ఎలాంటి కర్బణ ఉద్గారాలు విడుదల కావు. అందుకే వీటిని పర్యావరహణ హితమైనవిగా గుర్తిస్తారు.
-
హైడ్రోజన్ రైళ్లలో ఫ్యూయల్ సెల్స్ ఉంటాయి. ఇవి.. హైడ్రోజన్ ను ఆక్సిజన్ తో అనుసంధానించి శక్తిని ఉత్పత్తి చేస్తాయి. తద్వారా రైళ్లు నడుస్తాయి.
☛ ప్రహార్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వల్ప శ్రేణి క్షిపణి “ప్రహార్” ను భారత సెప్టెంబర్ 20న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ రేంజ్ నుంచి జరిపిన పరీక్షలో క్షిపణి నిర్దేశిత 200 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించింది.
-
ఈ క్షిపణిని ఉపరితరం తలం నుంచి ఉపరితలానికి ప్రయోగిస్తారు.
-
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ – DRDO ఈ క్షిపణిని అభివృద్ధి చేసింది.
☛ ఇస్రోతో కేంద్ర హోంశాఖ ఒప్పందం
అత్యాధునిక అత్యవసర ప్రతిస్పందన కేంద్రం ఏర్పాటు కోసం కేంద్ర హోంశాఖ.. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రోతో సెప్టెంబర్ 20న ఒప్పందం కుదుర్చుకుంది. దేశ అంతర్గత భద్రత, విపత్తు నిర్వహణ అంశంలో కావాల్సిన సాంకేతిక సహకారాన్ని ఇస్రో అందిస్తుంది. ఏడాదిన్నరలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు.
☛ ప్రపంచవ్యాప్తంగా పేదరికంలో 130 కోట్ల మంది
ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది పేదరికంలో మగ్గుతున్నారని ఐరాస అభివృద్ధి కార్యక్రమం(USDP).. ఆక్సఫర్డ్ పేదరిక, మానవ అభివృద్ధి కార్యక్రమం(OPHI) సంయుక్త నివేదిక వెల్లడించింది. ఈ మేరకు “2018 – ప్రపంచ బహుల పరిమాణ పేదరిక సూచి – MPI” ని సెప్టెంబర్ 20న విడుదల చేశాయి.
-
నివేదిక ప్రకారం 2005-06 నుంచి 2015-16 మధ్య కాలంలో భారత్ లో 27 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు.
-
ఈ పదేండ్లలో భారత్ లో పేదరికం రేటు 55 శాతం నుంచి 28 శాతానికి తగ్గిపోయింది.
-
పేదరిక నిర్మూలనలో కాలక్రమేణా పురోగతి సాధించిన మొదటి దేశం భారత్ అని నివేదిక పేర్కొంది.
☛ గగన్యాన్ మిషన్ కోసం షార్ లో 3వ లాంచ్ ప్యాడ్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రో .. గగన్యాన్ పేరుతో మానవ సహిత ప్రయోగం కోసం ఏర్పాట్లు చేస్తోంది. 2022లో చేపట్టే ఈ ప్రయోగం కోసం ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ – షార్ లో 3వ లాంచ్ ప్యాడ్ ను ఇస్రో ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఈ కేంద్రంలో ఉన్న రెండు ప్రయోగ వేదికలు నిండుగా ఉన్నందున… 3వ ప్రయోగ వేదిక ఏర్పాటు జరుగుతోంది. అలాగే… Small Satellite Launch Vehicles (SSLV) ప్రయోగం కోసం గుజరాత్ లోని సముద్ర తీర ప్రాంతాల్లో అనువైన ప్రదేశంలో వేదికను ఏర్పాటు చేసేందుకు ఇస్త్రో కసరత్తు చేస్తోంది.
***************************************************************
అవార్డులు
నీల్ బసుకి ఆసియాన్ అచీవర్స్ అవార్డు
బ్రిటన్ పోలీసు విభాగంలో అసిస్టెంట్ కమిషనర్ హోదాలో పనిచేస్తున్న భారత సంతతి అధికారి నీల్ బసు .. ప్రతిష్టాత్మక ఆసియన్ అచీవర్స్ అవార్దుకు ఎంపికయ్యారు. ఆసియాన్ బిజినెస్ పబ్లికేషన్స్ లిమిటెడ్ (ABPL) అనే మీడియా సంస్థ ఏటా ఈ అవార్డులని ప్రదానం చేస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 14న నిర్వహించిన కార్యక్రమంలో నీల్ బసు తరపున సహ ఉద్యోగి అవార్దు అందుకున్నారు.
-
నీల్ బసు బ్రిటన్ లోని స్కాట్లాండ్ యార్డ్ లో తీవ్రవాద నిరోధక దళానికి నేతృత్వం వహిస్తున్న తొలి భారత సంతతి అధికారి.
☛ విరాట్, మీరాలకు “ఖేల్ రత్న” అవార్డు
కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ క్రీడా అవార్డులు – 2018ని సెప్టెంబర్ 20న అధికారికంగా ప్రకటించింది. ఇద్దరికి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, 8 మంది కోచ్ లకు ద్రోణాచార్య, నలుగురికి జీవితకాల పురస్కారం, 20 మందికి అర్జున అవార్డు, నలుగురికి ధ్యాన్ చంద్ అవార్డు ప్రకటించింది.
-
క్రికెట్ నుంచి సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని తర్వాత రాజీవ్ ఖేల్ రత్న పురస్కారానికి ఎంపికైన మూడో క్రికెటర్ విరాట్ కోహ్లీ
-
తెలుగువారైన టేబుల్ టెన్నిస్ కోచ్ శ్రీనివాసరావుకు ద్రోణా చార్య అవార్డు దక్కింది.
-
తెలంగాణ డబుల్స్ స్టార్ షట్లర్ సిక్కిరెడ్డి అర్జున అవార్డుకు ఎంపికయ్యార
***************************************************************
అవార్డు విజేతలు
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న
-
విరాట్ కోహ్లీ(క్రికెటర్)
-
మీరాబాయి చాను(వెయిట్ లిఫ్టర్)
ద్రోణాచార్య
-
ఆచయ్య కుట్టప్ప(బాక్సింగ్)
-
విజయ్ శర్మ(వెయిట్ లిఫ్టింగ్)
-
శ్రీనివాసరావు(టేబుల్ టెన్నిస్)
-
సుఖ్ దేవ్ సింగ్(అథ్లెటిక్స్)
ధ్యాన్ చంద్ అవార్డు
-
సత్యదేవ్ ప్రసాద్ (ఆర్చరీ)
-
భరత్ కుమార్ చైత్రీ(హాకీ)
-
బాబి అలోయ్ సియన్(అథ్లెటిక్స్)
-
చౌగలే దాడు దత్తాత్రేయ (రెజ్లింగ్)
రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్
-
విశాఖ ఉక్కు కర్మాగారం(రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్)
-
జేఎస్ డబ్ల్యూ స్పోర్ట్స్
-
ఇషా ఔట్ రీచ్
***************************************************************
వార్తల్లో వ్యక్తులు
☛ పురుషుల డెకథ్లాన్ లో కెవిన్ మాయెర్ సరికొత్త రికార్డు
పురుషుల డెకథ్లాన్ లో సెప్టెంబర్ 17న కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరిగిన డెకాస్టర్ ఈవెంట్లో ఫ్రాన్స్ అథ్లెట్ కెవిన్ మాయెర్ 9,126 పాయింట్లు సాధించి స్వర్ణం గెలుచుకోవటంతో పాటు కొత్త ప్రపంచ రికార్డు లిఖించాడు. 2015లో అమెరికా అథ్లెట్ యాప్టన్ ఈటన్ 9,045 పాయింట్లతో నెలకొల్పిన రికార్డుని మాయెర్ తిరగరాశాడు.
డెకథ్లాన్ అంట్ ?
-
అథ్లెటిక్స్ లో 100 మీటర్లు, లాంగ్ జంప్, షాట్ పుట్, హైజంప్, 400 మీటర్లు, 110 మీటర్ల హార్టిల్స్, డిస్కర్ త్రో, పోల్ వాల్ట్, జావెలిన్ త్రో, 1500 మీటర్ల పరుగు సమాహారం.
☛ ద్యుతీచంద్ పై పుస్తకం రాయనున్న సందీప్ మిశ్రా
భారత స్ట్రింటర్ ద్యుతీ చంద్ ఆత్మకథను జర్నలిస్ట్ సందీప్ మిశ్రా పుస్తకం రూపంలో తీసుకొస్తున్నారు. పరుగు కోసం ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు, అధిగమించిన సవాళ్లను వివరిస్తూ పుస్తకం రాస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పేదరికాన్ని జయించి ట్రాక్ పై పరుగు అందుకున్న ఒడిశాకు చెందిన ద్వితీ చంద్ లో పురుష లక్షణాలున్నాయని నిషేధం విధించారు. దీంతో కామన్ వెల్త్ గేమ్స్ కి దూరమయ్యారు. ఆ తర్వాత నిషేధంపై అర్బిట్రేషన్ కోర్టులో పోరాడి గెలిచింది.
-
ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో ద్యుతీ చంద్ 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో రెండు రజతాలు నెగ్గింది.
-
ఒడిశాలో పుట్టిన ద్యుతీ చంద్, హైదరాబాద్ లో పెరిగింది.
☛ హిమదాస్ కు అడిడాస్ స్పాన్సర్ షిప్
భారత స్టార్ అథ్లెట్ హిమదాస్ కు ప్రముఖ క్రీడా పరికరాల సంస్థ అడిడాస్ స్పాన్సర్ షిప్ చేయనుంది. అస్సాం కు చెందిన హిమదాస్ తో అడిడాస్ సంస్థ సెప్టెంబర్ 18న ఒప్పందం కుదుర్చుకుంది.
-
హిమదాస్ భారత్ ప్రముఖ అథ్లెట్లలో ఒకరు.
-
ఫిన్ లాండ్ లో జరిగిన అండర్ – 20 ఛాంపియన్ షిప్ లో ఆమె బంగారు పతకం గెలిచి చరిత్ర సృష్టించింది.
-
ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణంతో పాటు రెండు రజతాలు గెలిచింది.
-
ఈ నేపథ్యంలో అడిడాస్ కంపెనీ ఆమె కోసం ప్రత్యేకంగా షూస్ ను తయారు చేసింది. ఒక బూటుపై హిమదాస్ అని.. ఇంకో బూటుపై క్రియేటివ్ హిస్టరీ అని ముద్రించింది.
☛ 4 గంటల్లో 2 కేజీలు తగ్గిన మేరీ కోమ్
5 సార్లు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ అయిన భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్.. తానేంటో మరోసారి నిరూపించారు. 48 కేజీల కేటగిరీలో పోటీ పడేందుకు 4 గంటల్లో 2 కేజీలు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు. పోలాండ్ లో జరిగిన బాక్సింగ్ చాంపియన్ షిప్ కోసం అక్కడికి వెళ్లేసరికి మేరీకోమ్ బరువు 50 కేజీల బరువు ఉంది. వేయింగ్ కి మరో 4 గంటల సమయం మాత్రమే ఉండటంతో.. బరువు తగ్గాలని నిశ్చయించుకున్న ఆమె… ఏకబిగిన స్కిప్పింగ్ చేసింది. సరిగ్గా వేయింగ్ సమయానికి 2 కేజీలు తగ్గి 48 కేజీలకు వచ్చి… పోటీకి అర్హత సాధించింది. తద్వారా సునాయాసంగా గెలిచి.. స్వర్ణం సాధించింది.
-
మణిపూర్ కు చెందిన మేరీ కోమ్ 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచి.. ఈ ఘనత సాధించిన తొలి మహిలా బాక్సర్ గా రికార్డు సృష్టించింది.
-
2018 కామన్ వెల్త్ గేమ్స్ లోను స్వర్ణం గెలిచి రికార్డు నమోదు చేసింది.
-
2016 ఏప్రిల్ లో అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మేరీ కోమ్ ను రాజ్యసభకు నామినేట్ చేశారు.
-
2017లో కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ.. మేరీ కోమ్ ను జాతీయ బాక్సింగ్ పరీశలకురాలిగా నియమించింది.
-
2003లో అర్జున అవార్డు, 2006లో పద్మ శ్రీ, 2013లో పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్నారు.
☛ భారత తొలి ఐఏఎస్ మహిళా అధికారిణి అన్నా రాజం కన్నుమూత
స్వతంత్ర భారత దేశ ప్రథమ మహిళా IAS అధికారిణి అన్నా రాజం మల్హోత్రా (91) ఏళ్ల వయసులో కన్నుమూశారు. సెప్టెంబర్ 18న ముంబై సబర్బణ్ అంధేరీలో ని స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు.
-
అన్నా రాజం 1927 జులైలో కేరళలో జన్మించారు. ఉన్నత విద్యను మద్రాస్ లో అభ్యసించారు.
-
1951లో అన్నా రాజం భారత సివిల్ సర్వీసెస్ కు ఎంపికయ్యారు. మద్రాస్ కేడర్ ను ఎంపిక చేసుకున్నారు. అప్పటి మద్రాస్ ముఖ్యమంత్రి సి. రాజగోపాలచారి ప్రభుత్వంలో అధికారిణిగా పనిచేశారు.
-
అన్నా రాజం భర్త ఆర్ ఎన్ మల్హోత్రా. ఆయన 1985 నుంచి 1990 వరకు భారతీయ రిజర్వు బ్యాంక్ గవర్నర్ గా పనిచేశారు.
☛ అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ గా కమ్లేశ్ నీల్ కాంత్ వ్యాస్
ప్రముఖ శాస్త్రవేత్త, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ కమ్లేశ్ నీల్ కాంత్ వ్యాస్.. అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ గా, డిపార్ట్ మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ(DAE) కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ ఆయన నియామకానికి సెప్టెంబర్ 18న ఆమోదం తెలిపింది. 2021 మే వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు.
-
ప్రస్తుత చైర్మన్ శేఖర్ బసు స్థానంలో కమ్లేశ్ నీల్ కాంత్ వ్యాస్ బాధ్యతలు చేపడతారు. శేఖర్ బసు 2015 అక్టోబర్ లో అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ గా నియమితులయ్యారు. 2018 సెప్టెంబర్ తో ఆయన పదవికాలం ముగిసింది.
-
కమ్లేశ్ నీల్ కాంత్ వ్యాస్ వడోదరలోని ఎంఎస్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పొందారు.
-
అణు పరిశోధన రంగంలో సేవలకు గాను కమ్లేశ్.. 2011లో ఇండియన్ న్యూక్లియర్ సొసైటీ నుంచి ఔట్ స్టాండింగ్ సర్వీస్ అవార్డు, 2006లో హోమీ బాబా సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డు పొందారు.
-
అటామిక్ ఎనర్జీ కమిషన్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ గవర్నింగ్ బాడీ. ఇది నేరుగా ప్రధాని పర్యవేక్షణలో ఉంటుంది. దీన్ని 1948లో ఏర్పాటు చేశారు.
☛ పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ జైలు శిక్ష రద్దు
అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు రద్దు చేసింది. ఆయన కూతురు మర్యం, అల్లుడు మహ్మద్ సఫ్దార్ ల జైలు శిక్షలను నిలిపివేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 19న ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. వారు ముగ్గురు జైలు నుంచి విడుదలయ్యారు.
☛ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కొండపల్లి కోటేశ్వరమ్మ కన్నుమూత
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కొండపల్లి కోటేశ్వరమ్మ(100) సెప్టెంబర్ 19న అనారోగ్యంతో విశాఖపట్నంలో కన్నుమూశారు. కృష్ణా జిల్లా పామర్రులో జన్మించిన ఆమె.. ప్రజా సమస్యలపై పోరాటం చేశారు.
-
ఆమె భర్త నక్సల్ బరీ కీలక నేత కొండపల్లి సీతారామయ్య
-
స్వాతంత్రోద్యమ సమయంలో గాంధీజీ పామర్రు సందర్శించినప్పుడు కోటేశ్వరమ్మ తన నగలన్నింటినీ విరాళంగా ఇచ్చారు.
-
తెలంగాణ సాయుధ పోరాటంలో 3 ఏళ్ల పాటు అజ్ఞానంతో ఉన్నారు.
-
నక్సల్ బరీ ఉద్యమంలో తన కుమారుడు చంద్రశేఖర్ ఆజాద్ ను పోగొట్టుకున్నారు.
-
92 ఏళ్ల వయసులో తన జీవిత విశేషాలతో “నిర్జన వారధి” పుస్తకాన్ని రచించారు.
☛ ఎయిర్ ఇండియా స్వతంత్ర డైరెక్టర్ గా పురందేశ్వరి
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి.. ఎయిర్ ఇండియా స్వతంత్ర డైరెక్టర్ గా నియమితులయ్యారు. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ సెప్టెంబర్ 20న నియామ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ఈ పదవిలో 3 ఏళ్లు కొనసాగుతారు.
-
యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించిన పురందేశ్వరి, రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు.
☛ ఆర్చరీ కోచ్ జీవన్ జ్యోత్ రాజీనామా
భారత ఆర్చరీ కాంపౌండ్ విభాగం జట్టు కోచ్ జీవన్ జ్యోత్ సింగ్.. తన పదవికి రాజీనామా చేశారు. ఉత్తమ కోచ్ లకు ఇచ్చే జాతీయ క్రీడా పురస్కారం “ద్రోణాచార్య” జాబితా నుంచి తన పేరుని తొలగించినందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అవార్డుల సెలక్షన్ కమిటీ జీవన్ జ్యోత్ సింగ్ పేరుని నామినీల జాబితాలో చేర్చింది. అయితే.. కేంద్ర క్రీడా శాఖ ఆయన పేరుని ఎంపిక జాబితా నుంచి తొలగించింది.
☛ సెయిల్ చైర్మన్ గా అనిల్ కుమార్ చౌదరి
భారతీయ స్టీల్ అథారిటీ( Steel Authority of India – SAIL) చైర్మన్ గా అనిల్ కుమార్ చౌదరి నియమితులయ్యారు. కేంద్ర నియామకాల కమిటీ ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది. 2018 జూన్ లో పదవీ విరమణ పొందిన పీకే సింగ్ స్థానంలో అనిల్ కుమార్ చౌదరి కొత్త చైర్మన్ గా బాధ్యతలు చేపడతారు. 2020 డిసెంబర్ వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు.
-
SAIL ను 1974లో ఏర్పాటు చేశారు.