ఇది కథ కాదు – డ్రగ్స్ డాన్ – డైనమిక్ లేడీ ఆఫీసర్ – మధ్యలో ముఖ్యమంత్రి.. అసలేం జరిగింది ?

పోలీస్ డ్యూటీలో పురుషులతో సమానంగా విధులు నిర్వహించడమే కాదు… వారికంటే సమర్థంగా పనిచేయగలమని ఎందరో డైనమిక్ లేడీ ఆఫీసర్లు నిరూపించారు.  ఇటీవల గుజరాత్ లో కానిస్టేబుల్ సునీతా యాదవ్… కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన మంత్రి కుమారుడిని అడ్డుకొని నిలదీశారు. ఈ ఘటనతో ఆమెను సోషల్ మీడియాలో ఎంతో మంది అభినందించారు. ఊరందరిదీ ఓ తీరైతే.. పోలీసు శాఖలో ఉన్నతాధికారులు మరోతీరు కదా.. ! ఆమె మీద ఎలాంటి ఒత్తిడి వచ్చిందో ఏమోకానీ.. కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. పోలీసు పవర్.. వేసుకునే యూనిఫాంలో లేదని.. ఉద్యోగ ర్యాంక్ లో ఉందని.. ఈ సారి ఐపీఎస్ సాధించి మళ్లీ పోలీస్ డిపార్ట్ మెంట్ లోకి వస్తానని ఆత్మవిశ్వాసంతో చెప్పారు.. సునీతా యాదవ్. ఇప్పుడు మీరు చదివే మణిపూర్ సూపర్ కాప్ స్టోరీ.. ఇంకా పవర్ ఫుల్. పోలీసు డిపార్ట్మెంట్ లో నిబద్ధత, ధైర్య సాహసాలతో విధులు నిర్వహించి.. మణిపూర్ యువతకి స్ఫూర్తిగా నిలిచారు డైనమిక్ ఆఫీసర్ థౌనోజామ్ బృందా. డ్రగ్స్ మాఫియా ఆటకట్టించి.. వారి వెన్నులో వణుకు పుట్టించిన  ఆఫీసర్ . ఓ కేసులో ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బిరెన్ సింగ్ నే ఎదురించి.. ధైర్యంగా పోరాడుతున్న ధీశాలి. కానీ.. ఈ పోరులో తిరిగి ఆమె మీదే ఉల్టా కేసులు నమోదు చేసినా.. బెదరకుండా న్యాయం కోసం ఫైట్ చేస్తున్న మణిపూర్ పోలీస్ ఆఫీసర్ బృందా ధైర్యం.. పోరాట తత్వం.. నేటి యువతకు కావాలి ఆదర్శం !!

థౌనోజామ్ బృందా. మణిపూర్ పోలీసు శాఖలో మాదకద్రవ్యాలు, సరిహద్దు వ్యవహారాల విభాగం అడిషనల్ ఎస్పీ. అన్యాయాన్ని ఉక్కుపాదంతో అణచివేసే తత్వం, డ్యూటీలో సిన్సియర్, తప్పు చేసిన వాడు ఎంతటివాడైనా వదిలేది లేదు అనే అగ్రెసివ్ అప్రోచ్ ఆమె సొంతం. విధి నిర్వహణలో భాగంగా.. 2018 జూన్ 19న తన బృందంతో కలిసి డ్రగ్స్ రాకెట్ పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. 8 మందిని అదుపులోకి తీసుకొని వారి నుంచి 4.59 కేజీల హెరాయిన్, 2,80,200 “వరల్డ్ ఈజ్ యువర్స్” అనే టాబ్లెట్లు, రూ. 57.18 లక్షల నగదు, రూ. 95 వేల విలువ గల రద్దయిన పాత నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇలా.. నిందితులను అదుపులోకి తీసుకున్నారో లేదో.. అలా రాజకీయ నేతల నుంచి బృందాకు ఫోన్ కాల్స్ మొదలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే.. అస్ని కుమార్ అనే వ్యక్తి నుంచి ఆమెకు వాట్సాప్ కాల్ వచ్చింది. ఆ కాల్ చేసిన వ్యక్తి మణిపూర్ బీజేపీ ఉపాధ్యక్షుడు. ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ మాట్లాడతారంటూ కాల్ కనెక్ట్ చేశారు. ఫోన్ లైన్లోకి వచ్చిన సీఎంకి.. బృందా జరిగిన విషయం చెప్పారు. పట్టుబడిన నిందితుల నుంచి అందిన సమాచారం మేరకు అటానమస్ డిస్ట్రిక్ కౌన్సిల్ కమిటీ సభ్యుడి ఇంట్లో సోదాలు నిర్వహించాలని అనుకుంటున్నట్లు ముఖ్యమంత్రికి తెలిపారు ఆఫీసర్ బృందా. మొత్తం విన్నాక.. గో ఎహెడ్ అన్న సీఎం.. ఒకవేళ ఆ సభ్యుడి ఇంట్లో డ్రగ్స్ దొరికితే అరెస్టు కూడా చేయమని చెప్పారట. సోదాలు జరిపిన ఇళ్లు.. లుఖోసెయ్ జోవ్ ది. అతడు..చాందెల్ జిల్లా అటానమస్ డిస్ట్రిక్ కౌన్సిల్ ఛైర్మన్. డ్రగ్స్ ముఠాలకి కింగ్ పిన్ అనే ఆరోపణలు కూడా ఉన్నాయి అతడిపై. ముఖ్యమంత్రి ఎన్ బిరెన్ సింగ్ భార్యకు కుడి భుజం లాంటి వారు అంటారట మణిపూర్ లో. సోదాల్లో జోవ్ ఇంట్లో డ్రగ్స్ దొరికాయి. దీంతో అతడిని బృందా అరెస్టు చేశారు. విడుదల చేయాలంటూ ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ నుంచి ఒత్తిడి వచ్చినా.. ఆమె ససేమిరా అన్నారు. పకడ్బందీగా కేసు ఫైల్ చేసి కోర్టులో సమర్పించారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ.. అనూహ్యంగా జోవ్ కి బెయిల్ మంజూరైంది. ఈ పరిణామాలపై తీవ్రంగా కలత చెందిన ఆఫీసర్ బృందా… ఫేస్ బుక్ వేదికగా తన ఆవేదనని పంచుకున్నారు. న్యాయవ్యవస్థ పనితీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు నిర్ణయాన్ని తప్పుపట్టినందుకు గాను.. ఆమె మీద హైకోర్టు… కోర్టు ధిక్కార నేరం కింద కేసు నమోదు చేసింది. ఒక నిజాయతీ గల ఆఫీసర్, ధైర్యంగా డ్రగ్స్ ముఠాని పట్టుకొని కోర్టు ముందు నిలబెడితే.. ఆమెకి దక్కిన ప్రతిఫలం ఇది. రిపోర్టర్ ప్రశాంతా మజుందార్ డైనమిక్ లేడీ ఆఫీసర్ కి జరిగిన అన్యాయాన్ని వెలుగులోకి తెచ్చారు. న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ వెబ్ సైట్ జూలై 14న పూర్తి వివరాలతో కథనాన్ని ప్రచురించింది.

కోర్టు ధిక్కార కేసులో.. తన పూర్తి వివరణని అఫిడవిట్ రూపంలో కోర్టుకి సమర్పించారు… ఆఫీసర్ బృందా. డ్రగ్స్ ముఠాలపై దాడులు జరిగిన తీరు.. లుఖోసెయ్ జోవ్ ఇంట్లో తనిఖీలు… డ్రగ్స్ దొరికిన విషయం… సీఎం ఎన్ బిరెన్ సింగ్ మాట్లాడిన వివరాలను అఫిడవిట్ లో కోర్టుకి తెలియజేశారు. అఫిడవిట్ లో పేర్కొన్న వివరాలు ఆమె మాటల్లోనే….

