Weekly Current Affairs – September 1- 7, 2018

జాతీయం

ఇండస్ వాటర్ ఒడంబడిక – భారత్, పాక్ మధ్య అవగాహన

ఇండస్ వాటర్ ఒడంబడిక 1960కి అనుగుణంగా రెండు దేశాల్లో ఆయా దేశాల నీటి కమిషనర్ల పర్యటనకు భారత్, పాకిస్తాన్ అంగీకరించాయి. భారత్ లో జమ్ము అండ్ కశ్మీర్ లో చేపడుతున్న జల విద్యుత్ ప్రాజెక్టులపై పాకిస్తాన్ అభ్యంతరం చెబుతోంది. ఈ నేపథ్యంలో.. ఈ వివాదాల పరిష్కారం కోసం రెండు దేశాల ప్రతినిధులు ఇరు ప్రాంతాల్లో పర్యటించి.. సమస్యలను అధ్యయనం చేసేందుకు, వాటిని పరిష్కరించేందుకు రెండు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. ఈ మేరకు భారత్, పాకిస్తాన్ మధ్య ఇటీవల అత్యున్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు పాకిస్తాన్ లాహోర్ లో జరిగాయి. పాకిస్తాన్ నూతన ప్రధాన మంత్రిగా పాకిస్తాన్ తెహ్రీక్ – ఈ – ఇన్సాఫ్(PTI) అధినేత ఇమ్రాం ఖాన్ గత నెలలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి జరిగిన చర్చల్లో ఈ అవగాహన కుదిరింది. అలాగే శాశ్వత ఇండస్ కమిషన్ (PIC)ను బలోపేతం చేయాలని నిర్ణయించాయి.
వెయ్యి మెగా వాట్ల సామర్థ్యంతో కూడిన పాకల్ దుల్, 48 మెగావాట్ల లోయర్ కాల్నాయ్ జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంపై పాకిస్తాన్ లేవనెత్తిన అభ్యంతరాలను భారత్ తోసిపుచ్చింది. చెనాబ్ నదిపై నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టులని సందర్శించాల్సిందిగా పాకిస్తాన్ ప్రతినిధులను అహ్వానించింది. తదుపరి పీఐసీ సమావేశంలో భారత్ లో జరగనుంది.
ఇండస్ వాటర్ ఒడంబడిక ?
ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్తాన్ మధ్య ఇండస్ వాటర్ ఒడంబడిక కుదిరింది. ఇండస్ కింద ఆరు నదులు ఉన్నాయి. అవి బియాస్, రవి, సట్లెజ్, ఇండస్, చెనాబ్, జెలమ్. రవి, బియాస్, సట్లెజ్ నదులు భారత్ నియంత్రణ… ఇండస్, జెలమ్, చెనాబ్ నదులపై పాకిస్తాన్ నియంత్రణ ఉండేలా ఒడంబడిక జరిగింది. అలాగే భారత్ మీదుగా ప్రవహించే ఇండస్ నదిలో సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి కోసం కేవలం 20 శాతం నీటిని మాత్రమే భారత్ ఉపయోగించుకోవాలి. ఈ మేరకు 1960 సెప్టెంబర్ 19న అప్పటి భారత్ ప్రధాన మంత్రి జవహార్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ సంతకం చేశారు. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన నీటి ఒడంబడికగా ఇండస్ వాటర్ ట్రీటీ గుర్తింపు పొందింది.

రాక్సౌల్ కఠ్మాండు రైల్వేపై భారత్ నేపాల్ మధ్య ఒప్పందం

బిహార్ లోని రాక్సౌల్ నగరాన్ని నేపాల్ రాజధాని కఠ్మాండుతో అనుసంధానించే రైల్వే లైన్ నిర్మాణానికి భారత్, నేపాల్ మధ్య ఒప్పందం కుదిరింది. నేపాల్ రాజధాని కఠ్మాండులో ఆగస్టు 30-31 వరకు జరిగిన 4వ బిమ్ స్టెక్ (BIMSTEC) సమావేశంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ… అనంతరం నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇందులో భాగంగా రాక్సౌల్, కఠ్మాండు మధ్య రైల్వే లైన్ నిర్మాణంపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఏడాదిలోనే భారత్, నేపాల్ మధ్య ట్రాన్సిట్ ట్రీటీ కూడా కుదిరింది.

నేపాల్ – భారత్ మైత్రి భవన్ ప్రారంభం

నేపాల్ రాజధాని కఠ్మాండులోని పశుపతినాథ్ శివాలయంలో భారత ఆర్థిక సహాయంతో నిర్మించిన 400 పడకల భక్తుల వసతి కేంద్రాన్ని నేపాల్ ప్రధానితో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆసియాలోని నాలుగు ప్రముఖ శైవ క్షేత్రాల్లో పుశుపతినాథ్ ఆలయం ఒకటి.

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభం

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(IPPB)ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 1న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఐపీపీబీ సేవలు తొలుత 650 తపాలా శాఖలు, 3,250 యాక్సెస్ పాయింట్లలో ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 1.55 లక్షల పోస్టాఫీసులకు ఈ సేవలను విస్తరిస్తామని మోదీ ప్రకటించారు.

ఇవీ విశేషాలు

 • ఐపీపీబీలో రూ.లక్షకు మించి డిపాజిట్లు ఉంటే అవి పొదుపు ఖాతాలుగా మారిపోతాయి. ఆధార్, వేలిముద్రలతో ఒక్క నిమిషంలోనే ఐపీపీబీలో ఖాతా తెరవచ్చు.

 • ఐపీపీబీలో ముందస్తు రుణాలు(అడ్వాన్‌‌సడ్ లోన్‌‌స), క్రెడిట్ కార్డుల వంటి సేవలు అందుబాటులో ఉండవు.

 • డిపాజిట్లపై 4 శాతం వడ్డీ చెల్లిస్తారు.
 • రుణాలు, బీమా వంటి థర్డ్‌పార్టీ సేవలందించేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్, బజాజ్ అలియాన్‌‌జ జీవిత బీమా కంపెనీతో ఐపీపీబీ ఒప్పందం కుదుర్చుకుంది.

ఓబీసీ జనాభా లెక్కల సేకరణ

స్వాతంత్య్రం తర్వాత దేశంలో జన గణనలో భాగంగా తొలిసారి ఇతర వెనుకబడిన వర్గాల(ఓబీసీ) జనాభా లెక్కలను సేకరించనున్నారు. ఈ మేరకు 2021లో చేపట్టే జనగణనలో ఓబీసీల లెక్కలను సేకరించాలని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 31న నిర్ణయించింది. అలాగే జనగణన తుది నివేదిక వెల్లడించే సమయాన్ని ఏడేళ్ల నుంచి మూడేళ్లకి తగ్గించింది. 2006లో జాతీయ నమూనా సర్వే సంస్థ నివేదిక ప్రకారం దేశ జనాభాలో ఓబీసీలు సుమారు 41 శాతం వరకుఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. జనగణన కోసం సుమారు 25 లక్షల మంది ఎన్యూమరేటర్లకు శిక్షణ ఇస్తున్నారు.

యువతను వ్యవసాయం వైపు ఆకర్షించేందుకు ఆర్య పథకం

యువతను వ్యవసాయం వైపు ఆకర్షించడం (ఎట్రాక్టింగ్‌ అండ్‌ రిటైనింగ్‌ యూత్‌ ఇన్‌ అగ్రికల్చర్‌ఆర్య) పథకాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి 100 జిల్లాల్లో అమలు చేయాలని కేంద్ర వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఈ పథకం అమలుకు అన్ని రాష్ట్రాల వ్యవసాయశాఖలకు సూచనలిచ్చింది.

 • దేశవ్యాప్తంగా ఉన్న 669 కృషి విజ్ఞాన కేంద్రాల్లో(KVK) 100 కేవీకేలను ఇందుకోసం ఎంపిక చేయాలని ఆదేశించింది.
 • ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 జిల్లా కేవీకేల్లో ఈ పథకం అమలువుతోంది.
 • తెలంగాణలోని నల్గొండ జిల్లా కంపాసాగర్‌లో గల ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన కేంద్రం నిర్వహిస్తున్న KVKలో ఆర్య కార్యక్రమం ప్రయోగాత్మక అమల్లో ఉంది.
 • దేశంలో పంట ఉత్పాదకత, దిగుబడులు పెరగాలంటే ఆర్య పథకం కీలకం అని కేంద్రం గట్టిగా భావిస్తోంది. యువతను సేద్యం వైపు ఆకర్షించేలా చేయడం ద్వారా కొత్త ప్రయోగాలకు చేయూతనిచ్చినట్లవుతుందని గట్టిగా విశ్వసిస్తోంది.
 • మరోవైపు ఇప్పటికే గ్రామాల్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ఉన్న యువ రైతులను ఎంపిక చేసి ఆధునాతన పరిజ్ఞానం వినియోగం, మార్కెటింగ్‌ అవకాశాలను పెంచుకునే నైపుణ్య శిక్షణ కేవీకేల ద్వారా ఇవ్వాలని ఆలోచిస్తోంది.

అక్టోబర్ 2 నుంచి నల్సా పరిహార పథకం అమలు

అత్యాచారాలు, దాడులకు గురైన మహిళలకు న్యాయం చేయడానికి జాతీయ న్యాయ సేవల సంస్థ (నల్సా) రూపొందించిన ‘పరిహార పథకం’ అక్టోబర్ 2 నుంచి అమల్లోకి రానుంది. కేంద్ర ప్రభుత్వ నూతన చట్ట నిబంధనలు కార్యరూపం దాల్చే వరకు పరిహార పథకంలోని అంశాలను ప్రత్యేక న్యాయస్థానాలు పరిగణనలో తీసుకోవాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 5న ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు లైంగిక దాడికి గురైన మైనర్ బాధితులకు రూ. 4 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు పరిహారం అందుతుంది. లైంగిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధితులు, సామూహిక లైంగిక దాడికి గురైన బాధితుల కుటుంబాలు రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు పరిహారం పొందుతాయి. యాసిడ్ దాడికి గురైన మహిళలకు రూ.3 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు పరిహారంగా అందుతాయి. ప్రభుత్వం పోక్సో చట్టంను సవరించే వరకు మైనర్ బాధితులు ఈ పరిహారం పొందేందుకు అర్హులని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

స్వలింగ సంపర్కం నేరం కాదు : సుప్రీంకోర్టు

అంగీకారంతో ఇద్దరు మేజర్లు మధ్య జరిగే స్వలింగ సంపర్కం లేదా స్త్రీపురుషుల మధ్య ప్రైవేటుగా జరిగే లైంగిక చర్య నేరం కాదని పేర్కొంటూ సెప్టెంబర్ 6న దేశ అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ మేరకు ఐపీసీ సెక్షన్ 377లోని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం వెల్లడించింది.

తీర్పులోని ముఖ్యాంశాలు

 • జంతువులు, చిన్న పిల్లలు, మైనర్లతో, అలాగే మేజర్లతోనూ పరస్పర అంగీకారం లేకుండా జరిగే లైంగిక కేసుల విషయంలో 377 సెక్షన్‌లోని నిబంధనలు కొనసాగుతాయని కోర్టు పేర్కొంది.

 • సమాజంలో LGBTQ (లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్, క్వీర్)లు దేశంలోని మిగిలిన పౌరుల్లాగే అన్ని రాజ్యాంగబద్ధమైన హక్కులను పొందవచ్చని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.

 • నవ్‌తేజ్ జౌహార్, జర్నలిస్ట్ సునీల్ మెహ్రా, చెఫ్ రితూ దాల్మియా, హోటల్ యజమానులు అమన్‌నాథ్, కేశవ్ సూరీ, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ అయేషా కపూర్ సహా 20 మంది ఐఐటీ విద్యార్థులు వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ చారిత్రక తీర్పునిచ్చింది.

 • ఈ తీర్పుతో స్వలింగ సంపర్కాన్నీ చట్టబద్ధం చేసిన 26వ దేశంగా భారత్ నిలిచింది.

  సెక్షన్ 377 ఏం చెబుతోంది ?

 • 377వ సెక్షన్ భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) లోని 16వ అధ్యాయంలో ఉంది. దీన్ని 1838లో థామస్ మెకాలే రూపొందించారు. 1861లో అమల్లోకి వచ్చింది. బ్రిటిష్ సొడొమీ చట్టం(బగ్గరీయాక్ట్ 1533) ఆధారంగా ఇది రూపొందింది. ఈ చట్టం ప్రకారం సహజ విరుద్ధంగా జరిగే ఎలాంటి శృంగారమైనా నేరం. దీన్ని ఉల్లంఘించిన వారికి గరిష్టంగా జీవిత ఖైదు, కనీసం పదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించేందుకు సెక్షన్ 377 వీలు కల్పించింది.

రాష్ట్రీయం

తిరుపతిలో ‘స్వీకార్ ’

తిరుపతి సమీపంలో అలిపిరి వద్ద శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఫర్ కేన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ రీసెర్చ్ (స్వీకార్) సంస్థను టాటా ట్రస్ట్ నిర్మించనుంది. టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటాతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వీకార్ నిర్మాణానికి ఆగస్టు 31న భూమి పూజ చేశారు. స్వీకార్‌ను తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) బోర్డు విరాళంగా ఇచ్చిన 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.600 కోట్ల వ్యయంతో నిర్మిస్తారు.

దేశవ్యాప్తంగా టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో 124 ఆస్పత్రులు నడుస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో ‘చేరువ’ కార్యక్రమం

సామాజిక మాధ్యమాలు, సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు రూపొందించిన ‘చేరువ..మీ చెంతకు.. మీ పోలీస్’ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ విజయవాడలో ఆగస్టు 31న ప్రారంభించారు. ఏపీ పోలీసు శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా పోలీసులు ప్రజలు భాగస్వాములై విభిన్న సమస్యలు, అంశాలపై చర్చించనున్నారు. కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరంలో ప్రజలకు చేరువ అయ్యేలా ప్రత్యేక వాహనాన్ని డీజీపీ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా నిర్వహించనున్నారు. సామాజిక మాద్యమాల్లో.. ఏపీ పోలీసులు ప్రజలకు మరింత చేరువయ్యేలా సామాజిక మాద్యమాల్లో అకౌంట్‌లను డీజీపీ ఠాకూర్ ప్రారంభించారు. 9440900822 వాట్సాప్, ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయడంతోపాటు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్‌లను ఏర్పాటు చేశారు.

మంజీర ఎత్తిపోతలకు రూ.476.25 కోట్లు

మంజీర ఎత్తిపోతలకు రూ.476.25 కోట్లు మంజూరు చేస్తు తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 4న ఉత్తర్వులు జారీ చేసింది. నిజాంసాగర్ మండలం మల్లూరు గ్రామ సమీపంలో ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించనున్నారు. నిజాం సాగర్ కింద మంజీరా నదిపై పిట్లం, బిచ్కుంద మండలాల పరిధిలోని 21 గ్రామాల్లో 30 వేల ఎకరాలకు నీరివ్వాలన్నది లక్ష్యం. ఈ ఎత్తిపోతలకు 2.90 టీఎంసీల నీటిని వినియోగించనున్నారు

మత్స్య అభివృద్ధి పథకాన్ని ప్రారంభించిన తలసాని

తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని ప్రారంభించింది. సెప్టెంబర్ 5న హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ పథకం రెండేళ్ల పాటు అమల్లో ఉంటుంది. ఇందులో భాగంగా 855 మంది మత్స్యకారులకు ద్విచక్ర వాహనాలు, 12 మందికి లగేజ్ ఆటోలు, 8 మంది లబ్ధిదారులకు సంచార విక్రయ కేంద్రాలు అందజేశారు. 2 మహిళా మత్స్య సంఘాలకు రూ.5 లక్షల చొప్పున గ్రాంట్ అందజేశారు.

తెలంగాణ శాసనసభ రద్దు

తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ రద్దయింది. నిర్ణీత కాల వ్యవధి కన్నా 8 నెలల 26 రోజుల ముందే ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు శాసనసభ రద్దుకి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంత్రిమండలిలో చేసిన తీర్మానాన్ని గవర్నర్ నరసింహన్ కు అందజేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 క్లాజ్ 2(బీ) అనుసరించిన గవర్నర్ శాసనసభను రద్దు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ తర్వాత శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు గవర్నర్ నోటిఫికేషన్ ను ప్రస్తావిస్తు గెజిట్ జారీ చేశారు. ఎన్నికలు జరిగి, తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకు కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.

రాష్ట్రంలో నిర్ణీత కాలం ప్రకారం 2019 ఏప్రిల్ లో ఎన్నికలు జరగాల్సి ఉండగాటీఆర్ఎస్ అధ్యక్షుడు కే.చంద్రశేఖర్ రావు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ముందుగానే సభను రద్దు చేశారు.

అంతర్జాతీయం

కఠ్మాండులో 4వ బిమ్స్ టెక్ సమావేశం

4వ బిమ్స్ టెక్ సమావేశం నేపాల్ రాజధాని కఠ్మాండులో ఆగస్టు 30 – 31 తేదీల్లో జరిగింది. ఈ సమావేశానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన మోదీ.. ఉగ్రవాదం, మాదక ద్రవ్యాలపై పోరులో బిమ్స్ టెక్ దేశాలు సహకరించుకోవాలని అన్నారు. సభ్య దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక, రవాణా, డిజిటల్ సంబంధాలను మెరుగుపరిచేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

 • బిమ్స్ టెక్ (బంగాళాఖాత దేశాల ఆర్థిక సహకార సంస్థ)లో భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయ్ లాండ్, భూటాన్, నేపాల్ సభ్య దేశాలుగా ఉన్నాయి.
 • ప్రపంచ జనాభాలో ఈ దేశాల మొత్తం వాటా 22 శాతంగా ఉంటుంది.
 • బిమ్స్ టెక్ దేశాల జీడీపీ 2.8 ట్రిలియన్ డాలర్లు.

లీడెన్ లో 4వ అంతర్జాతీయ ఆయుర్వేద కాంగ్రెస్

4వ అంతర్జాతీయ ఆయుర్వేద కాంగ్రెస్ నెదర్లాండ్స్ లోని లీడెన్ లో సెప్టెంబర్ 1,2 తేదీల్లో జరిగింది. భారత ఆయుష్ శాఖ మంత్రి శ్రీ పాద యశో నాయక్ ఈ సదస్సుని ప్రారంభించారు. నెదర్లాండ్స్ కు చెందిన అంతర్జాతీయ మహరిషి ఆయుర్వేద ఫౌండేషన్, భారత్ లోని న్యూఢిల్లీలో ఉన్న ఆల్ ఇండియా ఆయుర్వేదిక్ కాంగ్రెస్, పూణెలోని అంతర్జాతీయ అకాడమీ ఆఫ్ ఆయుర్వేదా సంయుక్తంగా ఈ కాంగ్రెస్ నిర్వహించాయి.

భారత్, సిప్రస్ మధ్య 2 ఒప్పందాలు

మనీ లాండరింగ్ నిరోధం, పర్యావరణ పరిరక్షణలో సహకారానికి సంబంధించి భారత్, సిప్రస్ మధ్య సెప్టెంబర్ 3న రెండు ఒప్పందాలు కుదిరాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సిప్రస్ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు నికోస్ అనస్టాసియాడెస్ తో రాజధాని నికోసియాలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఈ ఒప్పందాలు జరిగాయి.

భారత్ లో అత్యధిక పెట్టుబడులు పెడుతున్న విదేశాల జాబితాలో సిప్రస్ 8వ స్థానంలో ఉంది. ఆ దేశం నుంచి 9 బిలియన్ డాలర్ల పెట్టుబడులు భారత్ లోకి వస్తున్నాయి.

భారత్, అమెరికా మధ్య 2+2 చర్చలు

భారత్, అమెరికా దేశాల విదేశాంగ, రక్షణ శాఖల మంత్రుల తొలి సమావేశం న్యూఢిల్లీలో సెప్టెంబర్ 6న జరిగింది. 2+2 భేటీగాను పిలుస్తోన్న ఈ సమావేశంలో భారత్ నుంచి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్.. అమెరికా తరపున విదేశాంగ మంత్రి మైకేల్ పాంపియో, రక్షణ మంత్రి జేమ్స్ మేటిస్ లు చర్చల్లో పాల్గొన్నారు.

 • ఈ సందర్భంగాకామ్ కాసా ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా అమెరికా నుంచి భారత్ కు అత్యాధునిక మిలటరీ కమ్యూనికేషన్ పరికరాలు అందుతాయి. ఇది పదేళ్ల పాటు అమల్లో ఉంటుంది.

 • అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేసే యుద్ధ విమానాలు, ఇతర హెలికాప్టర్లలో అమెరికాకు చెందిన అత్యంత భద్రమైన ఎన్ క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థను అమరుస్తారు. సి-17, సి– 130జే, పి-81 విమానాలతో పాటు అపాచె, చింకూర్, హెలికాప్టర్లలో ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఏర్పాటు చేస్తారు.

ఆర్థికం

2017-18లో మారిషస్ నుంచి అత్యధిక FDIలు

2017-18 ఆర్థిక సంవత్సరంలో భారత్ లో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) పెట్టిన దేశంగా మారిషస్ నిలిచింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 2న వెలువరించిన వివరాల ప్రకారం.. 2017-18లో దేశంలోకి మొత్తం 37.36 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. వీటిలో 13.41 బిలియన్ డాలర్ల పెట్టుబడులు మారిషస్ నుంచి వచ్చాయి. 9.27 బిలియన్ డాలర్లతో సింగపూర్ రెండోస్థానంలో నిలిచింది.

2016-17లో మొత్తం 36.31 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు దేశంలోకి రాగా మారిషస్ నుంచి 13.38 బిలియన్ డాలర్లు, సింగపూర్ నుంచి 6.52 బిలియన్ డాలర్లు వచ్చాయి.

లక్ష కోట్ల డాలర్ల కంపెనీగా అమెజాన్

ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ కంపెనీ లక్ష కోట్ల డాలర్ల కంపెనీగా అవతరించింది. సెప్టెంబర్ 4న న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్ లో అమెజాన్ షేర్ 2 శాతం లాభంతో 2,050 డాలర్లను తాకింది. ఈ ధర వద్ద కంపెనీ మార్కెట్ క్యాప్ లక్ష కోట్ల డాలర్ల మార్కును అధిగమించింది. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో కంపెనీగా అమెజాన్ నిలిచింది.

యాపిల్ సంస్థ ఇటీవలే లక్ష కోట్ల డాలర్ల మార్కుని దాటి ఈ ఘనత సాధించిన తొలి కంపెనీగా రికార్డు నమోదు చేసింది.

జన్ ధన్ ఓవర్ డ్రాఫ్ట్ రూ.10 వేలకు పెంపు

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకం కింద ప్రస్తుతం రూ.5 వేల పరిమితితో ఉన్న ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని రూ.10 వేలకు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 5న ప్రకటించింది. అలాగే పథకానికి అర్హతకు గరిష్ట వయసుని 60 నుంచి 65 ఏళ్ల పెంచారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. పథకానికి మంచి ఆదరణ లభిస్తుందన్నందున.. కొనసాగించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. రూ. 2 వేల వరకు ఓవర్ డ్రాఫ్ట్ పొందేందుకు ఎలాంటి షరతులు ఉండవని వివరించారు.

ఇవీ జన్ ధన్ లెక్కలు

 • జన్ ధన్ యోజన కింద నాలుగేళ్లలో 32.41 కోట్ల ఖాతాలు తెరిచారు.

 • వీటిలో రూ.81,200 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి.

 • 30 లక్షల మంది ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు.

 • 2014 ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ జన్ ధన్ యోజన పథకాన్ని ప్రారంభించారు.

2018-19 తొలి 5 నెలల్లో తెలంగాణ వృద్ధి 21.96 శాతం

తెలంగాణ రాష్ట్రం గడచిన నాలుగేళ్లుగా గణనీయమైన ఆదాయ అభివృద్ధిని సాధిస్తూ వస్తోంది. ఇందుకు అనుగుణంగానే 2018-19 ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో(ఏప్రిల్ ఆగస్టు) రాష్ట్రం 21.96 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. అంటే.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో తొలి ఐదు నెలల్లో రూ.21,642.02 కోట్ల ఆదాయం సమకూరగా… 2018-19లో ఇదే కాలానికి రూ.26,394.18 కోట్ల ఆదాయం వచ్చిందని ప్రభుత్వం ప్రకటించింది. ఇది కేంద్ర ప్రభుత్వం మదింపు చేసిన గణాంకాలని ప్రకటనలో పేర్కొంది.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలి నాలుగేళ్లలో ఏడాదికి సగటున 17.17 ఆదాయ వృద్ధి రేటు నమోదు చేస్తోంది. దేశంలో మరే రాష్ట్రం ఈ స్థాయిలో గణాంకాలు నమోదు చేయడం లేదు.

క్రీడలు

హామిల్టన్ కు ఇటలీ గ్రాండ్‌ప్రి టైటిల్

మెర్సిడీస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్.. ఇటలీ గ్రాండ్‌ ప్రి ఫార్ములావన్ రేసు విజేతగా నిలిచాడు. ఇటలీలోని మోంజాలో సెప్టెంబర్ 2న జరిగిన రేసులో హామిల్టన్ 53 ల్యాప్‌ల దూరాన్ని గంటా 16 నిమిషాల 54.484 సెకన్లలో పూర్తిచేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఫెరారీ డ్రైవర్ రైకోనెన్ రెండో స్థానం, మెర్సిడెస్‌కే చెందిన బొటాస్ మూడో స్థానం, ఫెరారీ మరో డ్రైవర్ వెటెల్ నాలుగో స్థానం దక్కించుకున్నారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు.

ఆసియా క్రీడలు – 2018

ఇండోనేషియాలోని జకార్తా, పాలెంబాంగ్ నగరాల్లో 2018 ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు 18వ ఆసియా క్రీడలు జరిగాయి. ఈ క్రీడల్లో 45 దేశాలు పాల్గొన్నాయి. ఈ క్రీడల్లో భారత్ 15 స్వర్ణాలు, 24 రజతాలు, 30 కాంస్యాలను గెలుచుకొని పతకాల పట్టికలో 8 స్థానంలో నిలిచింది. 2022 ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్జౌ నగరంలో జరుగుతాయి.

గుర్తుంచుకోవాల్సిన అంశాలు

చైనా 132 స్వర్ణాలు, 92 రజతాలు, 65 కాంస్యాలతో కలిపి మొత్తం 280 పతకాలతో మొదటి స్థానంలో నిలిచింది. జపాన్ రెండో స్థానంలో(75 స్వర్ణాలు, 56 రజతాలు, 74 కాంస్యాలు, మొత్తం 205), దక్షిణ కొరియా మూడో స్థానంలో(49 స్వర్ణాలు, 58 రజతాలు, 70 కాంస్యాలు ,మొత్తం 177) నిలిచాయి.

 • ఆసియా క్రీడల్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా జపాన్ స్విమ్మర్ రికాకో ఇకీ ఎంపికైంది. స్విమ్మింగ్ విభాగంలో నిర్వహించిన పోటీల్లో 18 ఏళ్ల ఇకీ ఆరు పసిడి, రెండు రజత పతకాలను సాధించింది.దీంతో 1998 తర్వాత ఈ అవార్డు అందుకున్న ఏకైక మహిళగా ఇకీ గుర్తింపు పొందింది.

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్ లో ఓం ప్రకాశ్ కు స్వర్ణం

దక్షిణ కొరియాలో జరిగిన ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్ లో భారత పిస్టల్ షూటర్ ఓం ప్రకాశ్ మిథర్వాల్ స్వర్ణం గెలుచుకున్నాడు. కొరియాలోని చాంగ్ వాన్ నగరంలో జరిగిన ఈ పోటీల్లో 50 మీటర్ల పిస్టల్ విభాగంలో 23 ఏళ్ల ఓం ప్రకాశ్ 564 పాయింట్లు స్కోర్ చేసి తొలి స్థానంలో నిలిచాడు. తద్వారా స్వర్ణం నెగ్గాడు. దీంతో ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో స్వర్ణం గెలిచిన నాలుగో భారతీయుడిగా ప్రకాశ్ గుర్తింపు సాధించాడు. గతంలో 2006లో అభినవ్ బింద్రా, 2006లో మానవ్ జిత్ సింధు, 2010లో తేజస్విని సావంత్ మాత్రమే ఈ ఘనత సాధించారు.

ఈ ఏడాది జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో ఓం ప్రకాశ్ 10 మీటర్లు, 50 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగాల్లో కాంస్యాలు గెలుచుకున్నాడు.

సైన్స్ అండ్ టెక్నాలజీ

రైళ్లలో భద్రతకు ‘రైల్‌ సురక్ష’ యాప్‌

రైలు ప్రయాణికులకు ఎదురయ్యే భద్రతా పరమైన సమస్యలను సత్వరమే పరిష్కరించడం కోసం ‘రైల్‌ సురక్ష’ పేరుతో రైల్వే శాఖ మొబైల్‌ యాప్‌ను సెప్టెంబర్‌ 2న రూపొందించింది. ఈ యాప్‌ను సెంట్రల్‌ రైల్వే పరిధిలోని దూరప్రాంత, లోకల్‌ రైలు ప్రయాణికులకు సెప్టెంబర్‌ చివర నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రయాణికులు సురక్ష యాప్‌లో పెట్టిన సమస్య ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌లో ఉన్న కంట్రోల్‌ రూం(182)కు చేరుతుంది. ఫిర్యాదు వచ్చిన వెంట‌నే కంట్రోల్‌ రూం సిబ్బంది రైల్వే రక్షక దళం (ఆర్‌పీఎఫ్‌)లేదా గవర్నమెంట్‌ రైల్వే పోలీస్‌ (జీఆర్‌పీ)లను అప్రమత్తం చేసి ఫిర్యాదు దారుడి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు.

అవార్డులు

డా.బీ.కే. మిశ్రాకు బీ.సీ.రాయ్ జాతీయ అవార్డు – 2018

ముంబైకి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ బీ.కే. మిశ్రా.. ప్రతిష్టాత్మక డాక్టర్ బీ.సీ. రాయ్ జాతీయ అవార్డు – 2018 ఎంపికయ్యారు. ఎమినెంట్ మెడికల్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ కింద ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 2019 జూలై 1న వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ మిశ్రా.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డుని అందుకుంటారు.

· బీసీ రాయ్ అవార్డు.. భారత వైద్య రంగంలో అందించే అత్యున్నత పురస్కారం.

· బీసీ రాయ్ అవార్డుని 1976లో భారతీయ మెడికల్ కౌన్సిల్ నెలకొల్పింది.

· ప్రముఖ వైద్యుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బిధన్ చంద్ర రాయ్ పేరిట ఈ అవార్డుని ఏర్పాటు చేశారు.

· ఆరు రంగాల్లో ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బిజినెస్ రిఫార్మర్ పురస్కారం

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్-2018 అవార్డు లభించింది. ఈ మేరకు టైమ్స్ గ్రూపు ఎండీ వినీత్ జైన్ సెప్టెంబర్ 5న ప్రకటించాడు. ముంబైలో అక్టోబర్ 27న జరిగే కార్యక్రమంలో కేసీఆర్‌కు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ 2014 నుంచి 2017 వరకు సగటున ఏడాదికి 17.17 శాతం చొప్పున, 2018 మొదటి ఐదు నెలల్లో 21.96 శాతం ఆదాయాభివృది సాధించిందని కేసీఆర్ తెలిపారు. అలాగే టీఎస్ ఐపాస్ సింగిల్ విండో పారిశ్రామిక అనుమతుల విధానం ద్వారా ఇప్పటివరకు 7,000 పరిశ్రమలు అనుమతులు పొందాయని వివరించారు.

వార్తల్లో వ్యక్తులు

IBA చైర్మన్ గా సునీల్ మెహతా

2018-19 కాలానికి గాను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) చైర్మన్‌గా పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డెరైక్టర్ సునీల్ మెహతా ఎంపికయ్యారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ దీనబంధు మొహపాత్ర ఐబీఏ డిప్యూటీ చైర్మన్‌గా ఎంపికయ్యారు.

 • ప్రస్తుతం ఐబీఏ డిప్యూటీ చైర్మన్లుగా ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్, ఫెడరల్ బ్యాంక్ ఎండీ శ్యామ్ శ్రీనివాసన్ ఉన్నారు.
 • ఐబీఏ.. భారత బ్యాంకులు, ఆర్థిక సంస్థల సంఘం. దీనిని 1946 సెప్టెంబర్ 26న ఏర్పాటు చేశారు. కేంద్ర కార్యాలయం ముంబైలో ఉంది.
 • ప్రస్తుతం ఐబీఏలో 237 మంది సభ్యులు ఉన్నారు.

ఎ ఇయర్ ఇన్ ఆఫీస్పుస్తక ఆవిష్కరణ

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రచించిన మూవింగ్ ఆన్, మూవింగ్ ఫార్వర్డ్: ఎ ఇయర్ ఇన్ ఆఫీస్పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో సెప్టెంబర్ 2న జరిగిన కార్యక్రమంలో మోదీ ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్‌గా ఏడాది కాలంలో తన అనుభవాలను వివరిస్తు వెంకయ్యనాయుడు ఈ పుస్తకాన్ని రచించారు.

పాకిస్తాన్ అధ్యక్షడిగా ఆరిఫ్ అల్వీ

పాకిస్తాన్ నూతన అధ్యక్షుడిగా.. అధికార తెహ్రిక్ ఇ – ఇన్సాఫ్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన డాక్టర్ ఆరిఫ్ అల్వీ ఎన్నికయ్యారు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరిగిన పోలింగ్ లో నేషనల్ అసెంబ్లీ, సెనేట్ కు సంబంధించిన 430 ఓట్లు ఉన్నాయి. ఇందులో అల్వీకి 212 ఓట్లు వచ్చాయి. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఆరీఫ్ అల్వీ సన్నిహితుడు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments