రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది ఇప్పటికే అనేక సార్లు రుజువైన ఫార్ములా. అవసరం.. ఏ రాజకీయ పార్టీనైనా ఏ పార్టీతో అయినా కలిసేలా చేస్తుంది. బిహార్ లో నితీశ్ – లాలూ, తెలంగాణలో టీడీపీ – కాంగ్రెస్ ఇందుకు మంచి ఉదాహరణ. అయితే ఇంతకు మించిన కలయికకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దారులు తెరిచారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఒక రోజు ధర్మ పోరాట దీక్ష చేపట్టిన బాబు.. జగన్ తో కలిసిపనిచేస్తే తప్పేం లేదని మాట్లాడుతూ.. తనదైన శైలిని మరోసారి ప్రదర్శించాడు. బాబు ఇప్పటి వరకు దేశంలో ఏ పార్టీతో పొత్తుపెట్టుకోలేదో చెప్పండంటు ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్న ప్రస్తుత సమయంలో…బాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచాయి.
“ఏపీలో జగన్ పార్టీ ఒకటో రెండో సీట్లు గెలిస్తే.. వచ్చి మాతో కలిసి పనిచేయవచ్చు. అందులో తప్పేం లేదు. జాతీయ స్థాయిలో ఏపీ వాదనను బలంగా వినిపించేందుకు జగన్ కలిసివస్తే కలిసి పనిచేయడానికి మాకేం అభ్యంతరం లేదు” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ – బాబు – పవన్ మధ్య త్రిముఖ పోరు తప్పదన్న సంకేతాలు వస్తోన్న నేపథ్యంలో… చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాన్ని ఇంకా రసవత్తం చేశాయి.