జోవ్ ఇంట్లో డ్రగ్స్ దొరికిన తర్వాత… అతడు రాజీ కోసం విజ్ఞప్తి చేశాడు. విషయాన్ని ఇక్కడే సెటిల్ చేసుకుందామని బ్రతిమిలాడాడు. కానీ నేను అందుకు ఒప్పుకోలేదు. దీంతో.. డీజీపీ, ముఖ్యమంత్రికి ఫోన్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరాడు. దీనికీ నేను సమ్మతించలేదు. ఆ తర్వాత.. అస్ని కుమార్ (బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు) మా ఇంటికి వచ్చారు. అరెస్టు చేసిన ఏడీసీ ఛైర్మన్ జోవ్.. సీఎం భార్యకి కుడి భుజం వంటి వారని.. ఈ అరెస్టు పై ఆమె చాలా కోపంగా ఉన్నారని చెప్పారు. కేసులో రాజీకి వచ్చి.. జోవ్ భార్య లేదా కొడుకుని కేసులో ఇరికించి.. అతడిని విడుదల చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారని అస్ని కుమార్ వివరించారు. దీనికి నేను అంగీకరించలేదు. నేను డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది జోవ్ నుంచి. అతడి భార్య, కొడుకు నుంచి కాదని.. అందుచేత జోవ్ ని విడుదల చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పాను. దీంతో.. వెళ్లిపోయిన అస్ని కుమార్.. మరోసారి ఇంటికి వచ్చి ముఖ్యమంత్రి దంపతులు.. కేసు విషయంలో చాలా కోపంగా ఉన్నారని.. జోవ్ ని విడుదల చేయాలని అన్నారు. నేను అంతకముందు చెప్పిన విషయాన్నే మరోసారి స్పష్టం చేశాను. కోర్టులో హాజరుపరుస్తాను. విడుదల చేయాలా వద్దా అనేది కోర్టు నిర్ణయిస్తుందని చెప్పాను. ఢిల్లీ నుంచి మణిపూర్ కి బదిలీపై వచ్చినప్పుడు నా విధుల్లో ఎవరి జోక్యం ఉండదని హామీ ఇచ్చారు. డ్రగ్స్ ముఠాల కార్యకలాపాలను అరికట్టడంలో నా సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. ఏ సమయంలో అయినా నాకు అడ్డంకులు సృష్టిస్తే తిరిగి వెళ్లిపోతానని బదిలీకి ముందే చెప్పాను. కానీ.. ఇప్పుడు ముఖ్యమంత్రి తన భార్య రాజకీయ భవిష్యత్తు కోసం డ్రగ్స్ మాఫియా డాన్ గా పేరొందిన జోవ్ ని విడుదల చేయమని ఒత్తిడి చేస్తున్నారు. తన భార్య కోసం డ్యూటీలో నా క్రెడిబిలిటీని తాకట్టు పెట్టమంటున్నారు. దీనికి నేను అసలు ఒప్పుకోను. ఆ తర్వాత ఇదే విషయమై.. మణిపూర్ పోలీస్ బాస్ తో జరిగిన సమావేశంలో జోవ్ పై దాఖలు చేసిన చార్జ్ షీట్ గురించి డీజీపీ ఆరా తీశారు. అది కోర్టులో ఉందని నేను చెప్పగా.. ముఖ్యమంత్రి చార్జ్ షీట్ ని వెనక్కి తీసుకోవాలని సూచించారని.. వెంటనే జోవ్ పై నమోదు చేసిన అభియోగాలను ఉపసంహరించుకోవాలని నన్ను ఆదేశించారు. నేను అందుకు అంగీకరించకపోవడంతో… సీఎం చాలా ఆగ్రహంగా ఉన్నారని ఎన్ఏబీ ఎస్పీ ద్వారా కబురు పంపించారు.

2019 జనవరి 1న NDPS (Narcotic Drugs and Psychotropic Substances) ప్రత్యేక న్యాయమూర్తి యమ్కామ్ రాథర్.. డీజీపీ, బార్ కౌన్సిల్ ఆఫ్ మణిపూర్ కార్యదర్శికి ఓ లేఖ రాశారు. అప్పటి ఇంఫాల్ వెస్ట్ ఎస్పీ, సీనియర్ న్యాయవాది చంద్రజిత్ శర్మలు… స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి. బిపిన్ చంద్రను కలిసి.. డ్రగ్స్ కేసులో జోవ్ కు వ్యతిరేకంగా దాఖలు చేసిన చార్జి షీట్ ను వెనక్కి తీసుకోవాల్సిందిగా ఒత్తిడి చేశారన్నది ఆ లేఖ సారాంశం. ఇదే విషయాన్ని 2019 మార్చి 3న ఓ స్థానిక దినపత్రిక ప్రస్తావిస్తూ కథనాన్ని ప్రచురించింది. న్యాయవాది చంద్రజిత్, ఇంఫాల్ వెస్ట్ ఎస్పీ డ్రగ్స్ ముఠాపై విచారణను తొక్కిపెట్టాలని చూస్తున్నారని ఆ కథనంలో పేర్కొంది. ఈ వార్తను ఖండిస్తూ ఎన్ఏబీ ఎస్పీ అదే రోజు పత్రికా ప్రకటన విడుదల చేశారు. జోవ్ పై విచారణలో తమపై ఎలాంటి ఒత్తిడి లేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అది జరిగిన తెల్లారి ముఖ్యమంత్రి ఎన్ బిరెన్ సింగ్.. నాతో పాటు మరికొంత మంది పోలీసు అధికారులని తన బంగ్లాకి పిలిపించారు. అక్కడే అందరి ముందు నాపై కోప్పడ్డారు. ఇందుకేనా రాష్ట్ర ప్రభుత్వం తరపున నీకు గ్యాలంటరీ అవార్డు ఇచ్చి సత్కరించింది అని అసహనం వ్యక్తం చేశారు. మా డ్యూటీని మేం సక్రమంగా నిర్వహించినందుకు కూడా ఇలా ఎందుకు తిట్లు తినాలో నాకైతే అర్థం కాలేదు. ఇంత మందితో పోరాడి కేసుని కోర్టు ముందుకు తెచ్చినా.. యథేచ్ఛగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న జోవ్ కి బెయిల్ లభించడంతో ఫేస్ బుక్ ద్వారా నా అసహనాన్ని వ్యక్తం చేశాను. అయితే.. న్యాయవ్యవస్థను తప్పుపట్టడం, న్యాయ ప్రక్రియను అడ్డుకోవడం నా ఉద్దేశం అసలే కాదు. న్యాయమూర్తి స్థానంలో ఉండి పారదర్శకంగా వ్యవహరించకుండా.. ఆ స్థానానికి కళంకం తెచ్చేలా వ్యవహరించిన వారిపైనే నా అసంతృప్తిని వ్యక్తం చేశాను తప్పితే.. భారత న్యాయ వ్యవస్థపై నాకు అపారమైన గౌరవం, నమ్మకం ఉన్నాయి. అని కోర్టుకి సమర్పించిన అఫిడవిట్ లో ఆఫీసర్ బృందా వివరణ ఇచ్చారు.

మణిపూర్ పోలీసు శాఖలో డైనమిక్ ఆఫీసర్ గా బృందా ప్రత్యేక గుర్తింపు పొందారు. విస్తృత దాడులతో అనేక డ్రగ్స్ ముఠాలను అరెస్టు చేసినందుకు గాను 2018లో ఫిక్కీ ఆమెను అవార్డుతో సత్కరించింది. విధి నిర్వహణలో ఉత్తమ సేవల గుర్తింపుగా మణిపూర్ ముఖ్యమంత్రి నుంచి గ్యాలంటరీ అవార్డు సైతం పొందారు. యువతలో స్ఫూర్తి నింపే కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. మణిపూర్ లో సూపర్ కాప్ గా గుర్తింపు పొందిన బృందా కెరీర్ కూడా సమస్యల సుడిగుండంలాగే ఉంటుంది. యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రెంట్ అనే నిషేధిత తిరుగుబాటు సంస్థకి మాజీ అధ్యక్షుడైన ఆర్.కే. మెఘెన్ కి ఆమె కోడలు. 2010లో మెఘెన్ ని భద్రతా దళాలు అరెస్టు చేసినప్పుడు… అతడిని కోర్టులో హాజరుపరచాలంటూ జరిగిన నిరసనల్లో బృందా పాల్గొన్నారు. 2012లో మణిపూర్ పోలీస్ సర్వీస్ పరీక్షకు హాజరై ఉద్యోగానికి ఎంపికయ్యారు. అయితే.. ఆమెపై తిరుగుబాటు సంస్థ సానుభూతిపరురాలిగా ముద్ర వేసిన ప్రభుత్వం.. ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించింది. చివరికి హైకోర్టులో పోరాడి తన హక్కుని సాధించుకున్న బృందా.. డ్యూటీలో చేరిన కొద్ది కాలంలోనే సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు పొందారు. మాదకద్రవ్యాలు, సరిహద్దు వ్యవహారాల అడిషనల్ ఎస్పీగా డ్రగ్స్ మాఫియా ఆటకట్టించారు.

పోలీసులు నిజాయతీగా డ్యూటీ చేయాలని స్టేజీలపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే రాజకీయ నాయకులు… వాళ్ల బొక్కలను బయటపెడితే మాత్రం ఎలా బెదిరింపులకు పాల్పడతారో, ఎన్ని ఇబ్బందుల పాలు చేస్తారో చెప్పేందుకు ఆఫీసర్ బృందా ఉదంతమే ఉదాహరణ. అఫిడవిట్ లో ప్రస్తావించిన అంశాలపై స్పందించిన ముఖ్యమంత్రి బిరెన్ సింగ్.. అందరు పొలిటికల్ లీడర్లు చెప్పినట్లుగానే… బృందాపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. !!

New Indian Express ప్రచురించిన ఆర్టికల్ లింక్

https://www.newindianexpress.com/nation/2020/jul/14/cm-pressured-me-to-let-off-arrested-drug-lord-manipur-lady-cop-to-high-court-2169677.html

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments