Monthly Current Affairs – September – 2018 – International

సెప్టెంబర్ అంతర్జాతీయం

కఠ్మాండులో 4వ బిమ్స్ టెక్ సమావేశం

4వ బిమ్స్ టెక్ సమావేశం నేపాల్ రాజధాని కఠ్మాండులో ఆగస్టు 30 – 31 తేదీల్లో జరిగింది. ఈ సమావేశానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన మోదీ.. ఉగ్రవాదం, మాదక ద్రవ్యాలపై పోరులో బిమ్స్ టెక్ దేశాలు సహకరించుకోవాలని అన్నారు. సభ్య దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక, రవాణా, డిజిటల్ సంబంధాలను మెరుగుపరిచేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

 • బిమ్స్ టెక్ (బంగాళాఖాత దేశాల ఆర్థిక సహకార సంస్థ)లో భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయ్ లాండ్, భూటాన్, నేపాల్ సభ్య దేశాలుగా ఉన్నాయి.
 • ప్రపంచ జనాభాలో ఈ దేశాల మొత్తం వాటా 22 శాతంగా ఉంటుంది.
 • బిమ్స్ టెక్ దేశాల జీడీపీ 2.8 ట్రిలియన్ డాలర్లు.

లీడెన్ లో 4వ అంతర్జాతీయ ఆయుర్వేద కాంగ్రెస్

4వ అంతర్జాతీయ ఆయుర్వేద కాంగ్రెస్ నెదర్లాండ్స్ లోని లీడెన్ లో సెప్టెంబర్ 1,2 తేదీల్లో జరిగింది. భారత ఆయుష్ శాఖ మంత్రి శ్రీ పాద యశో నాయక్ ఈ సదస్సుని ప్రారంభించారు. నెదర్లాండ్స్ కు చెందిన అంతర్జాతీయ మహరిషి ఆయుర్వేద ఫౌండేషన్, భారత్ లోని న్యూఢిల్లీలో ఉన్న ఆల్ ఇండియా ఆయుర్వేదిక్ కాంగ్రెస్, పూణెలోని అంతర్జాతీయ అకాడమీ ఆఫ్ ఆయుర్వేదా సంయుక్తంగా ఈ కాంగ్రెస్ నిర్వహించాయి.

భారత్, సిప్రస్ మధ్య 2 ఒప్పందాలు

మనీ లాండరింగ్ నిరోధం, పర్యావరణ పరిరక్షణలో సహకారానికి సంబంధించి భారత్, సిప్రస్ మధ్య సెప్టెంబర్ 3న రెండు ఒప్పందాలు కుదిరాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సిప్రస్ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు నికోస్ అనస్టాసియాడెస్ తో రాజధాని నికోసియాలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఈ ఒప్పందాలు జరిగాయి.

భారత్ లో అత్యధిక పెట్టుబడులు పెడుతున్న విదేశాల జాబితాలో సిప్రస్ 8వ స్థానంలో ఉంది. ఆ దేశం నుంచి 9 బిలియన్ డాలర్ల పెట్టుబడులు భారత్ లోకి వస్తున్నాయి.

భారత్, అమెరికా మధ్య 2+2 చర్చలు

భారత్, అమెరికా దేశాల విదేశాంగ, రక్షణ శాఖల మంత్రుల తొలి సమావేశం న్యూఢిల్లీలో సెప్టెంబర్ 6న జరిగింది. 2+2 భేటీగాను పిలుస్తోన్న ఈ సమావేశంలో భారత్ నుంచి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్.. అమెరికా తరపున విదేశాంగ మంత్రి మైకేల్ పాంపియో, రక్షణ మంత్రి జేమ్స్ మేటిస్ లు చర్చల్లో పాల్గొన్నారు.

 • ఈ సందర్భంగాకామ్ కాసా ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా అమెరికా నుంచి భారత్ కు అత్యాధునిక మిలటరీ కమ్యూనికేషన్ పరికరాలు అందుతాయి. ఇది పదేళ్ల పాటు అమల్లో ఉంటుంది.

 • అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేసే యుద్ధ విమానాలు, ఇతర హెలికాప్టర్లలో అమెరికాకు చెందిన అత్యంత భద్రమైన ఎన్ క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థను అమరుస్తారు. సి-17, సి– 130జే, పి-81 విమానాలతో పాటు అపాచె, చింకూర్, హెలికాప్టర్లలో ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఏర్పాటు చేస్తారు.

పసిఫిక్లో చెత్త ఏరివేత మిషన్ ప్రారంభం

పసిఫిక్ మహాసముద్రంలో పేరుకుపోయిన 5 లక్షల కోట్ల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు ద ఓషీయన్ క్లీన్ అప్ అనే స్వచ్ఛంద సంస్థ చెత్త ఏరివేత మిషన్ ను ప్రారంభించింది. నెదర్లాండ్స్ కు చెందిన 24 ఏళ్ల బోయన్ స్లాట్ఈ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్ ప్రాంతంలో చేపడుతున్నారు.

చేతులు మారిన టైమ్ మ్యాగజైన్

ప్రతిష్టాత్మక ఇంగ్లీష్ మ్యాగజైన్ టైమ్ యాజమాన్యం మరోసారి మారింది. క్లౌడ్ కంప్యూటింగ్ దిగ్గజం సేల్స్ ఫోర్స్ సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ మార్క్ బెనియాఫ్ టైమ్ కొత్త యజమాని అయ్యారు. ఈ మేరకు ఆయనకు 190 మిలియన్ డాలర్లకు టైమ్ మ్యాగజైన్ ను అమ్ముతున్నట్లు ప్రస్తుత యాజమాన్యం మెరిడిత్ కార్పొరేషన్ వెల్లడించింది.

 • యేల్ యూనివర్సిటీకి చెందిన డిగ్రీ విద్యార్థులు హెన్రీ లూస్, బ్రిటన్ హాడెన్ లు 1923 మార్చిలో టైమ్ మ్యాగజైన్ ను ప్రారంభించారు.

 • 2017లో టైమ్ మ్యాగజైన్ సహా పలు ప్రచురణలను టైమ్ కంపెనీ నుంచి మెరిడిత్ కార్పొరేషన్ కొనుగోలు చేసింది.

 • ఇప్పుడు మెరిడిత్ నుంచి ఆ సంస్థ మార్క్ బెనియాఫ్ చేతుల్లోకి వెళ్లింది.

 • ఇది న్యూస్ మ్యాగజైన్.

కమిట్ మెంట్ టు డెవలప్ మెంట్ ఇండెక్స్ – 2018

కమిట్ మెంట్ టు డెవలప్ మెంట్ ఇండెక్స్ (అభివృద్ధి నిబద్ధత సూచీ) – 2018లో స్వీడన్ మొదటి స్థానంలో నిలిచింది. విదేశాలకు ఆర్థిక సాయం, పర్యావరణ విధానాల ఆధారంగా చేసుకొని సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్ మెంట్ (CGD) 27 ధనిక దేశాలతో ఈ జాబితాను విడుదల చేసింది.

 • ఈ జాబితాలో స్వీడన్ తర్వాత 2వ స్థానంలో డెన్మార్, 3వ స్థానంలో జర్మనీ, ఫిన్లాండ్ సంయుక్తంగా నిలిచాయి.

 • అమెరికా 23వ స్థానంలో ఉంది.

 • 27వ స్థానంలో జపాన్ ఉంది.

చైనా ఉత్పత్తులపై మరోసారి సుంకం విధించిన ట్రంప్

అమెరికా, చైనా మధ్య మొదైలన వాణిజ్య యుద్ధం ఇంకా తీవ్రమవుతోంది. సుంకాల పెంపుతో వాణిజ్య పోటీకి తెరతీసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్మరోసారి సుంకాల విధించారు. చైనా నుంచి దిగుమతి అయ్యే 200 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై 10 శాతం సుంకాలు (TARRIF) విధించారు. 2018 చివరి నాటికి ఈ మొత్తాన్ని 25 శాతానికి పెంచనున్నారు. దీనికి ప్రతీకార చర్యగా చైనా సైతం అమెరికాకు చెందిన 60 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది.

 • చైనాకు చెందిన 50 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై అమెరికా గతంలోనే సుంకం విధించింది.

 • దీంతో చైనా సైతం అదే స్థాయిలో అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకం విధించింది.

జపాన్ ప్రధానిగా మరో 3 ఏళ్ల పాటు షింజో అబే

జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ(LDP) అధ్యక్షుడిగా మరో 3 ఏళ్ల కాలానికి ఎన్నికయ్యారు. దీంతో… 2021 ఆగస్టు వరకు ఆయన జపాన్ ప్రధానిగా కొనసాగుతారు. ఈ మేరకు సెప్టెంబర్ 20న జరిగిన పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో 807 ఓట్లకు గాను అబేకు 553 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థి, మాజీ రక్షణమంత్రి షిగెరు ఇషిబాకు 254 ఓట్లు వచ్చాయి.

 • విజయం తర్వాత షింజో అబే మాట్లాడుతూ.. ఇక తన కర్తవ్యం జపాన్ రాజ్యాంగాన్ని సవరించడమే అని ప్రకటించారు.

 • రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఒత్తిడితో 1947లో జపాన్ రాజ్యాంగాన్ని రూపొందించారు.

వియత్నాం అధ్యక్షుడు ట్రాన్ డాయ్ క్వాంగ్ కన్నుమూత

వియత్నాం అధ్యక్షుడు ట్రాన్ డాయ్ క్వాంగ్ తీవ్ర అనారోగ్యంతో సెప్టెంబర్ 21న హనోయిలో కన్నుమూశారు. చికిత్స పొందుతు ఆయన కన్నుమూశారని ఆ దేశ అధికారిక మీడియా తెలిపింది.

 • ట్రాన్ డాయ్ క్వాంగ్ 2016లో వియత్నాం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

 • వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు.

మద్యంమరణాలు ఏటా 30 లక్షలు : WHO

2016లో మద్యం కారణంగా సంభవించే వ్యాధులు, సమస్యలతో 30 లక్షల మరణాలు సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తెలిపింది. మొత్తం మరణాల్లో ఇది 5.3 శాతమని వెల్లడించింది. ఈ మేరకు సెప్టెంబర్ 21న మద్యం మరణాల గణాంకాల నివేదికను విడుదల చేసింది. 30 లక్షల మందిలో 75 శాతం మంది పురుషులేనని పేర్కొంది.

 • అలాగేప్రపంచవ్యాప్తంగా ఏటా సంభవించే ప్రతి 20 మరణాల్లో ఒక దానికి మద్యమే కారణమని డబ్ల్యూహెచ్ఓ వివరించింది.

 • ఇదే సమయంలో ఎయిడ్స్ 1.8 శాతం, రోడ్డు ప్రమాదాల్లో 2.5 శాతం, హిం స కారణంగా 0.8 శాతం మంది ప్రాణాలు కోల్పోయారు.

 • యూరప్ తో పాటు భారత్, చైనాల్లో మద్యం వినియోగం గణనీయంగా పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

 • WHO ని 1948 ఏప్రిల్ 7న ఏర్పాటు చేశారు. దీని కేంద్ర కార్యాలయం స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉంది.

రష్యా లక్ష్యంగా అమెరికా కాస్టా చట్టం

అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్ – 400ను రష్యా నుంచి కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు తప్పవని అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రూపొందించిన కాస్టా ఆర్డర్ పై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. రష్యాను లక్ష్యంగా చేసుకొని అమెరికా కాస్టా చట్టాన్ని తెచ్చింది.

 • రష్యా నుంచి ఎస్ – 400 ను కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు విధించడమే కాస్టా ఆర్డర్.

 • భారత్ సైతం రష్యా నుంచి ఎస్ – 400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

 • కాగా ఇప్పటికే రష్యా నుంచి సుఖోయ్ యుద్ధ విమానాలు, ఎస్ – 400 లను కొన్న చైనా సంస్థ, దాని డైరెక్టర్ షాంగ్ పూపై అమెరికా ఆంక్షలు విధించింది.

ఇండోనేషియాలో ప్రకృతి విప్తత్తు.. భారీ ప్రాణ నష్టం

ఇండోనేషియాలో సంభవించిన భూకంపం, సునామీ భారీ విధ్వంసం సృష్టించాయి. సెప్టెంబర్ 28న రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో భూకంపం, ఆ వెంటనే సునామీ విరుచుకుపడటంతో 400 మందికిపైగా మృతి చెందారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

ఐరాస జనరల్ అసెంబ్లీలో సుష్మా ప్రసంగం

న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో సెప్టెంబర్ 29న సాధారణ అసెంబ్లీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారత ప్రతినిధిగా కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రసంగించారు. ఉగ్రవాదం అంశంలో పాకిస్తాన్ తీరుని ఎండగట్టారు. చర్చలు జరుపుతామని చెబుతూనే.. ఇటీవల భారత జవాన్ల చంపడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇంకా సుష్మ తన ప్రసంగంలో.. ప్రపంచానికి పర్యావరణ మార్పులు విసురుతున్న సవాళ్లు, ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన తదితర అంశాలను ప్రస్తావించారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments