జాతీయం
ఢిల్లీలో ప్రపంచ రవాణా సదస్సు – 2018
తొలి గ్లోబల్ మొబిలిటీ సమ్మిట్(ప్రపంచ రవాణా సదస్సు) – MOVE, సెప్టెంబర్ 7, 8 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగింది. ఈ సదస్సుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం ప్రసంగిస్తు.. మెరుగైన రవాణాతో ఆర్థిక వ్యవస్థ వృద్ధి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. 5 ఏళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు 15 శాతానికి చేరుకుంటాయని అంచనా వేశారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆటోమోబైల్ సంస్థల సీఈవోలు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.
-
తొలి గ్లోబల్ గ్లోబల్ మొబిలిటీ సమ్మిట్ ను నీతి ఆయోగ్ నిర్వహించింది.
“సేఫ్ సిటీ” నగరాలకు రూ.2,919 కోట్ల నిధులు
దేశంలోని 8 ప్రధాన నగరాల్లో మహిళలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించేందుకు సేఫ్ సిటీ ప్రాజెక్టుని చేపట్టిన కేంద్రం… ప్రాజెక్టు అమలు కోసం రూ.2,919.55 కోట్ల నిర్భయ నిధులు కేటాయించింది. ఈ జాబితాలో ఉన్న నగరాలు… హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, లఖ్ నవూ.
-
ఈ మొత్తం నిధుల్లో హైదరాబాద్ నగరానికి రూ. 282 కోట్లు కేటాయించారు.
-
ప్రాజెక్టులో భాగంగా ఆయా నగరాల్లో తరచూ నేరాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, క్రైం మ్యాపింగ్ చేస్తారు. ఆ ప్రాంతాల్లో నిరంతర పెట్రోలింగ్, మఫ్తీ బృందాలు, షీటీంలు తిరుగుతుంటాయి. క్విక్ రెస్పాన్స్ టీంలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి.
-
ఆయా ప్రాంతాల్లో పానిక్ బటన్ లు ఏర్పాటు చేస్తారు. వాటిని మహిళలు నొక్కగానే.. రెప్సాన్స్ బృందాలు తక్షణం అక్కడికి చేరుకుంటాయి.
PM-AASHA కు కేంద్ర కేబినెట్ ఆమోదం
2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంలో భాగంగా ప్రధాన మంత్రి – అన్నదాత ఆయ్ (ఆదాయ) సంరక్షణ అభియాన్ – PM AASHA పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 12న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్.. ఈ మేరకు పథకానికి అంగీకార ముద్ర వేసింది.
-
పీఎం ఆశ పథకాన్ని అమలు చేసేందుకు వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాలకు రూ. 15 వేల కోట్లను కేంద్రం మంజూరు చేసింది.
-
ఈ ఏడాది కేంద్రం ఉత్పత్తి వ్యయంలో 1.5 రెట్లు ప్రాతిపదికన కనీస మద్దతు ధర నిర్ణయించింది.
-
మద్దతు ధర కోసం ప్రస్తుతం… ధర మద్దతు పథకం (PSS), ధర లోటు చెల్లింపు పథకం(PDPS), ప్రైవేటు ప్రొక్యూర్ మెంట్ మరియు స్టాకిస్ట్ పథకం(PPS) అమల్లో ఉన్నాయి.
-
ఈ పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకి తెస్తూ కేంద్రం రూపొందించిందే.. పీఎం ఆశ పథకం.
ఆశా, అంగన్ వాడీలకు మోదీ వేతన కానుక
ఆశా, అంగన్ వాడీ కార్యకర్తల గౌరవ వేతనాలు పెంచుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సెప్టెంబర్ 11న ఆశా, ఏఎన్ఎం, అంగన్ వాడీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
-
ప్రస్తుతం రూ.3వేల గౌరవ వేతనం పొందుతున్న వారికి తాజా పెంపుతో ఇకపై రూ.4,500 వేతనం అందుతుంది.
-
రూ.2,200 పొందుతున్న వారికి వేతనం రూ.3,500 లభిస్తుంది.
-
అంగన్ వాడీల సహాయ గౌరవ వేతనాన్ని రూ.1,500 నుంచి రూ.2,500 కు పెంచారు.
ఆయుష్మాన్ భారత్ తొలి లబ్ధిదారు కరిష్మ
సెప్టెంబర్ 23 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినున్న ప్రతిష్టాత్మక పథకం ఆయుష్మాన్ భారత్ తొలి లబ్ధిదారు పేరుని ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 11న వెల్లడించారు. ఆశా, ఏఎన్ఎం, అంగన్ వాడీ కార్యకర్తలతో మాట్లాడుతూ.. హరియాణాలోని కర్నాల్ జిల్లాలో ఇటీవల జన్మించిన కరిష్మ అనే చిన్నారి ఈ పథకంలో తొలి లబ్ధిదారు అని వెల్లడించారు. జార్ఖండ్ లో ప్రధాని మోదీ సెప్టెంబర్ 23న ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు.
మానవాభివృద్ధి సూచీలో భారత్ కు 130వ స్థానం
ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం(USDP) సెప్టెంబర్ 14న విడుదల చేసిన మానవ అభివృద్ధి సూచీ– 2018లో భారత్ 130వ స్థానంలో నిలిచింది. 189 దేశాల ర్యాంకింగ్స్ తో యూఎస్ డీపీ ఈ జాబితాను విడుదల చేసింది.
-
ఈ ర్యాంకింగ్స్ లో తొలి స్థానంలో నార్వే, 2వ స్థానంలో స్విట్జర్లాండ్, 3వ స్థానంలో ఆస్ట్రేలియా, 4వ స్థానంలో ఐర్లాండ్, 5వ స్థానంలో జర్మనీ నిలిచాయి.
-
తాజా ర్యాంకింగ్స్ లో బంగ్లాదేశ్ 136వ స్థానంలో, పాకిస్తాన్ 150వ స్థానంలో నిలిచాయి.
-
2017 ర్యాంకింగ్స్ లో భారత్ కు 131వ స్థానం దక్కింది.
రాష్ట్రీయం
తెలంగాణలో 0.39 మీటర్ల మేర పెరిగిన భూగర్భ జలాలు
తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయి. ఈ ఏడాది ఆగస్టు నెలలో కురిసిన వర్షాలతోనే రాష్ట్రవ్యాప్తంగా సగటున 0.39 మీటర్ల మేర భూగర్భ జలమట్టం పెరిగిందని భూగర్భ జనరుల విభాగం సెప్టెంబర్ 7న వెల్లడించింది. మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన పనులతో చెరువులతో సమృద్ధి నీరు చేరి.. భూమిలోకి ఇంకుతోందని.. దీని ఫలితంగానే భూగర్భ జలమట్టం పెరిగిందని వివరించింది.
వారసత్వ కట్టడాలుగా సదర్మాట్ ఆనకట్ట, కామారెడ్డి పెద్ద చెరువు
తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో గోదావరి నదిపై నిర్మించిన సదర్మాట్ ఆనకట్ట, కామారెడ్డి పెద్ద చెరువుని కేంద్ర ప్రభుత్వం వారసత్వ కట్టడాలుగా గుర్తించింది. ఈ రెండింటిని మనుగడలో ఉన్న పురాతన నీటిపారుదల ఆనకట్టలుగా గుర్తిస్తూ ఈ మేరకు సమాచారన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది.
-
సదర్మాట్ ఆనకట్టను 1891-92 మధ్య కాలంలో గోదావరి నదిపై శ్రీరాంసాగర్ దిగువన నిర్మించారు. ఇది నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం , మేడం పల్లి గ్రామంలో ఉంది.
-
కామారెడ్డి పెద్ద చెరువుని 1897లో నిర్మించారు. దీని పరిధిలో 858 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉంది.
గోకుల్ చాట్ బాంబు పేలుళ్ల దోషులకు ఉరిశిక్ష
హైదరాబాద్ లుంబిని పార్క్, గోకుల్ చాట్ బాంబు పేలుళ్ల దోషులు అనీల్ షఫీక్ సయీద్, మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చొదరిలకు ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. వీరికి ఆశ్రయం కల్పించిన తారీఖ్ అంజుమ్ కు జీవిత ఖైదు ఖరారు చేసింది. ఈ మేరకు ప్రత్యేక హైకోర్టు హైదరాబాద్ జంట పేలుళ్లపై సెప్టెంబర్ 10న దోషులకు శిక్ష ఖరారు చేసింది.
-
అనీక్, ఇస్మాయిల్ చొదరిలకు విధించిన ఉరిశిక్షను హైకోర్టు ఖరారు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే శిక్షను అమలు చేసే అవకాశం ఉంటుంది.
-
2007 డిసెంబర్ 25న లుంబినీ పార్క్, గోకుల్ చాట్ లలో వరుస పేలుళ్లు జరిగాయి. దిల్ సుఖ్ నగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద పెట్టిన మరో బాంబుని పోలీసులు నిర్వీర్యం చేశారు. లుంబీనీ పార్కు పేలుళ్లలో 12 మంది, గోకుల్ చాట్ పేలుళ్లలో 32 మంది మృతి చెందారు.
మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు ఏర్పాటు చేసిన తెలంగాణ
డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సహా ఇతర వైద్య సిబ్బంది నియామకం కోసం తెలంగాణలో ప్రత్యేకంగా మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు (MHSRB)ని ఏర్పాటు కానుంది . ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
-
బోర్డు చైర్మన్ గా వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి వ్యవహరిస్తారు.
-
సభ్య కార్యదర్శిగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ను నియమిస్తారు.
-
జాయింట్ కలెక్టర్ కేడర్ అధికారి సభ్యుడిగా ఉంటారు.
అంతర్జాతీయం
“పసిఫిక్” లో చెత్త ఏరివేత మిషన్ ప్రారంభం
పసిఫిక్ మహాసముద్రంలో పేరుకుపోయిన 5 లక్షల కోట్ల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు ద ఓషీయన్ క్లీన్ అప్ అనే స్వచ్ఛంద సంస్థ చెత్త ఏరివేత మిషన్ ను ప్రారంభించింది. నెదర్లాండ్స్ కు చెందిన 24 ఏళ్ల బోయన్ స్లాట్… ఈ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్ ప్రాంతంలో చేపడుతున్నారు.
ఆర్థికం
బీమా రంగంలో తపాలా శాఖ
భారత తపాల శాఖ బీమా రంగంలోకి అడుగు పెట్టనుంది. సెప్టెంబర్ 1న పేమెంట్స్ బ్యాంక్ సేవలను ప్రారంభించిన తపాల శాఖ.. వచ్చే రెండేళ్లలో బీమా సంస్థను ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర సమాచార శాఖ మంత్రి మనోజ్ సిన్హా సెప్టెంబర్ 9న వెల్లడించారు.
-
ప్రస్తుతం తపాలా శాఖ ప్రభుత్వ ఉద్యోగుల కోసం పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, గ్రామీణ ప్రాంతాల్లో బలహీన వర్గాలు, మహిళలకు రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకాలను అందిస్తోంది.
అవినీతి మూల్యం.. ప్రపంచ జీడీపీలో 5 శాతం
అవినీతి కారణంగా ప్రపంచ జీడీపీలో 5 శాతం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు. లంచ కారణంగా హింస పెరగడం, శాంతి భద్రతలను కాపాడుకునేందుకు అవినీతిని అంతమొందించటం అనే అంశాలపై ఐరాస భద్రతా మండలి సెప్టెంబర్ 11న నిర్వహించిన సమావేశంలో గ్యూటెరస్ ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక వేదిక అంచనాలను అంటకిస్తు.. అవినీతి కారణంగా ప్రపంచం 2.6 ట్రిలియన్ డాలర్ల మేల మూల్యం చెల్లించాల్సి వస్తోందని చెప్పారు.
క్రీడలు
యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత నవోమి
యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను జపాన్ టెన్నిస్ క్రీడాకారిణి నవోమి ఒసాకా గెలుచుకుంది. న్యూయార్క్ లో సెప్టెంబర్ 9న జరిగిన ఫైనల్లో నవోమి ఒసాకా.. అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ ను ఓడించి.. టైటిల్ విజేతగా నిలిచింది. తద్వారా గ్రాండ్ స్లామ్ సాధించిన తొలి జపాన్ క్రీడాకారిణిగా నవోమి ఒసాకా గుర్తింపు సాధించింది.
-
ఈ మ్యాచ్ లో సెరెనా విలియమ్స్ మ్యాచ్ చైర్ అంపైర్ తో వాగ్వాదానికి దిగింది. నువ్వొక దొంగ.. అబద్దాల కోరు అంటు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్ లో అంకుర్ కు స్వర్ణం
భారత షూటర్ అంకుర్ మిట్టల్ దక్షిణ కొరియాలోని చాంగ్ వాన్ నగరంలో జరిగిన ప్రపంచ సీనియన్ షూటింగ్ చాంపియన్ షిప్ లో స్వర్ణం గెలుపొందాడు. సెప్టెంబర్ 8న జరిగిన పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం, టీమ్ ఈవెంట్లో కాంస్యం సాధించాడు.
యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత జకోవిచ్
ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను సెర్బియా స్టార్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ గెలుచుకున్నాడు. సెప్టెంబర్ 10న జరిగిన న్యూయార్క్ లో జరిగిన ఫైనల్లో.. అర్జెంటీనా ప్లేయర్ యువాన్ మార్టిన్ డెల్ పొట్రో ను ఓడించి జకోవిచ్ టైటిల్ విజేతగా నిలిచాడు. తద్వారా మూడోసారి యూఎస్ ఓపెన్ ను కైవసం చేసుకున్నాడు.
-
టైటిల్ విజేత జకోవిచ్ కు 38 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ, రన్నరప్ డెల్ పొట్రోకు 18 లక్షల 50 వేల డాలర్ల ప్రైజ్ మనీ లభించింది.
సైన్స్ అండ్ టెక్నాలజీ
గాల్లోనే ఇంధనం – తేజస్ మరో ఘనత
పూర్తి దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్.. గాల్లోనే ప్రయాణిస్తూనే IAF IL 78 అనే ట్యాంకర్ విమానం నుంచి 1,900 కేజీల ఇంధనాన్ని నింపుకుంది. భూమికి 20,000 అడుగుల ఎత్తులో గంటకు 500 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతూ తేజస్ ఈ ఘనత సాధించింది. దీంతో.. యుద్ధ విమానాలకు గాల్లోనే ఇంధనం నింపకలిగే సామర్థ్యం ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్ నిలిచింది.
-
తేజస్ తేలికపాటి యుద్ధ విమానాన్ని హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది.
-
123 తేజస్ మార్క్ – 1 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత వాయుసేన 2017 డిసెంబర్ లో హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ కు రూ.50,000 కోట్ల ఆర్డర్ ఇచ్చింది.
అవార్డులు
అంపశయ్య నవీన్ కు కాళోజీ పురస్కారం – 2018
తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక కాళోజీ సాహితీ పురస్కారం – 2018కి అంపశయ్య నవీన్ ఎంపికయ్యారు. ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు పేరిట తెలంగాణ ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందిస్తోంది. సెప్టెంబర్ 9న కాళోజీ 104వ జయంతిని పురస్కరించుకొని నవీన్ కు పురస్కారాన్ని అందజేశారు.
-
నవీన్ గతంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.
-
కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహాదారుడిగా కూడా ఆయన వ్యవహరించారు.
-
నవీన్ స్వస్థలం వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామం
హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నంబర్ – 1
హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. విమాన సేవల నాణ్యతలో ప్రపంచ వ్యాప్తంగా తొలి స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) నుంచి నంబర్ 1 ఎయిర్ పోర్ట్ ట్రోఫీని అందుకుంది. ఏసీఐ ప్రపంచవ్యాప్తంగా 34 విమానాశ్రయ సేవలను అధ్యయనం చేసి ఈ ర్యాంకింగ్స్ ను ప్రకటించింది.
-
సెప్టెంబర్ 12న కెనడాలోని హాలీ ఫాక్స్ లో నిర్వహించిన ఏసీఐ కస్టమర్ ఎక్స్ లెన్స్ సమ్మిట్ లో ఈ అవార్దు అందజేశారు.
కాళేశ్వరం సీఈకి ఇంజినీర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నల్లా వెంకటేశ్వర్లుకు ఉన్నత గౌరవం దక్కింది. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఆయనకు ఇంజినీర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు – 2018 ప్రకటించింది. సెప్టెంబర్ 15న భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 158వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో వెంకటేశ్వర్లుకు ఈ అవార్దు ప్రదానం చేశారు.
వార్తల్లో వ్యక్తులు
మిస్ అమెరికా – 2019 గా నియా ఇమానీ
మిస్ అమెరికా – 2019 కిరీటాన్ని 25 ఏళ్ల నియా ఇమానీ ప్రాంక్లిన్ గెలుచుకుంది. ఈ మేరకు అట్లాంటిక్ సిటీలో జరిగిన తుదిపోరులో గెలిచి టైటిల్ ను కైవసం చేసుకుంది. నార్త్ కరోలినా యూనివర్సిటీలో ఆర్ట్స్ లో గ్రాడ్యుయేట్ అయిన ఈమె సింగర్ కూడా.
అలీబాబా కొత్త చైర్మన్ గా డేనియల్ జాంగ్
ఈ – కామర్స్ దిగ్గజం అలీబాబా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు జాక్ మా సెప్టెంబర్ 10న వెల్లడించారు. తదుపరి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కంపెనీ సీఈవో డేనియల్ జాంగ్ ను ప్రకటించారు. డేనియల్.. అత్యంత ప్రజాదరణ పొందిన “సింగిల్ డే సేల్” ప్రచార రూపకర్త గా గుర్తింపు పొందారు. 2019 సెప్టెంబర్ 10న జాంగ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపడతారు.
-
అలీబాబా ప్రస్తుత మార్కెట్ విలువ 420 బిలియన్ డాలర్లు.
అంతర్జాతీయ క్రికెట్ కు అలిస్టర్ కుక్ గుడ్ బై
ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్ మెన్ అలిస్టర్ కుక్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. భారత్ తో టెస్ట్ సీరీస్ లో భాగంగా ఓవల్ వేదికగా సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్ కుక్ ఆఖరి మ్యాచ్ గా నిలిచింది. ఈ మ్యాచ్ లో సెంచిరీ (147) సాధించిన కుక్.. అరుదైన రికార్డు నమోదు చేశాడు. అరంగేట్రంతో పాటు చివరి మ్యాచ్ లో సెంచరీ సాధించిన క్రికెటర్ గా గుర్తింపు పొందాడు.
-
2006లో నాగపూర్ వేదికగా భారత్ తో జరిగిన మ్యాచ్ లో అరంగేట్రం చేసిన అలిస్టర్ కుక్.. 104 పరుగులు సాధించాడు.
-
ఇంతముందు అరంగేట్ర, చివరి టెస్టులో రెగీ డఫ్ (ఆస్ట్రేలియా), పోన్స్ఫర్డ్ (ఆస్ట్రేలియా), గ్రెగ్ చాపెల్ (ఆస్ట్రేలియా), అజహరుద్దీన్ (భారత్) లు సెంచరీలు చేశారు. అయితే అరంగేట్ర, చివరి టెస్టు ఒకే జట్టుపై ఆడి సెంచరీలు చేసింది మాత్రం రెగీ డఫ్ (ఆస్ట్రేలియా), పోన్స్ఫర్డ్ (ఆస్ట్రేలియా), అలిస్టర్ కుక్(ఇంగ్లాండ్)లు మాత్రమే.
ఏబీసీ చైర్మన్ గా హార్మూస్ జీ కామా
2018-19 సంవత్సరానికి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యూలేషన్స్ (ABC) నూతన కార్యవర్గాన్ని సెప్టెంబర్ 13న ఎన్నుకున్నారు. ముంబై సమాచార్ డైరెక్టర్ హార్మూస్ జీ కామా ఎన్నికయ్యారు. ఆయన ఏడాది పాటు ఈ పదవిలో ఉంటారు. డిప్యూటీ చైర్మన్ గా డీడీబీ ముద్ర ప్రైవేట్ లిమిటెడ్ మాజీ చైర్మన్ మధుకార్ కామత్ ని ఎన్నుకున్నారు.
-
ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యూలేషన్స్… పత్రికల సబ్ స్క్రిప్షన్స్ ని లెక్కిస్తుంది.
-
ఏబీసీని 1948లో ఏర్పాటు చేశారు. కేంద్ర కార్యాలయం ముంబైలో ఉంది.
46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తి(CJI)గా జస్టిస్ రంజన్ గొగోయ్ నియమితులయ్యారు. ఈ మేరకు న్యాయ మంత్రిత్వశాఖ సెప్టెంబర్ 14న వెల్లడించింది. ప్రస్తుత సీజేఐ దీపక్ మిశ్రా తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రంజన్ గొగోయ్ పేరుని సీజేఐగా లా కమిషన్ కు ప్రతిపాదించారు. కమిషన్ ఆ ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోదీకి పంపగా… ఆయన రాష్ట్రపతి ఆమోదానికి సిఫారసు చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేయటంతో న్యాయమంత్రిత్వ శాఖ నియామక ప్రకటన విడుదల చేసింది.
-
ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తొలి వ్యక్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ నిలిచారు.
-
ప్రస్తుత సీజేఐ దీపక్ మిశ్రా 2018 అక్టోబర్ 2న రిటైర్ అవుతారు.