ఖమ్మం లోక్ సభ సీటుపై కాంగ్రెస్ వృద్ధ నేతల నజర్

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవాతో కాంగ్రెస్ కాకలు తీరిన నేతలందరూ కొట్టుకుపోయారు. గులాబీ దళాధిపతి వేసిన పద్మవ్యూహంలో ఇరుక్కున్న చేయి నలిగిపోయింది. శాసనసభ ఎన్నికల్లో చతికిలపడ్డ హస్తం నేతలు…. సార్వత్రిక ఎన్నికల్లో ఉనికి కాపాడుకునేందుకు తాపత్రయపడుతున్నారు. తాజా ఎన్నికల ఫలితాల్లో సీనియర్ నేతలు సైతం మట్టికరవడంతో మోహం చూపించుకోలేక ఇళ్లకే పరిమితమయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలిచినవారిలో రాష్ట్రవ్యాప్తంగా తెలిసిన మోహాలు తక్కువే. కేవలం రిజర్వ్ డ్ స్థానాల్లోనే కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని చూపింది. మిగతా స్థానాల్లో అత్తెసరు మెజారిటీతో గట్టెక్కింది. ముఖ్యంగా గిరిజన, ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో గెలుపు హస్తం పార్టీకి అభయహస్తంలా నిలిచిందనే చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా పూర్వ ఖమ్మం జిల్లాలోనే కాంగ్రెస్ అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోవడంతోసార్వత్రిక ఎన్నికల్లో అక్కడ ఎంపీ స్థానంపై కాంగ్రెస్ వృద్ధనేతల కన్నుపడింది. అక్కడైతే సులువుగా గెలవచ్చన్న ధీమాతో ప్రతి సీనియర్ నేత ఆ స్థానం తనకే ఇవ్వాలని ఢిల్లీ స్థాయిలో ఇప్పటికే లాబీయింగ్ మెుదలెట్టారు.

ఇందులో భాగంగా ఖమ్మం స్థానంపై మొదట కర్చీఫ్ వేసింది సీనియర్ నేత వీహెచ్. రాష్ట్రంలో అంత పలుకుబడి, ఉనికి లేకపోయినా ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేయించుకోగల సమర్థుడు. అంబర్ పేట శాసనసభ స్థానంపై గజినీ మాదిరి అత్యధిక సార్లు పోటికి దిగినా కిషన్ రెడ్డి ఊపు ముందు నిలవక అసలు పోటీనే మానేసిన ఆయనఈ దఫా ఎలాగైనా గెలిచి లోక్ సభలో అడుగుపెట్టాలని భావించి ఖమ్మం సీటుపై దృష్టిసారించారు. అందులో భాగంగానే పీసీసీకి దరఖాస్తు సైతం చేసుకున్నారు. ఖమ్మం ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడ్డ పొంగులేటి సుధాకర్ రెడ్డి సైతం నాడు ఎంపీ సీటిస్తామన్న పెద్దల హామీతో మిన్నకుండి నేడు ఎంపీ సీటు కోసం తెరవెనుక ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అంత బాగుండకపోవడంతో ఆయన లోక్ సభకు పోటీకి దిగడం అనుమానమేనని తెలుస్తోంది. మరోవైపు పదేళ్లుగా మరుగునపడి ఖమ్మం ఆడబిడ్డగా చెప్పుకుంటున్న రేణుకాచౌదరి ఆ స్థానం తనదేనంటూ దబాయించడం మొదలు పెట్టింది. ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన ఆమె ఢిల్లీ స్థాయి నేతగా ఎదిగి ఖమ్మంలో పెద్దఎత్తున అనుచరగణాన్ని నడపడం ఆమెకు కలిసొచ్చే అంశం. ఖమ్మం సీటు ఆమెకు ఇవ్వని పక్షంలో పార్టీ మారతారనే చర్చ జోరుగా సాగుతోంది. కానీ రేణుకా చౌదరి మాత్రం సీటిచ్చినా ఇవ్వకపోయినా పార్టీలోనే ఉంటాననిఖమ్మం స్థానికులకే సీటివ్వాలని డిమాండ్ చేస్తోంది. బయటి వ్యక్తులకు అక్కడ టికెట్ ఇవ్వకపోతేబలమైన నేతగా తనకే సీటుదక్కుతుందన్న దురాశ సైతం ఆమె మనసులో ఉందని రేణుకా వ్యతిరేకవర్గం భావిస్తోంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో జిల్లాలో మల్లు భట్టి విక్రమార్క హవా నడుస్తుండటంతో ఆమె వ్యతిరేకవర్గమైన ఆయన ఆమెకు సీటు దక్కకుండా చేస్తారేమోననే చర్చ జిల్లా రాజకీయాల్లో జోరుగా జరుగుతోంది.

రాష్ట్రమంతా టీఆర్ఎస్ హవా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ బలంగా ఉన్న ఖమ్మం స్థానంపై ఆ పార్టీ సైతం కన్నెసింది. కచ్చితంగా గెలవాలన్న నేపథ్యంలో ఈ దఫా టీఆర్ఎస్ అర్ధబలం ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సీటిస్తారనేది కాస్త అనుమానంగానే ఉంది. తాజా ఎన్నికల్లో తుమ్మల, జలగం, మదన్ లాల్ ఓటమికి ఆయన వర్గమే కారణమని గులాబీ దళాధిపతి భావిస్తున్నారు. ఒకవేళ సిట్టింగ్ కే స్థానం ఇచ్చే నేపథ్యంలో సీటు పొంగులేటికే కన్ ఫర్మ్ అయితే కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు వారి వ్యతిరేకవర్గమే పనిచేస్తుందన్న నమ్మకం కాంగ్రెస్ వర్గాల్లో బలంగా ఉంది. అందుకే ఖమ్మం సీటుకు డిమాండ్ ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వృద్ధనేతలందరూ చివరిసారిగా అదృష్టం పరీక్షించుకునేందుకు ఆ సీటుకోసం ఉబలాటపడుతున్నారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments