సిద్ధిపేటకు ఎయిర్ పోర్ట్.. వాళ్లు ఒప్పుకుంటేనే ??

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల అభివృద్ధి పర్యటనల్లో వరాలు జాలువారుతాయి. జిల్లా మంత్రులు అడిగినవే కాకుండా అడగనివి కూడా మంజూరు చేస్తారు. గతంలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల పర్యటనల మాదిరిగానే డిసెంబర్ 10న కేసీఆర్ సిద్ధిపేట పర్యటన సాగింది. తెలంగాణ రాష్ట్రానికి సిద్ధిపేట జిల్లాను బొడ్రాయిగా అభివర్ణించిన సీఎం.. హరీశ్ అడ్డాకి అనేక వరాలు ప్రకటించి వెళ్లారు. సిద్ధిపేటకు అంతర్జాతీయ విమానాశ్రయం తెస్తా అన్న వాగ్దానం.. చాలా మందిలో సాధ్యమేనా అనే సందేహాలు రేకెత్తించింది. ఎందుకంటే.. తెలంగాణలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ కే ఇప్పటి వరకు ఎయిర్ పోర్ట్ లేదు. ఇప్పుడు కొత్తగా సిద్ధిపేట పేరు తెరపైకి వచ్చి చేరింది. మరి వరంగల్, సిద్ధిపేటఈ రెండింట్లో దేనికి ముందుగా ఎయిర్ పోర్ట్ వస్తుంది ??

GMR ఒప్పుకుంటేనే .. !!

తెలంగాణలో నిర్వహణలో ఉన్న ఏకైక విమానాశ్రయం.. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్. GMR సంస్థ ఈ ఎయిర్ పోర్ట్ ని నిర్మించింది. ఇందుకోసం 2004లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకుంది. అదేంటంటే… 30 ఏళ్ల వరకు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఎక్కడా మరో విమానాశ్రయం కట్టకూడదు. ఈ కారణంగానే.. వరంగల్ మమ్మూర్ ఎయిర్ పోర్ట్ పై ఇప్పటి వరకు ముందడుగు పడటం లేదు. వాస్తవానికి.. 1980 వరకు ఆపరేషన్ లో ఉన్న మమ్మూర్ ఎయిర్ పోర్ట్.. ఆ తర్వాత డిమాండ్ లేకపోవటంతో మూతపడింది. స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు 2007లో ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మమ్మూర్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు అంగీకరించింది. ఈ మేరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. కానీఅప్పటికే జీఎంఆర్ తో ఉన్న 150 కిలోమీటర్ల నిబంధన కారణంగా.. ఆ ఒప్పందం ఆచరణకు నోచుకోలేదు.తాజాగా సిద్ధిపేట పర్యటనతో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో మరిన్ని విమానాశ్రయాల అంశాన్ని లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం ద్వారా ప్రాంతీయ అనుసంధానానికి ప్రాముఖ్యతను ఇస్తున్న నేపథ్యంలో.. సిద్ధిపేట ఎయిర్ పోర్ట్ విషయంలో కేంద్రం నుంచి సానుకూలత లభించే అవకాశాలు ఉన్నాయి. తన రాజకీయ ప్రస్థానానికి నాంది పలికిన నేలపై విమానాలను దింపాలనే సంకల్పాన్ని నిజం చేయాలంటేకేసీఆర్ ముందుగా జీఎంఆర్ ని ఒప్పించాల్సి ఉంటుంది. కర్ణాటకలోని బీదర్ లో అంతకమునుపే ఉన్న ఎయిర్ పోర్టులో సాధారణ ప్రయాణ సేవలను ప్రారంభించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను జీఎంఆర్ మొదట అడ్డుకుంది. బీదర్ ఎయిర్ పోర్ట్.. హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్ల లోపల ఉందన్న కారణంతో.. కమర్షియల్ ఆపరేషన్స్ కి అంగీకరించలేదు. కానీ.. తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంప్రదింపులతో జీఎంఆర్ దిగొచ్చింది. పలు కండిషన్లతో ఒకే చెప్పింది. సోతెలంగాణలోను వరంగల్, సిద్ధిపేటలో ఎయిర్ పోర్ట్ లు ప్రారంభించాలంటే.. రాష్ట్ర ప్రభుత్వం జీఎంఆర్ ని ఒప్పించక తప్పదు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments