Monthly Current Affairs – September – 2018 – Economy

సెప్టెంబర్ ఆర్థికం

2017-18లో మారిషస్ నుంచి అత్యధిక FDIలు

2017-18 ఆర్థిక సంవత్సరంలో భారత్ లో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) పెట్టిన దేశంగా మారిషస్ నిలిచింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 2న వెలువరించిన వివరాల ప్రకారం.. 2017-18లో దేశంలోకి మొత్తం 37.36 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. వీటిలో 13.41 బిలియన్ డాలర్ల పెట్టుబడులు మారిషస్ నుంచి వచ్చాయి. 9.27 బిలియన్ డాలర్లతో సింగపూర్ రెండోస్థానంలో నిలిచింది.

2016-17లో మొత్తం 36.31 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు దేశంలోకి రాగా మారిషస్ నుంచి 13.38 బిలియన్ డాలర్లు, సింగపూర్ నుంచి 6.52 బిలియన్ డాలర్లు వచ్చాయి.

లక్ష కోట్ల డాలర్ల కంపెనీగా అమెజాన్

ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ కంపెనీ లక్ష కోట్ల డాలర్ల కంపెనీగా అవతరించింది. సెప్టెంబర్ 4న న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్ లో అమెజాన్ షేర్ 2 శాతం లాభంతో 2,050 డాలర్లను తాకింది. ఈ ధర వద్ద కంపెనీ మార్కెట్ క్యాప్ లక్ష కోట్ల డాలర్ల మార్కును అధిగమించింది. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో కంపెనీగా అమెజాన్ నిలిచింది.

యాపిల్ సంస్థ ఇటీవలే లక్ష కోట్ల డాలర్ల మార్కుని దాటి ఈ ఘనత సాధించిన తొలి కంపెనీగా రికార్డు నమోదు చేసింది.

జన్ ధన్ ఓవర్ డ్రాఫ్ట్ రూ.10 వేలకు పెంపు

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకం కింద ప్రస్తుతం రూ.5 వేల పరిమితితో ఉన్న ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని రూ.10 వేలకు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 5న ప్రకటించింది. అలాగే పథకానికి అర్హతకు గరిష్ట వయసుని 60 నుంచి 65 ఏళ్ల పెంచారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. పథకానికి మంచి ఆదరణ లభిస్తుందన్నందున.. కొనసాగించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. రూ. 2 వేల వరకు ఓవర్ డ్రాఫ్ట్ పొందేందుకు ఎలాంటి షరతులు ఉండవని వివరించారు.

ఇవీ జన్ ధన్ లెక్కలు

 • జన్ ధన్ యోజన కింద నాలుగేళ్లలో 32.41 కోట్ల ఖాతాలు తెరిచారు.

 • వీటిలో రూ.81,200 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి.

 • 30 లక్షల మంది ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు.

 • 2014 ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ జన్ ధన్ యోజన పథకాన్ని ప్రారంభించారు.

2018-19 తొలి 5 నెలల్లో తెలంగాణ వృద్ధి 21.96 శాతం

తెలంగాణ రాష్ట్రం గడచిన నాలుగేళ్లుగా గణనీయమైన ఆదాయ అభివృద్ధిని సాధిస్తూ వస్తోంది. ఇందుకు అనుగుణంగానే 2018-19 ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో(ఏప్రిల్ ఆగస్టు) రాష్ట్రం 21.96 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. అంటే.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో తొలి ఐదు నెలల్లో రూ.21,642.02 కోట్ల ఆదాయం సమకూరగా… 2018-19లో ఇదే కాలానికి రూ.26,394.18 కోట్ల ఆదాయం వచ్చిందని ప్రభుత్వం ప్రకటించింది. ఇది కేంద్ర ప్రభుత్వం మదింపు చేసిన గణాంకాలని ప్రకటనలో పేర్కొంది.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలి నాలుగేళ్లలో ఏడాదికి సగటున 17.17 ఆదాయ వృద్ధి రేటు నమోదు చేస్తోంది. దేశంలో మరే రాష్ట్రం ఈ స్థాయిలో గణాంకాలు నమోదు చేయడం లేదు.

బీమా రంగంలో తపాలా శాఖ

భారత తపాల శాఖ బీమా రంగంలోకి అడుగు పెట్టనుంది. సెప్టెంబర్ 1న పేమెంట్స్ బ్యాంక్ సేవలను ప్రారంభించిన తపాల శాఖ.. వచ్చే రెండేళ్లలో బీమా సంస్థను ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర సమాచార శాఖ మంత్రి మనోజ్ సిన్హా సెప్టెంబర్ 9న వెల్లడించారు.

 • ప్రస్తుతం తపాలా శాఖ ప్రభుత్వ ఉద్యోగుల కోసం పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, గ్రామీణ ప్రాంతాల్లో బలహీన వర్గాలు, మహిళలకు రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకాలను అందిస్తోంది.

అవినీతి మూల్యం.. ప్రపంచ జీడీపీలో 5 శాతం

అవినీతి కారణంగా ప్రపంచ జీడీపీలో 5 శాతం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు. లంచ కారణంగా హింస పెరగడం, శాంతి భద్రతలను కాపాడుకునేందుకు అవినీతిని అంతమొందించటం అనే అంశాలపై ఐరాస భద్రతా మండలి సెప్టెంబర్ 11న నిర్వహించిన సమావేశంలో గ్యూటెరస్ ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక వేదిక అంచనాలను అంటకిస్తు.. అవినీతి కారణంగా ప్రపంచం 2.6 ట్రిలియన్ డాలర్ల మేల మూల్యం చెల్లించాల్సి వస్తోందని చెప్పారు.

3 బ్యాంకుల విలీనం

మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులు.. బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయ బ్యాంక్, దేనా బ్యాంకుల విలీనం చేయాలని సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విలీనం ద్వారా రూ.14.82 లక్షల కోట్ల వ్యాపారంతో దేశీయంగా 3వ అతిపెద్ద బ్యాంక్ ఏర్పాటు అవుతుంది.

 • విలీనంతో బ్యాంకులు మరింత పటిష్టంగా మారతాయని, రుణ వితరణ సామర్థ్యం కూడా పెరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు.

 • 2017లో భారతీయ స్టేట్ బ్యాంకులో ఆరు అనుబంధ బ్యాంకులు (స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్, భారతీయ మహిళా బ్యాంక్) విలీనం అయ్యాయి. తద్వారా ఎస్బీఐ ప్రపంచంలోనే టాప్ 50 బ్యాంకుల్లో ఒకటిగా చోటు దక్కించుకుంది.

 • దేశీయంగా 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి.

పరిహారం ఆలస్యం చేస్తే బీమా కంపెనీలకు జరిమానా

ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (PMFBY) కింద రైతులకు బీమా పరిహారం క్లెయిమ్స్‌ చెల్లింపులు చేయడంలో ఆలస్యం జరిగితే బీమా కంపెనీలు, సంబంధిత రాష్ట్రాలకు జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సెప్టెంబర్ 19న మార్గదర్శకాలు విడుదల చేసింది. వాటిని ఆయా రాష్ట్రాలకు పంపింది. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే రబీ సీజన్ నుంచి ఈ మార్గదర్శకాలు అమలవుతాయి.

 • సెటిల్‌మెంటు చేయడంలో నిర్ణీతకాల పరిమితి రెండు నెలలు దాటితే 12 శాతం వడ్డీ రైతులకు చెల్లించాలని బీమా కంపెనీలకు ఆదేశం.

 • కంపెనీల విన్నపం మేరకు తమ వాటా సబ్సిడీ సొమ్ము చెల్లించడంలో మూడు నెలలకు మించితే రాష్ట్రాలు 12 శాతం వడ్డీ చెల్లించాలని స్పష్టం చేసిన కేంద్రం.

 • రైతులకు సక్రమంగా బీమా సేవలు అందించడంలో విఫలమయ్యే కంపెనీలను రద్దు చేయాలని ఆదేశించింది.

 • ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని 2016 ఫిబ్రవరి 18న ప్రారంభించారు. ఈ పథకంలో నమోదు చేసుకునే రైతులు ఖరీఫ్ బీమా ప్రీమియంలో కేవలం 2 శాతం, రబీ ప్రీమియంలో 1.5 శాతం చెల్లిస్తే సరిపోతుంది.

2022 నాటికి 5 లక్షల కోట్ల డాలర్లకు భారత జీడీపీ: మోదీ

భారత ఆర్థిక వ్యవస్థ 2022 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 2.5 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న జీడీపీ మరో నాలుగేళ్లలో రెట్టింపు అవుతుందని ప్రకటించారు. సెప్టెంబర్ 20న ఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో సెంటర్ (IICC) ఏర్పాటుకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

 • రూ.25,706 కోట్లతో కన్వెన్షన్ సెంటర్ ను నిర్మిస్తున్నారు. దీని ద్వారా 5 లక్షల ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

మోర్ ఇకపై అమెజాన్ చేతుల్లోకి

అంతర్జాతీయ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. భారత్ లో సుప్రసిద్ధ ఆఫ్ లైన్ రీటైల్ మార్కెట్ మోర్ ను కొనుగోలు చేస్తోంది. సమర ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ తో కలిసి మోర్ ను చేజిక్కించుకోనుంది. ఈ మేరకు సమర సంస్థతో మోర్ మాతృ సంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్ సెప్టెంబర్ 19న ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.4,200 కోట్లు.

 • మోర్ కు దేశవ్యాప్తంగా 509 బ్రాండెడ్ సూపర్ మార్కెట్లు, 20 హైపర్ మార్కెట్లు ఉన్నాయి.

 • గతంలో త్రినేత్ర సూపర్ మార్కెట్ బ్రాండ్ నే ఆదిత్య బిర్లా గ్రూప్ 2007లో కొనుగోలు చేసి మోర్ గా నామకరణం చేసింది.

రూ.750 ప్రీమియం.. ప్రమాద బీమా రూ.15 లక్షలు

వాహన బీమా కవరేజ్ మొత్తాన్ని భారీగా పెంచుతు భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ(Insurance Regulatory and Development Authority – IRDA) సెప్టెంబర్ 21న కీలక నిర్ణయం తీసుకుంది. ఓనర్ కమ్ డ్రైవర్ ల ప్రమాద బీమాను రూ.15 లక్షలకు పెంచింది. సంవత్సరానికి కేవలం రూ.750 ప్రీమియంతో ఈ పాలసీని పొందవచ్చు.

 • ఈ నిర్ణయాని కంటే ముందు పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ ద్విచక్ర వాహనాలకు రూ.1 లక్ష, కమర్షియల్ వాహనాలకు రూ.2 లక్షలుగా ఉండేది. దీనికి నెల వారీ ప్రీమియం ద్విచక్ర వాహనాలకు రూ.50, కమర్షియల్ వెహికల్స్ కు రూ.100 రూపాయలుగా ఉండేది.

 • IRDA 1999లో ఏర్పాటు చేశారు. దీని కేంద్ర కార్యాలయం హైదరాబాద్ లో ఉంది.

 • IRDA ప్రస్తుత చైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్ర ఖుంతియా

ఒకే పన్ను రేటుపై ఉత్తరాది రాష్ట్రాల అంగీకారం

ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ తో పాటు మరో రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు ఢిల్లీ, చంఢీగఢ్ … పెట్రో ఉత్పత్తులపై ఒకే పన్ను రేటు విధించేందుకు అంగీకరాం తెలిపాయి. వీటితో పాటు మద్యం అమ్మకాలు, వాహనాల రిజిస్ట్రేషన్లు, రవాణా పర్మిట్లు పై కూడా ఈ రాష్ట్రాల్లో ఒకే పన్ను రేటు ఉండాలని నిర్ణయించాయి. పెట్రోలు, డీజిల్ ధరలు గణనీయంగా పెరుగుతున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీని ద్వారా బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలన్నది లక్ష్యం.

ఆహార శుద్ధి పరిశ్రమలోకి బిలియన్ డాలర్ల పెట్టుబడులు

భారత్ లోని ఆహార శుద్ధి పరిశ్రమల్లోకి 2018 సెప్టెంబర్ వరకు బిలియన్ డాలర్లకు పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(FDI)లు వచ్చాయి. భారత కరెన్సీలో ఆ విలువ రూ.7,200 కోట్లు. ఈ మేరకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి హర్ సిమ్రత్ కౌర్ సెప్టెంబర్ 25న వెల్లడించారు.

MSMEలకి గంటలో రుణం పోర్టల్ ప్రారంభం

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను నెలకొల్పే పారిశ్రామికవేత్తలకు గంటలో రుణం మంజూరు చేసేందుకు కేంద్ర ఆర్థిక సెప్టెంబర్ 25న ప్రత్యేక పోర్టల్ ప్రారంభించారు. ఈ మేరకు www.psbloansin59minutes.com వెబ్ సైట్ ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లాంఛనంగా ప్రారంభించారు. Small Industries Development Bank(SIDBI), మరో 5 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ రుణాలను మంజూరు చేస్తాయి.

 • అవసరమైన అన్ని పత్రాలతో వెబ్ సైట్లో దరఖాస్తు చేసిన గంట లోపు రుణాన్ని మంజూరు చేస్తారు.

 • ఈ విధానం ద్వారా రూ. కోటి వరకు రుణం ఇస్తారు.

CCS ఆర్థిక స్వేచ్ఛా సూచీలో భారత్ కు 96వ స్థానం

సెంటర్ ఫర్ సివిల్ సొసైటీ(CCS), కెనడా ఫ్రేసర్ ఇన్సిస్టిట్యూట్ లు సంయుక్తంగా విడుదల చేసిన ఆర్థిక స్వేచ్ఛా సూచీ(Economic Freedom Index)-2018 లో భారత్ 96వ స్థానంలో నిలిచింది. 162 దేశాల ర్యాంకింగ్స్ తో ఈ సూచీ విడుదలైంది.

 • హాంకాంగ్ తొలి స్థానంలో నిలవగా, సింగపూర్ రెండో స్థానంలో నిలిచింది.

 • 2017కు సంబంధించి ఇదే నివేదికలో భారత్ కు 98వ స్థానం దక్కింది.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments