మహిళలు ఆకాశంలో సగం అన్నది పాత మాట. అవకాశాల్లో సగం అన్నది నేటి మాట. అతివలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఆకాశంలో, నీటిలో రాణి రుద్రమ వలే సైన్యంలో పోరాడుతున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టసవరణతో మహిళలు.. భూగర్భంలోను అడుగు పెట్టేందుకు వీలు కలిగింది. మహిళలను భూగర్భ మైనింగ్ లోకి నిషేధించిన 1952 మైన్స్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల సవరించింది. దీంతో దాదాపు 67 ఏళ్ల తర్వాత భూగర్భ మైనింగ్ లో మహిళలు కూడా విధులు నిర్వహించే అవకాశం లభించింది. అలాగే వారు కావాలంటే నైట్ షిఫ్ట్ లను కూడా ఎంచుకునే స్వేచ్ఛ కల్పించింది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సవరణలను అమలు చేసిన ఘనతను తెలంగాణలోని సింగరేణి సంస్థ సొంతం చేసుకోనుంది. చట్ట సవరణ ద్వారా తీసుకొచ్చిన కొత్త నిబంధనలను అమలు చేసే దిశగా చర్యలు ప్రారంభించిన SCCL… త్వరలో మహిళలకు నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.
భూగర్భ మైనింగ్ లో ఆసక్తి ఉన్న మహిళలు జనరల్ మజ్దూర్, పంప్ ఆపరేటర్, కన్వేయర్ ఆపరేటర్, కోల్ కట్టర్, ఫిట్టర్, హెల్పర్ తదితర 52 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు అన్ని అంశాల్లో శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం సింగరేణిలో 1,362 మంది మహిళలు క్లర్క్, స్వీపర్, హాస్పిటల్ సిబ్బంది హోదాల్లో పనిచేస్తున్నారు.