వానాకాలంలో న్యూస్ పేపర్లో చాలా మంది ఆసక్తితో చూసే కాలమ్… ఏ ప్రాజెక్టులో ఎంత నీరు ఉంది, ఇన్ ఫ్లో ఎంత.. ఔట్ ఫ్లో ఎంత అనే వివరాలు. ఆయా ప్రాజెక్టులు నిండినయ్ అంటే.. అవి మన దగ్గర లేకున్నా.. మనసులో ఏదో తెలియని ఆనందం వస్తుంది. కానీ.. వాస్తవానికి ప్రాజెక్టుల్లో నిజంగా సామర్థ్యానికి తగిన నీటి నిల్వ చేరుతుందా అంటే.. నిస్సందేహంగా లేదనే చెప్పాలి. దశాబ్దాలుగా ప్రాజెక్టుల అడుగన పేరుకుపోతున్న పూడిక… వాటర్ స్టోరేజ్ కెపాసిటీని తగ్గిస్తోంది. దాదాపు 408 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు.. నేడు 312 టీఎంసీలకే పరిమితం అయ్యింది. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల్లోను ఇంతకుమించి పూడిక పేరుకుపోయింది.
53 ఏళ్లలో 110 టీఎంసీలు.. !!
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి 1955 డిసెంబర్ 10న శంకుస్థాపన చేశారు. పనులు 12 ఏళ్ల పాటు కొనసాగి.. 1967లో 408.24 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయింది. నీటి ప్రవాహంలో ఏటేటా కొట్టుకువచ్చే మట్టి, రాళ్లతో ప్రాజెక్టులో భారీగా పూడిక పేరుకుపోయింది. అలా.. ఈ 53 ఏళ్లలో పేరుకున్న పూడిక సాగర్ స్టోరేజ్ ని 110 టీఎంసీల మేర తగ్గించింది. అంటే.. ఇప్పుడు ప్రాజెక్టు పూర్తిగా నిండినా అందులో ఉన్న నీటి నిల్వ కేవలం 312 టీఎంసీలే.
సాగర్ లో తగ్గిన నీటి నిల్వ స్థాయి ఇలా..
సంవత్సరం తగ్గిన నీరు (టీఎంసీల్లో)
1967 – 74 14.8
1974-78 48.7
1978-2009 79.21
2009-2010 96.05
2010-2016 108
2016-2020 110
పరిష్కారం ఏంటి.. ?
ప్రాజెక్ట్ డెత్ స్టోరేజ్ కి చేరుకున్నప్పుడు.. పేరుకుపోయిన ఒండ్రు మట్టిని తీసుకేందుకు అవకాశం ఉంటుంది. ఆ మట్టిన పొలాల్లో వేస్తే పంటలకు చాలా మంచిది. సమయానికి వర్షాలు రావడంతో.. ఈ రెండేళ్లలో సాగర్ జలాశయం నీటి నిల్వలు పూర్తిగా అడుగంటి పోలేదు. మరో మార్గం.. నీటి ప్రవాహంలో ఒండ్రు మట్టి, రాళ్లు రప్పలు ఎక్కువగా రాకుండా అడ్డుకోవడం. జలాశయం పైన.. అంటే ప్రవాహం వచ్చే మార్గంలో చెక్ డ్యాంలు నిర్మించడం ద్వారా పూడిక రాకుండా నివారించవచ్చని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు.