Monthly Current Affairs – September – 2018 – AP & TS

సెప్టెంబర్ రాష్ట్రీయం

తిరుపతిలో ‘స్వీకార్ ’

తిరుపతి సమీపంలో అలిపిరి వద్ద శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఫర్ కేన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ రీసెర్చ్ (స్వీకార్) సంస్థను టాటా ట్రస్ట్ నిర్మించనుంది. టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటాతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వీకార్ నిర్మాణానికి ఆగస్టు 31న భూమి పూజ చేశారు. స్వీకార్‌ను తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) బోర్డు విరాళంగా ఇచ్చిన 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.600 కోట్ల వ్యయంతో నిర్మిస్తారు.

దేశవ్యాప్తంగా టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో 124 ఆస్పత్రులు నడుస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో ‘చేరువ’ కార్యక్రమం

సామాజిక మాధ్యమాలు, సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు రూపొందించిన ‘చేరువ..మీ చెంతకు.. మీ పోలీస్’ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ విజయవాడలో ఆగస్టు 31న ప్రారంభించారు. ఏపీ పోలీసు శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా పోలీసులు ప్రజలు భాగస్వాములై విభిన్న సమస్యలు, అంశాలపై చర్చించనున్నారు. కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరంలో ప్రజలకు చేరువ అయ్యేలా ప్రత్యేక వాహనాన్ని డీజీపీ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా నిర్వహించనున్నారు. సామాజిక మాద్యమాల్లో.. ఏపీ పోలీసులు ప్రజలకు మరింత చేరువయ్యేలా సామాజిక మాద్యమాల్లో అకౌంట్‌లను డీజీపీ ఠాకూర్ ప్రారంభించారు. 9440900822 వాట్సాప్, ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయడంతోపాటు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్‌లను ఏర్పాటు చేశారు.

మంజీర ఎత్తిపోతలకు రూ.476.25 కోట్లు

మంజీర ఎత్తిపోతలకు రూ.476.25 కోట్లు మంజూరు చేస్తు తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 4న ఉత్తర్వులు జారీ చేసింది. నిజాంసాగర్ మండలం మల్లూరు గ్రామ సమీపంలో ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించనున్నారు. నిజాం సాగర్ కింద మంజీరా నదిపై పిట్లం, బిచ్కుంద మండలాల పరిధిలోని 21 గ్రామాల్లో 30 వేల ఎకరాలకు నీరివ్వాలన్నది లక్ష్యం. ఈ ఎత్తిపోతలకు 2.90 టీఎంసీల నీటిని వినియోగించనున్నారు

మత్స్య అభివృద్ధి పథకాన్ని ప్రారంభించిన తలసాని

తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని ప్రారంభించింది. సెప్టెంబర్ 5న హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ పథకం రెండేళ్ల పాటు అమల్లో ఉంటుంది. ఇందులో భాగంగా 855 మంది మత్స్యకారులకు ద్విచక్ర వాహనాలు, 12 మందికి లగేజ్ ఆటోలు, 8 మంది లబ్ధిదారులకు సంచార విక్రయ కేంద్రాలు అందజేశారు. 2 మహిళా మత్స్య సంఘాలకు రూ.5 లక్షల చొప్పున గ్రాంట్ అందజేశారు.

తెలంగాణ శాసనసభ రద్దు

తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ రద్దయింది. నిర్ణీత కాల వ్యవధి కన్నా 8 నెలల 26 రోజుల ముందే ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు శాసనసభ రద్దుకి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంత్రిమండలిలో చేసిన తీర్మానాన్ని గవర్నర్ నరసింహన్ కు అందజేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 క్లాజ్ 2(బీ) అనుసరించిన గవర్నర్ శాసనసభను రద్దు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ తర్వాత శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు గవర్నర్ నోటిఫికేషన్ ను ప్రస్తావిస్తు గెజిట్ జారీ చేశారు. ఎన్నికలు జరిగి, తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకు కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.

రాష్ట్రంలో నిర్ణీత కాలం ప్రకారం 2019 ఏప్రిల్ లో ఎన్నికలు జరగాల్సి ఉండగాటీఆర్ఎస్ అధ్యక్షుడు కే.చంద్రశేఖర్ రావు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ముందుగానే సభను రద్దు చేశారు.

తెలంగాణలో 0.39 మీటర్ల మేర పెరిగిన భూగర్భ జలాలు

తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయి. ఈ ఏడాది ఆగస్టు నెలలో కురిసిన వర్షాలతోనే రాష్ట్రవ్యాప్తంగా సగటున 0.39 మీటర్ల మేర భూగర్భ జలమట్టం పెరిగిందని భూగర్భ జనరుల విభాగం సెప్టెంబర్ 7న వెల్లడించింది. మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన పనులతో చెరువులతో సమృద్ధి నీరు చేరి.. భూమిలోకి ఇంకుతోందని.. దీని ఫలితంగానే భూగర్భ జలమట్టం పెరిగిందని వివరించింది.

వారసత్వ కట్టడాలుగా సదర్మాట్ ఆనకట్ట, కామారెడ్డి పెద్ద చెరువు

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో గోదావరి నదిపై నిర్మించిన సదర్మాట్ ఆనకట్ట, కామారెడ్డి పెద్ద చెరువుని కేంద్ర ప్రభుత్వం వారసత్వ కట్టడాలుగా గుర్తించింది. ఈ రెండింటిని మనుగడలో ఉన్న పురాతన నీటిపారుదల ఆనకట్టలుగా గుర్తిస్తూ ఈ మేరకు సమాచారన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది.

 • సదర్మాట్ ఆనకట్టను 1891-92 మధ్య కాలంలో గోదావరి నదిపై శ్రీరాంసాగర్ దిగువన నిర్మించారు. ఇది నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం , మేడం పల్లి గ్రామంలో ఉంది.

 • కామారెడ్డి పెద్ద చెరువుని 1897లో నిర్మించారు. దీని పరిధిలో 858 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉంది.

గోకుల్ చాట్ బాంబు పేలుళ్ల దోషులకు ఉరిశిక్ష

హైదరాబాద్ లుంబిని పార్క్, గోకుల్ చాట్ బాంబు పేలుళ్ల దోషులు అనీల్ షఫీక్ సయీద్, మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చొదరిలకు ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. వీరికి ఆశ్రయం కల్పించిన తారీఖ్ అంజుమ్ కు జీవిత ఖైదు ఖరారు చేసింది. ఈ మేరకు ప్రత్యేక హైకోర్టు హైదరాబాద్ జంట పేలుళ్లపై సెప్టెంబర్ 10న దోషులకు శిక్ష ఖరారు చేసింది.

 • అనీక్, ఇస్మాయిల్ చొదరిలకు విధించిన ఉరిశిక్షను హైకోర్టు ఖరారు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే శిక్షను అమలు చేసే అవకాశం ఉంటుంది.

 • 2007 డిసెంబర్ 25న లుంబినీ పార్క్, గోకుల్ చాట్ లలో వరుస పేలుళ్లు జరిగాయి. దిల్ సుఖ్ నగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద పెట్టిన మరో బాంబుని పోలీసులు నిర్వీర్యం చేశారు. లుంబీనీ పార్కు పేలుళ్లలో 12 మంది, గోకుల్ చాట్ పేలుళ్లలో 32 మంది మృతి చెందారు.

మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు ఏర్పాటు చేసిన తెలంగాణ

డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సహా ఇతర వైద్య సిబ్బంది నియామకం కోసం తెలంగాణలో ప్రత్యేకంగా మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు (MHSRB)ని ఏర్పాటు కానుంది . ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

 • బోర్డు చైర్మన్ గా వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి వ్యవహరిస్తారు.

 • సభ్య కార్యదర్శిగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ను నియమిస్తారు.

 • జాయింట్ కలెక్టర్ కేడర్ అధికారి సభ్యుడిగా ఉంటారు.

20 రోజుల పాటు స్టార్టప్ ఇండియా తెలంగాణ యాత్ర

పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని అనుకునే వారు, వినూత్న ఆవిష్కర్తలను కలిసి ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్రంలో స్టార్టప్ యాత్ర సెప్టెంబర్ 15న ప్రారంభమైంది. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో అక్టోబర్ 5 వరకు 20 రోజుల పాటు జరిగే ఈ యాత్రను రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి కే. తారకరామారావు ప్రారంభించారు.

 • ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 200 మంది విద్యార్థుల నుంచి వినూత్న ఆలోచనలను సేకరించి అందులో 20 మందిని ఎంపిక చేస్తారు.

 • 12 జిల్లాల మీదుగా ఈ యాత్ర సాగుతుంది.

హైదరాబాద్ లో గర్భస్థ శిశువుకు గుండె శస్త్రచికిత్స

దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రి వైద్యులు గర్భంలోని శిశువుకి విజయవంతంగా గుండె శస్త్రచికిత్స చేశారు. మూసుకుపోయిన గుండె రక్తనాళాలను తెరిచి జన్మించకముందే పునర్జన్మ ప్రసాదించారు.

దేశంలోనే తొలిసారిగా కింది వాటిలోని ఏ నగరంలో గర్భస్థ శిశువుకి గుండె

ఏపీ ఎమ్మెల్యేని కాల్చి చంపిన మావోయిస్టులు

ఆంధ్రప్రదేశ్ విశాఖటపట్నం జిల్లాలోని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు కాల్చి చంపారు. సెప్టెంబర్ 23న డుంబ్రిగూడ మండల కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలోని లివిటిపుట్టులో ఈ ఘటన జరిగింది. గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను అడ్డగించిన మావోయిస్టులు.. వారిపై కాల్పులు జరిపారు.

దేవెందర్ గౌడ్ మై జర్నీపుస్తక ఆవిష్కరణ

మై జర్నీపేరుతో టీడీపీ సీనియర్ నేత తూళ్ల దేవెందర్ గౌడ్ రాసిన తన జీవిత చరిత్ర పుస్తకాన్ని.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సెప్టెంబర్ 23న హైదరాబాద్ లో ఆవిష్కరించారు.

ఈజ్ ఆఫ్ లివింగ్ లో ఆంధ్రప్రదేశ్ కు మొదటి స్థానం

ఈజ్ ఆఫ్ లివింగ్ లో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఒడిశా, 3వ స్థానంలో మధ్యప్రదేశ్, 4వ స్థానంలో తెలంగాణ నిలిచాయి. ఈ మేరకు సెప్టెంబర్ 24న న్యూఢిల్లీలో అమృత్ (AMRUT – Atal Mission for Rejuvenation and Urban Transformation) అవార్డులను ప్రదానం చేశారు. కేంద్ర పట్ణణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ పూరి ఈ అవార్డులను అందజేశారు.

 • పట్టణాల వారీగా 2018 ఆగస్టులో ప్రకటించిన ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ లో తిరుపతి 4వ స్థానంలో, విజయవాడ 9వ స్థానంలో నిలిచాయి.

 • అభివృద్ధి కార్యక్రమాల డీపీఆర్ ల రూపకల్పన, కాంట్రాక్టుల కేటాయింపు, ప్రాజెక్టుల పూర్తి, యుటిలైజేషన్ సర్టిఫికెట్ల సమర్పణ వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ర్యాంకులను రూపొందిస్తారు.

 • AMRUT పథకాన్ని 2015లో ప్రారంభించారు.

అమీర్ పేట్ ఎల్బీనగర్ మెట్రో ప్రారంభం

హైదరాబాద్ మెట్రో కారిడార్ – 1 లోని అమీర్ పెట్ ఎల్బీనగర్ మార్గం.. సెప్టెంబర్ 24 నుంచి ప్రజలకి అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్.. జెండా ఊపి రైలుని ప్రారంభించారు. 16 కిలోమీటర్ల ఈ మార్గంలో 17 స్టేషన్లు ఉన్నాయి. దీంతో.. 29 కిలోమీటర్ల కారిడార్ – 1 పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లైంది.

 • హైదరాబాద్ మెట్రోని ప్రధాని నరేంద్ర మోదీ 2017 నవంబర్ 28న ప్రారంభించారు. తొలుత మియాపూర్ నుంచి నాగోల్ మార్గాన్ని ప్రధానితో ప్రారంభింపజేశారు.

ప్రకృతి సేద్యం ఐరాస వేదికపై చంద్రబాబు ప్రసంగం

ప్రకృతి వ్యవసాయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐక్యరాజ్య సమితి వేదికపై ప్రసంగించారు. “సుస్థిరి సేద్యానికి ప్రకృతి చేయూత – ఆర్థిక సవాళ్లు అవకాశాలుఅనే అంశంపై న్యూయార్క్ లోని ఐరాస కార్యాలయంలో సెప్టెంబర్ 25న జరిగిన సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు.. కీలకోపన్యాసం చేశారు.

ప్రసంగంలోని ముఖ్యంశాలు

 • రాష్ట్రం జీఎస్ డీపీలో వ్యవసాయం వాటా 28 శాతం

 • రాష్ట్రంలో 62 శాతం జనాభాకు వ్యవసాయం, అనుబంధ రంగాలే ఆధారం

 • ఆక్వా రంగంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్

 • 2018లో రాష్ట్రంలో 5 లక్షల మంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు

 • 2020 నాటికి 1.7 మిలియన్ల రైతులు ప్రకృతి సేద్యం చేయాలన్నది లక్ష్యం

 • 2022 నాటికి 4.1మిలియన్ల రైతులని ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాలన్నది లక్ష్యం

 • 2024 నాటికి 60 లక్షల మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం చేయించాలన్నది ధ్యేయం.

 • ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందన్న చంద్రబాబు

ముఖ్యమంత్రి యువనేస్తంకు దరఖాస్తుల వెల్లువ

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు భృతి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి యువనేస్తంపథకానికి దరఖాస్తులు అధికంగా వస్తున్నాయి. సెప్టెంబర్ 14న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెబ్ సైట్ ను అధికారికంగా ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు అంటే.. 12 రోజుల్లో 3,69,864 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇప్పటి వరకు 1,00,004 మందిని అర్హులుగా గుర్తించారు. అర్హులైన వారికి 2018 అక్టోబర్ 2 నుంచి నెలకి రూ.1000 నిరుద్యోగ భృతి చెల్లించనున్నారు. ఈ మొత్తం నేరుగా వారి ఖాతాల్లోకి వస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లో చేనేతలకు ఉచిత విద్యుత్

ఆంధ్రప్రదేశ్ లో చేనేతలకు ఉచిత విద్యుత్ విధానం సెప్టెంబర్ 25 నుంచి అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలోని 90,765 చేనేత కుటుంబాలకు ప్రతి నెలా 100 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ ఇస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 7న చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చారు.

కరీంనగర్ ముంబై వీక్ల ఎక్స్ ప్రెస్ ప్రారంభం

కరీంనగర్ లోకమాన్య తిలక్ టెర్మినల్ ముంబై వీక్లీ ఎక్స్ ప్రెస్ ను రైల్వే సహాయ మంత్రి రాజెన్ గోహెన్ సెప్టెంబర్ 26న జెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్ స్టేషన్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు రైలుని ప్రారంభించారు. దీంతోఇప్పటి వరకు నిజామాబాద్ ముంబై మధ్య నడుస్తున్న ఈ ఎక్స్ ప్రెస్.. ఇక నుంచి కరీంనగర్ వరకు వెళుతుంది.

 • కాజీపేట – కొండపల్లి మధ్య 3వ లైను నిర్మాణ పనులని మంత్రి ప్రారంభించారు.

హైదరాబాద్ కు యాంథెమ్సంస్థ

వైద్య రంగంలో అత్యాధునిక సదుపాయాల కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి మరో అంతర్జాతీయ సంస్థ వస్తోంది. అమెరికాలోని ఇండియానా పోలీస్ కేంద్రంగా హెల్త్ కేర్ సేవలు అందిస్తోన్న యాంథెమ్సంస్థ హైదరాబాద్ లో తన కార్యకలాపాలు ప్రారంభించనుంది. దీని ద్వారా 2 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అనిల్ చంద్ర పునేత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అనిల్ చంద్ర పునేత నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్ దినేష్ కుమార్ పదవి కాలం ముగియటంతో ఆయన స్థానంలో పునేతను నియమిస్తూ సెప్టెంబర్ 28న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1984 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన పునేత తొలుత కడప జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలు మొదలు పెట్టారు. ఆయన 2019 మే నెల వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతల్లో ఉంటారు.

ఏపీలో రేషన్ లో రాగులు, జొన్నలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీపీఎల్ కుటుంబాలకు ప్రతి నెలా అందజేసే రేషన్ లో రాగులు, జొన్నలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఒక్కో కార్డుకి గరిష్టంగా 3 కిలోల చొప్పున రాగులు, జొన్నలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్రంలో చిత్తూరు, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో వీటిని పంపిణీ చేస్తుండగా.. అక్టోబర్ నుంచి రాష్ట్రమంతటా ఇవ్వాలని నిర్ణయించారు.

 • బియ్యం తరహాలోనే కిలో రూపాయికే అందిస్తారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments