జాతీయం
☛ జాతీయ గాంధీ మ్యూజియంలో గాంధీ హృదయ స్పందన
న్యూఢిల్లీలోని జాతీయ గాంధీ మ్యూజియంలో మహాత్మా గాంధీ హృదయ స్పందనలను ఏర్పాటు చేశారు. 2018 అక్టోబర్ 2న గాంధీ 150వ జయంతి ఉత్సవాలు ప్రారంభవుతున్న నేపథ్యంలో.. ఈ ఏర్పాటు చేశారు. గాంధీ జివించి ఉన్న రోజుల్లో వివిధ సందర్భాల్లో సేకరించిన ECG(Electro Cardio Graphy) ఆధారంగా ఆయన హృదయ స్పందనలను పునర్ సృష్టి చేశారు. డిజిటల్ మోడల్ లో వాటిని ప్రజలు వినేందుకు ఏర్పాటు చేశారు.
☛ దేశంలో సాగు భూమి 157.14 మిలియన్ హెక్టార్లు
2015-16లో చేపట్టిన వ్యవసాయ గణన వివరాలను కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 1న విడుదల చేసింది. దీని ప్రకారం 2010-11లో దేశంలో సాగు భూమి 159.59 మిలియన్ హెక్టార్లుగా ఉండగా… 2015-16 గణనలో అది 157.14 మిలియన్ హెక్టార్లుగా ఉంది. అంటే.. 5 ఏళ్లలో 1.53 శాతం మేర సాగు భూమి తగ్గింది.
-
నివేదిక ప్రకారం.. దేశంలో కమతాల సంఖ్య 5.33 శాతం పెరిగింది.
-
ఉత్తరప్రదేశ్ లో అత్యధిక కమతాలు ఉన్నాయి.
-
కమతాలు ఎక్కువగా పెరిగిన రాష్ట్రాల్లో.. మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
-
రాజస్తాన్ లో అత్యధిక సాగు భూమి ఉంది.
-
ఇక 2010-11 ప్రకారం వ్యవసాయంలో 12.79 శాతం మహిళా రైతులు ఉండగా.. 2015-16 నాటికి 13.87 శాతానికి చేరారు.
-
వ్యవసాయ గణన ప్రతి 5 ఏళ్లకోసారి చేపడతారు.
☛ గిర్ అభయారణ్యంలో మరో రెండు సింహాలు మృతి
గుజరాత్ లోని గిర్ అభయారణ్యంలో సింహాల మరణాలు అటవీశాఖ అధికారులు, జంతు ప్రేమికులను ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా అక్టోబర్ 2న ఈ అభయారణ్యంలో మరో రెండు సింహాలు మృతి చెందాయి.
-
దీంతో 2018 సెప్టెంబర్ 12వ తేదీ నుంచి ఇక్కడ మృతి చెందిన సింహాల సంఖ్య 23కు చేరింది.
-
కొట్లాటలు, ఇన్ఫెక్షన్ల కారణంగా ఇవి చనిపోయాయి.
-
అభయారణ్యంలోని దల్జానియా రేంజ్ లోనే ఈ మరణాలన్నీ సంభవించాయి.
☛ ఘనంగా గాంధీ జయంతి.. బాపూకి “కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్“
ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 2న మహాత్మా గాంధీ 149వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. 2019 అక్టోబర్ 2న బాపూజీ 150వ జయంతి నేపథ్యంలో.. ఏడాది పాటు ఉత్సవాలు జరపాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం.. వేడుకలను ఘనంగా ప్రారంభించింది.
-
శాంతి, సహనం, అహింసను బోధించిన మహాత్ముని స్ఫూర్తిదాయక జీవితానికి గుర్తింపుగా అమెరికా కాంగ్రెస్.. గాంధీకి అత్యున్నత పౌర పురస్కారం “కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్” ఇవ్వనుంది. ఇందుకోసం అమెరికా కాంగ్రెస్ లో తీర్మానం ప్రవేశపెట్టింది.
-
గాంధీ జయంతిని పురస్కరించుకొని బ్రిటన్ దౌత్యకార్యాలయంలో ఏర్పాటు చేసిన గాంధీ బోధనలను గుర్తుచేసుకుంటు బాపు@150 చిత్రాన్ని ప్రదర్శించారు.
-
నెదర్లాండ్స్ రాజధాని ఆమ్ స్టర్ డామ్, జపాన్, రష్యాల లో భారత పోస్టల్ శాఖ రూపొందించిన గాంధీ స్మారక స్టాంపును విడుదల చేశారు.
-
గాంధీ శతజయంతి.. అంటే.. 1969లో ఆయన స్మారకార్థం రూ.100 నోటుపై తొలిసారి గాంధీ బొమ్మను ముద్రించింది.
-
ఆ తర్వాత 1996 వరకు ఆయన చిత్రం నోట్లపై ముద్రించలేదు
-
1996లో తొలిసారిగా నవ్వుతున్న గాంధీ చిత్రంతో కొత్త సీరీస్ నోట్లను ఆర్బీఐ ముద్రించింది.
-
1949లో రూపాయి నోటుపై ఆశోక స్తంభాన్ని చేర్చారు.
రాష్ట్రీయం
☛ మధ్యప్రదేశ్ లో గోవుల మంత్రిత్వశాఖ
మధ్యప్రదేశ్ లో గోవుల మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సెప్టెంబర్ 30న వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న Madhya Pradesh Gaupalan Evam Pashudhan Samvardhan (MPGEPS) బోర్డుకి కొన్ని పరిమితులు ఉన్న నేపథ్యంలో దీని స్థానంలో కొత్త మంత్రిత్వశాఖను తీసుకొచ్చారు.
-
దేశంలో గోవుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రంగా రాజస్థాన్ గుర్తింపు పొందింది.
☛ చార్మినార్.. భారత స్వచ్ఛ ఐకాన్
400 ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన చార్మినార్… భారత స్వచ్ఛ ఐకాన్ గా గుర్తింపు పొందింది. స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా చార్మినార్ కు స్వచ్ఛ ఐకాన్ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు అక్టోబర్ 2న న్యూఢిల్లీలో జరిగిన స్వచ్ఛ భారత్ మిషన్ 4వ వార్షికోత్సవంలో కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ మంత్రి ఉమా భారతి చేతుల మీదుగా జీహెచ్ఎంసీ అధికారులు అవార్డు అందుకున్నారు.
-
చారిత్రక కట్టడాల అభివృద్ధి, పునరుద్ధరణ, స్వచ్ఛ కార్యక్రమాల నిర్వహణకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటించింది.
☛ ఏపీలో ఆర్టీఐ కమిషనర్ల నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్లుగా ఎం. రవికుమార్, బి.వి. రమణ కుమార్, కట్టా జనార్దనరావులు నియమితులయ్యారు. సమాచార హక్కు చట్టం – 2005 ప్రకారం గవర్నర్ నరసింహన్ సూచించిన ఈ ముగ్గురి పేర్లకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం.. అక్టోబర్ 1న నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో వారు 5 ఏళ్లు కొనసాగుతారు.
☛ ఆంధ్రప్రదేశ్ లో “యువనేస్తం” ప్రారంభం
అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా “యువనేస్తం” పథకాన్ని ప్రారంభించింది. రాజధాని అమరావతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. నిరుద్యోగులకు నెలకు రూ. వెయ్యి భృతి చెల్లించేందుకు ఉద్దేశించిన ఈ పథకాన్ని ప్రారంభించారు. అలాగే యువజన విధానం 2018ని( AP Youth Policy 2018) ఆవిష్కరించారు.
యువనేస్తం వివరాలు ఇవి:
-
యువనేస్తం పథకం కింద ఇప్పటి వరకు 2.10 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు.
-
అర్హులందరికీ నెలకు రూ. వెయ్యి నిరుద్యోగి భృతిని చెల్లిస్తారు. నగదు మొత్తాన్ని వారి ఖాతాల్లోనే జమ చేస్తారు.
☛ తిరుపతిలో ప్లాస్టిక్ పై నిషేధం
ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుపతిలో ప్లాస్టిక్ వస్తువుల వాడకంపై నిషేధం విధించారు. ఈ మేరకు అక్టోబర్ 2న ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, కప్పులు సహా పలు రకాల ప్లాస్టిక్ ఉత్పత్తుల ఉత్పత్తి, అమ్మకం, వినియోగాన్ని నిషేధించారు. నిబంధన అతిక్రమించిన వారిపై భారీ జరిమానా ఉంటుందని ప్రకటించారు. తిరుపతి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.
అంతర్జాతీయం
☛ భారత్ – ఉజ్బెకిస్తాన్ మధ్య 17 ఒప్పందాలు
భారత్ – ఉజ్బెకిస్తాన్ మధ్య అక్టోబర్ 1న 17 ఒప్పందాలు కుదిరాయి. భారత పర్యటనలో భాగంగా ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్ కత్ మిర్జియోయెవ్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రక్షణ, విద్య, వైద్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో 17 ఒప్పందాలు జరిగాయి. అనంతరం… ఇరువురు నేతలు ఉమ్మడిగా సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రెండు దేశాలు వివిధ అంశాల్లో పరస్పర సహకారంతో ముందు సాగుతాయని ప్రకటించారు.
☛ ఇండోనేషియాకు సహాయంగా భారత్ ఆపరేషన్ సముద్ర మైత్రి
భూకంపం, సునామీతో కకావికలమైన ఇండోనేషియాకు తనవంతు సహాయ సహకారాలు అందించేందుకు భారత్ ఆపరేషన్ సముద్ర మైత్రి చేపట్టింది. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన తర్వాత భారత ఈ ఆపరేషన్ ను ప్రారంభించింది.
-
ఆపరేషన్ లో భాగంగా భారత్ భారీ ఎత్తున ఆహార, ఔషధ, నిత్యావసర వస్తువులను ఇండోనేషియాకు పంపింది. రెండు C – 130J, C – 17 ఎయిర్ క్రాఫ్ట్ లు, మూడు నౌకల ద్వారా ఈ వస్తువులను పంపింది.
-
సెప్టెంబర్ 28న ఇండోనేషియాలో 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం, సునామీ వల్ల వెయ్యి మందికిపైగా చనిపోయారు. లక్షల మంది నిరాశ్రులయ్యారు.
-
2018లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన భూకంపాల్లో ఇదే అతిపెద్దది.
☛ ISA తొలి అసెంబ్లీని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ (అంతర్జాతీయ సోలార్ కూటమి) తొలి అసెంబ్లీని ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 2న న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. ఇదే కార్యక్రమంలో.. సెకండ్ ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్ (IORA) పునరుత్పాదక ఇంధన మంత్రుల సమావేశం, 2వ గ్లోబల్ రీ ఇన్వెస్ట్ (RE – Invest) మీట్ అండ్ ఎక్స్ పోను ప్రధాని మోదీ ప్రారంభించారు.
-
పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో అంతర్జాతీయ సోలార్ కూటమి ప్రారంభమైంది. ఐఎస్ఏ కేంద్ర కార్యాలయం భారత్ లోని గురుగ్రామ్ లో ఉంది.
-
2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 1,000 గిగావాట్ల సోలార్ విద్యుత్ ని ఉత్పత్తి చేసే వ్యవస్థలను ఏర్పాటు చేయాలని, ఇందుకోసం ఈ రంగంలోకి వెయ్యి బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చేలా చూడాలన్నది ఐఎస్ఏ లక్ష్యం.
అవార్డులు
☛ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు జాతీయ పర్యాటక అవార్డు
దక్షిణ మధ్య రైల్వేలోని కీలక రైల్వే స్టేషన్ అయిన సికింద్రాబాద్.. మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకుంది. ప్రయాణికుల సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, పర్యాటకులను ఆకట్టుకోవడంలో దేశంలోనే తొలి స్థానంలో నిలిచి… జాతీయ పర్యాటక అవార్డు గెలుచుకుంది. ఈ మేరకు అక్టోబర్ 2న జాతీయ పర్యాటక సంస్థ ప్రకటించింది.
-
నిత్యం 210 రైళ్లు, లక్షా 80 వేల మందికిపైగా ప్రయాణికుల రాకపోకలతో సికింద్రబాద్ రైల్వేస్టేషన్ దక్షిణ మధ్య రైల్వోలే అతిపెద్దది.
-
ఈ ఏడాది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ … స్వచ్ఛ రైల్వే స్టేషన్ పురస్కారాన్ని సైతం గెలుచుకుంది.
-
ప్రతిష్టాత్మక ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ సొసైటీ నుంచి పర్యావరణ పరిరక్షణ, ఇంధన వనరుల సద్వినియోగంలో ప్లాటినమ్ సర్టిఫికెట్ దక్కించుకుంది.
☛ స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ అవార్డ్స్ – 2018
స్వచ్ఛ భారత్ ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాన్ని మెరుగ్గా అమలు చేసిన వారికి విభాగాల వారీగా స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ అవార్డులు – 2018ని ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 4న న్యూఢిల్లీలో ప్రదానం చేశారు.
అవార్డ గ్రహీతలు
ఉత్తమ రాష్ట్రం – హరియాణా
ఉత్తమ జిల్లా – సతారా జిల్లా, మహారాష్ట్ర
అత్యధిక మంది భాగస్వామ్యం – ఉత్తరప్రదేశ్
-
జోనల్ వారీ ర్యాంకింగ్స్ లో దక్షిణభారతం విభాగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా, తెలంగాణ రెండో స్థానంలో నిలిచాయి.
-
స్వతంత్ర ఏజెన్సీ ద్వారా జిల్లాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, పాఠశాలల్లో పరిశుభ్రత, పౌరు భాగస్వామ్యం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ర్యాంకింగ్స్ ను ప్రకటించారు.
-
2018 నుంచి కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వశాఖ ఈ అవార్డులను అందించటం ప్రారంభించింది.
సైన్స్ అండ్ టెక్నాలజీ
☛ పూణెలో ప్రపంచంలో అతిపెద్ద డోమ్
ప్రపంచంలోనే అతిపెద్ద డోమ్ ను( గుమ్మటం) పూణె మహారాష్ట్ర ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని(MIT) వరల్డ్ పీస్ యూనివర్సిటీ క్యాంపస్ లో ఆవిష్కరించారు. అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు డోమ్ ను ఆవిష్కరించారు.
-
MIT వరల్డ్ పీస్ లైబ్రరీ, వరల్డ్ పీస్ ప్రేయర్ హాల్ పై ఈ డోమ్ ను నిర్మించారు.
-
దీని వ్యాసార్థం 160 ఫీట్లు.
-
ఇంతకముందు ప్రపంచంలోనే అతిపెద్ద డోమ్ గా ఉన్న వాటికన్ డోమ్ వ్యాసార్థం 139.6 ఫీట్లు.
☛ ఎస్ – 400 పై రష్యాతో భారత్ ఒప్పందం
ఎస్ – 400 ట్రయంఫ్ అధునాతన గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థ కొనుగోలుకు సంబంధించి భారత్ రష్యాతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనలో భాగంగా అక్టోబర్ 5న ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య అంతరిక్షం, రైల్వేలు, అణుశక్తి, విద్య, ఎరువుల తదితర రంగాల్లో 8 ఒప్పందాలు కుదిరాయి. 2022 నాటికి భారత్ చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్ యాన్ కు సాంకేతిక సహకారం అందించేందుకు రష్యా అంగీకరించింది. ఈ మేరకు ఇస్రో.. రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్ కాస్మోస్ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
-
ఎస్-400 క్షిపణి వ్యవస్థను రష్యా నుంచి కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు విధిస్తామంటూ ఆమెరికా హెచ్చరికలు జారీ చేసినా… భారత్ వాటిని పట్టించుకోకుండా రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా ఇందుకోసం రూపొందించి కాట్సా చట్టాన్ని భారత్ అంతగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో… భారత్, రష్యా ఒప్పందంపై అమెరికా ఆచితూచి స్పందించింది.
ఎస్ – 400 విశిష్టతలు
-
ఎస్ – 400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ ఒప్పందం విలువ 5 బిలియన్ డాలర్లు
-
ఎస్ – 400 క్షిపణులను భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగిస్తారు.
-
ఇది శత్రు దేశాల క్షిపణులను అడ్డుకొని ధ్వంసం చేస్తుంది. ఈ వ్యవస్థ ద్వారా ఒకేసారి 36 లక్ష్యాలపైకి 72 క్షిపణులను ప్రయోగించవచ్చు.
-
ఒక్కో వ్యవస్థలో రెండు రాడార్లు, క్షిపణి లాంచర్లు, కమాండ్ పోస్టులు ఉంటాయి.
-
ఒక్కో రాడార్ 100 నుంచి 300 లక్ష్యాలను ఏకకాలంలో గుర్తించగలదు.
-
600 కీలోమీటర్ల దూరం నుంచే శత్రు క్షిపణులు, ఇతర ప్రయోగాల జాడను ఎస్ – 400 ట్రయంఫ్ గుర్తించగలదు.
-
400 కిలోమీటర్ల దూరం నుంచి లక్ష్యం పై గురిచపెడుతుంది.
-
పొరుగు దేశాలు పాకిస్తాన్, చైనాలోని అన్ని వైమానిక స్థావరాలు దీని పరిధిలోకి వస్తాయి.
☛ “గిర్” సింహాల మృతికి కారణం – సీడీవీ వైరస్
గుజరాత్ లోని గిర్ అభయారణ్యంలో 23 ఆసియా జాతి సింహాల్లో 5 సింహాల మృతికి కారణాన్ని భారత వైద్య పరిశోధన మండలి, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(NIA-PUNE) గుర్తించాయి. ప్రమాదకర కెనైన్ డిస్టెంపర్ వైరస్(CDA) కారణంగా ఇందులో 5 సింహాలు చనిపోయాయని తెలిపాయి.
-
ఈ ప్రమాదకర వైరస్ కారణంగానే తూర్పు ఆఫ్రికాలో ఉన్న సింహాల్లో 30 శాతం అంతరించిపోయాయని ఎన్ఐఏ పేర్కొంది.
-
గాలితో పాటు ప్రత్యక్షంగా తాకటం వల్ల జంతువుల్లో ఈ వైరస్ సోకుతుంది.
-
ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సీడీవీ టీకాను భారత్ అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది.
-
గుజరాత్ లోని గిర్ అభయారణ్యంలో దాదాపు 600 సింహాలు ఉన్నాయి.
☛ షార్ లో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు
ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు అక్టోబర్ 4న ప్రారంభమయ్యాయి. ఇస్రో మాజీ చైర్మన్ కె. రాధాకృష్ణాన్ ఉత్సవాలను ప్రారంభించారు. అక్టోబర్ 5న షార్ నుంచి రోహిణి-200 సౌండింగ్ రాకెట్‌ను ప్రయోగించారు. విద్యార్థులు స్వయంగా వీక్షించడం కోసం ఈ ప్రయోగం చేపట్టారు.
-
అక్టోబర్ 10 వరకు ఈ వారోత్సవాలు జరుగుతాయి
-
అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అంతరిక్ష వారోత్సవాలను నిర్వహిస్తున్నారు.
క్రీడలు
☛ రష్యా గ్రాండ్ ప్రీ విజేత హామిల్టన్
2018 ఫార్ములా వన్ సీజన్ లో మెర్సిడిస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ 8వ టైటిల్ ను గెలుచుకున్నాడు. సెప్టెంబర్ 30న జరిగిన రష్యా గ్రాండ్ ప్రీ లో 53 ల్యాప్ ల రేసుని అందరికన్నా ముందు పూర్తి చేసిన హామిల్టన్… రేసు విజేతగా నిలిచాడు. కాగా తన కెరీర్ లో ఇది 70వ విజయం.
-
మెర్సిడిస్ జట్టుకే చెందిన బొటాస్ రెండో స్థానంలో, ఫెరారీ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ మూడో స్థానంలో నిలిచారు.
☛ సమాచార హక్కు చట్టం పరిధిలోకి బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI)ని సమాచార హక్కు చట్టం(RTI) పరిధిలోకి తెస్తూ కేంద్ర సమాచార కమిషన్(CIC) అక్టోబర్ 1న ఉత్తర్వులు జారీ చేసింది. పలు చట్టాలు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు, లా కమిషన్ ఆఫ్ ఇండియా నివేదిక, జాతీయ క్రీడామంత్రిత్వశాఖ నిబంధనలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని… ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 2 (H) పరిధిలోకి బీసీసీఐ వస్తుందని సీఐసీ కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు పేర్కొన్నారు. దీని ప్రకారం ఇకపై పౌరులు ఎవరైనా ఆర్టీఐ కింద బీసీసీఐ సమాచారం కోరితే తప్పకుండా ఇవ్వాల్సిందే.
-
2005 జూన్ 15 నుంచి దేశంలో సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చింది.
☛ బ్యూనస్ ఎయిర్స్ లో 3వ యూత్ ఒలింపిక్స్ ప్రారంభం
3వ యూత్ ఒలింపిక్స్ పోటీలు అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో అక్టోబర్ 6న ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 18 వరకు జరిగే ఈ క్రీడల్లో బ్రేక్‌డ్యాన్సింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, రోలర్ స్పోర్ట్స్ అండ్ కరాటే, బీఎం ఎక్స్ ఫ్రీస్టయిల్, కైట్ బోర్డింగ్, బీచ్ హ్యాండ్‌బాల్, ఫుట్సల్, అక్రోబటిక్ జిమ్నాస్టిక్స్ తదితర అంశాలను కొత్తగా చేర్చారు.
-
ఈ ఒలింపిక్స్‌లో 32 క్రీడాంశాల్లో 4000 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు.
-
ఒలింపిక్స్‌లో తొలిసారిగా ‘లింగ సమానత్వం’ అనే నేపథ్యాన్ని ఈ క్రీడల్లో చేర్చారు. దీని ప్రకారం పోటీల్లో పాల్గొనే ఆటగాళ్లలో పురుషులు, మహిళల సంఖ్య సరిగ్గా సమానంగా ఉంటుంది.
-
యూత్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత పతాకధారిగా షూటర్ మను భాకర్ వ్యవహరించింది. భారత్ తరఫున యూత్ ఒలింపిక్స్‌లో 13 క్రీడాంశాల్లో కలిపి మొత్తం 47 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు.
-
2014 యూత్ ఒలింపిక్స్‌లో ఒక రజతం, ఒక కాంస్యం నెగ్గి రెండు పతకాలతో భారత్ 64వ స్థానంలో నిలిచింది.
-
2010లో మొదటి యూత్ ఒలింపిక్స్ సింగపూర్‌లో జరగగా 2014లో చైనాలోని నాన్జింగ్లో జరిగాయి.
-
ప్రస్తుతం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడిగా థామస్ బాచ్ ఉన్నారు.
వార్తల్లో వ్యక్తులు
☛ బిగ్ బాస్ – 2 విన్నర్ కౌశల్
స్టార్ మాలో ప్రసారమైన తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 2 కౌశల్ నిలిచారు. సెప్టెంబర్ 30న జరిగిన ఫైనల్లో కౌశల్ టైటిల్ విజేతగా.. గీతా మాధురి రన్నరప్ గా నిలిచారు. ఫైనల్ కు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ హీరో వెంకటేశ్.. కౌశల్ కు ట్రోఫీతో పాటు రూ.50 లక్షల బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా కౌశల్ మాట్లాడుతూ… బహుమతి మొత్తాన్ని క్యాన్సర్ బాధితుల కోసం విరాళంగా ఇస్తానని ప్రకటించారు.
-
హీరో నాని ఈ షోకి హోస్ట్ గా వ్యవహరించారు. 2018 జూన్ 10న ప్రారంభమైన బిగ్ బాస్ – 2, 113 రోజుల పాటు జరిగింది.
☛ యూత్ ఒలంపిక్స్ లో భారత పతాకధారి.. మనూ భాకర్
భారత యువ షూటర్ మనూ భాకర్.. అరుదైన అవకాశం దక్కించుకుంది. అక్టోబర్ 6 నుంచి 18 వరకు అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ లో యూత్ ఒలింపిక్స్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల ప్రారంభ వేడుకల్లో 68 భారత బృందానికి యువ షూటర్ మనూ భాకర్.. పతాకధారిగా వ్యవహరించనుంది.
-
యూత్ ఒలింపిక్స్ లో 13 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తారు.
☛ హాకీ ఇండియా అధ్యక్షుడిగా ముస్తాక్ అహ్మద్
హాకీ ఇండియా(HI)కి గతంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ముస్తాక్ అహ్మద్.. హెచ్ఐ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అక్టోబర్ 1న జరిగిన ఎన్నికల్లో హెచ్ఐ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాజేంద్ర సింగ్ స్థానంలో ముస్తాక్ అహ్మద్ బాధ్యతలు చేపడతారు.
ఉపాధ్యక్షులుగా ఆసిమా అలీ, బోలానాథ్ సింగ్… కొత్త సెక్రటరీ జనరల్‌గా రాజీందర్ సింగ్.. కోశాధికారిగా తపన్ కుమార్ దాస్ నియమితులయ్యారు. మహిళల మాజీ కెప్టెన్ అసుంతా లక్రా, ఫిరోజ్ అన్సారీ సంయుక్త కార్యదర్శులుగా ఎన్నుకున్నారు.
☛ హిమదాస్ IOCలో ఉద్యోగం
భారత స్ప్రింట్ సంచలనం హిమదాస్ కు ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOC) ఉద్యోగం ఇచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో భారత తరపున పాల్గొని.. సాధించిన ఘనతలకు గుర్తింపుగా తమ సంస్థలోని హెచ్ఆర్ విభాగంలో గ్రేడ్ ఏ ఆఫీసర్ ఉద్యోగం ఇస్తున్నట్లు ఐఓసీ అక్టోబర్ 1న ప్రకటించింది. ఆమెకు భారీ వేతన భత్యాలతో పాటు పాల్గొనే ఈవెంట్లకు అయ్యే ప్రయాణ, బస ఖర్చులన్నింటినీ తమ సంస్థే భరిస్తుందని పేర్కొంది.
-
అస్సోంకు చెందిన హిమ దాస్ 2018 ఆసియా క్రీడల్లో రిలేలో స్వర్ణం సహా 3 పతకాలు సాధించింది.
-
ఆమె ప్రతిభకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2018 సంవత్సరానికి గాను అర్జున అవార్డుతో సత్కరించింది.
-
హిమ దాస్ ను “ధింగ్ ఎక్స్ ప్రెస్” అని అభివర్ణిస్తారు.
☛ ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గా గీతా గోపీనాథ్
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రధాన ఆర్థిక వేత్తగా(Chief Economist) భారత సంతతికి చెందిన గీతా గోపీనాథ్ నియమితులయ్యారు. 2018 చివర్లో పదవీ విరమణ పొందుతున్న ప్రస్తుత చీఫ్ ఎకనమిస్ట్ ఓస్ట్ ఫెల్ట్ స్థానంలో గీతా పదవీ బాధ్యతలు చేపడతారు. ఈ మేరకు ఐఎంఎఫ్ అక్టోబర్ 1న వెల్లడించింది.
-
భారత్ లో పుట్టి పెరిగిన గీతా.. ప్రస్తుతం హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.
-
ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పొందారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి MA డిగ్రీలు పొందారు.
-
2016లో గీతా.. కేరళ సీఎం పినరయి విజయన్ ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. ఇది వివాదాస్పదం కావడంతో.. బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
☛ పారా ఏషియాడ్ లో భారత పతాకధారిగా తంగవేలు
ఇండోనేషియాలోని జకార్తాలో అక్టోబర్ 6 నుంచి 13 వరకు జరిగే పారా ఆసియా క్రీడల్లో భారత పతాకధారిగా రియో పారాలింపిక్స్ చాంపియన్ తంగవేలు మరియప్పన్ వ్యవహరించనున్నాడు. ఈ పోటీల్లో అథ్లెట్లు, సహాయ సిబ్బంది సహా మొత్తం 302 మందితో కూడిన భారత బృందం పాల్గొంటుంది.
-
2016లో జరిగిన రియో పారాలింపిక్స్ పోటీల్లో హై జంప్ ఈవెంట్లో తంగవేలు మరియప్పన్ స్వర్ణం గెలుచుకున్నాడు. తద్వారా ఈ పోటీల్లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడిగా గుర్తింపు సాధించాడు.
☛ భారత 46వ ప్రధాన న్యాయమూర్తిగా రంజన్ గోగోయ్
భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గోగోయ్ అక్టోబర్ 3న ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ రంజన్ గోగోయ్ సీజేఐ గా 13 నెలలపాటు అంటే.. 2019 నవంబర్ 17 వరకు ఉంటారు.
-
ఈశాన్య భారతం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అయిన మొదటి వ్యక్తి.. జస్టిస్ రంజన్ గోగోయ్.
-
1954 నవంబర్ 18న అస్సాంలోని దిబ్రూగఢ్ లో రంజన్ గోగోయ్ జన్మించారు. 1978లో తొలిసారి న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 2001లో గువాహతి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012 ఏప్రిల్ 23 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు.
-
45వ సీజేఐ దీపక్ మిశ్రా 2018 అక్టోబర్ 2న రిటైర్ అయ్యారు.
☛ యూఎస్ నూక్లియర్ వింగ్ చీఫ్ గా రీటా బరన్వాల్
అమెరికా అణుశక్తి విభాగం అధిపతిగా భారత సంతతికి చెందిన రీటా బరన్వాల్ నియమితులుకానున్నారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమెను ఈ పదవికి నామినేట్ చేశారు. ఈ ప్రతిపాదనలకు సెనేట్ ఆమోదం తెలిపితే రీటా బరన్వాల్.. ఇంధన విభాగం అసిస్టెంట్ సెక్రటరీ హోదా పొందుతారు.
-
ఈ బాధ్యతల్లో రీటా.. అణు సాంకేతిక పరిశోధన, నిర్వహణ, అభివృద్ధి బాధ్యతలను నిర్వర్తిస్తారు.
-
రీటా బరన్వాల్.. గతంలో అమెరికా నేవి రియాక్టర్లలో వాడే న్యూక్లియర్ ఎనర్జీ పదార్థాల పరిశోధన, అభివృద్ధి విభాగానికి నేతృత్వం వహించారు.
-
మసాచుసెట్స్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బీఎస్సీ గ్రాడ్యుయేషన్, మిషగాన్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ, పీహెచ్డీ పొందారు.
☛ ఐసీఐసీఐ సీఈవో పదవికి చందా కొచ్చర్ రాజీనామా
ఐసీఐసీఐ సీఈవోగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన చందా కొచ్చర్.. అక్టోబర్ 3న పదవికి రాజీనామా చేశారు. 2019 మార్చి 31 వరకు ఆమె పదవికాలం ఉన్నప్పటికీ… ఎండీ, సీఈవో పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సహా ఇతర అనుబంధ సంస్థల నుంచి కూడా చందా కొచ్చర్ తప్పుకున్నారు.
-
చందా కొచ్చర్ స్థానంలో సందీప్ బక్షి ఐసీఐసీఐ ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు.
-
వీడియోకాన్ గ్రూప్ నకు లంచం తీసుకొని రుణం మంజూరు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో చందా కొచ్చర్ పదవి నుంచి తప్పుకున్నారు. వీడియో కాన్ గ్రూప్ నకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.3,250 కోట్ల రుణాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే వీడియో కాన్ గ్రూప్ చందా కొచ్చర్ భర్త దీపక్ కొచర్ కు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్ సంస్థలో పెట్టుబడులు పెట్టిందని ఆరోపణలు వచ్చాయి.
☛ MSS DGగా ఎమ్మెస్సార్ ప్రసాద్
Missile and Strategic Systems(MSS) డైరెక్టర్ జనరల్ గా ప్రముఖ శాస్త్రవేత్త ఎమ్మెస్సార్ ప్రసాద్ నియమితులయ్యారు.
-
ప్రసాద్… ఐఐటీ మద్రాస్ లో బీటెక్, బాంబే ఐఐటీ నుంచి ఎరోనాటికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఎంటెక్ పూర్తి చేశారు.
-
1964లో డీఆర్డీవోలో చేరారు. మిస్సైల్ టెక్నాలజీలో కీలక శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు.
-
జలాంతర్గాముల నుంచి ప్రయోగించే పలు క్షిపణుల తయారీలో ఆయన ప్రధాన భూమిక పోషించారు.
-
Missile and Strategic Systems.. రక్షణ రంగంలో కీలక విభాగం.
☛ ఫోర్బ్స్ ఇండియా బిలియనీర్స్ – 2018లో ముకేశ్ నంబర్ వన్
భారత దేశంలో టాప్ – 100 బిలియనీర్స్ – 2018 పేరుతో ఫోర్బ్స్ మాగజైన్ వెలువరించిన జాబితాలో.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
-
47.3 బిలియన్ డాలర్ల సంపదతో ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు.
-
21 బిలియన్ డాలర్ల సంపదతో విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ రెండో స్థానంలో ఉన్నారు.
-
18.3 బిలియన్ డాలర్ల సంపదతో ఎర్సెల్లార్ మిట్టర్ చైర్మన్ అండ్ సీఈవో లక్ష్మీ మిట్టల్ మూడో స్థానంలో ఉన్మారు.
-
టాప్ – 100 జాబితాలో ముగ్గురు తెలుగు వారికి స్థానం దక్కింది. వారు.. మేఘ ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ అధిపతి పి.పి. రెడ్డి, అరబిందో ఫార్మా చైర్మన్ పి.వి. రామ్ ప్రసాద్ రెడ్డి, దీవీస్ ల్యాబ్స్ చైర్మన్ మురళి.
☛ డిప్యూటీ నేషనల్ సెక్యురిటీ అడ్వైజర్ గా ఆర్.ఎన్.రవి
డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్(డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు)గా జాయింట్ ఇంటిలిజెన్స్ కమిటీ చైర్మన్ ఆర్.ఎన్. రవి నియమితులయ్యారు. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ అక్టోబర్ 4న వెల్లడించింది.
-
జాతీయ భద్రతా సలహాదారుగా ప్రస్తుతం అజిత్ దోవల్ ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు ఇద్దరు డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారులు ఉన్నారు. ఈ నియామకంతో ఆర్.ఎన్. రవి మూడో వ్యక్తి అయ్యారు. మరో ఇద్దరు రా మాజీ చీఫ్ రాజిందర్ ఖన్నా, పంకజ్ శరణ్.
-
ఆర్.ఎన్.రవి 1976 ఐపీఎస్ బ్యాచ్ కేరళ క్యాడర్ కు చెందిన వారు.