కరెంట్ అఫైర్స్ – ఆగస్టు 2, 2020

చిన్నారులతో రోజర్ ఫెడరర్ టెర్రస్ టెన్నిస్

38 ఏళ్ల దిగ్గజ టెన్నిస్ ప్లేయర్‌ రోజర్ ఫెడరర్ఇటలీకి చెందిన ఇద్దరు చిన్నారులతో కలిసి టెర్రస్ టెన్నిస్ ఆడి.. వారిని ఆనందాశ్చర్యాలకు గురి చేశాడు. వారితో టెన్నిస్‌ ఆడటంతోపాటు కమ్మగా పాస్తాను ఆరగించి మరపురాని సంతోషాన్ని పంచాడు. లాక్‌డౌన్‌ కాలంలో ఎదురెదురు ఇళ్ల టెర్రస్‌లపై నిలబడి అత్యంత కచ్చితత్వంతో ర్యాలీలు ఆడిన చిన్నారులు విటోరియా (13 ఏళ్లు), కరోలా (11 ఏళ్లు) వీడియో చూసి ఫెడరర్‌ ముగ్ధుడయ్యారు. జూలై 10న నేరుగా చిన్నారుల ఇంటికే వెళ్లిఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా వారిద్దరిని రాఫెల్‌ నాదల్‌ అకాడమీలో వేసవి శిబిరానికి పంపిస్తున్నట్లు ఫెడరర్‌ చెప్పాడు.

ఐరాస, గూగుల్‌కు నేపాల్‌ కొత్త మ్యాప్‌

భారత్‌ సరిహద్దుల్లోని కాలాపానీ, లిపులేఖ్‌, లింపియాధురాలు తమవేనంటూ రూపొందించిన కొత్త మ్యాప్‌ను ఐక్యరాజ్యసమితి(ఐరాస), గూగుల్‌కు పంపించేందుకు నేపాల్‌ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మూడు ప్రాంతాలను తమ దేశంలో చేర్చుతూ రూపొందించిన కొత్త మ్యాప్‌నకు జూన్‌ 13న నేపాల్‌ పార్లమెంట్‌ ఆమోదించింది. అయితే ఈ వ్యవహారం పట్ల భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ నేపాల్‌ మాత్రం ముందుకే సాగింది. ఇప్పుడు కొత్త మ్యాప్‌ను ఐక్యరాజ్యసమితి, గూగుల్‌కు పంపించడానికి సిద్ధమైనట్టు సమాచారం. ఆ మ్యాప్‌ను ఆంగ్లంలోనూ ముద్రించి అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకువెళ్లాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.

ఎంపీ, ఎస్పీ మాజీ నేత అమర్ సింగ్ కన్నుమూత

రాజ్యసభ సభ్యుడు, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ) మాజీ నేత అమర్‌సింగ్‌(64) కన్నుమూశారు. సింగపూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జూలై 1న తుదిశ్వాస విడిచారు. 1956 జనవరి 27న ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌లో జన్మించిన అమర్‌సింగ్ యూపీ నుంచి రాజ్యసభకు తొలిసారిగా 1996లో ఎన్నికయ్యారు. 2003, 2016లో రాజ్యసభ సభ్యుడయ్యారు. 1996 నుంచి 2010లో బహిష్కరణకు గురయ్యే వరకు ఆయన ఎస్‌పీలో కీలక నేతగా కొనసాగారు.

కొత్త జాతీయ విద్యా విధానం – 2020లో నో చైనీస్

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆమోదించిన జాతీయ విద్యా విధానం 2020లో (ఎన్‌ఈపీ) చైనా భాషకు చోటు దక్కలేదు. సెకండరీ స్కూలులో సాధారణంగా ప్రతీ విద్యార్థికి వారికి ఆసక్తి ఉన్న విదేశీ భాషను నేర్చుకునే అవకాశం ఉంటుంది. వేర్వేరు దేశాల్లో సంస్కృతులు, ఆయా దేశాల్లో సామాజిక స్థితిగతులపై జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం ఈ విదేశీ భాషల కేటగిరీని ప్రవేశపెట్టారు. గత ఏడాది విడుదల చేసిన ఎన్‌ఈపీ ముసాయిదా ప్రతిలో ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, జపనీస్‌తో పాటుగా చైనీస్‌ భాష ఉంది. కానీ కేంద్రం తాజాగా ఆమోదించిన తుది ప్రతిలో చైనీస్‌ను తొలగించినట్టు జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి. కేంద్ర మంత్రులు ప్రకాశ్‌ జవదేకర్, రమేష్‌ పోఖ్రియాల్‌ విడుదల చేసిన ఎన్‌ఈపీలో రష్యన్, పోర్చుగీస్, థాయ్‌ భాషలకు చోటు దక్కింది.

ఏపీలో బాలలు, మహిళల భద్రతకు ఈ – రక్షా బంధన్

రాష్ట్రంలో బాలలు, మహిళల భద్రత కోసం పోలీస్‌ శాఖ, సీఐడీ విభాగం సంయుక్తంగా రూపొందించిన ‘రక్షా’బంధన్‌ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగస్టు 3వ తేదీన రాఖీ పౌర్ణిమ సందర్భంగా ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్‌కుమార్‌ జూలై 31న తెలిపారు. ఆగస్ట్‌ 4 నుంచి నెల రోజులపాటు నిపుణులతో ‘సైబర్‌ సేఫ్‌’పై ఆన్‌లైన్‌ ద్వారా అవగాహన కల్పిస్తామని.. బాలలు, మహిళలను పెద్ద సంఖ్యలో ఇందులో భాగస్వాములను చేస్తామనిసైబర్‌ సేఫ్‌ అవగాహన కార్యక్రమంపై బాలలు, మహిళలకు పోటీలు కూడా నిర్వహిస్తామని తెలిపారు.

ఈ ఏడాది నుంచే డిగ్రీలో డేటా సైన్స్ కోర్సు

విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా డిగ్రీలో పలు కొత్త కోర్సులు, కొత్త కాంబినేషన్లను ప్రవేశ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచే వీటిని అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం విద్యారంగంలో అత్యధిక డిమాండ్‌ ఉన్న డేటా సైన్స్‌ను బీఎస్సీ డేటా సైన్స్‌ పేరుతో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశపెట్టేందుకు ఉన్నత విద్యామండలి సన్నాహాలు చేస్తోంది. యూనివర్సిటీ ల్లోని కంప్యూటర్‌ సైన్స్, మ్యాథమేటిక్స్, స్టాటిస్టిక్స్‌ విభాగాలతోపాటు టీసీఎస్, కాగ్నిజెంట్‌ వంటి పారిశ్రామిక రంగాలకు చెందిన నిఫుణుల సహకారంతో కోర్సు సిలబస్‌కు డిజైన్‌ చేసింది.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments