ఈ ఆర్టికల్ రాసినవారు చరిత్రకారులు, ఆలేరు శ్రీరామరాజు హరగోపాల్
– శ్రీరామరాజు హరగోపాల్
☛ స్టోరీ కింద ఫోటోలు ఉన్నాయి…
నల్గొండ జిల్లాలోని గురిజాల శాలిగౌరారం మండలంలోని చిన్న గ్రామం.ఎన్నాళ్ళగానో తమవూరు గురిజాలకు రమ్మని పిలుస్తున్న నవీన్ భట్టుతో నేను, మా చంటి, రాగిమురళి కలిసి (12.12.18)న గురిజాల గ్రామానికి వెళ్ళాం. మాకక్కడ ఆ గుడిలో ఎపుడుండే మల్లయ్య, మజార్, ఇంకా ఇద్దరు పిల్లలు మా పనిలో బాగా సహకరించారు. అద్భుతమైన దేవాలయ ప్రాంగణం. అందమైన, అపూర్వమైన శిల్పాలు చరిత్రకు తార్కాణాలుగా నిలిచివున్నాయి.
☛ గురిజాల మూసీనది ఒడ్డున వున్న ఒక పురాతన గ్రామం. పాత గురిజాల నది వరదలో మునిగిపోతే కొత్త గురిజాల మిట్టన కట్టబడింది. పాతగురిజాల పాటిగడ్డలో ఆలయాల ప్రాంగణం వుంది. అందులో ఇపుడు బాగున్నది ఒక శివాలయమే. ఆ శివాలయంలో 14 స్తంభాల అర్ధమంటపం, అంతరాళం, గర్భగుడి వున్నాయి. గుడికప్పుపైన గర్భగుడి, అంతరాళాలపైన రాతి విమానాలున్నాయి. 12 అడుగుల ఎత్తున్న ఈ గుడికి నలువైపుల అంచులున్న చూరు (ప్రస్తరం) వుంది. ముఖ మంటపంలో నేలమీద కొత్తబండలు పరిచారు. అందువల్ల నందిమంటపం వుండేదో తెలియదు. కాని, ముఖం చెదిరిన కాకతీయుల కాలంనాటి తెల్లరాతి నంది వుంది. లోపల వున్న చతురస్రాకారపు ప్రాణమట్టం మీద గోధుమరంగులో వున్న బాణలింగం వుంది. అంతరాళం, గర్భగుడుల ద్వారబంధాలపై కలశాలు వున్నాయి. లలాటబింబంగా గజలక్ష్మి వుంది. అర్ధమంటపం మూడువైపుల తెరిచివున్నా, ప్రవేశద్వారం మంటపంతో ఉత్తరం దిశలో వుంది. గర్భగుడి తూర్పుముఖంగా వుంది. కొత్తగా కట్టిన దారి తూర్పున కట్టారు. గుడికి ఈశాన్యదిశలో ఎక్కడాలేని విధంగా శాసనస్తంభం దిమ్మె వుంది. పక్కన 3ముక్కలుగా(అడుగుముక్కలేదు) విరిగివున్న 9వ శతాబ్దపు తెలుగులిపిలో వున్న తెలుగుశాసనస్తంభం పడివుంది. దానిని చదివారని, నల్లగొండ జిల్లా శాసనాలసంపుటి2లో వుందని శాసనపరిశోధకులు, చరిత్రకారులు దామరాజు సూర్యకుమార్ చెప్పారు.
☛ శివాలయానికి ఉత్తరదిశలో కూలిపోయిన గుడిగోడల్లో గోడకానించి నిలిపిన 3గురు అమ్మదేవతల శిల్పాలున్నాయి. వెతికితే మరో అమ్మదేవత విగ్రహం దొరికింది. గుడికి ఈశాన్యభాగంలో పడవేసివున్న అందమైన శిల్పాలు భైరవుడు, మహిషాసురమర్దిని కనిపించారు. గుడికి ద్వారబంధానికి ఆనించిపెట్టిన తలతెగిన వీరగల్లు ఒకటి వుంది. గుడిలోని అమ్మదేవతలలో (దక్షిణం నుంచి) మొదటి దేవతాశిల్పం జటామ కుటకిరీటధారిణి, చతుర్భుజి, కుడిచేతుల్లో కత్తి, ఢమరుకం, ఎడమచేతుల్లో రక్తపాత్ర, ఖట్వాంగాలున్నాయి. సర్పహారం ధరించివుంది. శైలిని బట్టి కళ్యాణీచాళుక్యుల కాలంనాటిదనిపిస్తున్నది. అయితే ఈ దేవత శాక్తేయ సంప్రదాయానికి చెందిన దేవత. (Sakta goddesses from the sort of Tantric traditions that are assembled together in the Jayadarathayāmala-Jason Schwartz)
☛ ఉత్తరం వైపునవున్న శిల్పం కిరీటం తెగిపోయివుంది. చతుర్భుజియైన ఈ దేవత కుడిచేతుల్లో ఖడ్గం, ఢమరుకాలు, ఎడమచేతుల్లో రక్తపాత్ర, సర్పం, ఖట్వాంగాలున్నాయి. పీనపయోధరాలు కలిగిన దేవత అర్ధనగ్నంగానే వుంది. కుడివైపున కింద భక్తురాలు దేవతను పూజిస్తున్నట్టుగా వుంది. శైలి రాష్ట్ర కూటులనాటిదనిపిస్తున్నది.ఈ దేవత కూడా శాక్తేయదేవతననిపిస్తున్నది. మధ్యలోనున్న దేవత చాముండి. ఈ దేవతకూడా చతుర్భుజే. కుడిచేతుల్లో ఖడ్గం, ఢమరుకం, ఎడమచేతుల్లో రక్తపాత్ర, త్రిశూలం కలిగివుంది. కపాలమాలలు ధరించిన చాముండికి వాహనంగా సర్పాన్ని తింటున్న ముంగిసవుంది. ఇటువంటి ముంగిస దేవత గురించి లలితోపాఖ్యానంలో వుందని జేసన్ ష్వర్ట్జ్ అంటున్నాడు. ముంగిస లేదా నక్క వాహనం గల దేవతను కాకతిగా భావించి చెప్పినవారు వేటూరి ప్రభాకరశాస్త్రి. ముంగిస, నక్క, పంది వాహనంగల మాతృకల విగ్రహాలెన్నో కనిపిస్తున్నాయి. అవన్నీ కాకతి దేవతలు కావడానికి అవకాశం లేదు. చాముండ సప్తమాతృకలలో సౌమ్యమూర్తిగా ఈ శిల్పాలలో కనిపిస్తున్నది. శాక్తేయులు, కాలాముఖులు విస్తరించిన కాలంలో ఈ దేవతల శిల్పాలు, వాటి ఆరాధనలు చేసే దేవాలయాలు ఎక్కువగా నిర్మించబడ్డవనిపిస్తున్నది. ప్రతిమాలక్షణాలను బట్టి ఈ దేవత కాకతీయశిల్పమనిపించదు. అంతకు ముందటి కాలానిదే. అక్కడ దొరికిన శాసనలిపి కూడా 9వ శతాబ్దానిది. శాసనవిషయం బయటపడకుండా ఈ దేవతల గురించి అందులో ప్రస్తావించబడిందో లేదో చెప్పలేం.
☛ ఈ మూడు దేవతలతో పాటు మాకు ఆ గుడి ఆవరణలో మరో అమ్మదేవత ఏ వాహనంలేని తెల్లరాతి చాముండి శిల్పం దొరికింది. మరొక పక్క దాదాపు మూడడుగుల ఎత్తున్న మహిషాసురమర్దిని శిల్పం, నాలుగడుగుల ఎత్తు, రెండడుగుల వెడల్పు అడుగుమందంవున్న భైరవుని విగ్రహం అక్కడే లభించాయి.
☛ శివాలయానికి ఎదురుగా బయట దక్షిణాభిముఖుడైన హనుమంతుని గుడి వుంది. కొత్తగా కట్టిన గది. ముందర కొత్త ధ్వజస్తంభం. ఆ దేవాలయపు ముందరి గోడకానించిపెట్టిన నెమలి వాహనంతో వున్న వల్లీ సహిత సుబ్రహ్మణ్యస్వామి శిల్పం వుంది. వెనకగోడ పక్కన భైరవుని శిల్పం పడేసివుంది. ఇట్లాంటి శిల్పాలు ఎక్కడెక్కడ పడివున్నాయో మరి. ఈ గుడులకు దూరంగా ఈశాన్యంగా పొలాల్లో వున్న దేవాలయశిథిలాలలో తవ్విపారేసిన ధ్వజస్తంభం, అవతలికి పడేసిన వినాయక(రాష్ట్రకూటశైలి) శిల్పం, ఒక గూడు వంటి గుడి పుట్టలతో నిండి కనిపించాయి.
☛ అంతటా నిధులవేటల్లో దేవాలయాలన్నీ కుప్పకూలిపోయాయి. శిల్పాలకు దిక్కులేదు, కట్టడాలకు రక్షణలేదు. శాసనాలు విరిగి ముక్కలైవున్నాయి. మూసీనది అంచున ఒక తెల్లరాతిగుండుమీద పాదాలు, పానవట్టంతో లింగం చెక్కివున్నాయి ఒక అంచున భైరవుని శిల్పం చెక్కివుంది. పరమ మాహేశ్వరుల ఆరాధనాస్థలమై వుంటుంది.
శివాలయానికి 50 లక్షలు మంజూరైనాయట. కాని, వాటిని తెచ్చుకుని పునరుద్ధరణ చేయగలవారు లేరని గ్రామస్తుడు, శివాలయానికి వాలంటీరుగా సేవలందిస్తున్న మల్లయ్య అన్నాడు.
-
-
-
-
-
-
శ్రీరామరాజు హరగోపాల్
-
-
-
-
-