మొన్న మేడా మల్లికార్జున రెడ్డి, నిన్న ఆమంచి కృష్ణమోహన్, నేడు అవంతి శ్రీనివాస్… ఇలా అధికార టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు మొదలయ్యాయి. ఎన్నికల వేళ జంప్ జిలానీల సంఖ్య పెరగడం సహజమైనా వరసబెట్టి అధికార పార్టీ నుంచి విపక్షానికి నేతలు వరస కడుతుండటం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరసగా 23 మంది ఎమ్మెల్యేలు జగన్ పార్టీని వీడి సైకిల్ సవారీ చేయగా… ఇప్పుడు టీడీపీ నుంచి ఫ్యాన్ కిందకు చేరేందుకు నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు ప్రధానంగా ఇద్దరు ఎమ్మెల్యేలు ఓ ఎంపీ అధికారికంగా వైసీపీ తీర్థం పుచ్చుకోగా… ఈ లిస్టు మరింత పెరిగే అవకాశం ఉందని ఆయా పార్టీల నేతలు స్పష్టంచేస్తున్నారు.
ఉత్తరాంధ్రలో గంటా గ్యాంగ్ గా ఎదిగిన అవంతి శ్రీనివాస్ ఇప్పుడు ఆయన సాన్నిహిత్యాన్ని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. భీమిలి సీటు విషయంలో ఏర్పడిన విభేదాలు పార్టీ వీడేంత వరకు వెళ్లింది. ప్రజారాజ్యం హయాంలో భీమిలి నుంచి గెలుపొందిన అవంతి 2014 వచ్చే సరికి అదే చోట ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఆశించి భంగపడి తెలుగుదేశం తరపున అనకాపల్లి ఎంపీగా గెలిచారు. అది అయిష్టంగానే. ఆ స్థానాన్ని గంటా కోసం త్యాగం చేసి ఢిల్లీకి చేరినా భీమిలి గల్లీల్లో తన అనుచరగణాన్ని కోల్పోయారు. ఈ విషయాన్ని గుర్తించే మరోమారు తప్పు జరగకూడదని భీమిలి ఎమ్మెల్యే సీటు కోసం టీడీపీతో తీవ్రంగా విభేదించినట్లు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. ఆయన కోసం సీటు త్యాగం చేస్తానని సాక్షాతు గంటా శ్రీనివాసరావు ప్రకటించినా… ఆయన పార్టీ వీడటం అధికారదాహం కోసమేనని గంటా వర్గీయులు కౌంటర్ వేస్తున్నారు. అవంతి పార్టీ ఫిరాయించడంతో విశాఖ టీడీపీ వర్గాలను విస్మయానికి గురిచేసినా… ఆ పార్టీ అధినేత చంద్రబాబు ధీమాగా ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు పార్టీ ఫిరాయించడం సహజమేనని ఆయన భావిస్తున్నారు. అమలు చేసిన పథకాలు, అభివృద్ధి తన పార్టీని గెలిపిస్తుందని చంద్రబాబు నమ్మకంగా ఉన్నారు. మొదట్నుంచి నేతలను కాకుండా పార్టీ అభిమానులు, కార్యకర్తలను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటారని ఆయన వ్యక్తిత్వం తెలిసిన ఎవరైనా చెప్పగలరు. అందువల్లే వరసబెట్టి నేతలు పార్టీ వీడుతున్నా… జాతీయస్థాయిలో ప్రత్యేకహోదా కోసం మద్దతు కోరుతూ రాష్ట్రంలో తన ఛరిష్మా పెంచుకుంటున్నారు. నేతల అవినీతి, కొందరి అసమర్థత చంద్రబాబును కుర్చీ దూరం చేస్తుందని ముందుగానే గుర్తించి ముందస్తు చర్యలకు ఉపక్రమించినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కొందరు నేతలకు ఎలాగూ సీట్లు నిరాకరించాలని భావిస్తున్న చంద్రబాబుకు ఇలా నేతల ఫిరాయింపు లాభమే చేకూరుస్తుందని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ లకు ఫిరాయింపుదారులు మింగుడు పడడంలేదు. ఇన్నాళ్లు అధికారం చెలాయించి ఎన్నికల వేళ తమ నాయకత్వానికి గండికొడతారేమోననే భావన వారిలో ఉంది. ఒకవేళ ఈ ఫిరాయింపుదారులకు టికెట్ ఇస్తే ఆయా నియోజకవర్గ ఇంఛార్జ్ లే వారిని ఓడిస్తారని టీడీపీ వర్గాలు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి.