నకిలీ సర్టిఫికెట్లతో పట్టభద్రుల ఓటు నమోదు సాధ్యమేనా ??

తెలంగాణలో రెండు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ నియోజవర్గాల ఓటు నమోదు ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో జరుగుతోంది. రాజకీయ పార్టీలు ఏజెంట్లను పెట్టి మరీ పట్టభద్రుల నుంచి సర్టిఫికెట్లు, ఫోటోలు సేకరించి ఫాం – 18 నింపి తహసీల్దార్, మున్సిపల్ ఆఫీసుల్లో సమర్పిస్తున్నాయి. పార్టీకి అనుకూలంగా ఉన్నవారందరినీ ఓటర్లుగా నమోదు చేసేందుకు పొలిటికల్ పార్టీలు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాయి.

అయితే.. ఓటరు నమోదు ప్రక్రియపై అనుమానం వ్యక్తం చేసిన కాంగ్రెస్.. టీఆర్ఎస్ నకిలీ సర్టిఫికెట్లతో పట్టభద్రుల ఓట్లు నమోదు చేస్తోందని ఆరోపిస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలోని టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ.. ఎన్నికల ముఖ్య కార్యనిర్వాహణ అధికారి శశాంక్ గోయల్ ను కలిసి.. ఓటరు నమోదుపై దృష్టి సారించాలని కోరింది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో వస్తోన్న దరఖాస్తులను నిశితంగా పరిశీలించిన తర్వాతే.. అర్హులైన ఓటర్లను గుర్తించాలని విజ్ఞప్తి చేసింది.నకిలీ సాధ్యమేనా ??

ఆఫ్ లైన్ ఓటరు నమోదులో గెజిటెడ్ అధికారి పాత్ర కీలకం. కొత్తగా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలంటేదరఖాస్తుదారులు డిగ్రీ సర్టిఫికెట్ జిరాక్స్ ను గెజిటెడ్ అధికారితో అటెస్ట్ చేయించాలి. ఫాం – 18 కి ఆ సర్టిఫికెట్ జత చేసి.. రెండు ఫోటోలు, ఓటర్ ఐడీ కార్డ్ జిరాక్స్ తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయంలో ఇవ్వాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ ను అటెస్ట్ చేసే అధికారి.. ఒరిజినల్ సర్టిఫికెట్ ను పరిశీలించిఅది అసలైందని ధృవీకరించుకున్న తర్వాతే సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే.. ఈ రోజుల్లో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఒకరి సర్టిఫికెట్ ను మరొకరి సర్టిఫికెట్ గా మార్ఫింగ్ చేయటం ఎంతో సులువు. అలాగే గెజిటెడ్ అధికారి సంతకం సాధించడం అంత కష్టం ఏమీ కాదు. ఇలా నేరుగా సమర్పించిన దరఖాస్తులకు రీ వెరీఫికేషన్ లేకుంటే మాత్రం నకిలీ ఓట్లు నమోదయ్యే అవకాశం ఉన్నట్లే !!ఇక.. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ లో ఓటరు తమ వివరాలు పూర్తిగా నింపి.. ఫోటో, డిగ్రీ సర్టిఫికెట్ ను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. బూత్ ల వారీగా నమోదైన దరఖాస్తులను ఎన్నికల సంఘం బూత్ ఆఫీసర్లతో పరిశీలన చేయిస్తుంది. BLO లు దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి ఇచ్చిన వివరాలు, డిగ్రీ సర్టిఫికెట్ ను పరిశీలిస్తారు. అన్ని సరిగ్గా ఉంటే.. వివరాలు సరైనవే అని రిపోర్ట్ పంపిస్తారు. లేకుంటే అప్లికేషన్ రిజెక్ట్ చేయాలని ప్రతిపాదిస్తారు. ఒక వేళ BLO లు దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లకుండా అప్లికేషన్ వెరిఫికేషన్ పూర్తి చేస్తే మాత్రం అవకతవకలకు ఆస్కారం పుష్కలం !!

నకిలీ ఓట్లు నమోదుకాకుండా చూడాలంటే ఎన్నికల సంఘం.. ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తుల పరిశీలనను పకడ్బందీగా నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతి డిగ్రీ సర్టిఫికెట్ కి ఒక యూనిక్ నంబర్ ఉంటుంది. ఓటరు నమోదు డాటా బేస్ లో అభ్యర్థి దరఖాస్తుని.. వారి సర్టిఫికెట్ యూనిక్ నంబర్ ని అనుసంధానం చేస్తే.. మరొకరు మార్ఫింగ్ చేసి అదే సర్టిఫికెట్ తో ఓటు కోసం నమోదు చేసుకోకుండా అడ్డుకోవచ్చు. అన్ని యూనివర్సిటీల నుంచి డిగ్రీ సర్టిఫికెట్ల ఐడీ నెంబర్లను తీసుకొని.. ఈసీ డాటా బేస్ కి కనెక్ట్ చేస్తే.. నకిలీ ఓట్ల నమోదుకు అవకాశం ఉండదు. ఒక్క ఓటు తేడాతో గెలుపు ఓటమలు నిర్దేశించే ఎన్నికల్లో.. ఓటర్లను అత్యంత జాగ్రత్తగా గుర్తించాలి. అర్హులకే ఓటు హక్కు కల్పించాలి !!

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments