షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడే సన్నబియ్యం రకం తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్ 15048)కు జాతీయ, ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇమేజ్ కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ బియ్యం రకానికి మరింత ప్రాచుర్యం కల్పించి మార్కెటింగ్ అవకాశాలు పెంచేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB)తో చేతులు కలిపింది. ఈ మేరకు జూలై 28న ప్రభుత్వం, వ్యవసాయ యూనివర్సిటీ, ఐఎస్బీ మధ్య ఒప్పందం కుదిరింది.
తెలంగాణ సోనాను 2015లో జయశంకర్ వ్యవసాయవర్సిటీ రూపొందించింది. ఈ బియ్యంలో గ్లూకోజ్శాతం (గ్రైసిమిక్స్) తక్కువగా ఉన్నట్టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) తేల్చింది. దీంతోపాటు అంతర్జాతీయ జర్నల్స్‌లో రీసర్చ్ రిజల్స్ట్ ను ప్రచురించింది. విటమిన్-B3 కూడా పుష్కలంగా ఉన్నట్టు గుర్తించింది.
ఇతర రకాల సాగుతో పోల్చితే తెలంగాణ సోనా తక్కువ సమయంలో పంటకొస్తుంది. వానకాలం, యాసంగి రెండు సీజన్లలోనూ సాగుకు ఇది అనుకూలమైది. సాగునీరు, ఎరువులు, కాలం, ఖర్చును ఆదాచేయడంతోపాటు అధిక దిగుబడులు ఇచ్చే తెలంగాణ సోనాను ఈ సీజన్లో 10 లక్షల ఎకరాల్లో పండించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నియంత్రిత సాగువిధానంలో రైతులకు సూచించింది.