కరెంట్ అఫైర్స్ – జూలై 31, 2020

ఏపీ ఏస్ఈసీగా రమేష్ కుమార్ పునర్నియామకం
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా (SEC) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పునర్నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూలై 30న ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనను తిరిగి నియమిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు రాజపత్రం(గెజిట్) విడుదల చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్ళి గోపాల కృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ లో వచ్చే తుది తీర్పునకు లోబడి పదవీ పునరుద్ధరణ నోటిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు.
స్థానిక ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో.. ప్రభుత్వం రమేశ్ కుమార్ ని పదవి నుంచి తొలగించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టుని ఆశ్రయించారు.

ఆంధ్రప్రదేశ్ లో ఆమెజాన్ ‘సహేలి’
మహిళల్లో సాధికారిత పెంచడం, వారిని పారిశామ్రికవేత్తలుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా రూపొందిన ‘సహేలి’ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలుపరిచే ప్రక్రియలో భాగస్వామి కావడానికి అమెజాన్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. స్థానిక ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పించడం, అమ్మకాలకు ఊతమివ్వడం అమెజాన్‌ చేస్తుంది. హస్తకళలు, బొమ్మల తయారీ, వివిధ రకాల ఉత్పత్తులను తయారుచేసే మహిళలను ఈ కార్యక్రమంలో ప్రోత్సహిస్తారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గురువారం అమెజాన్‌ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కంపెనీ ఈ మేరకు అంగీకరించింది. సహేలీ అనే కార్యక్రమాన్ని ఆమెజాన్ ప్రారంభించింది.

మారిషస్ సుప్రీంకోర్టు భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
పోర్ట్‌ లూయీస్‌లో నిర్మించిన మారిషస్‌ సుప్రీంకోర్టు నూతన భవనాన్ని జూలై 30న మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ జగన్నాథ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఆన్‌లైన్‌ విధానంలో ప్రారంభించారు. భారత్, మారిషస్‌ దేశాల మధ్య సహకారానికి ఈ భవనం ఉదాహరణగా నిలుస్తుందని ప్రధాని మోదీ తెలిపారు.
అఫ్గానిస్తాన్‌ పార్లమెంట్‌ భవన నిర్మాణంలో, నైగర్‌లో మహాత్మాగాంధీ కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణంలో, నేపాల్‌లో ఎమర్జెన్సీ అండ్‌ ట్రామా సెంటర్‌ ఏర్పాటులో, శ్రీలంకకు ఎమర్జెన్సీ అంబులెన్స్‌ సర్వీస్‌ల రూపకల్పనలో, మాల్దీవుల్లో క్రికెట్‌ క్రీడ అభివృద్ధిలో భారత్‌ భాగస్వామ్యం భారతీయులందరికీ గర్వకారణమని మోదీ తెలిపారు. సుప్రీంకోర్టు భవన నిర్మాణంలోభారత్‌ అందించిన సహకారానికి మారిషస్‌ ప్రధాని జగన్నాథ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

జీబీపీ 2 బిలియన్‌ సైక్లింగ్ ప్రారంభించిన బ్రిటన్ ప్రధాని
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్స్ ‘మేడిన్ ఇండియా’ హీరో సైకిల్ తొక్కి అందరిని ఆశ్చర్యపరిచారు. కరోనాపై పోరులో భాగాంగా స్థూలకాయానికి (ఒబెసిటీ)కి వ్యతిరేకంగా బ్రిటన్‌ ప్రభుత్వం చేపట్టిన కొత్త జీబీపీ 2 బిలియన్‌ సైక్లింగ్, వాకింగ్ డ్రైవ్‌ను ప్రారంభించిన బోరిస్‌.. దానిలో భాగంగా నాటింగ్‌హామ్‌లోని హెరిటేజ్ సెంట‌ర్‌లో సైకిల్ తొక్కారు. బ్రిటన్‌లో కరోనా వైరస్ కారణంగా మృతి చెందుతున్నవారిలో చాలామంది స్థూలకాయులేనని, మితిమీరిన శరీర బరువు వల్ల వారు మృత్యువాత పడుతున్నారని కొందరు నిపుణులు ఇటీవల తేల్చారు. ప్రధాని తొక్కిన సైకిల్ ఇండియాకు చెందిన హీరో మోటార్స్ కంపెనీది. వికింగ్ ప్రో బైక్ పేరుతో ఆ సైకిల్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేశారు. మాంచెస్టర్ లో సైకిల్‌ను డిజైన్ చేశారు.

జాతీయ యుద్ధ స్మారక స్థూపంపై గల్వాన్ వీరుల పేర్లు
తూర్పు లద్దాఖ్ లోని గల్వాన్ లోయలో ప్రాణాలు కోల్పోయిన 20 మంది భారత సైనికుల పేర్లను దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక స్థూపంపై లిఖించనున్నారని రక్షణ శాఖ అధికారులు జూలై 30న ఒక ప్రకటన విడుదల చేశారు. జూన్ 15న చైనా సైన్యంతో దాదాపు 7 గంటలు సాగిన ఘర్షణలో 16 బిహార్ రెజిమెంట్ కు కమాండింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న తెలంగాణకు చెందిన కల్నల్ బి. సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు మృతి చెందారు.

వలస కూలీలకు 3లక్షల ఉద్యోగాలు : సోనూసూద్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సోను సూద్ జూలై 30 తన 47వ పుట్టిన రోజు సందర్భంగా తాను ఏర్పాటు చేసిన ప్రవాసీ రోజ్ గార్ పోర్టల్ ద్వారా వలస కూలీలకు మరో 3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని ప్రకటించారు. మంచి వేతనంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ వంటి అన్ని ప్రయోజనాలతో ఈ ఉద్యోగాలు ఉంటాయని వెల్లడించారు. తన ప్రయత్నంలో భాగం పంచుకొంటున్న అమెజాన్, సోడెక్స్, ట్రిడెంట్ సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు.

పూణేలో మృతిచెందిన ఆడపులి ‘నందిని’
మహారాష్ట్రలోని పూణే నగరంలోని రాజీవ్ గాంధీ జులాజికల్ పార్కు, వన్యప్రాణుల పరిశోధనా కేంద్రంలో ‘నందిని’ అనే ఓ ఆడపులి మృతి చెందింది. పదహారున్నర సంవత్సరాల వయసున్న ఆడపులి వయసు మీద పడి పూణే నగరంలోని కట్రాజ్ ప్రాంతంలోని జంతుప్రదర్శన శాలలో మృత్యువాత పడింది. వయసు మీద పడటంతోనే ఆడపులి ‘నందిని’ అనారోగ్యానికి గురై మరణించిందని పూణే జంతుప్రదర్శనశాల అధికారులు వెల్లడించారు.

పూణెలో ‘డొనేట్‌ ప్లాస్మా’ కార్యక్రమం ప్రారంభం
సైబరాబాద్‌ పోలీస్‌, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సెల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘డొనేట్‌ ప్లాస్మా’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ వంద ప్రాణాలను కాపాడింది. సైబరాబాద్ పోలీసుల స్ఫూర్తితో పుణె పోలీసులు ఈ యాప్ ద్వారా కరోనా బాధితులకు సేవలు అందించాలని నిర్ణయించారు. జూలై 30న జరిగిన పుణె కౌన్సెల్‌ సమావేశానికి హాజరైన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే.. డొనేట్‌ ప్లాస్మా యాప్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ను ఠాక్రే ప్రశంసించారు.
తెలంగాణ చూపిన బాటను ఇతర రాష్ట్రాలు అనుసరించడంపై సీపీ ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమం మొదలు పెట్టిన 6 రోజుల్లోనే కరోనా మహమ్మారి చెర నుంచి బయట పడిన వంద మంది ప్లాస్మాదానం చేయగా.. మరో 400 మంది ప్లాస్మా దానానికి సిద్ధంగా ఉన్నట్లు సీపీ సజ్జనార్‌ వెల్లడించారు. వారంతా డొనేట్‌ ప్లాస్మా డాట్‌ ఎస్సీఎస్సీ డాట్‌ ఇన్‌లో రిజిస్టరై ఉన్నారని పేర్కొన్నారు. వారందరికీ సెల్యూట్‌ చెప్పారు. డొనేట్‌ ప్లాస్మా ద్వారా అందిన ప్లాస్మాతో ఇప్పటి వరకు 100 మందికి పైగా కరోనా బాధితుల ప్రాణాలు కాపాడామని తెలిపారు.

పీఎంజీకేవై కింద రెండో విడతలో తెలంగాణకు 4.79 లక్షల టన్నుల బియ్యం
ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన(పీఎంజీకేవై) పథకం రెండో విడతలో భాగంగా తెలంగాణకు కేంద్రం 4.79 లక్షల టన్నుల బియ్యాన్ని కేటాయించినట్లు భారత ఆహార సంస్థ(ఎఫ్ సీఐ) వెల్లడించింది. జూలై 8 నుంచి 27 వరకు 19.98లక్షల టన్నుల బియ్యం, 13.42 లక్షల టన్నుల గోధుమలు కలిపి మొత్తం 30.40లక్షల టన్ను ల ఆహార ధాన్యాలు(జూలై నెల కోటాలో 83శాతం) దేశ వ్యాప్తంగా సరఫరా చేసినట్లు పేర్కొంది.

డిబ్యూటీ కలెక్టర్లుగా బబితా ఫోగాట్, కవితా దేవి
భారత స్టార్ రెజ్లర్ బబితా ఫోగాట్, కబడ్డీ క్రీడాకారిణి కవితా దేవిలను క్రీడా, యువజన వ్యవహారాల శాఖ డిప్యూటీ డైరెక్టర్లుగా నియమిస్తూ హర్యానా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పోస్టు కోసం అథ్లెట్లు ఇద్దరూ దరఖాస్తు చేసుకోగా.. ఇద్దరికీ చోటుకల్పించారు. ఫోగాట్, దేవిల నియామకంపై రెండ్రోజుల క్రితమే హర్యానా క్రీడా, యువజన వ్యవహారాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విడివిడిగా రెండు ఉత్తర్వులు జారీ చేశారు. నెలరోజుల్లోగా పంచకుల డైరెక్టరేట్‌లో రిపోర్టు చేయాలని పేర్కొన్నారు.

శకుంతలాదేవీకి గిన్నిస్ సర్టిఫికెట్
హ్యూమన్‌ కంప్యూటర్‌గా ప్రసిద్ధికెక్కిన శకుంతలాదేవికి.. ‘వేగంగా గణించే మనిషి’గా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ జూలై 30న ధ్రువీకరణ పత్రాన్ని ఇచ్చింది. 1980 జూన్‌ 18న ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌లో 13 అంకెలు ఉన్న రెండు సంఖ్యలను గుణించి కేవలం 28 సెకండ్లలోనే ఆమె సరైన సమాధానం చెప్పారు. శకుంతల 2013లో మరణించారు. ఆమె లండన్‌లో సమాధానం చెప్పి దాదాపు 40 ఏండ్ల తర్వాత ఇప్పుడు ధ్రువీకణ పత్రాన్ని ఆమె కూతురుకు అందజేసింది.

దేశంలో హెర్డ్‌ ఇమ్యూనిటీ కష్టం : కేంద్రం
భారత్‌లాంటి అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో నివసించే జనాభాలో వైరస్‌ను తట్టుకునే యాంటీబాడీలు బాగా అభివృద్ధి చెందినప్పటికీ అవి స్వల్పకాలం మాత్రమే ఉంటాయని వెల్లడించింది. టీకా కార్యక్రమం ద్వారా మాత్రమే ఇమ్యూనిటీని సాధించగలమని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి రాజేష్‌ భూషణ్‌ గురువారం మీడియా సమావేశంలో చెప్పారు. ఒక ప్రాంతంలో ఉండే జనాభాలో ఎంత మందిలో యాంటీ బాడీలు అభివృద్ధి చెందితే హెర్డ్‌ ఇమ్యూనిటీని సాధించవచ్చునన్న అంశంలో శాస్త్రవేత్తల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 70 నుంచి 90 శాతం ప్రజల్లో యాంటీబాడీలు ఉత్పత్తి అయితే దానిని హెర్డ్‌ ఇమ్యూనిటీగా పరిగణించవచ్చునని ఇప్పటివరకు భావిస్తున్నారు. అయితే 60 శాతం మందిలో వచ్చినా దానిని హెర్డ్‌ ఇమ్యూనిటీగా చెప్పుకోవచ్చునని వైరాలజిస్టు షాహిద్‌ జమీల్‌ చెప్పారు.

ఢిల్లీలో డీజిల్ పై వ్యాట్ తగ్గింపు
ఢిల్లీలో డీజిల్‌పై ఉన్న వ్యాట్‌ను 30 నుంచి 16.75 శాతానికి తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఢిల్లీలో లీట‌రు రూ.82 ఉన్న డీజిల్ ధ‌ర రూ.73.64కు త‌గ్గుతుంద‌ని ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ జూలై 30న తెలిపారు. తమ ప్రభుత్వ నిర్ణయం వల్ల వినియోగ‌దారుల‌కు డీజిల్‌పై లీట‌ర‌కు రూ.8.36 మేర ఆదా అవుతుంద‌ని వివ‌రించారు.
ఢిల్లీ ప్రభుత్వ జాబ్ పోర్టల్ కు విశేష స్పందన
ఢిల్లీ ప్రభుత్వం ఇటీవ‌ల ప్రారంభించిన జాబ్ పోర్టల్ కు విశేష స్పంద‌న వస్తుందని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. వారం రోజుల్లోనే సుమారు 7,577 కంపెనీలు రిజిష్టర్ చేసుకున్నాయ‌ని చెప్పారు. 2,04,785 ఉద్యోగాల కోసం ఆయా సంస్థలు ఈ జాబ్ పోర్టల్ లో పేర్కొన్నాయ‌న్నారు. ఉద్యోగాల కోసం 3,22,865 మంది త‌మ పేర్లను న‌మోదు చేసుకున్నార‌ని కేజ్రీవాల్ వెల్లడించారు.

జయా జైట్లీకి నాలుగేళ్లు జైలు శిక్ష
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సమతా పార్టీ మాజీ అధ్యక్షురాలు జయా జైట్లీకి ఢిల్లీ కోర్టు 4 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఆమెతోపాటు మరొక ఇద్దరికి ఇదే శిక్ష విధిస్తూ ఢిల్లీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు జూలై 30న తీర్పునిచ్చింది. 2001నాటి రక్షణ శాఖ ఒప్పందంలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు రుజువు కావడంతో వీరికి ఈ శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. మరో రూ.1 లక్ష చొప్పున జరిమానా కూడా విధించింది. దోషులుగా తేలిన వారు జయా జైట్లీ, సమతా పార్టీ మాజీ నేత గోపాల్ పచేర్వాల్, మేజర్ జనరల్ (రిటైర్డ్) ఎస్‌పీ ముర్గయి.

మార్స్ పైకి నాసా పెర్సివరెన్స్ రోవర్
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ‘నాసా’మార్స్ ప్రయోగంలో మరో ముందడుగు వేసింది. మార్స్ పై ఇంతకుముందు జీవం ఉందా? లేదా? అనే దానిపై పరిశోధనలు చేసేందుకు పెర్సివరెన్స్ రోవర్ను జూలై 30న అంతరిక్షంలోకి పంపింది. దాదాపు7 నెలలు ప్రయాణించి, 2021 ఫిబ్రవరిలో ఇది మార్స్ పై దిగనుంది. కారు సైజులో ఉండే ఈరోవర్ ఇంతవరకు తయారుచేసిన అన్నింటికన్నా పెద్దది. ఇందులో 25 కెమెరాలు, రెండు మైక్రోఫోన్లు ,లేజర్స్ ఉంటాయి.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments