కరెంట్ అఫైర్స్ – ఆగస్టు 5, 2020

పీఓకే, జమ్మూలోని కొన్ని ప్రాంతాలతో పాక్ మ్యాప్

భారత్‌లోని కొన్ని కీలక భూభాగాలు తమవేనని చెప్పుకుంటూ ఇటీవల నేపాల్‌ కొత్త మ్యాప్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి అక్కడ పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ఇదే తరహాలో పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)తోపాటు జమ్మూకశ్మీర్‌ను తమలో కలిపేసుకుంటూ పాకిస్తాన్‌ ప్రభుత్వం కొత్త మ్యాప్‌ రూపొందించింది. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని ఇండియా ప్రభుత్వం నిర్వీర్యం చేసి ఆగస్టు 5కి ఏడాది కానుండగా ఆగస్టు 4 మ్యాప్ ను పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ ఆవిష్కరించారు.

గుజరాత్‌లోని జునాగఢ్, మనవదర్, సర్‌ క్రీక్‌లను కూడా ఈ పటంలో చేర్చడం గమనార్హం. అంతేకాకుండా నియంత్రణ రేఖను(ఎల్‌ఎసీ)ని కారాకోరం పాస్‌ దాకా పొడిగించింది. సియాచిన్‌ను పూర్తిగా పాక్‌లో అంతర్భాగంగా మార్చేసింది. పాక్‌ ప్రజలతోపాటు కశ్మీర్‌ ప్రజల ఆకాంక్షలకు సైతం ఈ మ్యాప్‌ ప్రతిరూపమని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించారు. ఇప్పటినుంచి ఇదే పాకిస్తాన్‌ అధికారిక పటమని స్పష్టం చేశారు. ఆర్టికల్‌ 370ని నిర్వీర్యం చేసి ఏడాది అవుతున్న సందర్భంగా బుధవారం ‘బ్లాక్‌ డే’గా పాటించనున్నట్లు పాకిస్తాన్‌ పేర్కొంది.

☛ యూకే–భారత్‌ మధ్య స్పైస్‌జెట్‌ సర్వీసులు

బడ్జెట్‌ క్యారియర్‌ స్పైస్‌జెట్‌ యూకే – భారత్‌ మధ్య విమాన సర్వీసులను నడపనుంది. సెప్టెంబర్‌ 1 నుంచి ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. లండన్‌ హీత్రో ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఈ మేరకు స్లాట్స్‌ దక్కించుకున్నట్టు క్యారియర్‌ స్పైస్‌జెట్‌ కంపెనీ ప్రకటించింది. ఎయిర్‌ బబుల్‌ ఒప్పందంలో భాగంగా అక్టోబరు 23వరకు ఈ స్లాట్స్‌ పొందామని, అంతర్జాతీయ సర్వీసులు తిరిగి ప్రారంభం అవగానే సాధారణ విమాన సేవలను తిరిగి మొదలుపెడతామని వెల్లడించింది. ఎయిర్‌ బబుల్‌ ఒప్పందం ప్రకారం నిబంధనలు, పరిమితులతో రెండుదేశాలకు చెందిన విమానయాన సంస్థలు అంతర్జాతీయ సర్వీసులను నడపవచ్చు.

☛ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివాజీరావు పాటిల్ కన్నుమూత

సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివాజీరావు పాటిల్ నీలాంగేకర్ (88) ఆగస్టు 4న కరోనాతో తెల్లవారుజామున కన్నుమూశారు. లాతూర్ జిల్లా నీలంగ నగరానికి చెందిన పాటిల్ 1985 జూన్ నుంచి మార్చి 1986 మార్చి వరకు సీఎంగా పనిచేశారు.

☛ జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో మొట్టమొదటిసారి సాయుధ మహిళా సైనికులు

జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో మొట్టమొదటిసారి సాయుధులైన మహిళా సైనికులను కేంద్రం మోహరించింది. అసోం రైఫిల్స్ విభాగంలో మొట్టమొదటిసారి మహిళలను సరిహద్దుల్లో మోహరించారు. పారామిలటరీ విభాగంలో మహిళలను మొదటిసారి నియమించారు. రైఫిళ్లు చేతబట్టిన అసోం రైఫిల్స్ మహిళా సైనికులు సరిహద్దుల్లో పహరా కాస్తుండటంతో స్థానిక ప్రజలు వారికి సంతోషంతో స్వాగతం పలికారు. ఎముకలు కొరికే చలిలో సాయుధ మహిళా సైనికులు అనుక్షణం అప్రమత్తంగా సరిహద్దుల్లో పహరా కాశారు.

☛ ఆగస్టు 6 నుంచి 4వ విడత చేప పిల్లల పంపిణీ

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నాలుగో విడత ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమం ఆగస్టు 6 నుంచి ప్రారంభం కానుంది. నాగర్‌కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో పాలెం గ్రామంలోని పెంటాని చెరువులో పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్థి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, వ్యవసాయ మంత్రి నిరంజన్‌ రెడ్డి కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 24 వేల రిజర్వాయర్లు, చెరువుల్లో రూ.50 కోట్ల ఖర్చుతో 81 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.

☛ ఇక్రిశాట్‌, ఐసీఏఆర్‌ సహకారంతో నూతన వేరుశనగ వంగడాలు

ఇక్రిశాట్‌, ఐసీఏఆర్‌ సహకారంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నూతన వేరుశనగ వంగడాలను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ఇక్రిశాట్‌ అభివృద్ధి చేసిన నూతన వేరుశనగ వంగడాలను మినిస్టర్‌ క్వార్టర్స్‌లోని మంత్రి నివాసంలో ఆగస్టు 4 విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 80 శాతం ఓలిక్‌ యాసిడ్‌ ఉండే గిరినార్‌ 4, గిరినార్‌ 5 వేరుశనగ వంగడాలను రాబోయే యాసంగి నాటికి బ్రీడర్‌ సీడ్‌, అనంతరం సర్టిఫైడ్‌ సీడ్‌ ఉత్పత్తి చేసి అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ రకాలను తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా పెద్ద ఎత్తున రైతాంగం ద్వారా విత్తనాభివృద్ధి సంస్థ సహకారంతో విత్తనోత్పత్తి చేయించాలని ఈ సందర్భంగా ఇక్రిసాట్‌ శాస్త్రవేత్తలు మంత్రిని కోరారు.

☛ అనంతపురంలో వీర వాహన తయారీ ప్లాంట్

కియా’ కార్ల యూనిట్‌తో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న ‘అనంతపురంలో’లో మరో భారీ వాహనాల కంపెనీ ఏర్పాటు కాబోతోంది. ఎలక్ట్రిక్‌ బస్సుల యూనిట్‌ నెలకొల్పేందుకు వీర వాహన కంపెనీ ముందుకు వచ్చింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాన్ని సైతం చేసుకుంది. వీర వాహన ఉద్యోగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ రూ.1000 కోట్లతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. దీని కోసం సోమందేపల్లి మండల సమీపంలోని గుడిపల్లి గ్రామంలో 124 ఎకరాల భూమిని కేటాయించారు. ఏటా 3 వేల బస్సుల తయారీ లక్ష్యంతో యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్న వీర వాహన్‌ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. వీర వాహన్‌ ఉద్యోగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో ప్రత్యక్షంగా 3 వేల మందికి, పరోక్షంగా 10 వేల మందికిమొత్తంగా 13 వేల మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి.

☛ ఏపీలో ప్రత్యేకంగా పారిశ్రామిక భద్రతా విధానం

రాష్ట్రంలో పారిశ్రామిక ప్రమాదాల నివారణకు ప్రత్యేకంగా పారిశ్రామిక భద్రతా విధానాన్ని తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిశ్రమల భద్రత కోసం ప్రస్తుతమున్న రెగ్యులేటరీ వ్యవస్థలన్నింటినీ ఈ విధానం కిందకు తీసుకురావాల్సిందిగా అధికారులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకునేలా విధానాలు రూపొందించాలని.. ఫ్యాక్టరీలపై బలమైన పర్యవేక్షణ యంత్రాంగం, థర్డ్‌ పార్టీ తనిఖీలు ఉండాలని సీఎం స్పష్టంచేశారు. ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే రూ.50 లక్షల పరిహారం ఇచ్చేలా కొత్త విధానంలో పొందుపరచాలన్నారు.

☛ ఏపీలో మనబడి నాడు–నేడు రెండో దశ కార్యక్రమం

మనబడి నాడు–నేడు రెండో దశ కార్యక్రమం ప్రారంభానికి సర్వం సిద్ధమవుతోంది. మొదటి దశలో దాదాపు 15వేలకు పైగా పాఠశాలలకు మహర్దశ పట్టింది. రెండో దశలో మరో 14,584 పాఠశాలలు, విద్యాసంస్థలకు కొత్తరూపు తీసుకురానున్నారు. నాడు–నేడు కార్యక్రమం పనుల పురోగతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 4 తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

☛ సివిల్ సర్వీసెస్ కు తెలంగాణ, ఏపీ నుంచి 50 మందికిపైగా ఎంపిక

యూపీఎస్‌సీ ఆగస్టు 4 వెల్లడించిన సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లో తెలంగాణ, ఏపీ విద్యార్థులు ప్రతిభ చాటారు. రెండు రాష్ట్రాల నుంచి అధికసంఖ్యలో ఎంపికై సివిల్స్‌లో తమ సత్తా చాటారు. ప్రతిష్టాత్మకమైన ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌కు 829 మంది ఎంపిక కాగా అందులో 50 మందికి పైగా తెలంగాణ, ఏపీ విద్యార్థులు ఉన్నారు. ఈ ఫలితాల్లో హరియాణాకు చెందిన ప్రదీప్‌సింగ్‌ ఆల్‌ ఇండియా టాపర్‌గా నిలిచారు. ఇక జతిన్‌ కిషోర్‌ రెండో ర్యాంకు, ప్రతిభా వర్మ మూడో ర్యాంకు సాధించారు.

యాదాద్రి– భువనగిరి జిల్లాకు చెందిన పి.ధాత్రిరెడ్డి సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లో అల్‌ ఇండియా 46వ ర్యాంకు సాధించి భేష్‌ అనిపించుకున్నారు. ధాత్రిరెడ్డి గతంలో సివిల్స్‌ రాసి 283 ర్యాంకు సాధించారు. ప్రస్తుతం ఐపీఎస్‌ శిక్షణలో ఉన్న ఆమె మళ్లీ పట్టుదలతో సివిల్స్‌ రాసి ఐఏఎస్‌లో 46వ ర్యాంకును సాధించారు.

☛ లెబనాన్ రాజధాని బీరూట్‌లో భారీ పేలుడు

లెబనాన్ రాజధాని బీరూట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఆగస్టు 4న సాయంత్రం జరిగిన ఈ పేలుళ్లలో 70 మందికి పైగా చనిపోగా.. నాలుగు వేలమందికి పైగా గాయపడినట్లు ఆదేశ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాముల్లో ప్రమాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments