జాతీయం
☛ అలహాబాద్ ఇకపై “ప్రయాగ్‌రాజ్“
ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ నగరం అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చారు. ఆ రాష్ట్ర కేబినెట్ అక్టోబర్ 16న ఈ మేరకు తీర్మానం చేసింది.
-
16వ శతాబ్దంలో మొఘలు చక్రవర్తి అక్బర్ ఇక్కడి గంగా–యమున కలిసే సంగమ ప్రాంతంలో కోటను నిర్మించాడు. ఆ కోటకు, పరిసర ప్రాంతానికి కలిపి ఇలాహాబాద్ అని పేరు పెట్టాడు. కాలక్రమంలో దీన్నే అలహాబాద్ గా మారింది.
-
కుంభమేళా జరిగే సంగమ ప్రాంతాన్ని ప్రయాగ్ అనే పేరుతోనే ఇప్పటికీ పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అలహాబాద్ ను ప్రయోగ్ రాజ్ గా మార్చారు.
☛ ప్రధానుల మ్యూజియంకు శంకుస్థాపన
దేశరాజధాని న్యూఢిల్లీలోని తీన్‌మూర్తి ఎస్టేట్స్‌లో నిర్మించనున్న ‘భారత ప్రధానమంత్రుల మ్యూజియం’(మ్యూజియం ఫర్ ప్రైమ్ మినిస్టర్స్)కు కేంద్రమంత్రులు మహేశ్ శర్మ, హర్దీప్సింగ్ పూరి అక్టోబర్ 15న శంకుస్థాపన చేశారు.
10,975.36 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ. 271 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ మ్యూజియంలో ఫ్రధానమంత్రి పదవుల్లో ఉన్నవారు చేపట్టిన కార్యక్రమాల వివరాలను పొందుపరచనున్నారు.
☛ అమృత్ సర్ వద్ద రైలు ప్రమాదం – 61 మంది మృతి
పంజాబ్‌లోని అమృత్సర్ నగర శివార్లలో అక్టోబర్ 19న ఘోర రైలు ప్రమాదం జరిగింది. జోడా ఫాటక్ అనే గ్రామ సమీపంలో ప్రజలు రైలు పట్టాలపై నిల్చుని దగ్గరలోని మైదానంలో జరుగుతున్న రావణ దహన కార్యక్రమాన్ని చూస్తుండగా.. జలంధర్ నుంచి అమృత్సర్ వస్తున్న రైలు పట్టాలపై ఉన్న ప్రజలను ఢీకొంటూ వేగంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 61 మంది మృతి చెందగా మరో 72 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో పట్టాలపై దాదాపు 300మంది వరకు ఉండగా, రావణుడి దిష్టిబొమ్మకు అప్పుడే నిప్పుపెట్టి టపాసులు పేలుస్తుండటంతో ఇళ్లకు తిరిగి వెళ్లేందుకు మరింతమంది పట్టాలపైకి వచ్చారు. టపాసుల శబ్దం కారణంగా రైలు శబ్దం వినిపించకపోవడంతో ప్రజలు తొందరగా పట్టాల నుంచి పక్కకు రాలేకపోవడంతో మృతుల సంఖ్య అధికంగా ఉంది. జలంధర్–అమృత్సర్ రైలు ప్రజలపైకి దూసుకొచ్చిన సమయంలోనే పక్కనే ఉన్న మరో ట్రాక్‌పైకి ఇంకో రైలు కూడా రావడంతో పట్టాలపై ఉన్న ప్రజలు ఎటూ తప్పించుకోలేకపోయారు. దీంతో బాధితుల సంఖ్య భారీగా పెరిగింది.
☛ నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరిట ఏటా అవార్డు: ప్రధాని మోదీ
నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ ‘ఆజాద్ హింద్’ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అక్టోబర్ 21న ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.సందర్భాన్ని గుర్తుచేసేలా రూపొందించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
-
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతు… విపత్తు సమయంలో సహాయక కార్యక్రమాల్లో విశేష సేవలందించే సిబ్బందికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరిట ఇకపై ఏటా అవార్డు ఇస్తామని ప్రకటించారు.
-
ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యులు బ్రిటిష్ పాలకుల చేతిలో విచారణ ఎదుర్కొన్న ఎర్రకోటలోని జైలుగది సంఖ్య 3లో ఆ శిలాఫలకాన్ని ఏర్పాటు చేయనున్నారు.
-
అదే జైలులో ఒక మ్యూజియాన్ని కూడా నిర్మించనున్నారు.
☛ జాతీయ అమరవీరుల స్థూపం ఆవిష్కరణ
అక్టోబర్ 21న జాతీయ పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలో నిర్మించిన జాతీయ అమరవీరుల స్మారకాన్ని… ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. శౌర్య కుడ్యంపై దేశవ్యాప్తంగా 34,800 మంది పోలీసు అమరవీరుల పేర్లను లిఖించారు.
-
జాతీయ పోలీసు అమర వీరుల స్థూపాన్ని నిర్మాణానికి తెలంగాణలోని ఖమ్మం నుంచి భారీ గ్రానైట్ రాయిని తరలించారు. 31 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పు, 278 టన్నుల బరువున్న ఈ రాయిని స్థూపంగా తీర్చిదిద్దారు.
-
నేలకొండపల్లి మండలం చెరువు మాదారంలో వద్దిరాజు రవిచంద్రకు చెందిన గాయత్రి గ్రానైట్స్ నుంచి దీనిని వెలికితీశారు.
రాష్ట్రీయం
☛ పోలేపల్లిలో డీఎస్ఎం రెండో ప్లాంట్
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని పోలేపల్లి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లో డీఎస్ఎం సంస్థ తన రెండో ప్లాంటును అక్టోబర్ 15న ప్రారంభించింది.
జంతువుల పోషకాహార విభాగంలో ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న డీఎస్ఎం దాదాపు 174దేశాలలో కార్యకలాపాలు సాగిస్తుంది. మహారాష్ట్రలోని అంబార్‌లో తొలి ప్లాంటును ఏర్పాటు చేసిన ఈ సంస్థ టర్నోవరు రూ.2 వేల కోట్ల వరకు ఉంది.
☛ మిర్చి ఎయిర్ పోర్ట్ రేడియో…
హైదరాబద్‌లోని రాజీవ్‌గాందీ అంతర్జాతీయం విమానాశ్రయం (శంషాబాద్ విమానాశ్రయం)లో మిర్చి ఎయిర్పోర్ట్ రేడియో సర్వీసులు ప్రారంభమయ్యాయి. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ప్యాసింజర్ ప్రైమ్ ప్రోగ్రామ్ కింద ఈ రేడియో సర్వీసులను జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్(జీహెచ్ఐఎల్) అక్టోబర్16న ప్రారంభించింది. ఈ సర్వీసుల ద్వారా ముందుగా రికార్డు చేసిన తెలుగు, హిందీ, ఇంగ్లిష్ పాటలను అందించనున్నారు.విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులు, సందర్శకులకు ఎల్లప్పుడూ ఈ రేడియో సేవలు అందుబాటులో ఉంటాయి.
☛ హిమాచల్ ప్రదేశ్ లో తొలి సొరంగంలో రైల్వేస్టేషన్
భారత్–చైనా సరిహద్దులో నిర్మించబోతున్న వ్యూహాత్మకంగా కీలకమైన బిలాస్పూర్–మనాలి–లేహ్ రైల్వే మార్గంలో దేశంలోనే తొలిసారిగా సొరంగంలో రైల్వే స్టేషన్‌ను ఏర్పాటుచేయనున్నారు.
-
హిమాచల్‌ప్రదేశ్‌లోని కీలాగ్‌లో ఈ స్టేషన్‌ను నిర్మించనున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు.
-
దేశంలో సొరంగంలో ‘మెట్రో’ స్టేషన్లు ఉన్నా.. సొరంగంలో తొలి ‘రైల్వే స్టేషన్’ మాత్రం ఇదేకానుంది.
-
‘బిలాస్పూర్–మనాలి–లేహ్ మార్గంలో 27 కి.మీ పొడవైన సొరంగంలో ఏర్పాటయ్యే కీలాగ్ స్టేషన్ సముద్ర మట్టానికి 3 వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది.
-
465 కి.మీ పొడవైన ఈ లైను నిర్మాణానికి రూ.83,360 కోట్లువ్యయం అవుతుందని అంచనా.
-
ఈ లైను భద్రతా బలగాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతుందని రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
☛ తెలంగాణలో 3 పోస్టల్ పాస్ పోర్ట్ కేంద్రాలు
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్, భువనగిరి, మల్కాజిగిరి ప్రాంతాల్లో 3 పోస్టల్ పాస్ పోర్ట్ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అక్టోబర్ 31 లోగా ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.
☛ అత్యున్నత విద్యాసంస్థల్లో 34వ స్థానంలో ఓయూ
దేశంలోని 75 అత్యున్నత విద్యాసంస్థలతో రూపొందించిన జాబితాలో ఉస్మానియా విశ్వవిద్యాలయం 34వ స్థానంలో నిలిచింది. క్యూఎస్ ఇండియా అనే సంస్థ 2019 సంవత్సరానికి సంబంధించి ఈ జాబితాను తయారు చేసింది.
☛ కిలిమంజారోను అధిరోహించిన పాలమూరు వాసి
ఆఫ్రికా ఖండంలో ఎత్తయిన శిఖరం కిలిమంజారోని మహబూబ్‌నగర్‌లోని సుశ్రుత ప్రజావైద్యశాల ఎండీ డాక్టర్ మధుసూదన్‌రెడ్డి అక్టోబర్ 22న అధిరోహించారు. మహబూబ్‌నగర్ ట్రెక్కింగ్ క్లబ్ తరఫున ‘మహబూబ్‌నగర్ బాలికలను రక్షించాలి’ అనే నినాదంతో ఆయన కిలిమంజారోని అధిరోహించారు.
☛ అంధుల కోసం దేశంలోనే తొలిసారి బ్రెయిలీ లీపీ ఓటరు కార్డులు
దేశంలోనే ప్రథమంగా అంధుల కోసం బ్రెయిలీ లిపిలోనూ ఓటరు ఫొటో గుర్తింపు కార్డుల (EPIC)ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ అక్టోబర్ 23న కొందరు దివ్యాంగులకు ఈ బ్రెయిలీ ఓటరు గుర్తింపు కార్డులను పంపీణి చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బ్రెయిలీ లిపిలో ముద్రించిన కరపత్రాలు, మూగ, బధిరులకు అర్థమయ్యేలా సైన్ లాంగ్వేజితో రూపొందించిన చిత్రాల సీడీలను రావత్ ఆవిష్కరించారు.
-
ప్రముఖ క్రీడాకారులు పుల్లెల గోపీచంద్, వీవీఎస్ లక్ష్మణ్‌లతో ఈసీ ఈ చిత్రాలు రూపొందించింది.
-
ఈ చిత్రాలు, కరపత్రాల్లో పోలింగ్ కేంద్రంలో ఎలా ఓటు వేయాలి.. ఈవీఎం మెషీన్లను ఎలా వాడాలి వంటి త దితర వివరాలున్నాయి.
-
ఓటరు జాబితా ప్రకారం రాష్ట్రంలో 4,12,098 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు.
☛ విశాఖలో వైజాగ్ ఫిన్‌టెక్ ఫెస్టివల్
వైజాగ్ ఫిన్‌టెక్ ఫెస్టివల్ విశాఖపట్నంలో జరిగింది. ఇందులో భాగంగా అక్టోబర్ 23న ఫిన్‌టెక్ ఫెస్టివల్లో తొలిరోజు రాష్ట్ర ప్రభుత్వం 10 సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ కార్యక్రమలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌ను ఇన్నోవేషన్ వ్యాలీగా తీర్చిదిద్దుతానని చెప్పారు. రాజధాని అమరావతిని ప్రపంచంలోనే మేటి ఐటీ సిటీగా, నాలెడ్జి నగరంగా, తిరుపతిని హార్డ్‌వేర్, ఎలక్ట్రానికగ్ హబ్‌గా తయారు చేస్తామన్నారు.
ప్రపంచస్థాయి ఫిన్‌టెక్ సంస్థలను రాష్ట్రానికి ఆకర్షించేందుకు వీలుగా ప్రతి సంవత్సరం ‘వన్ మిలియన్ డాలర్ ఛాలెంజ్’ (రూ. 7 కోట్లు) పోటీలను నిర్వహిస్తామని చంద్రబాబు ప్రకటించారు.
-
కార్యక్రమంలో 15 దేశాల నుంచి 1,800 మంది ఐటీ రంగ ప్రతినిధులు పాల్గొన్నారు.
☛ హైదరాబాద్ లో ఓటింగ్ శాతం పెంచేందుకు “వాదా” యాప్
హైదరాబాద్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ‘వాదా’(ఓటర్ యాక్సెస్బిలిటీ యాప్ ఫర్ ద డిఫరెంట్లీ ఏబుల్డ్)ను కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఓపీ రావత్ అక్టోబర్ 23న ప్రారంభించారు.
-
వాదా(హామీ) అనే అర్థమొచ్చేలా ఈ పేరు పెట్టారు. ఓటర్ చైతన్య రథాలు, గర్భిణులు, 65 ఏళ్లు దాటిన వయోధికులు, దివ్యాంగులు పోలింగ్ కేంద్రాలకు చేరుకునేందుకు ఈ యాప్ ద్వారా అధికారులు సహాయమందిస్తారు.
అంతర్జాతీయం
☛ శ్రీలంక ప్రధానితో మోదీ భేటీ
భారత పర్యటనలో ఉన్న శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘేతో ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్20న భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలతో పాటు పలు అంతర్జాతీయ సమస్యలపై చర్చించారు. అలాగే 2017 మేలో మోదీ శ్రీలంకకు వెళ్లిన సందర్భంగా ప్రకటించిన పలు ప్రాజెక్టులను ఇరు దేశాధినేతలు సమీక్షించారు.
☛ హ్యూమన్ కాపిటల్ ఇండెక్స్ లో 115వ స్థానంలో భారత్
ప్రపంచ బ్యాంక్ ఇటీవల విడుదల చేసిన హ్యూమన్ కాపిటల్ ఇండెక్స్ లో భారత్ 115వ స్థానంలో నిలిచింది. విద్య, ఆరోగ్యం, శిశుమరణాల రేటు ఆధారంగా 157 దేశాల్లో ఈ సర్వే జరిగింది.
-
సింగపూర్ ఈ ర్యాంకింగ్స్ లో తొలి స్థానంలో నిలిచింది.
-
భారత్ పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ 106, నేపాల్ 102, శ్రీలంక 74వ స్థానంలో మనకంటె మెరుగ్గా ఉన్నాయి.
☛ యూఎస్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న భాషగా తెలుగు
అమెరికాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భాషగా తెలుగు నిలిచింది. 2010-17 కాలంలో అమెరికాలో ఇంగ్లీషు మినహా ఇతర భాషలపై అధ్యయనం చేసిన సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ సంస్థ అక్టోబర్ 22న వివరాలు వెల్లడించింది.
-
2017 నాటి లెక్కల యూఎస్‌లో 4 లక్షలకు పైగా తెలుగు మాట్లాడేవారున్నారు. ఈ సంఖ్య 2010నాటితో పోల్చితే రెట్టింపు.
-
ప్రపంచ వాణిజ్య సదస్సు (వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్) అంచనా ప్రకారం అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 2010-17కాలంలో ఏకంగా 86 శాతానికి పెరిగింది.
-
అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న టాప్-10 భాషల్లో ఏడు దక్షిణాసియా భాషలు ఉన్నాయి.
-
అమెరికాలోని 32 కోట్ల జనాభాలో 6 కోట్ల మంది ఇంగ్లీషేతర భాషలు మాట్లాడుతున్నారు. అందులో అధికంగా స్పానిష్ మాట్లాడేవారున్నారు.
-
యూఎస్‌లో భారతీయ భాషల్లో హిందీ మాట్లాడుతున్నవారు అధికంగా ఉండగా తర్వాతి స్థానంలో గుజరాతీ మాట్లాడేవారున్నారు.
☛ పొడవైన సముద్ర వంతెన ప్రారంభం
ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెనగా గుర్తింపు పొందిన ‘హాంకాంగ్– జుహయి’ని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అక్టోబర్ 23న అధికారికంగా ప్రారంభించారు.
-
పెరల్ నది డెల్టాలోని హాంకాంగ్– జుహయి– మకావో పట్టణాలను కలుపుతూ ఈ వంతెనను నిర్మించారు. ఈ బ్రిడ్జి మొత్తం పొడవు 55 కి.మీ కాగా, ఇందులో 22.9 కి.మీ. సముద్రంపై, 6.7 కి.మీ. సొరంగంలో ఉంది.
-
ప్రస్తుతం హాంకాంగ్ నుంచి జుహయికి ప్రయాణ సమయం 3 గంటలు కాగా, ఈ వంతెన వల్ల అది 30 నిమిషాలకు తగ్గనుంది. 2009లో ప్రారంభమైన ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ.1.47 లక్షల కోట్లు ఖర్చు చేశారు.
అవార్డులు
☛ తెలంగాణ దళిత రచయిత్రికి“శక్తి భట్”పురస్కారం
అమెరికాలో స్థిరపడిన తెలంగాణ దళిత రచయిత్రి సుజాత గిడ్లకు 2018 సంవత్సరానికి గాను “శక్తి భట్”తొలి రచన పురస్కారం దక్కింది. ఆమె రచించిన “యాంట్స్ అమాంగ్ ఎలిఫెంట్స్:యాన్ అన్ టచెబుల్ ఫ్యామిలీ అండ్ మేకింగ్ ఆఫ్ మోడర్న్ ఇండియా” (Ants Among Elephants: An Untouchable Family and Making of Modern India) అనే పుస్తకానికి గాను ఈ అవార్డు ప్రకటించారు. అవార్డు కింద 2లక్షల రూపాయలు అందిస్తారు.
-
6 పుస్తకాలు అవార్డు కోసం షార్ట్ లిస్ట్ కాగా… న్యాయనిర్ణేతలు సుజాత పుస్తకాన్ని ఎంపిక చేశారు.
-
రచయిత్రి సుజాత… పేదల జీవితం, పితృస్వామ్య వ్యవస్థ, తిరుగుబాటు, కమ్యూనిజం తదితర అంశాలపై పుస్తకంలో వివరించారు.
-
యువ రచయిత శక్తి స్మారకార్థం శక్తి భట్ ఫౌండేషన్ 2008లో ఈ అవార్డుని నెలకొల్పింది.
-
సుజాత గిడ్ల స్వస్థలం తెలంగాణలోని వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజీపేట్ మండలం.
-
మద్రాస్ ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అప్లైడ్ ఫిజిక్స్ లో పరిశోధకురాలిగా పనిచేశారు.
-
1990లో తన 26వ ఏట కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా వెళ్లి స్థిరపడ్డారు.
☛ ప్రొఫెసర్ అభయ్ అష్టేకర్కు ‘ఐన్‌స్టీన్ ప్రైజ్-2018’
ఇండో అమెరికన్, ప్రొఫెసర్ అభయ్ అష్టేకర్ ప్రతిష్టాత్మక ‘ఐన్‌స్టీన్ ప్రైజ్-2018’ పురస్కారానికి ఎంపికయ్యారు. అమెరికన్ ఫిజికల్ సొసైటీ (APS) అక్టోబర్15న ప్రకటించింది.
-
1974లో యూనివర్సిటీ ఆఫ్ చికాగో నుంచి అభయ్ పీహెచ్డీ పూర్తి చేశారు.
-
లూప్ క్వాంటమ్ గ్రావిటీ ప్రోగ్రామ్‌పై అనేక పరిశోధనలు చేశారు.
-
ప్రస్తుతం ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా, పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఇన్స్టిట్యూట్ ఫర్ గ్రావిటేషన్ అండ్ ది కాస్మోస్‌కి డెరైక్టర్ ఉన్నారు.
-
అక్టోబర్23న జరగనున్న అవార్డుల ప్రదానోత్సవంలో అభయ్ ఐన్‌స్టీన్ ప్రైజ్-2018తోపాటు పదివేల డాలర్లను నగదు ప్రోత్సాహకాన్ని అందుకున్నారు.
☛ న్యూ అకాడమీ విజేత మెర్సె కోండె
నోబెల్ సాహిత్య పురస్కారానికి నిరసనగా అందిస్తున్న న్యూ ఆకాడమీ అవార్డు విజేతగా ఫ్రెంచ్ రచయిత మెర్సె కోండె ఎంపికయ్యారు. ఈ బహుమతికి అందించే నగదును క్రౌడ్ ఫండింగ్,విరాళాల ద్వారా సేకరిస్తారు. అవార్డు కింద మెర్సె కోండె దాదాపు 87,000 పౌండ్లు అందుకోనున్నారు.
☛ అన్నా బర్న్స్ కు మ్యాన్ బుకర్ – 2018
ఆంగ్ల సాహిత్యంలో ప్రతిష్టాత్మక మ్యాన్ బుకర్ ప్రైజ్‌ను ఈ ఏడాదికి ఐర్లాండ్ రచయిత్రి అన్నా బర్న్స్(56)గెలుచుకున్నారు.ఆమె రచించిన ‘మిల్క్ మ్యాన్’ నవలకు ఈ అవార్డు దక్కింది.
-
20వ శతాబ్దం చివరినాళ్లలో ఉత్తర ఐర్లాండ్‌లో జాత్యంతర ఘర్షణలు,రాజకీయ అస్థిరతకాలంలో ఓ యువతి,వివాహితుడితో సంబంధం ఏర్పర్చుకున్న ఇతివృత్తంతో ఈ నవల సాగుతుంది.ఆనాటి పరిస్థితులను మిల్క్‌మ్యాన్ ఎంతో సహజంగా కళ్లకు కట్టిందని ఎంపిక కమిటీ కొనియాడింది.
-
మ్యాన్‌బుకర్ ప్రైజ్ 49 ఏళ్ల ప్రస్తానంలో ఈ అవార్డుకు ఎంపికైన తొలి ఉత్తర ఐరిష్ మహిళగా అన్నా గుర్తింపు పొందారు.
-
అన్నా బర్న్స్‌కు ఈ అవార్డు కింద రూ. 50.85లక్షల చెక్కు, ట్రోఫీ బహూకరించారు.
-
మిల్క్‌మ్యాన్’ నవల.. నాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ కట్టుబాట్లను సవాలుచేసే సాధారణ యువతి పాత్ర చుట్టూ తిరుగుతుంది.ఇందులో పాత్రదారులకు పేర్లు ఎలాంటి పేర్లు పెట్టకుండా వారి హోదాలతోనే నవలను ముందుకు నడిపారు.
☛ ఫాలీ నారీమన్ కు లాల్ బహదూర్ శాస్త్రి – 2018 అవార్డు
న్యాయకోవిదుడు, సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్ నారిమన్‌కు లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ ఎక్స్‌లెన్స్ అవార్డు-2018 లభించింది. ఢిల్లీలో అక్టోబర్ 22న జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ అవార్డును నారీమన్ కు ప్రదానం చేశారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ
☛ ఒడిశాలో దేశంలోనే తొలి 2జీ ఈథనాల్ ప్లాంట్
దేశంలోనే తొలి సెకండ్ జనరేషన్ (2జీ) ఇథనాల్ బయో రిఫైనరీ ప్లాంట్ ను ఒడిశాలోని బార్ గఢ్ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ వరిగడ్డి నుంచి ఇథనాల్ ను ఉత్పత్తి చేయనున్నారు.రూ.100 కోట్లతో భారత్ పెట్రోలియం కార్పొరేషన్(BPCL) ఏర్పాటు చేయనుంది. 2020 వరకు పూర్తి చేయాలని టార్కెట్ నిర్దేశించుకున్నారు.
-
మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోను ప్లాంట్ లు ఏర్పాటు చేసేలా బీపీసీఎల్ ప్రణాళికలు రచిస్తోంది.
-
2018 జీవ ఇంధన పాలసీ ప్రకారం 2030 నాటికి లీటర్ పెట్రోల్ కు 20 శాతం ఇథనాల్ కలిపేలా కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
-
ప్రస్తుతం ఇథనాల్ కొరత కారణంగా 3 నుంచి 4 శాతం వరకే కలుపుతున్నారు.
☛ మైక్రోసాఫ్ట్ తో నీతిఆయోగ్ ఒప్పందం
వ్యవసాయ, ఆరోగ్య రంగాల్లో సవాళ్లకు పరిష్కారం కనుగొనే దిశగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(AI)టెక్నాలజీ వినియోగించాలని నీతి ఆయోగ్ నిర్ణయించింది. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. వ్యవసాయ రంగంలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అధునాత న ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సేవల్ని మైక్రోసాఫ్ట్ నీత ఆయోగ్ కు అందించనుంది.
☛ ఎయిర్ ఫోర్స్ మెడ్ వాచ్ యాప్
అక్టోబర్ 8న ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) 86వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆరోగ్యానికి సంబంధించిన మెడ్ వాచ్ అనే ఒక యాప్ ని తీసుకొచ్చింది. ఇది వాయు సైనికులకే కాకుండా సాధారణ పౌరులకు సైతం ఆరోగ్యానికి సంబంధించిన కచ్చితమైన, అధికారిక సమాచారాన్ని అందిస్తుంది.
-
ప్రథమ చికిత్స, పోషకాలకు సంబంధించిన విషయాలు, వాక్సినేషన్, టైంకి హెల్త్ చెకప్,మెడికల్ రికార్డులు, హెల్త్ లైన్ నంబర్లు యాప్ లో అందుబాటులో ఉంటాయి.
-
ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా యాప్ ని ఆవిష్కరించారు.
క్రీడలు
☛ యూత్ ఒలింపిక్స్ లో 17వ స్థానంలో భారత్
అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ వేదికగా జరిగిన 3వ యూత్ ఒలింపిక్స్ లో భారత్ మొత్తం13 పతకాలతో 17వ స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా ఈ క్రీడల్లో భారత్ 3 స్వర్ణాలు, 9 రజతాలు,ఒక కాంస్యంతో కలిపి 13 పతకాలు సాధించింది.
-
2010 క్రీడల్లో భారత్ 8 పతకాలతో 58వ స్థానంలో… 2014 క్రీడల్లో రెండు పతకాలతో 64వ స్థానంలో నిలిచింది.
-
2022 యూత్ ఒలింపిక్స్ పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్‌లో జరుగుతాయి.
☛ విజయ్ హజారే ట్రోఫీ విజేతగా ముంబై
విజయ్ హజారే క్రికెట్ ట్రోఫీ – 2018ను ముంబై జట్టు గెలుచుకుంది. అక్టోబర్ 20న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్లో ముంబై 4 వికెట్ల తేడాతో ఢిల్లీపై విజయం సాధించింది. దీంతో ముంబై ఓవరాల్‌గా ఈ ట్రోఫీని పదోసారి దక్కించుకున్నట్టయింది. ఆదిత్య తరే(ముంబై జట్టు)కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం లభించింది.
☛ షాంఘై చెస్ విజేత లలిత్ బాబు
షాంఘై ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ విజేతగా ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు నిలిచాడు. చైనాలో అక్టోబర్ 22న జరిగిన ఈ టోర్నీలో లలిత్ ఏడు పాయింట్లతో లీ డి (చైనా), దాయ్ చాంగ్రెన్ (చైనా)లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా లలిత్ బాబుకు టాప్ ర్యాంక్ లభించింది.
-
రెండో స్థానంలో లీ డి… మూడో స్థానంలో దాయ్ చాంగ్రెన్ నిలిచారు.
☛ యూఎస్ గ్రాండ్‌ప్రి రేసు విజేత కిమీ రైకోనెన్
అమెరికాలోని ఆస్టిన్‌లో అక్టోబర్ 22న జరిగిన యూఎస్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేసులో ఫెరారీ డ్రైవర్ కిమీ రైకోనెన్ విజేతగా నిలిచాడు. 56 ల్యాప్‌ల రేసును అందరికంటే వేగంగా రైకోనెన్ 1 గంటా 34 నిమిషాల 18.643 సెకన్లలో పూర్తి చేసి విజయం సాధించాడు.
-
రేసులో రెడ్‌బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ రెండో స్థానంలో నిలువగా మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మూడోస్థానం దక్కించుకున్నాడు.
వార్తల్లో వ్యక్తులు
☛నోకియా ప్రచారకర్తగా ఆలియా భట్
మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ నోకియా బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటి ఆలియా భట్ వ్యవహరించనున్నారు. భారత్‌లో నోకియా ఫోన్ల డిజైన్, సేల్స్ నిర్వహిస్తున్న హెచ్ఎండీ గ్లోబల్ ఇండియా అక్టోబర్ 15న ఈ మేరకు ప్రకటించింది.
☛ “Privacy as Secrecy” పుస్తకావిష్కరణ
కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు రచించిన ‘ప్రైవసీ యాజ్ సీక్రసీ’ పుస్తకకాన్ని న్యూఢిల్లీలో అక్టోబర్ 16న ప్రొఫెసర్ ఉపేంద్ర బక్షీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీధర్ ఆచార్యులు మాట్లాడుతూ… గోప్యత పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాచార హక్కు చట్టం కింద దాఖలైన పిటిషన్లకు సమాధానం ఇవ్వకుండా తిరస్కరించేందుకు వీల్లేదని చెప్పారు.
☛ మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు పాల్ అలెన్ కన్నుమూత
మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు, ప్రపంచపు అత్యంత ధనికుల్లో ఒకరైన పాల్ అలెన్ (65)కన్నుమూశారు.నాన్–హాడ్జ్కిన్స్ లింఫోమా అనే కేన్సర్ కారణంగా అమెరికాలో అక్టోబర్16న తుదిశ్వాస విడిచారు.
-
పాల్ అనేక వ్యాపార రంగాల్లో ప్రవేశించారు.పలు దాతృత్వ సంస్థలను నెలకొల్పారు.సాంకేతిక,వైద్య పరిశోధనల కోసం పలు పరిశోధనాత్మక సంస్థలను స్థాపించి సమాజసేవ చేశారు.
-
మైక్రోసాఫ్ట్ మరో సహా వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, అలెన్ ఇద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులు.
-
1975ఏప్రిల్4న ఇద్దరు కలిసి మైక్రోసాఫ్ట్ సంస్థను స్థాపించారు.
☛ కేంద్ర మంత్రి పదవికి ఎంజే అక్బర్ రాజీనామా
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ అక్టోబర్17న తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయాల్లోకి రాక ముందు వేర్వేరు మీడియా సంస్థల్లో ఎడిటర్‌గా పనిచేస్తున్న సమయంలో ఆయన లైంగికంగా వేధించారని పలువురు మహిళా జర్నలిస్టులు ఆరోపించారు.దీంతోఅక్బర్ పదవికి రాజీనామా చేశారు.దీన్ని ప్రధాని మోదీ,ఆ తర్వాత రాష్ట్రపతి కోవింద్ ఆమోదించారు.అక్బర్ రాజీనామా ‘మీటూ’ ఉద్యమ విజయమని మహిళా కార్యకర్తలు అభివర్ణించారు.
-
20ఏళ్ల కిత్రం తనతో అసభ్యంగా ప్రవర్తించారని మహిళా జర్నలిస్టు ప్రియా రమణిమంత్రిపై ఆరోపణలు చేశారు.
☛ మాజీ గవర్నర్ ఎన్డీ తివారి కన్నుమూత
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ నారాయణ్‌దత్ తివారీ(93)కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అక్టోబర్ 18న తుదిశ్వాస విడిచారు.
-
ప్రస్తుత ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్లో 1925, అక్టోబర్ 18న నారాయణ్ దత్ తివారీ జన్మించారు.
-
1947లో వర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
-
1976లో తొలిసారిగా ఉత్తరప్రదేశ్ సీఎంగా చేశారు.
-
ఉత్తరప్రదేశ్ కు మూడుసార్లు, ఉత్తరాఖండ్‌కు ఒకసారి సీఎంగా చేశారు.
-
కేంద్రంలో ఇందిరాగాంధీ, రాజవ్ గాంధీ హయాంలో ఆర్థికం, పెట్రోలియం, విదేశాంగ మంత్రిగా చేశారు.
-
ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్‌గానూ వ్యవహరించారు.
☛ తెలంగాణ మంత్రి కేటీఆర్ కు WEF ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారకరామారావుకు వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం నుంచి మరోసారి ఆహ్వానం అందింది. 2019 జనవరి 22 నుంచి 25 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న49వ వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం సదస్సుకు ప్రత్యేక అతిథిగా హాజరు కావాలని కేటీఆర్‌కు ఎకనామిక్స్ ఫోరమ్ అక్టోబర్ 21న ఆహ్వానం పంపింది. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి, డిజిటలైజేషన్,ఈఓడీబీ, ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ పాలనలో పారదర్శకత వంటి కీలక అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం అమలుపరిచిన సంస్కరణలపై సదస్సులో ప్రసంగించాలని కేటీఆర్‌ను ఫోరం కోరింది.
☛అసోచామ్ అధ్యక్షుడిగా బాలకృష్ణన్ గోయెంకా
పరిశ్రమల సంఘం అసోచామ్ ప్రెసిడెంట్ గా వెల్ స్పన్ గ్రూప్ చైర్మన్ బాలకృష్ణన్ గోయెంకా బాధ్యతలు చేపట్టారు. అసోచామ్ సీనియర్ వైస్ ఛైర్మన్ గా హీరానందని గ్రూప్ కో కో ఫౌండర్ నిరంజన్ హీరనందని ఉన్నారు. ఇంతవరకు అసోచామ్ చైర్మన్ గా సందీప్ జజోడియా ఉన్నారు.
☛ తొలి మిస్ ట్రాన్స్ క్వీన్ వీణా
ముంబైలో జరిగిన మిస్ ట్రాన్స్ జెండర్ల పోటీల్లో ఛత్తీస్ గఢ్ కు చెందిన వీణా సెంద్రె ఇండియా లోనే మొట్టమొదటి “మిస్ ట్రాన్స్ క్వీన్” గా నిలిచారు. రన్నరప్ గా తమిళనాడుకు చెందిన నమిత అమ్ము నిలిచారు. వీణా ఇంతకముందు మిస్ ఛత్తీస్ గఢ్ టైటిల్ ను గెలుచుకున్నారు.