కరెంట్ అఫైర్స్ – ఆగస్టు 4, 2020

ప్రముఖ వాగ్గేయకారుడు వంగ‌పండు కన్నుమూత

ప్రముఖ వాగ్గేయకారుడు వంగ‌పండు ప్రసాద‌రావు(77) ఆగస్టు 4 తెల్లవారు జామున గుండెపోటుతో క‌న్నుమూశారు. 1943లో పెదబొండపల్లిలో జన్మించిన వంగపండు కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా పార్వతీపురం పెద‌బొంద‌ప‌ల్లిలోని త‌న నివాసంలో తుదిశ్వాస విడిచారు. త‌న జీవిత కాలంలో వంద‌ల పాట‌ల‌ను ర‌చించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర పాట‌ల‌కు ఆయ‌న గ‌జ్జెక‌ట్టారు. విప్లవకవిగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వంగపండు పేరుపొందారు.

1972లో జ‌న‌నాట్య మండ‌లిని స్థాపించిన వంగ‌పండు త‌న గేయాల‌తో బ‌డుగుబ‌ల‌హీన వ‌ర్గాల‌ను, గిరిజ‌నుల‌ను చైత‌న్య ప‌రిచారు. 2017లో క‌ళార‌త్న పుర‌స్కారాన్ని అందుకున్నారు.‘అర్థరాత్రి స్వతంత్య్రం’ సినిమాతో వంగపండు సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవ..’ పాటతో ప్రఖ్యాతి పొందారు. ఈయన మూడు దశాబ్ధాలలో దాదాపు 300 పాటలు రచించారు.

☛ కరోనాకు సులభమైన పరిష్కారం లభించకపోవచ్చు : డబ్ల్యూహెచ్ఓ

కరోనా వైరస్‌ టీకా రూపకల్పనకు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ సులభమైన పరిష్కారం ఏదీ ఉండకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వ్యాఖ్యానించింది. అందుకే, కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు టెస్టింగ్, ట్రేసింగ్, భౌతికదూరం, మాస్క్‌ ధరించడం వంటి ప్రాథమిక అంశాలపైనే ప్రభుత్వాలు, పౌరులు దృష్టి సారించాలని సూచించింది. ‘ప్రస్తుతానికైతే ఈ మహమ్మారిని రూపుమాపే సులువైన అద్భుత చికిత్సేదీ లేదు.. ఎప్పటికీ రాకపోవచ్చు కూడా..’ అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఘెబ్రెసియస్‌ తెలిపారు.

☛ నర్సింగ్‌ కమ్యూనిటీ సభ్యులతో రాష్ట్రపతి రక్షాబంధన్

ఆగస్టు 3రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్రాష్ట్రపతి భవన్‌లో నర్సింగ్‌ కమ్యూనిటీ సభ్యులతో రక్షాబంధన్‌ జరుపుకున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కి నర్సులు రాఖీలు కట్టి, కోవిడ్‌–19 మహమ్మారిని ఎదుర్కోవడంలో తమ అనుభవాలను రాష్ట్రపతితో పంచుకున్నారని రాష్ట్రపతి భవన్‌ తెలిపింది. కోవిడ్‌ని ఎదుర్కోవడంలో ముందు వరుసలో నిలిచి పోరాడుతోన్న నర్సుల సేవలను, వారి నిబద్ధతను, కొనియాడిన రామ్‌నాథ్‌ కోవింద్‌ వారిని సత్కరించారు.

☛ ట్విట్టర్ లో మోదీ రక్షాబంధన్ శుభాకాంక్షలు

ఈ దేశంలోని అనేక మంది తల్లులు, సోదరీమణుల ఆశీర్వాదంతో మన దేశం మరింత ఉన్నత శిఖరాలను చేరుకుని విజయాన్ని సాధిస్తుంది’అని ప్రధాని నరేంద్ర మోదీ రక్షాబంధన్‌ సందర్భంగా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘ఈ దేశం కోసం పనిచేయగలగడం నాకు గర్వకారణం, భారత నారీమణుల ఆశీర్వాదాలు నాకు మరింత బలాన్నిస్తాయి’అని ట్వీట్‌ చేశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రధాని మోదీకి ప్రముఖ గాయని లతా మంగేష్కర్, ఆధ్యాత్మికవేత్త అమృతానందమయి రాఖీ బంధన్‌ సందేశాలు పంపారు.

☛ ఆగస్టు 4 నుంచి జిమ్ లు, యోగా కేంద్రాలు ఓపెన్

నాలుగున్నర నెలల విరామం తర్వాత దేశవ్యాప్తంగా జిమ్‌లు, యోగా కేంద్రాలు ఆగస్టు 4 నుంచి తెరుచుకోనున్నాయి. అన్‌లాక్‌–3.0లో వీటిని తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ‘యోగా కేంద్రాలు, జిమ్‌లలో కరోనా వ్యాప్తి నివారణ మార్గదర్శకాలను’ ఆగస్టు 3 జారీ చేసింది. ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేని వారిని మాత్రమే యోగా కేంద్రాలు, జిమ్‌లలోకి అనుమతించాలని తేల్చిచెప్పింది. భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. కంటైన్‌మెంట్‌ జోన్లలోని యోగా కేంద్రాలు, జిమ్‌లు మూసి ఉంటాయి. ఈ జోన్ల వెలుపల ఉన్న వాటిని మాత్రమే తెరిచేందుకు అనుమతిస్తారు.

☛ భౌగోళిక సమగ్రతలో రాజీలేదు చైనాకు స్పష్టం చేసిన భారత్
దేశ భౌగోళిక సమగ్రత విషయంలో రాజీ లేదని చైనాకు భారత్‌ మరోసారి తేల్చిచెప్పింది
. భారత్, చైనాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సొ, ఇతర ఘర్షణాత్మక ప్రదేశాల నుంచి బలగాల ఉపసంహరణ సాధ్యమైనంత త్వరగా పూర్తి కావాలని ఇరుదేశాల మిలటరీ కమాండర్‌ స్థాయి ఐదో విడత చర్చల సందర్భంగా స్పష్టం చేసింది. సీనియర్‌ కమాండర్‌ స్థాయి అధికారుల నేతృత్వంలో ఆగస్టు 2 చైనా భూభాగంలోని మోల్డో వద్ద 11 గంటల పాటు చర్చించారు. రెండు దేశాల మధ్య సౌహార్ధ సంబంధాలు నెలకొనాలంటే.. వాస్తవాధీన రేఖ వెంట గతంలో ఉన్న యథాతథ స్థితి నెలకొనడం అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేసినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ‘గల్వాన్‌ లోయ, పలు ఇతర ప్రాంతాల నుంచి చైనా తన బలగాలను ఉపసంహరించుకుంది. కానీ పాంగాంగ్‌ సొ ప్రాంతంలోని ఫింగర్‌ 4, ఫింగర్‌ 8 ల్లో, గొగ్రా వద్ద బలగాలను ఉపసంహరించకపోవడంపై భారత్‌ గట్టిగా ప్రశ్నించింది’ అని వివరించాయి.

☛ రక్షణ సామాగ్రి ఉత్పత్తిలో 1.75లక్షల కోట్ల టర్నోవర్‌ లక్ష్యం
వచ్చే ఐదేళ్ల(2025 నాటికి) లో రక్షణ సామాగ్రి ఉత్పత్తిలో రూ. 1.75 లక్షల కోట్ల టర్నోవర్ సాధించాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థకే చోదక శక్తిగా మారే సామర్ధ్యం ఈ రంగానికి ఉందని, ఆయుధ ఎగుమతులను కూడా చేయాలని నిర్దేశించుకుందని రక్షణశాఖ రూపొందించిన ముసాయిదా విధాన పత్రం పేర్కొంది. డిఫెన్స్‌ ప్రొడక్షన్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ పాలసీ–2020’ పేరిట రూపొందిన ఈ పత్రంలో రానున్న ఐదేళ్లలో ఏరోస్పేస్, రక్షణ రంగ ఉత్పత్తులు, సేవల ఎగుమతుల లక్ష్యమే రూ. 35 వేల కోట్లని పేర్కొంది. ఆయుధ ఉత్పత్తి, ఎగుమతికి ఊతమిచ్చే అంశం పై రక్షణ శాఖకు ఇది ఒక మార్గదర్శక పత్రమని, దేశ సైనిక దళాల అవసరాలను తీర్చేలా ఏరోస్పేస్, యుద్ధ నౌకల నిర్మాణ సామర్థ్యాన్ని సాధించేలా పటిష్ట పోటీతత్వంతో కూడిన రక్షణ పరిశ్రమను సాకారం చేయడమే దీని లక్ష్యమని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ఆయుధ కొనుగోళ్ల కోసం 13వేల కోట్ల డాలర్లను భారత్ వెచ్చించవచ్చని అంచనా.

32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈవిన్

టీకా సరఫరా గొలుసు వ్యవస్థలను బలోపేతం చేసేందుకు సాంకేతిక పరిష్కారాలను సమకూర్చే ది ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటలిజెన్స్ నెట్ వర్క్ (విన్)” దేశంలోని 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చేరిందని, మిగిలిన ప్రాంతాలకు త్వరలోనే అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆగస్ట్– 3న తెలిపింది. దేశంలోని శీతల కేంద్రాల వద్ద టీకాల నిల్వ, సరఫరా తీరు, కేంద్రంలోని ఉష్ణోగ్రత తదితర అంశాలకు సంబంధించి వాస్తవ వివరాలను ఎప్పటికప్పుడు ఈవిన్ అందజేస్తుంది. అండమాన్, నికోబార్ దీవులు, చండీగఢ్, లద్ధాఖ్, సిక్కింలలోనూ త్వరలో ఈవిన్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది.

☛ మరో 3 భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులు

సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో మరో 3 భారతీయ భాషల్లోనూ తీర్పులు అప్ లోడ్ చేయనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఇకపై పంజాబీ, మలయాళం, తమిళంలోనూ తీర్పులను అప్ లోడ్ చేయనున్నట్లు తెలిపింది. కాగా గతేడాది నుంచి తెలుగు సహా 6 భారతీయ భాషల్లో తీర్పులను సుప్రీంకోర్టు అందుబాటులో ఉంచుతోంది.

☛ ఏపీలో ఆగస్టు 7న ముగియనున్న సీసీఆర్‌సీ కార్యక్రమం

కౌలు రైతులు, వాస్తవ సాగుదార్లకు పంట సాగుహక్కుల కార్డు (సీసీఆర్‌సీ) అందచేయాలనే లక్ష్యంతో వ్యవసాయ శాఖ చేపట్టిన ప్రత్యేక ప్రచారోద్యమానికి పెద్దఎత్తున స్పందన లభిస్తోంది. జూలై 20న ప్రారంభించిన ఈ కార్యక్రమం ఈనెల 7న ముగియనుంది. భూ యజమానుల హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా కేవలం 11 నెలల కాలానికి ఇచ్చే ఈ కార్డులతో కౌలు రైతులు ప్రభుత్వం అందించే రాయితీ పథకాలు, వ్యవస్థాగత పరపతి పొందుతారు. ఏపీ పంట సాగుదారుల చట్టం–2019 ప్రకారం ఈ కార్డులు జారీ చేస్తారు.

☛ ఏపీలో రైతులకు రాయితీ యంత్రపరికరాలు

అన్నదాతలకు కూడా వ్యవసాయ యంత్ర పరికరాలను రాయితీపై ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతు ఉత్పత్తి సంఘాలు, కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లకు 50 శాతం రాయితీపై యంత్ర పరికరాలను పంపిణీ చేసేందుకు ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా రైతులకు కూడా రాయితీపై పరికరాలను సరఫరా చేసేందుకు మార్గదర్శకాలను జారీ చేసింది.

సన్నకారు, చిన్నకారు రైతులకు యంత్ర పరికరం విలువలో 50% రాయితీని ప్రభుత్వం ఇస్తుంది. అది గరిష్టంగా రూ.75వేలకుమించకుండాఉండాలి.
లబ్ధిదారుడు పరికరం విలువలో 10 శాతాన్ని ముందుగా చెల్లించాలి. మిగిలిన 40 శాతం మొత్తాన్ని బ్యాంకులు రుణంగాఇస్తాయి.
అవసరమైన పరికరాల కోసం రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

☛ ఏపీలో మహిళా సాధికారత కోసం మరో 3 సంస్థలతో ఒప్పందం

మహిళల స్వయం సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. వారి జీవితాలను మార్చే క్రమంలో ఇటీవలే గుజరాత్‌కు చెందిన అమూల్‌తో ఒప్పందం చేసుకోగా.. తాజాగా ఆగస్ట 3న మరో నాలుగు ప్రఖ్యాత కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో హిందుస్థాన్‌ యూనిలీవర్, ఐటీసీ, ప్రోక్టర్‌ అండ్‌ గాంబిల్‌ కంపెనీలతో ఆగస్టు 3న రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందాలను చేసుకుంది. ఆగస్టు 12న ‘వైఎస్సార్‌ చేయూత’ను ప్రభుత్వం ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ ఒప్పందాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం ఇచ్చే తోడ్పాటును మహిళలందరూ సద్వినియోగం చేసుకునేలా ఈ కంపెనీలు సహకరిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో తమ ఉత్పత్తుల మార్కెటింగ్‌ ద్వారా ఈ కంపెనీలు వారికి తోడ్పాటునందిస్తాయి. వైఎస్సార్ చేయూతలో భాగంగా
రూ.4,500కోట్లను మహిళలకు అందజేయనున్నారు.

☛ రాహుల్ ద్రావిడ్ ఆధ్వర్యంలో కోవిడ్ – 19 టాస్క్ ఫోర్స్

జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్ సిఏ) డైరెక్టర్ రాహుల్ ద్రావిడ్ ఆధ్వర్యంలో కొవిడ్ -19 టాస్కఫోర్స్ ను బీసిసిఐ ఏర్పాటు చేయనుంది. దేశంలో క్రికెట్ పునరుద్ధరణలో భాగంగా రాష్ట్ర సంఘాలకు పంపిన ప్రామాణిక నిర్వహణ విధానం(ఎస్ ఓ పీ) లో బీసిసిఐ పేర్కొంది. ద్రవిడ్ నేతృత్వంలో పరిశుభ్రత అధికారి, బీసిసిఐ ఏజీయం (క్రికెట్ ఆపరేషన్స్) సభ్యులుగా ఉండే టాస్క్ ఫోర్స్ఎన్ సీఏ లో శిక్షణను పర్యవేక్షిస్తుంది. కరోనా మహమ్మారి నియంత్రణ చర్యల్ని స్పష్టంగా, క్రమం తప్పకుండా ఆటగాళ్లకు తెలియజేయడం, క్రికెటర్లు ఖచ్చితంగా నియమ నిబంధనలను పాటించేలా చూడడం టాస్క్ ఫోర్స్ విధులు. ఎన్ సీఏ లో శిక్షణ ప్రారంభానికి ముందు ఆటగాళ్లు, సహాయక , పరిపాలనా సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు.

☛ మళ్లీ మొదలుకానున్న బ్యాడ్మింటన్

కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయిన బ్యాడ్మింటన్ ను పునఃప్రారంభించేందుకు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) చర్యలు మొదలు పెట్టింది. 2020, మార్చిలో ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్ షిప్ తర్వాత ఆగిపోయిన బ్యాడ్మింటన్ ను అక్టోబర్ లో థామస్ అండ్ ఉబెర్ కప్ ఫైనల్ తో ఆరంభించాలని నిర్ణయించింది. అక్టోబర్– 3 నుంచి 11 వరకు డెన్మార్క్ లో జరిగే ఈ టోర్నీ డ్రాను ఆగస్ట్ 3న బీడబ్ల్యూఎఫ్ విడుదల చేసింది. మొదట 2020, మే 16 నుంచి 24 వరకు, తర్వాత ఆగస్టు 15 నుంచి 23 వరకు నిర్వహించాలనుకున్న ఈ టోర్నీ కరోనా కారణంగా వాయిదా పడుతూనే వచ్చింది.

☛ ఫుట్ బాల్ ప్రతిభాన్వేషణ కోసం ఐదు జోన్ల కమిటీలు

భారత్‌ను ఫుట్‌బాల్‌ పవర్‌ హౌస్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రతిభాన్వేషణ కోసం దేశవ్యాప్తంగా ఐదు జోన్ల కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర క్రీడా మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. ‘ఖేలో ఇండియా’ కింద ఈ టాలెంట్‌ హంట్‌ను నిర్వహించనున్నామన్నారు. త్వరలోనే నార్త్‌, సౌత్‌, ఈస్ట్‌, వెస్ట్‌, నార్త్‌ఈస్ట్‌ జోనల్‌ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు రిజిజు తెలిపారు.

☛ దేశవాళీ క్రికెట్‌లో నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలకు చెక్

దేశవాళీ క్రికెట్‌లో నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలతో జరుగుతున్న మోసాలకు బీసీసీఐ చెక్‌ పెట్టనుంది. దీనిలో భాగం గా అలాంటి ప్రయత్నాలు చేసే వారిపై రెండేళ్ల నిషేధం విధించనున్నట్టు పేర్కొంది. మరోవైపు ఇప్పటి వరకు తమ వయస్సును తక్కువగా పేర్కొంటూ నకిలీ సర్టిఫికెట్‌ సమర్పించి ఆడుతున్న క్రికెటర్లకు బీసీసీఐ ఆఫర్‌ ఇచ్చింది. తమంతట తామే పొరపాటును అంగీకరించి సెప్టెంబరు 15 లోపు అసలైన బర్త్‌ సర్టిఫికెట్‌ అందిస్తే క్షమిస్తామని స్పష్టం చేసింది.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments