ప్రశ్నించేందుకే అంటు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. జనసేనతో ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పార్టీలతో ఢీ అంటే ఢీ అంటున్నారు. శ్రీకాకుళం ఉద్దానం కిడ్నీ సమస్య, ఉత్తరాంధ్ర వెనకబాటుతనం వంటి విషయాల్లో ఆలోచింపజేసే విధానాలతో ఆకట్టుకున్నారు. కానీ.. సినిమాల్లో లాగే.. రాజకీయాల్లోను ఆయనలో కంటిన్యుటీ లోపించినట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలను ప్రభావితం చేయగలిగే పలు సంఘటనలు ఇటీవల జరిగినా.. పవన్ మాత్రం వాటిపై కనీసం తమ పార్టీ విధానం ఏంటన్నది క్లారిటీ ఇవ్వలేదు. పార్టీలో పేరున్న లీడర్, ప్రజల దృష్టిని గ్రాబ్ చేయగల నాయకుడు ఆయన ఒక్కరే కాబట్టి… రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై జనసేన స్టాండ్ ని సహజంగా ఆయన నోటి నుంచే వినాలని అంతా అనుకుంటారు. కానీ పవన్ మాత్రం చాలా అంశాలపై మౌనమే సమాధానమనే ధోరణిలో ఉన్నట్లు కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు. సంప్రదాయ ప్రకారం ఏ అధికార పార్టీ అయినా ఈ సమయంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలి. కానీ అధికార టీడీపీ రూ. 2లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. రైతు రుణ మాఫీ ఆఖరి రెండు విడతల త్వరలో చెల్లిస్తామని చెబుతు ఇంకా పథకం అమలు పూర్తి కాలేదని అంగీకరించింది. టీడీపీ, వైసీపీకి ప్రత్యామ్నాయం తామే అని చెబుతున్న జనసేనాని మాత్రం.. బడ్జెట్ పై కనీసం ఇంత వరకు మీడియా ముఖంగా ఎలాంటి స్టేట్ మెంట్స్ చేయలేదు. 2014లో నరేంద్ర మోడీతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నార్ పవన్ కల్యాణ్. 3 ఏళ్ల తర్వాత తిరుపతి సభలో ప్రత్యేక హోదాకి బదులు మోడీ రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎన్నికలకు 2 నెలల ముందు ఇటీవల మోడీ గుంటూరు సభలో పాల్గొని.. అంత ఇచ్చాం, ఇంత ఇచ్చామని చెప్పి వెళ్లారు. కానీ పవన్ కల్యాణ్ మోడీ సభపై కానీ, సభలో ఆయన మాట్లాడిన అంశాలపై కానీ ఇంత వరకు స్పందించలేదు. నాడు కేసీఆర్ బీసీ ప్రధానిని తిట్టారంటూ గరంగరమైన పవర్ స్టార్.. నేడు అదే బీసీ ప్రధానిని టీడీపీ బ్యాచ్ గో బ్యాక్ అంటూ ఉంటే.. పవన్ కనీసం స్పందించలేదు.
కానీ ఇదే అంశంపై స్పందించిన జనసేన పార్టీ నేతలు.. మోడీ సభ విషయంలో టీడీపీ ప్లాన్ లో తాము చిక్కుకోదలుచుకోలేదని, అందుకే నిరసనలకు తాము మద్దతు ఇవ్వలేదని చెప్పారు. “టీడీపీ నిరసనలకు మద్దతు తెలిపితే.. బాబుతో కలిసిపోయారని ప్రచారం చేస్తారు. మద్దతు ఇవ్వకుంటే బీజీపీ గూటి పక్షులు అంటారు. వాళ్లు ఏమైనా అనుకోనివ్వండి. రాజకీయంగా మా వ్యూహాలు మాకు ఉన్నాయి.” అని అన్నారు. మరి ఇదే మాట పవన్ నోటి నుంచి వస్తే.. అవతలి పార్టీలకి తగిలే దెబ్బ గట్టిగా ఉంటుంది కదా. ఆ దిశగా జనసేనాని ఎందుకు ముందడుగు వేయడం లేదో…. !