వికాసం: తెలంగాణ లో ఇప్పుడు అందరి నోటా ఎగ్జిట్ పోల్స్ ముచ్చటే నడుస్తోంది. దాదాపు అన్ని సంస్థలు తెలంగాణలో మరోసారి అధికారం తెలంగాణ రాష్ట్ర సమితిదే అని తేల్చేశాయి. ఒక్క లగడపాటి తప్ప. దీంతో గులాబీ అనుచరులు అప్పుడే మస్తీలో మునిగితేలుతున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని( నేతృత్వంలోని అని గట్టిగా చెప్పలేని పరిస్థితి) ప్రజా కూటమి అధికారంపై పెట్టుకున్న ఆశలు అడి ఆశలే అని సర్వేలు నిర్మోహమాటంగా చెప్పేశాయి. సాధారణంగా దేశవ్యాప్తంగా గతంలో జరిగిన శాసనసభ, లోక్ సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ను పరిగణలోకి తీసుకొని చూస్తే.. పోలింగ్ తర్వాత వెలువడే ముందస్టు రిజల్ట్స్ కాస్త వాస్తవానికి దగ్గరగా ఉంటాయని అనేక సార్లు రుజువైంది. మరి ఈ సారి కూడా తెలంగాణ ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ తుది ఫలితానికి దగ్గరగా ఉంటాయా ? లేక ఢిల్లీ అసెంబ్లీలో జరిగిన ఆశ్చర్యం ఇక్కడ కూడా ఆవిష్కృతం అవుతుందా అన్నది తేలడానికి ఇంకా 3 రోజులు సమయం ఉంది. అప్పటి వరకు అభ్యర్థులు, పార్టీల గుండెల్లో ఏదో ఓ మూల డాల్బీ సౌండ్ ఎఫెక్ట్ కొనసాగుతుంది.
వివిధ సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్
*Times Now Later Increased TRS Prediction to 77 Lagadapati Survey
మరోసారి “తెలంగాణం“
ఎగ్జిట్ పోల్స్ లెక్కలు కాస్త పక్కన పెడితే.. తెలంగాణలో ఇంకా తెలంగాణ వాదం గుండెల్లో పదిలంగా ఉందని మరోసారి స్పష్టమైంది. 2018 జూన్ వరకు అంతా కేసీఆర్ కు తిరుగులేదని భావించినా.. సెప్టెంబర్ లో అర్థాంతరంగా ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళుతున్నట్లు ప్రకటించడం రాష్ట్ర ప్రజల్ని సందిగ్ధంలో పడేసింది. కేసీఆర్ వ్యూహం ఏదైనా.. చాలా మంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అప్పటి వరకు అధికారంపై ఎలాంటి ఆశలు లేని కాంగ్రెస్ కు ఓ ఆయుధం దొరికింది. నిరుద్యోగులు, ఉద్యోగులు ఎలాగో కాక మీద ఉన్నారు. వీరిద్దరి అండతో అందలం ఎక్కొచ్చని కాంగ్రెస్ కోటి ఆశలతో రంగంలోకి దిగింది. కానీ… తమకున్న శక్తిపై నమ్మకం లేకనో.. లేక ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు మంత్రాంగం ఫలితమో.. ఎమో తెలియదు కానీ.. కాంగ్రెస్ ప్రజాకూటమి పేరుతో తెలుగుదేశంతో కలిసి ఎన్నికల రణ క్షేత్రంలోకి అడుగుపెట్టింది. రాజకీయాల్లో పాకడం కూడా తెలియని కోదండరామ్ ని వెంట పెట్టుకొని ఏకంగా రేస్ లోకి వచ్చేసింది. అటు కేసీఆర్…. ఇటు కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, మంద కృష్ణ, చెరుకు సుధాకర్.
కూటమి కూర్పు చాయ్ పే చర్చాలా సాగడం, ఎవరి స్టేట్ మెంట్లు వారు ఇవ్వడం, పూర్తి ఆంధ్రా మూలాలు ఉన్న టీడీపీతో కలిసి సాగడం. ఇలా… భారీ యుద్ధానికి ముందే ప్రజాకూటమిలో అనేక లోపాలు బహిర్గతం అయ్యాయి. ఈ తరుణంలోనే కేసీఆర్ తన రాజకీయ చతురతని మరోసారి ప్రదర్శించాడు. నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉందని తెలుసు. అయినా.. వారిపై వరాల జోలికి పోకుండా కేవలం పూర్తిగా తెలంగాణ సెంటిమెంట్ కే పరిమితయ్యారు. ప్రజా కూటమి వస్తే జరిగే నష్టాలు అంటు.. మరోసారి తెలంగాణ ప్రజల్లో ప్రాంతీయ చైతన్యాన్ని ఉత్తేజపరిచారు. ఆంధ్రప్రదేశ్ లో 4న్నర ఎళ్లలో ఏం చేయని చంద్రబాబు… తెలంగాణను నంబర్ వన్ చేస్తామంటు ప్రకటనలు చేయడం ఏంటంటూ గాలితీశారు. ఇక బాలకృష్ణ సంగతిసరేరి. చంద్రబాబు వద్దనుకుంటే.. ఆయన కట్టిన వాటిని తీసేయండి అంటూ చేసిన చిల్లర ప్రసంగం.. తెలంగాణ వాదుల్లో కోపం తెప్పించింది. ఈ ఎన్నికలు తెలంగాణ అస్థిత్వానికే పరీక్ష అన్న చర్చ అంతటా వ్యాపించింది. ఇదే న్యూట్రల్ ఓటర్స్ ను సైతం టీఆర్ఎస్ వైపు మళ్లేలా చేసింది. ఇవాళ జరిగిన ఓటింగ్ సరళని గమనిస్తే.. చాలా వరకు టీఆర్ఎస్ కు పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. ఇక.. ఎగ్జిట్ పోల్స్ పై సోషల్ మీడియాలో సెటైరికల్ పోస్టులు హల్ చల్ చేస్తున్నాయి. టీఆర్ఎస్ కు వచ్చిన ఈ పాజిటివ్ వైబ్స్ అంతా చంద్రబాబు, బాలకృష్ణ ప్రచార ఫలమే అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. చాలా వరకు అన్ని పోస్టుల్లో.. జై తెలంగాణ నినాదాన్ని జోడిస్తున్నారు. దీన్ని బట్టే చెప్పవచ్చు…. ఈ నాటి ఎగ్జిట్ పోల్స్ డిసెంబర్ 11న నిజమైతే.. కాంగ్రెస్ తన గొయ్యిని తానే తొవ్వుకుందన్నది సుస్పష్టం. అలా కాకుండా.. లగడపాటి సర్వేనే నిజమైతే… టీఆర్ఎస్ పార్టీలో భారీ కుదుపులు, నాయకత్వంలో మార్పులు ఖాయం.