రూ. 3 వేల నిరుద్యోగ భృతి.. ఎంప్లాయి మెంట్ కార్డే కీలకం !

వికాసం: అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి రెండో దఫా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్.. గతంలో లాగే జనాకర్షక పథకాలను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి చెల్లించనుంది. ఆసరా పింఛన్ల పెంపుని 2019 ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. దీన్నిబట్టి చూస్తే.. నిరుద్యోగ భృతి పథకం కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచే మొదలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం నుంచి అందిన సూచనలతో అధికారులుపథకం విధివిధానాలు, లబ్ధిదారుల అర్హతలకు రూపకల్పన చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎవరిని అర్హులుగా నిర్ణయించాలి, ఏ ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలి అనే విషయాలపై కసరత్తు మొదలు పెట్టారు. ఈ పథకం కోసం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేస్తున్న అధికారులు తెలిపిన వివరాల ప్రకారంరాష్ట్రంలో దాదాపు 12 నుంచి 15 లక్షల మంది నిరుద్యోగులకు రూ. 3 వేల భృతి చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. లబ్ధిదారుల ఎంపిక కోసం ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించివాటిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే ఎంపిక చేయనున్నారు. అర్హత వయసు 25 నుంచి 35 మధ్య ఉండే అవకాశం ఉంది.

భృతి పొందాలంటే ఉండాల్సిన పత్రాలు

 • విద్యార్హత సర్టిఫికెట్లు అన్ని మెమోస్

 • అంటేటెన్త్, ఇంటర్, డిగ్రీ …. పీజీ చేసిన వాళ్లు వాటిని కూడా జత చేయాలి.

 • డిగ్రీ, ఆపైన చదివిన వారు అర్హులు. డిప్లొమా చేసిన వాళ్లకు కూడా వర్తించే అవకాశం.

 • విద్యాభ్యాసానికి సంబంధించిన బోనోఫైడ్ సర్టిఫికెట్లు

 • కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ సర్టిఫికెట్లు

 • ఆధార్ కార్డ్

 • శాశ్వత చిరునామాతో కూడిన ఏదైనా ఒక ఐడీ కార్డ్.

 • ఎంప్లాయిమెంట్ కార్డ్

ఎంప్లాయిమెంట్ కార్డ్.. కీలకం

నిరుద్యోగ భృతి పొందేందుకు ప్రభుత్వం ఎంప్లాయిమెంట్ కార్డ్ ని కీలకంగా పరిగణించే అవకాశం ఉంది. రాష్ట్రంలో జిల్లాల వారీగా ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ కేంద్రాలు ఉన్నాయి. గతంలో నియామకాల సమయంలో ఈ కార్డుని తప్పనిసరిగా అడిగే వారు. కానీ ఆన్ లైన్ విధానం అందుబాటులోకి వచ్చాకఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ల పాత్ర చాలా తగ్గింది. డిగ్రీ, పీజీలు పూర్తి చేసిన లక్షలాది మంది విద్యార్థులు జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ లలో తమ పేర్లు నమోదు చేసుకోలేదు. అవగాహన ఉన్న వారు తప్ప ఇతర విద్యార్థులు ఆ దిశగా దృష్టి సారించలేదు. నిరుద్యోగ భృతికి ఎంప్లాయిమెంట్ కార్డుని తప్పనిసరి చేయనున్న నేపథ్యంలోరిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు, నిరుద్యోగులు ఇప్పటికైనా వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేస్తే ఆఖరి నిమిషంలో హడావుడి, గందరగోళం నుంచి తప్పించుకోవచ్చు.

ఎంప్లాయి మెంట్ కార్డు పొందండి ఇలా..

ఎంప్లాయి మెంట్ కార్డు పొందాలంటేగతంలో లాగా జిల్లా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన తిప్పలు ఇప్పుడు లేవు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ వైబ్ సైట్ ను అందుబాటులోకి తెచ్చింది. www.employment.telangana.gov.in, పోర్టల్ ద్వారా నిరుద్యోగులు విద్యార్హత వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని పూరించి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇందుకోసం కావాల్సివి…. విద్యార్హత మెమోలు, బోనఫైడ్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం. అన్ని పత్రాలను స్కాన్ చేసి అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా దరఖాస్తు మొత్తం పూర్తి చేసిన తర్వాత.. రిజిస్ట్రేషన్ ఐడీ జనరేట్ అవుతుంది. సాధారణంగా నెల రోజుల్లోపు దరఖాస్తులు ఆయా జిల్లా అధికారుల ఆమోదం పొందుతాయి. ఆ తర్వాత ఎంప్లాయ్ మెంట్ కార్డుని నేరుగా వెబ్ సైట్ నుంచే డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఇదీ ప్రాసెస్

 • ముందుగా www.employment.telangana.gov.in లోకి లాగిన్ కావాలి

 • Online Registration Link క్లిక్ చేయాలి

 • Existing Card Holder ? దగ్గర No ఆప్షన్ క్లిక్ చేయాలి

 • ఆ తర్వాత పేరు, ఫోన్ నంబర్, ఈ మెయిల్ ఐడీ, ఆధార్ కార్డుతో యూజర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సబ్మిట్ చేసిన తర్వాత మొబైల్ నంబర్ కి యూజర్ ఐడీ, పాస్ వర్డ్ వస్తుంది. దానితో లాగిన్ అవ్వాలి.

 • ఆ తర్వాత విద్యార్హత వివరాలు నమోదు చేసిసంబంధిత సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాలి.

కార్డ్ ఉందా.. రెన్యూల్ చేశారా ?

 • ఎంప్లాయిమెంట్ కార్డు తీసుకున్న నిరుద్యోగులు చాలా మంది రెన్యూవల్ చేసుకోవడం మరిచిపోతారు.

 • అలాంటి వారుతమ కార్డు వ్యాలిడీలో ఉందా లేదా కూడా పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు.

 • ఎంప్లాయి మెంట్ కార్డు వ్యాలిడీ 3 ఏళ్లు ఉంటుంది. ఆ తర్వాత 6 నెలలు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ లోపు రెన్యూవల్ చేసుకోకపోతే కార్డు రద్దు అవుతుంది.

 • అందుకేగతంలో తీసుకున్న వారు కార్డు నెంబర్, రెన్యూవల్ తేదీ, పుట్టిన తేదీ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏవైనా విద్యార్హతలను అదనంగా చేర్చాలంటేస్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి. పూర్తి వివరాలు చెక్ చేసుకోని సబ్మిట్ చేస్తేనెల రోజుల్లో కొత్త కార్డు అప్ లోడ్ అవుతుంది. ఆ తర్వాత కొత్త కార్డ్ ని ఆన్ లైన్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

నిరుద్యోగులు ఎంత మంది ?

 • ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ లో నేటి వరకు (22.12.2018) 13 లక్షల 69,911 మంది తమ వివరాలు నమోదు చేసుకున్నారు.

 • సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం డిగ్రీ ఆపైన చదివిన 8.4 లక్షల మంది తాము ఏ కొలువు చేయడం లేదని తెలిపారు.

 • తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్లో 20 లక్షల మందికిపైగా అభ్యర్థులు ఇప్పటి వరకు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఉన్నారు.

 • ఉపాధి హామీ పథకంలో 20 లక్షల జాబ్ కార్డు దారులు ఉన్నారు. వీరిలో నిరక్షరాస్యులతో పాటు చదువుకున్న వారు ఉన్నారు.

 • ఈ లెక్కలన్నీంటినీ ఓ చోట చేర్చి చూస్తేరాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య 30 లక్షల పైగానే ఉండే అవకాశం ఉంది.

 • మొత్తంగా.. అయితే.. కనీస డిగ్రీ విద్యార్హత, వయసు, ఆర్థిక నిబంధనలతో నిరుద్యోగ భృతి పథకంలో పరిధిలోకి వచ్చి వారి సంఖ్య 12 నుంచి 15 లక్షలు ఉండవచ్చని అంచనా.

ఈ నేపథ్యంలోవచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే నిరుద్యోగ భృతి పథకానికి విధ విధానాలు, నిబంధనలు ఎలా ఉంటాయో అన్న చర్చ విద్యార్థులు, ఉద్యోగార్థుల్లో అప్పుడే మొదలైంది. వీటిపై ఓ స్పష్టత వస్తేగానీఎంత మంది నిరుద్యోగులు భృతికి అర్హులవుతారో తేలుతుంది.

Related posts