TSPSC లో సంస్కరణలపై కేసీఆర్ నజర్… ???

వికాసం: రెండో దఫా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ముందు రోజుల్లో తాను చేయబోయే సంస్కరణలను చెప్పకనే చెప్పారు. డిసెంబర్ 12న టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అది నిరుద్యోగులకు సంబంధించినదే కావటంతో.. ఆసక్తి ఇంకా పెరిగింది.

ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్నది మా కమిట్ మెంట్. ఇస్తాం. మేము ఇచ్చిన నోటిఫికేషన్లను కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సకాలంలో పూర్తి చేయలేకపోయింది. అగాధమైన కొన్ని పిచ్చి పిచ్చి పనులు పెట్టుకోని వాళ్లు చేయలే. మేం ఇచ్చిన నోటిఫికేషన్లు కంప్లీట్ చేయలే. అది కొంత మైనస్ కూడా అయ్యింది మాకు. అందుకే.. కొన్ని నోటిఫికేషన్లు టీఎస్పీఎస్సీ నుంచి తీసి డిపార్ట్ మెంట్లకు ఇచ్చినం. మీరే రిక్రూట్ మెంట్ చేయమని చెప్పి.”

ఇవి ఇవాళ కేసీఆర్ మాటలు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. రానున్న రోజుల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో భారీ సంస్కరణలు తప్పవన్న సూచనలు స్పష్టం కనిపిస్తున్నాయి. ఛైర్మన్ ను తొలగిస్తారని ఎన్నికలకు ముందు నుంచే ప్రచారం సాగుతోంది. నిరుద్యోగుల్లో వ్యతిరేకత ఉన్నా.. ఇతర అంశాల్లో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులు చూసి.. భవిష్యత్తుపై నమ్మకంతో అన్ని వర్గాల ప్రజలు మరోసారి కేసీఆర్ కే పట్టం కట్టారు. ఈ నేపథ్యంలోటీఎస్పీఎస్సీ పై కేసీఆర్ నజర్ సారించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు అన్ని భర్తీ చేస్తామని.. ఈ టర్మ్ లో అది పూర్తి చేస్తామని కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. దానికి కావాల్సిన చర్యలు కూడా చేపడతామని అన్నారు. ఆయన మాటలను బట్టి చూస్తేటీఎస్పీఎస్సీ పాలక వర్గాన్ని సంస్కరించడం ఖాయం అన్నట్లుగా కనిపిస్తోంది. ఐఏఎస్ ను చైర్మన్ గా నియమిస్తారన్న వాదన బలంగా వినిపిస్తోంది.

టీఎస్పీఎస్సీ తప్పుల చిట్టా….

నీళ్లు, నిధులు, నియామకాలు ! ఇది స్వరాష్ట్రం కోసం సకల జనులు హోరెత్తించిన నినాదం. తెలంగాణ ఏర్పాటు తర్వాత.. లక్షకుపైగా ఉద్యోగాల భర్తీ అంటూ.. ఈ ప్రక్రియను చేపట్టేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఏర్పాటు చేసిననాడునిరుద్యోగ యువత సంబురాలు చేసుకుంది. ఉద్యోగార్ధుల కష్టాలు, తెలంగాణ వెనుకబాటు తనంపై స్పష్టమైన అవగాహనతో పాటు తెలంగాణ ఎందుకు కావాలో పేర్కొంటూ అక్షర పోరాటం చేసిన ఘంటా చక్రపాణిని సర్వీస్ కమిషన్ కి చైర్మన్ గా నియమించిన రోజు తెలంగాణ యువత ఇక మా కష్టాలు తొలగిపోయే రోజులు వచ్చాయని పొంగిపోయింది. కోచింగ్ ల కోసం వేలకు వేలు పోసి.. రేయింబవళ్లు చదువుతూ ఉద్యోగ నియామక ప్రకటనల కోసం ఎదురుచూసింది. అయితే భారీ అంచనాలతో కార్యాచరణ ప్రారంభించిన టీఎస్ పీఎస్సీ.. నిరుద్యోగుల సహనానికి పరీక్ష పెట్టడం మొదలుపెట్టింది. ఉద్యోగ నియామక ప్రకటనల జారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో అనేక తప్పులతో అభాసుపాలైంది. గ్రూప్ – 2 మొదలు గురుకుల నియామకం వరకు నిత్య వివాదాల కేరాఫ్ గా నిలిచింది.

గందరగోళంగా.. గ్రూప్ – 2, గ్రూప్ -1

గురుకుల భర్తీ.. ఆగమాగం

7,306 పోస్టులతో జారీ చేసిన గురుకుల టీచర్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీలోను టీఎస్ పీఎస్సీ అలసత్వాన్నే ప్రదర్శించిందనే ఆరోపణలు ఉన్నాయి. తొలుత నోటిఫికేషన్ ఇవ్వడం, అర్హతల విషయంలో విమర్శలు, ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించుకోవడంతో నోటిఫికేషన్ లో మార్పులు జరిగాయి. కానీ ఎంపిక ప్రక్రియలో తీవ్ర జాప్యం.. అభ్యర్థుల సహనాన్ని పరీక్షించింది. తీరా వెల్లడించిన ఫలితాల్లోను టీఎస్ పీఎస్సీ చర్యలు గందరగోళానికి తెరలేపింది. ఎంపికలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదని అనేక మంది అభ్యర్థులు టీఎస్ పీఎస్సీ ముందే ధర్నాకు దిగారు. ఈ అంశంలో తమ అభ్యర్థనలను వినేందుకు కూడా అధికారులు అవకాశం ఇవ్వలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జీవోలపై అధికారులకే అవగాహన లేదా ?

ఇక టీఎస్ పీఎస్సీలో పనిచేసే అధికారులకు నియామక జీవోలపై కనీస అవగాహన కూడా లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన టీజీటీ ఎంపికలో ఓ అభ్యర్థి తనకు అన్యాయం జరిగిందంటు నియామక జీవో కాపీలు, అర్హత పత్రాలు తీసుకొచ్చి అధికారులకు చూపించిన తర్వాత ఎంపిక జాబితాలో మార్పు చేశారు. అంతకముందు ప్రకటించిన తుది జాబితాలో ఓ అభ్యర్థి పేరుని తొలగించి.. జీవో కాపీతో అభ్యర్థన దాఖలు చేసిన అభ్యర్థికి చోటు కల్పించారు. ఈ అంశంపై తొలగించబడ్డ ఉద్యోగి టీఎస్ పీఎస్సీ ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే.. తమ వారే పొరపాటు చేశారని, తప్పు తమదే అంటూ సముదాయించే ప్రయత్నం చేశారు. స్వయంగా టీఎస్ పీఎస్సీ కార్యదర్శి వాణీ ప్రసాద్ పిలిపించుకొని మరీ సదరు అభ్యర్థికి వివరణ ఇచ్చారంటే.. ఉద్యోగాల నియామక ప్రక్రియ ఎంత అలసత్వంతో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.

ప్రైవేటు బ్లాగు ప్రశ్నలు.. ప్రశ్నాపత్రంలో

రాష్ట్రంలో వివిధ గురుకుల పాఠశాలల్లోని 304 ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలో టీఎస్ పీస్సీ నిర్లక్ష్యం మరోసారి బహిర్గతమైంది. పేపర్ -1, పేపర్ – 2 పద్ధతిలో నిర్వహించిన ఈ పరీక్షలో ప్రైవేటు బ్లాగ్ నుంచి కొన్ని ప్రశ్నలు యథాతథంగా ఇచ్చారు. ఈ అంశంలో ఆరోపణలతో టీఎస్ పీఎస్సీ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయగా.. పొరపాటు వాస్తవమే అని వారు తేల్చారు. రెండు పేపర్లలో కలిపి 67 ప్రశ్నలు ప్రైవేటు బ్లాగు నుంచి ఇచ్చారని తేల్చారు. దీంతో.. ఆ ప్రశ్నలు తొలగించి మిగతా ప్రశ్నలతో పేపర్ వాల్యుయేషన్ చేయాలని, వాటిని మొత్తం మార్కులతో నార్మలైజ్ చేయాలని కమిషన్ నిర్ణయించింది. ఈ అంశంలో టీఎస్ పీఎస్సీ తీరుపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివాదాలకు కేరాఫ్ గా టీఆర్ టీ

తెలంగాణ రాష్ట్రంలో టీచర్ కొలువుల కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్న బీఈడీడీఈడీ అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ ఓ విధంగా చుక్కలే చూపించిందని చెప్పవచ్చు. నోటిఫికేషన్ ఇచ్చింది మొదలు, పరీక్ష నిర్వహణ వరకు కమిషన్ చేసిన అనేక సవరణలు, తప్పిదాలతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తొలుత 31 జిల్లాలతో నోటిఫికేషన్ జారీ చేసిన కమిషన్ కోర్టు జోక్యంతో పది జిల్లాలకు సవరించింది. హాల్ టికెట్ల జారీలో తీవ్ర గందరగోళం సృష్టించింది. ఎంపిక చేసుకోని కేంద్రాలను కేటాయించింది. దీనిపై అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవడంతో తప్పుదిద్దుకొంది. ఇంత చేసి పరీక్ష నిర్వహించినాఫలితాల వెల్లడికి చాలా సమయం తీసుకుంది.

ఇలాటీఎస్పీఎస్పీ అనేక తప్పిదాలతో.. ప్రభుత్వం ఇరకాటంలో పడింది. రానున్న రోజుల్లో అనేక శాఖల్లో ఖాళీల భర్తీపై కేసీఆర్ స్పష్టత ఇచ్చిన నేపథ్యంలోనియామక సంస్థలో భారీ సంస్కరణలు జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments