సెప్టెంబర్ – జాతీయం
☛ ఇండస్ వాటర్ ఒడంబడిక – భారత్, పాక్ మధ్య అవగాహన
ఇండస్ వాటర్ ఒడంబడిక 1960కి అనుగుణంగా రెండు దేశాల్లో ఆయా దేశాల నీటి కమిషనర్ల పర్యటనకు భారత్, పాకిస్తాన్ అంగీకరించాయి. భారత్ లో జమ్ము అండ్ కశ్మీర్ లో చేపడుతున్న జల విద్యుత్ ప్రాజెక్టులపై పాకిస్తాన్ అభ్యంతరం చెబుతోంది. ఈ నేపథ్యంలో.. ఈ వివాదాల పరిష్కారం కోసం రెండు దేశాల ప్రతినిధులు ఇరు ప్రాంతాల్లో పర్యటించి.. సమస్యలను అధ్యయనం చేసేందుకు, వాటిని పరిష్కరించేందుకు రెండు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. ఈ మేరకు భారత్, పాకిస్తాన్ మధ్య ఇటీవల అత్యున్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు పాకిస్తాన్ లాహోర్ లో జరిగాయి. పాకిస్తాన్ నూతన ప్రధాన మంత్రిగా పాకిస్తాన్ తెహ్రీక్ – ఈ – ఇన్సాఫ్(PTI) పార్టీ అధినేత ఇమ్రాం ఖాన్ గత నెలలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి జరిగిన చర్చల్లో ఈ అవగాహన కుదిరింది. అలాగే శాశ్వత ఇండస్ కమిషన్ (PIC)ను బలోపేతం చేయాలని నిర్ణయించాయి.
వెయ్యి మెగా వాట్ల సామర్థ్యంతో కూడిన పాకల్ దుల్, 48 మెగావాట్ల లోయర్ కాల్నాయ్ జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంపై పాకిస్తాన్ లేవనెత్తిన అభ్యంతరాలను భారత్ తోసిపుచ్చింది. చెనాబ్ నదిపై నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టులని సందర్శించాల్సిందిగా పాకిస్తాన్ ప్రతినిధులను అహ్వానించింది. తదుపరి పీఐసీ సమావేశంలో భారత్ లో జరగనుంది.
ఇండస్ వాటర్ ఒడంబడిక ?
ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్తాన్ మధ్య ఇండస్ వాటర్ ఒడంబడిక కుదిరింది. ఇండస్ కింద ఆరు నదులు ఉన్నాయి. అవి బియాస్, రవి, సట్లెజ్, ఇండస్, చెనాబ్, జెలమ్. రవి, బియాస్, సట్లెజ్ నదులు భారత్ నియంత్రణ… ఇండస్, జెలమ్, చెనాబ్ నదులపై పాకిస్తాన్ నియంత్రణ ఉండేలా ఒడంబడిక జరిగింది. అలాగే భారత్ మీదుగా ప్రవహించే ఇండస్ నదిలో సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి కోసం కేవలం 20 శాతం నీటిని మాత్రమే భారత్ ఉపయోగించుకోవాలి. ఈ మేరకు 1960 సెప్టెంబర్ 19న అప్పటి భారత్ ప్రధాన మంత్రి జవహార్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ సంతకం చేశారు. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన నీటి ఒడంబడికగా ఇండస్ వాటర్ ట్రీటీ గుర్తింపు పొందింది.
☛ రాక్సౌల్ – కఠ్మాండు రైల్వేపై భారత్ – నేపాల్ మధ్య ఒప్పందం
బిహార్ లోని రాక్సౌల్ నగరాన్ని నేపాల్ రాజధాని కఠ్మాండుతో అనుసంధానించే రైల్వే లైన్ నిర్మాణానికి భారత్, నేపాల్ మధ్య ఒప్పందం కుదిరింది. నేపాల్ రాజధాని కఠ్మాండులో ఆగస్టు 30-31 వరకు జరిగిన 4వ బిమ్ స్టెక్ (BIMSTEC) సమావేశంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ… అనంతరం నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇందులో భాగంగా రాక్సౌల్, కఠ్మాండు మధ్య రైల్వే లైన్ నిర్మాణంపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఏడాదిలోనే భారత్, నేపాల్ మధ్య ట్రాన్సిట్ ట్రీటీ కూడా కుదిరింది.
☛ నేపాల్ – భారత్ మైత్రి భవన్ ప్రారంభం
నేపాల్ రాజధాని కఠ్మాండులోని పశుపతినాథ్ శివాలయంలో భారత ఆర్థిక సహాయంతో నిర్మించిన 400 పడకల భక్తుల వసతి కేంద్రాన్ని నేపాల్ ప్రధానితో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆసియాలోని నాలుగు ప్రముఖ శైవ క్షేత్రాల్లో పుశుపతినాథ్ ఆలయం ఒకటి.
☛ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభం
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(IPPB)ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 1న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఐపీపీబీ సేవలు తొలుత 650 తపాలా శాఖలు, 3,250 యాక్సెస్ పాయింట్లలో ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 1.55 లక్షల పోస్టాఫీసులకు ఈ సేవలను విస్తరిస్తామని మోదీ ప్రకటించారు.
ఇవీ విశేషాలు
-
ఐపీపీబీలో రూ.లక్షకు మించి డిపాజిట్లు ఉంటే అవి పొదుపు ఖాతాలుగా మారిపోతాయి. ఆధార్, వేలిముద్రలతో ఒక్క నిమిషంలోనే ఐపీపీబీలో ఖాతా తెరవచ్చు.
-
ఐపీపీబీలో ముందస్తు రుణాలు(అడ్వాన్సడ్ లోన్స), క్రెడిట్ కార్డుల వంటి సేవలు అందుబాటులో ఉండవు.
- డిపాజిట్లపై 4 శాతం వడ్డీ చెల్లిస్తారు.
- రుణాలు, బీమా వంటి థర్డ్‌పార్టీ సేవలందించేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్, బజాజ్ అలియాన్‌జ జీవిత బీమా కంపెనీతో ఐపీపీబీ ఒప్పందం కుదుర్చుకుంది.
☛ ఓబీసీ జనాభా లెక్కల సేకరణ
స్వాతంత్య్రం తర్వాత దేశంలో జన గణనలో భాగంగా తొలిసారి ఇతర వెనుకబడిన వర్గాల(ఓబీసీ) జనాభా లెక్కలను సేకరించనున్నారు. ఈ మేరకు 2021లో చేపట్టే జనగణనలో ఓబీసీల లెక్కలను సేకరించాలని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 31న నిర్ణయించింది. అలాగే జనగణన తుది నివేదిక వెల్లడించే సమయాన్ని ఏడేళ్ల నుంచి మూడేళ్లకి తగ్గించింది. 2006లో జాతీయ నమూనా సర్వే సంస్థ నివేదిక ప్రకారం దేశ జనాభాలో ఓబీసీలు సుమారు 41 శాతం వరకుఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. జనగణన కోసం సుమారు 25 లక్షల మంది ఎన్యూమరేటర్లకు శిక్షణ ఇస్తున్నారు.
☛ యువతను వ్యవసాయం వైపు ఆకర్షించేందుకు ఆర్య పథకం
యువతను వ్యవసాయం వైపు ఆకర్షించడం (ఎట్రాక్టింగ్ అండ్ రిటైనింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్–ఆర్య) పథకాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి 100 జిల్లాల్లో అమలు చేయాలని కేంద్ర వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఈ పథకం అమలుకు అన్ని రాష్ట్రాల వ్యవసాయశాఖలకు సూచనలిచ్చింది.
- దేశవ్యాప్తంగా ఉన్న 669 కృషి విజ్ఞాన కేంద్రాల్లో(KVK) 100 కేవీకేలను ఇందుకోసం ఎంపిక చేయాలని ఆదేశించింది.
- ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 జిల్లా కేవీకేల్లో ఈ పథకం అమలువుతోంది.
- తెలంగాణలోని నల్గొండ జిల్లా కంపాసాగర్‌లో గల ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన కేంద్రం నిర్వహిస్తున్న KVKలో ఆర్య కార్యక్రమం ప్రయోగాత్మక అమల్లో ఉంది.
- దేశంలో పంట ఉత్పాదకత, దిగుబడులు పెరగాలంటే ఆర్య పథకం కీలకం అని కేంద్రం గట్టిగా భావిస్తోంది. యువతను సేద్యం వైపు ఆకర్షించేలా చేయడం ద్వారా కొత్త ప్రయోగాలకు చేయూతనిచ్చినట్లవుతుందని గట్టిగా విశ్వసిస్తోంది.
- మరోవైపు ఇప్పటికే గ్రామాల్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ఉన్న యువ రైతులను ఎంపిక చేసి ఆధునాతన పరిజ్ఞానం వినియోగం, మార్కెటింగ్ అవకాశాలను పెంచుకునే నైపుణ్య శిక్షణ కేవీకేల ద్వారా ఇవ్వాలని ఆలోచిస్తోంది.
☛ అక్టోబర్ 2 నుంచి నల్సా పరిహార పథకం అమలు
అత్యాచారాలు, దాడులకు గురైన మహిళలకు న్యాయం చేయడానికి జాతీయ న్యాయ సేవల సంస్థ (నల్సా) రూపొందించిన ‘పరిహార పథకం’ అక్టోబర్ 2 నుంచి అమల్లోకి రానుంది. కేంద్ర ప్రభుత్వ నూతన చట్ట నిబంధనలు కార్యరూపం దాల్చే వరకు పరిహార పథకంలోని అంశాలను ప్రత్యేక న్యాయస్థానాలు పరిగణనలో తీసుకోవాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 5న ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు లైంగిక దాడికి గురైన మైనర్ బాధితులకు రూ. 4 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు పరిహారం అందుతుంది. లైంగిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధితులు, సామూహిక లైంగిక దాడికి గురైన బాధితుల కుటుంబాలు రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు పరిహారం పొందుతాయి. యాసిడ్ దాడికి గురైన మహిళలకు రూ.3 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు పరిహారంగా అందుతాయి. ప్రభుత్వం పోక్సో చట్టంను సవరించే వరకు మైనర్ బాధితులు ఈ పరిహారం పొందేందుకు అర్హులని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
☛ స్వలింగ సంపర్కం నేరం కాదు : సుప్రీంకోర్టు
అంగీకారంతో ఇద్దరు మేజర్లు మధ్య జరిగే స్వలింగ సంపర్కం లేదా స్త్రీ–పురుషుల మధ్య ప్రైవేటుగా జరిగే లైంగిక చర్య నేరం కాదని పేర్కొంటూ సెప్టెంబర్ 6న దేశ అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ మేరకు ఐపీసీ సెక్షన్ 377లోని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం వెల్లడించింది.
తీర్పులోని ముఖ్యాంశాలు
-
జంతువులు, చిన్న పిల్లలు, మైనర్లతో, అలాగే మేజర్లతోనూ పరస్పర అంగీకారం లేకుండా జరిగే లైంగిక కేసుల విషయంలో 377 సెక్షన్‌లోని నిబంధనలు కొనసాగుతాయని కోర్టు పేర్కొంది.
-
సమాజంలో LGBTQ (లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్, క్వీర్)లు దేశంలోని మిగిలిన పౌరుల్లాగే అన్ని రాజ్యాంగబద్ధమైన హక్కులను పొందవచ్చని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.
-
నవ్‌తేజ్ జౌహార్, జర్నలిస్ట్ సునీల్ మెహ్రా, చెఫ్ రితూ దాల్మియా, హోటల్ యజమానులు అమన్నాథ్, కేశవ్ సూరీ, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ అయేషా కపూర్ సహా 20 మంది ఐఐటీ విద్యార్థులు వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ చారిత్రక తీర్పునిచ్చింది.
-
ఈ తీర్పుతో స్వలింగ సంపర్కాన్నీ చట్టబద్ధం చేసిన 26వ దేశంగా భారత్ నిలిచింది.
సెక్షన్ 377 ఏం చెబుతోంది ?
-
377వ సెక్షన్ భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) లోని 16వ అధ్యాయంలో ఉంది. దీన్ని 1838లో థామస్ మెకాలే రూపొందించారు. 1861లో అమల్లోకి వచ్చింది. బ్రిటిష్ సొడొమీ చట్టం(బగ్గరీయాక్ట్ 1533) ఆధారంగా ఇది రూపొందింది. ఈ చట్టం ప్రకారం సహజ విరుద్ధంగా జరిగే ఎలాంటి శృంగారమైనా నేరం. దీన్ని ఉల్లంఘించిన వారికి గరిష్టంగా జీవిత ఖైదు, కనీసం పదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించేందుకు సెక్షన్ 377 వీలు కల్పించింది.
☛ ఢిల్లీలో ప్రపంచ రవాణా సదస్సు – 2018
తొలి గ్లోబల్ మొబిలిటీ సమ్మిట్(ప్రపంచ రవాణా సదస్సు) – MOVE, సెప్టెంబర్ 7, 8 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగింది. ఈ సదస్సుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం ప్రసంగిస్తు.. మెరుగైన రవాణాతో ఆర్థిక వ్యవస్థ వృద్ధి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. 5 ఏళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు 15 శాతానికి చేరుకుంటాయని అంచనా వేశారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆటోమోబైల్ సంస్థల సీఈవోలు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.
-
తొలి గ్లోబల్ గ్లోబల్ మొబిలిటీ సమ్మిట్ ను నీతి ఆయోగ్ నిర్వహించింది.
☛ “సేఫ్ సిటీ” నగరాలకు రూ.2,919 కోట్ల నిధులు
దేశంలోని 8 ప్రధాన నగరాల్లో మహిళలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించేందుకు సేఫ్ సిటీ ప్రాజెక్టుని చేపట్టిన కేంద్రం… ప్రాజెక్టు అమలు కోసం రూ.2,919.55 కోట్ల నిర్భయ నిధులు కేటాయించింది. ఈ జాబితాలో ఉన్న నగరాలు… హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, లఖ్ నవూ.
-
ఈ మొత్తం నిధుల్లో హైదరాబాద్ నగరానికి రూ. 282 కోట్లు కేటాయించారు.
-
ప్రాజెక్టులో భాగంగా ఆయా నగరాల్లో తరచూ నేరాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, క్రైం మ్యాపింగ్ చేస్తారు. ఆ ప్రాంతాల్లో నిరంతర పెట్రోలింగ్, మఫ్తీ బృందాలు, షీటీంలు తిరుగుతుంటాయి. క్విక్ రెస్పాన్స్ టీంలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి.
-
ఆయా ప్రాంతాల్లో పానిక్ బటన్ లు ఏర్పాటు చేస్తారు. వాటిని మహిళలు నొక్కగానే.. రెప్సాన్స్ బృందాలు తక్షణం అక్కడికి చేరుకుంటాయి.
☛ PM-AASHA కు కేంద్ర కేబినెట్ ఆమోదం
2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంలో భాగంగా ప్రధాన మంత్రి – అన్నదాత ఆయ్ (ఆదాయ) సంరక్షణ అభియాన్ – PM AASHA పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 12న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్.. ఈ మేరకు పథకానికి అంగీకార ముద్ర వేసింది.
-
పీఎం ఆశ పథకాన్ని అమలు చేసేందుకు వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాలకు రూ. 15 వేల కోట్లను కేంద్రం మంజూరు చేసింది.
-
ఈ ఏడాది కేంద్రం ఉత్పత్తి వ్యయంలో 1.5 రెట్లు ప్రాతిపదికన కనీస మద్దతు ధర నిర్ణయించింది.
-
మద్దతు ధర కోసం ప్రస్తుతం… ధర మద్దతు పథకం (PSS), ధర లోటు చెల్లింపు పథకం(PDPS), ప్రైవేటు ప్రొక్యూర్ మెంట్ మరియు స్టాకిస్ట్ పథకం(PPS) అమల్లో ఉన్నాయి.
-
ఈ పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకి తెస్తూ కేంద్రం రూపొందించిందే.. పీఎం ఆశ పథకం.
☛ ఆశా, అంగన్ వాడీలకు మోదీ వేతన కానుక
ఆశా, అంగన్ వాడీ కార్యకర్తల గౌరవ వేతనాలు పెంచుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సెప్టెంబర్ 11న ఆశా, ఏఎన్ఎం, అంగన్ వాడీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
-
ప్రస్తుతం రూ.3వేల గౌరవ వేతనం పొందుతున్న వారికి తాజా పెంపుతో ఇకపై రూ.4,500 వేతనం అందుతుంది.
-
రూ.2,200 పొందుతున్న వారికి వేతనం రూ.3,500 లభిస్తుంది.
-
అంగన్ వాడీల సహాయ గౌరవ వేతనాన్ని రూ.1,500 నుంచి రూ.2,500 కు పెంచారు.
☛ ఆయుష్మాన్ భారత్ తొలి లబ్ధిదారు కరిష్మ
సెప్టెంబర్ 23 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినున్న ప్రతిష్టాత్మక పథకం ఆయుష్మాన్ భారత్ తొలి లబ్ధిదారు పేరుని ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 11న వెల్లడించారు. ఆశా, ఏఎన్ఎం, అంగన్ వాడీ కార్యకర్తలతో మాట్లాడుతూ.. హరియాణాలోని కర్నాల్ జిల్లాలో ఇటీవల జన్మించిన కరిష్మ అనే చిన్నారి ఈ పథకంలో తొలి లబ్ధిదారు అని వెల్లడించారు. జార్ఖండ్ లో ప్రధాని మోదీ సెప్టెంబర్ 23న ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు.
☛ మానవాభివృద్ధి సూచీలో భారత్ కు 130వ స్థానం
ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం(USDP) సెప్టెంబర్ 14న విడుదల చేసిన మానవ అభివృద్ధి సూచీ– 2018లో భారత్ 130వ స్థానంలో నిలిచింది. 189 దేశాల ర్యాంకింగ్స్ తో యూఎస్ డీపీ ఈ జాబితాను విడుదల చేసింది.
-
ఈ ర్యాంకింగ్స్ లో తొలి స్థానంలో నార్వే, 2వ స్థానంలో స్విట్జర్లాండ్, 3వ స్థానంలో ఆస్ట్రేలియా, 4వ స్థానంలో ఐర్లాండ్, 5వ స్థానంలో జర్మనీ నిలిచాయి.
-
తాజా ర్యాంకింగ్స్ లో బంగ్లాదేశ్ 136వ స్థానంలో, పాకిస్తాన్ 150వ స్థానంలో నిలిచాయి.
-
2017 ర్యాంకింగ్స్ లో భారత్ కు 131వ స్థానం దక్కింది.
☛ స్వచ్ఛతా హై సేవా కార్యక్రమం ప్రారంభం
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 15న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రధాని మోదీ దేశ రాజధాని ఢిల్లీలోని పహాడ్ గంజ్ లో ఉన్న అంబేడ్కర్ మాధ్యమిక పాఠశాలలో చీపురి పట్టుకొని ఆవరణను శుభ్రం చేశారు. అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మహాత్ముడికి నివాళులర్పించడానికి చేపట్టిన అద్భుత కార్యక్రమమిదని మోడీ ట్వీట్ చేశారు.
☛ భారత్ – బంగ్లాదేశ్ పైప్ లైన్ నిర్మాణం ప్రారంభం
భారత్ – బంగ్లాదేశ్ మధ్య పైప్ లైన్ నిర్మాణ పనులు సెప్టెంబర్ 18న ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరు దేశాల మధ్య నిర్మించనున్న 130 కిలో మీటర్ల ఫ్రెండ్ షిప్ పైప్ లైన్ నిర్మాణ పనులని ప్రారంభించారు.
-
ఈ పైప్ లైన్ ద్వారా భారత్ నుంచి బంగ్లాకు ఆయిల్ ను సరఫరా చేస్తారు. ఏడాదికి 10 లక్షల మెట్రిక్ టన్నుల ఆయిల్ ను సరఫరా చేసే సామర్థ్యం ఉంటుంది.
-
పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి, బంగ్లాదేశ్ లోని దినాజ్ పూర్ జిల్లాలోని పర్సతిపూర్ ను ఈ పైప్ లైన్ అనుసంధానం చేస్తుంది.
☛ 5 రాష్ట్రాల్లో 33.5 మిలియన్ డాలర్లతో వ్యవసాయ పథకం
జీవవైవిధ్యం, అటవీ భూములను రక్షించడం ద్వారా వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే లక్ష్యంతో… కేంద్ర వ్యవసాయ శాఖ, ఐరాస అనుబంధ సంస్థ FAO 5 రాష్ట్రాల్లో వ్యవసాయ పథకాన్ని ప్రారంభించాయి. మధ్యప్రదేశ్, మిజోరం, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నాయి.
-
పథకం అమలు కోసం 33.5 మిలియన్ డాలర్ల నిధులను గ్లోబల్ ఎన్విరాన్ మెంట్ ఫెసిలిటీ(GEF) గ్రాంట్ గా ఇచ్చేందుకు అంగీకరించింది. GEF ను 1992లో రియో ఎర్త్ సమ్మిట్ లో ఏర్పాటు చేశారు. పర్యావరణానికి మేలు చేసే ప్రాజెక్టుల అమలు కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ సంస్థ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.
-
FAO – Food and Agriculture Organisation
☛ “ట్రిపుల్ తలాక్” ను నిషేధిస్తూ ఆర్డినెన్స్
ట్రిపుల్ తలాక్ ను నిషేధిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్ కు కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 19న ఆమెదం తెలిపింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దీనిపై సంతకం చేయటంతో వెంటనే ఆర్డినెన్స్ జారీ అయ్యింది. దీని ప్రకారం ముస్లింలకు తక్షణ విడాకులు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి పాల్పడే భర్తకు 3 ఏళ్ల వరకు జైలు శిక్షను ప్రతిపాదించారు. 2017 ఆగస్టు 22న సుప్రీం కోర్టు ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది.
-
సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కేంద్రం ట్రిపుల్ తలాక్ బిల్లుని తీసుకొచ్చింది. ఇది లోక్ సభ ఆమోదం పొంది.. రాజ్యసభలో పెండింగ్ లో ఉంది.
-
తక్షణ ట్రిపుల్ తలాక్ ను భారత్ సహా 22 దేశాలు నిషేధించాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్గనిస్తాన్ లో కూడా ట్రిపుల్ తలాక్ పై నిషేధం ఉంది. పాకిస్తాన్ లో 1961లో చేసిన చట్టం ద్వారా ట్రిపుల్ తలాక్ ను నిషేధించారు.
-
భారత్ లో ట్రిపుల్ తలాక్ నిషేధం కోసం షయారా బానో 2015లో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇష్రత్ జహాన్, ఆప్రీన్ రెహ్మాన్, ఫరా ఫైజ్, అతియా సాబ్రీ, గుల్షన్ పర్వీన్ కూడా ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా పోరాడారు.
☛ “స్వయం ప్రభ” ఫోన్ లో ద్వారా జేఈఈ, నీట్ పాఠాలు
జేఈఈ మెయిన్, అడ్వాన్స్ డ్, నీట్ పాఠ్యాంశాలతో ఐఐటీ ఆచార్యులు రూపొందించిన పాఠాలను నేరుగా విద్యార్థులకు అందించేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ “స్వయం ప్రభ” పేరుతో కొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఐటీ ఢిల్లీ నేతృత్వంలో 600 పాఠాలు తయారు చేశారు. వాటిని యాప్ లో పొందుపరిచారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ ను ఉచితంగా డౌన్ లోడు చేసుకోవచ్చు.
-
స్వయం ప్రభ పేరిట 2017లో కేంద్ర ప్రభుత్వం కొన్ని ఛానెళ్లను ప్రారంభించింది. ఇటీవల స్మార్ట్ ఫోన్ ల వాడకం పెరగటంతో.. యాప్ ను అందుబాటులోకి తెచ్చింది.
-
పోటీ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం నెలకొల్పిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెబ్ సైట్ WWW.NTA.AC.IN లోను పాఠాలు అందుబాటులో ఉన్నాయి.
☛ భారత్, రష్యా వాయుసేన విన్యాసాలు AVIAINDRA – 2018 ప్రారంభం
AVIAINDRA – 2018 పేరుతో భారత్, రష్యా వాయుసేన విన్యాసాలు సెప్టెంబర్ 17న ప్రారంభమయ్యాయి. రష్యాలోని లిపెట్స్ క్ లో జరుగుతున్న ఈ విన్యాసాలు సెప్టెంబర్ 28 వరకు కొనసాగుతాయి. రెండో విడత విన్యాసాలు 2018 డిసెంబర్ 10 నుంచి 22 వరకు రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో జరుగుతాయి.
-
AVIAINDRA పేరుతో భారత్, రష్యా వైమానిక సంయుక్త విన్యాసాలు తొలిసారి 2014లో జరిగాయి. అప్పటి నుంచి ఏటా రెండు సార్లు ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నారు.
☛ లైంగిక వేధింపులపై ఫిర్యాదుకు పోర్టల్ ప్రారంభం
చైల్డ్ పోర్నోగ్రఫీ, ఆన్ లైన్ లో లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్ సైట్ ద్వారా వేదిక కల్పించింది. cybercrime.gov.in పేరుతో పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. సెప్టెంబర్ 20న ఈ పోర్టల్ ను ప్రారంభించారు.
-
చైల్డ్ పోర్నోగ్రఫీ, ఆన్ లైన్ లో లైంగిక వేధింపులపై ఎవరైనా పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసే వారు తమ వివరాలు సమర్పించాల్సిన అవసరం లేదు. ఒక వేళ వెల్లడించినా.. వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు.
☛ లైంగిక నేరస్తుల రిజిస్టర్ – NRSO ప్రారంభం
మహిళలు, చిన్నారులపై లైంగిక నేరాలను అరికట్టడంతో పాటు ఈ కేసుల్లో విచారణ వేగాన్ని పెంచేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం లైంగిక నేరస్తుల జాతీయ రిజిస్టర్ (National Registry of Sexual Offenders – NRSO)ను ప్రారంభించింది. కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ సెప్టెంబర్ 21న న్యూఢిల్లీలో దీన్ని ప్రారంభించారు.
-
ఎన్ఆర్ఎస్ఓలో భాగంగా నేరస్తుల పేర్లు, చిరునామా, వేలిముద్రలు సహా ప్రతి అంశాన్ని రిజిస్టర్ లో పొందుపరుస్తారు.
-
ఇందులో భాగంగా జాతీయ నేర గణాంకాల సంస్థ(National Crime Records Bureau – NCRB) దేశవ్యాప్తంగా జైలల్లో ఉన్న నేరస్తుల వివరాలు సేకరించింది.
-
2005 నుంచి నేరాలకు పాల్పడిన 4.40 లక్షల మంది నేరస్తుల వివరాలతో ఎన్ఆర్ఎస్ఓను ప్రారంభించారు. త్వరలో బాల నేరస్తులను కూడా ఇందులో చేరుస్తారు.
-
NCRB ని 1986 మార్చి 11న ఏర్పాటు చేశారు. కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉంది.
-
NCRB ప్రస్తుత డైరెక్టర్ – డాక్టర్ ఐష్ కుమార్, ఐపీఎస్
☛ యూఎన్ సోలార్ ప్రాజెక్టుకి భారత్ 1 మిలియన్ డాలర్లు
ఐక్యరాజ్య సమితి సోలార్ ప్రాజెక్టుకి భారత్ 1 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. న్యూయార్క్ లోని UN ప్రధాన కార్యాలయం ఆవరణపై సోలార్ ప్యానాళ్ల ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టే.. UN Solar Project.
-
2018 జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన సమావేశంలో… ఐరాస బిల్డింగ్ పై సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గ్యుటెరస్.. ప్రపంచ దేశాల ఆర్థిక సహాయాన్ని కోరారు.
-
ఈ ప్రాజెక్టు కోసం ఆర్థిక సాయాన్ని ప్రకటించిన తొలి దేశం భారత్
☛ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భారత్ పురోగతి
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భారత్ 2017లో గణనీయమైన పురోగతి సాధించిందని.. “ చైల్డ్ లేబర్ అండ్ ఫోర్స్ డ్ లేబర్” పేరుతో అమెరికా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడంలో గతేడాది 132 దేశాలు తీసుకున్న చర్యలను అధ్యయనం చేసిన తర్వాత.. కేవలం 14 దేశాలు ఈ అంశంలో పురోగతి సాధించాయని నివేదిక స్పష్టం చేసింది. ఈ 14 దేశాల్లో భారత్ ఒకటని వెల్లడించింది. భారత్ తో పాటు కొలంబియా, పరాగ్వే దేశాలు నివేదిక ప్రమాణాలను అందుకున్నాయి.
-
International Labour Organisation రూపొందించిన 182, 138 ఒడంబడికలపై భారత్ సంతకం చేసింది. అలాగే దీనికి అనుగుణంగా బాల కార్మిక నిర్మూలన చట్టంలో మార్పులు చేసి… 18 ఏళ్లకు తక్కువ ఉన్న పిల్లలతో పని చేయించడం నేరం కిందకి వస్తుందని పేర్కొంది.
-
International Labour Organisation ను 1919 ను ఏర్పాటు చేశారు. కేంద్ర కార్యాలయం స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉంది.
☛ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ప్రారంభం
కేంద్ర ప్రభుత్వం 2018-19 బడ్జెట్ లో ప్రకటించిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 23న జార్ఖండ్ లోని రాంచీలో అధికారికంగా ప్రారంభించారు. ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన – PM JAY పేరుతో పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దేశంలోని పేదలకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పించడం ఈ పథకం ఉద్దేశం
-
ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ప్రాయోజిత ఆరోగ్య బీమా పథకం
-
పథకం ద్వారా దేశంలోని 10 కోట్ల కుటుంబాల్లోని దాదాపు 50 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం ప్రకటించింది.
-
తాజా సామాజిక, ఆర్థిక కుల గణన (SECC) సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 8.03 కోట్ల కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో 2.33 కోట్ల కుటుంబాలు ఈ పథకాన్ని పొందవచ్చు.
-
పథకంలో నమోదు కోసం ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.
-
రాష్ట్రాల వద్ద ఉన్న దారిద్ర్య రేఖకు దిగవునున్న వారి వివరాలను నేరుగా పథకంలో చేరుస్తారు.
-
దేశవ్యాప్తంగా 445 జిల్లాల్లో ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభమైంది.
-
గుండె సర్జరీ, మూత్రపిండాలు, లివర్ సమస్యలు, మోకాలి చిప్ప మార్పిడి, షుగర్ తదితర 1300కు పైగా వ్యాధులకు ఈ బీమా వర్తిస్తుంది.
-
తెలంగాణ, ఒడిశా, ఢిల్లీ, కేరళ, పంజాబ్ మినహా… మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు… ఈ పథకంలో చేరాయి.
-
పథకం అమలుకు కేంద్రం 60 శాతం నిధులను అందిస్తుంది. మిగతా 40 శాతం ఆయా రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది.
-
71వ జాతీయ సాంపిల్ సర్వే ఆర్గనైజేషన్(NSSO) ప్రకారం.. 85.9 శాతం గ్రామీణ కుటుంబాలు, 82 శాతం పట్టణ కుటుంబాలకు ఆరోగ్య బీమా లేదు.
-
ఆయుష్మాన్ భారత్ CEO – ఇందూ భాషణ్
☛ 5జీ సేవల కోసం జపాన్ సంస్థలతో బీఎస్ఎన్ఎల్ ఒప్పందం
భారత్ లో 5జీ సేవలను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ – BSNL కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా బీఎస్ఎన్ఎల్.. జపాన్ కు చెందిన సాఫ్ట్ బ్యాంక్, ఎన్ టీటీ కమ్యూనికేషన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా చొరవతో ఈ ఒప్పందం జరిగినట్లు బీఎస్ఎన్ఎల్ అధికారులు సెప్టెంబర్ 22న వెల్లడించారు.
☛ డీబీహెచ్ఎస్ వందేళ్ల వేడుకలను ప్రారంభించిన రాష్ట్రపతి
దక్షిణ భారత హిందీ మహాసభ(DBHS) వందేళ్ల వేడుకలను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సెప్టెంబర్ 22న న్యూఢిల్లీలో ప్రారంభించారు. డీబీహెచ్ఎస్ విద్యాలయం కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లతో స్వతంత్ర హోదాలో పనిచేస్తోన్న సంస్థ.
-
దక్షిణ భారతంలో హిందీ భాషా అభివృద్ధి కోసం 1918లో దక్షిణ భారత హిందీ మహాసభను ఏర్పాటు చేశారు.
-
తద్వారా దక్షిణ, ఉత్తర భారత అనుసంధానానికి ఉన్న భాషా బేధాన్ని తొలగించాలన్నది లక్ష్యం.
-
డీబీహెచ్ఎస్ కేంద్ర కార్యాలయం తమిళనాడులోని చెన్నైలో ఉంది.
-
మహాత్మా గాంధీ సహకారంతో అన్నీ బీసెంట్ ఈ సంస్థను నెలకొల్పారు.
-
గాంధీజీ ఈ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించారు.
-
1964లో కేంద్ర ప్రభుత్వం డీబీహెచ్ఎస్ ను జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా గుర్తించింది.
☛ ఒడిశాలో ఝార్సుగూడా ఎయిర్ పోర్టుని ప్రారంభించిన ప్రధాని
ఒడిశాలోని ఝార్సుగూడాలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సెప్టంబర్ 23న ప్రారంభించారు. ప్రాంతీయ అనుసంధాన పథకం(Regional Connectivity Scheme – RCN) UDAN( Ude Deshk Ka Aaam Naagrik) లో భాగంగా నిర్మించిన తొలి ఎయిర్ పోర్టు ఇది.
-
ఈ విమానాశ్రయం ద్వారా ఒడిశాలోని భువనేశ్వర్, రాయ్ పూర్, రాంచీ నగరాలతో ప్రాంతీయ అనుసంధానం ఏర్పడుతుంది.
-
ఒడిశాలోని మరో మూడు నగరాలు.. జైపూర్ (కొరాపుట్ జిల్లా), రూర్ కేలా(సుందర్ ఘర్ జిల్లా), ఉట్కేలా(కాలాహండి జిల్లా) లో విమానాశ్రయాలు నిర్మాణంలో ఉన్నాయి.
☛ దేశంలో జడ్జీలు – ప్రజల నిష్పత్తి 10 లక్షలు : 19.49
భారత్ లో ప్రతి పది లక్షల మందికి దాదాపు 19 మంది చొప్పున న్యాయమూర్తులు ఉన్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం దేశంలోని కింది స్థాయి కోర్టులతో కలిపి మొత్తం 6 వేల మంది న్యాయమూర్తుల కొరత ఉంది. పార్లమెంటులో చర్చ కోసం కేంద్ర న్యాయశాఖ 2018 మార్చిలో ఈ నివేదికను రూపొందించింది.
☛ సిక్కింలో తొలి విమానాశ్రయం ప్రారంభం
సిక్కింలో రాష్ట్రంలోని పాక్ యాంగ్ నగరంలో నిర్మించిన ఆ రాష్ట్ర తొలి ఎయిర్ పోర్టుని ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 24న ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 2014 వరకు దేశంలో 65 విమానాశ్రయాలు ఉన్నాయని.. గత నాలుగేళ్లలో తమ ప్రభుత్వం కొత్తగా 35 ఎయిర్ పోర్టులని నిర్మించిందని… దీంతో పాక్ యాంగ్ ఎయిర్ పోర్ట్ దేశంలోని 100వ ఎయిర్ పోర్టుగా నిలిచిందని ప్రధాని వివరించారు.
-
పాక్ యాంగ్ పట్టణంలో సముద్ర మట్టానికి 4,500 అడుగుల ఎత్తులో కొండలపై ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుని నిర్మించారు.
-
ఎయిర్ పోర్టు 201 ఎకరాల్లో విస్తరించి ఉంది.
-
కొత్తగా ఓ ప్రాంతంలో పూర్తిస్థాయిలో నిర్మించే ఎయిర్ పోర్టుని గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయంగా పిలుస్తారు.
☛ ఢిల్లీలో WAYU పరికరాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి హర్షవర్దన్
గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు ఉద్దేశించిన WAYU(Wind Augmentation Purifying Unit) పరికరాన్ని న్యూఢిల్లీలోని ముకర్బా చౌక్ వద్ద సెప్టెంబర్ 25న కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్దన్ ఆవిష్కరించారు.
-
Council of Scientific and Industrial Research – National Environmental Engineering Research Institute (CSIR-NEERI) రూపొందించిన ఈ పరికరం గాలిలో కాలుష్య కారకాలను పీల్చుకొని స్వచ్ఛమైన గాలిని విడుదల చేస్తుంది.
-
500 చదరపు మీటర్లు పరిధిలో గాలిని పీల్చుకుంటుంది.
-
సగం యూనిట్ విద్యుత్ తో ఈ పరికరం 10 గంటలు పనిచేస్తుంది.
-
దీనికి నెల రోజుల నిర్వహణ వ్యయం కేవలం రూ.1500
☛ ఆధార్ చట్టబద్ధతపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు
ఆధార్ రాజ్యాంగ బద్ధమే అని పేర్కొంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సెప్టెంబర్ 26న చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. దీని ద్వారా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందన్న వాదనలో వాస్తవం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు 12 సంకెల ఆధార్ నంబర్ ను కొన్ని సేవలకు మాత్రమే తప్పనిసరి చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4:1 తో 1,442 పేజీల కీలక తీర్పు వెలువరించింది. ధర్మాసనంలో ఇదర సభ్యులు జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఖన్విల్కర్.
తీర్పులోని ముఖ్యాంశాలు
-
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి
-
ఆదాయ పన్ను దాఖలు, పాన్ నెంబర్ కు ఆధార్ తప్పనిసరి
-
ప్రభుత్వం నుంచి రాయితీ పొందే పథకాలకు ఆధార్ తప్పనిసరి
-
బ్యాంకు ఖాతా తెరవడానికి ఆధార్ అవసరం లేదు
-
టెలికం సంస్థలకు ఆధార్ వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సిమ్ కార్డు పొందడానికి కూడా అవసరం లేదు
-
విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఆధార్ అవసరం లేదు
-
సీబీఎస్ఈ, యూజీసీ, నీట్ వంటి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఆధార్ వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు
ఆధార్ గురించి మరింత సమాచారం
-
ఆధార్ ను 2009లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది
-
2010 సెప్టెంబర్ లో తొలి ఆధార్ నెంబర్ కేటాయించారు
-
2010 డిసెంబర్ లో ఆధార్ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టారు
-
2016 సెప్టంబర్ లో అమల్లోకి వచ్చిన ఆధార్ చట్టం
☛ NDCC కి కేంద్ర కేబినెట్ ఆమోదం
National Digital Communications Policy – 2018(NDCC) కి కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 26న ఆమోదం తెలిపింది. 2022 నాటికి దేశీయ టెలికం రంగంలో 10 వేల కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఈ రంగంలో 40 లక్షల ఉద్యోగాల కల్పన ఈ పాలసీ ముఖ్య లక్ష్యం. కొత్త పాలసీతో స్థూల దేశీయ ఉత్పత్తి(జీడీపీ)లో టెలికం రంగం వాటా ప్రస్తుతం ఉన్న 6 శాతం నుంచి 8 శాతానికి పెరుగుతుందని కేంద్ర టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు.
☛ రాజ్యాంగ ప్రాధాన్యమున్న కేసుల విచారణ లైవ్
కోర్టు విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలన్న ప్రతిపాదనకు సుప్రీం కోర్టు సెప్టెంబర్ 26న అంగీకారం తెలిపింది. పైలెట్ ప్రాజెక్టుగా మొదట సుప్రీంకోర్టులో రాజ్యాంగ ప్రాధాన్యమున్న కేసులను మాత్రమే లైవ్ ఇస్తారని వెల్లడించింది. ఈ మేరకు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేసిన తర్వాత అన్ని కేసులకు లైవ్ అనుమతిస్తామని కోర్టు స్పష్టం చేసింది.
☛ ఇస్మాయిల్ ఫారుఖీ తీర్పుని సమర్థించిన సుప్రీంకోర్టు
ఆయోధ్య రామమందిరం కేసు విషయంలో 1994 నాటి ఇస్మాయిల్ ఫారుఖీ తీర్పుని సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ కేసుని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసేందుకు నిరాకరిస్తూ సెప్టెంబర్ 27న చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం 2 : 1 తేడాతో తీర్పు వెల్లడించింది.
-
ఇస్లాం ప్రకారం ప్రార్థనలు చేసేందుకు మసీదు తప్పనిసరి కాదని 1994లో ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పుని పునర్ సమీక్షించాలంటూ ఎం సిద్ధిఖీ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఇందుకు నిరాకరించింది.
☛ ఐపీసీ సెక్షన్ 497ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
వివాహేతర సంబంధం నేరం కాదని పేర్కొంటు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సెప్టెంబర్ 27న సంచలన తీర్పు వెలువరించింది. ఈ అంశాన్ని నేరంగా పరిగణిస్తున్న ఇండియన్ పీనల్ కోడ్(భారతీయ శిక్షా స్మృతి) సెక్షన్ 497ను కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకాభిప్రాయంతో తీర్పు ఇచ్చింది. రాజ్యాంగ ధర్మాసనంలో ఇతర జడ్జిలు.. జస్టిస్ ఆరఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రా.
తీర్పులోని ముఖ్యాంశాలు
-
ఇష్టపూర్వక శృంగారం మహిళ హక్కు అని, ఈ విషయంలో మహిళకు షరతులు పెట్టలేమని కోర్టు వ్యాఖ్యానించింది. సెక్షన్ 497దీనికి విరుద్ధంగా ఉందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ.. కొట్టివేసింది. వివాహానికి వ్యతిరేకంగా నేరాభియోగాలకు సంబంధించిన క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ లోని 198 సెక్షన్ ను కొట్టివేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.
-
అయితే వివాహేతర సంబంధం నేరం కాకపోయినా.. నైతికంగా తప్పేనని, దీన్ని కారణంగా చూపి వివాహాన్ని రద్దుచేసుకోవచ్చని, విడాకులు కోరవచ్చని పేర్కొంది.
☛ జస్టిస్ రంజనా నేతృత్వంలో లోక్ పాల్ ఎంపిక కమిటీ
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యులతో లోక్ పాల్ ఎంపిక కమిటీని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 27న ఏర్పాటు చేసింది.
-
భారతీయ స్టేట్ బ్యాంక్ మాజీ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య,
-
ప్రసార భారతి చైర్మన్ సూర్య ప్రకాశ్,
-
ఇస్రో మాజీ చైర్మన్ కిరణ్ కుమార్,
-
అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సఖ రామ్ సింగ్ యాదవ్,
-
గుజరాత్ మాజీ డీజీపీ షబ్బీర్ హుస్సనే ఖండ్వాల,
-
రాజస్తాన్ కేడర్ కు చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి లలిత్ పన్వార్,
-
మాజీ సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ లు
ఎంపిక కమిటీలో సభ్యులుగా ఉంటారు.
☛ అవినీతి నిరోధకం కోసం నియమించనున్న లోక్ పాల్ కు చైర్ పర్సన్, ఇతర సభ్యులను ఈ కమిటీ ఎంపిక చేస్తుంది.
☛ లోక్ పాల్ మరియు లోకాయుక్త చట్టం 2013లో ఆమోదం పొందింది. లోక్ పాల్ చట్టం ప్రకారం విపక్ష నేత హోదా ఉన్న వారికి ఎంపిక సంఘంలో అవకాశం ఉంటుంది. లోక్ సభ బలంలో 10 శాతం స్థానాలు కానీ కనీసం 55 స్థానాలు కానీ వచ్చిన పార్టీ నేతకే విపక్ష నేత హోదా లభిస్తుంది. అయితే… 16వ లోక్ సభలో ఏకైక అతిపెద్ద విపక్ష పార్టీగా కాంగ్రెస్ నిలిచినప్పటికీ.. విపక్ష హోదా దక్కేందుకు కావాల్సిన స్థానాలు ఆ పార్టీకి రాలేదు. దీంతో… ఎంపిక సంఘం సమావేశాలకు కాంగ్రెస్ విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ను ప్రత్యేక ఆహ్వానితుడిగా మాత్రమే ఆహ్వానం అందుతోంది. దీంతో… ఖర్గే ఎంపిక సమావేశాలకు హాజరు కావడం లేదు. ఈ నేపథ్యంలోనే… ఆయన పేరు లేకుండానే కేంద్ర ప్రభుత్వం లోక్ పాల్ ఎంపిక కమిటీని ఏర్పాటు చేసింది.
☛ స్త్రీలకు శబరిమల ప్రవేశం కల్పించాలి: సుప్రీంకోర్టు
అన్ని వయసుల స్త్రీలకు శబరిమల ఆలయ ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 28న సంచలన తీర్పు ఇచ్చింది. రుతుస్రావాన్ని కారణంగా చూపుతూ ప్రస్తుతం 10 నుంచి 50 ఏళ్ల మహిళలను ఆలయంలోకి ప్రవేశకుండా నిషేధించడం రాజ్యాంగ విరుద్ధమని వెల్లడించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4: 1 తో తీర్పు వెల్లడించింది. భక్తిలో వివక్ష చూపలేమని పేర్కొంది.
తీర్పుకి అనుకూలం తీర్పుకి ప్రతికూలం
-
జస్టిస్ దీపక్ మిశ్రా జస్టిస్ ఇందు మల్హోత్రా
-
జస్టిస్ నారిమన్
-
జస్టిస్ ఏఎం ఖన్విల్కర్
☛ ఘనంగా పరాక్రమ్ పర్వ్
భారత్ సైన్యం పాకిస్తాన్ తో నియంత్రణ రేఖ వెంట ఆ దేశ సైనిక స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ ( మెరుపు దాడులు) ను విజయవంతంగా పూర్తి చేసి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు పరాక్రమ్ పర్వ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 28న రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో పరాక్రమ్ పర్వ్ ప్రదర్శనలో ప్రధాని నరేంద్ర మోదీ సైనిక వందనం స్వీకరించారు.
-
పరాక్రమ్ పర్వ్ లో భాగంగా సెప్టెంబర్ 28 – 30 వరకు న్యూఢిల్లీలోని రాజ్ పథ్ లాన్స్ లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.