Daily Current Affairs – September 29 – 2018

CCS ఆర్థిక స్వేచ్ఛా సూచీలో భారత్ కు 96వ స్థానం

సెంటర్ ఫర్ సివిల్ సొసైటీ(CCS), కెనడా ఫ్రేసర్ ఇన్సిస్టిట్యూట్ లు సంయుక్తంగా విడుదల చేసిన ఆర్థిక స్వేచ్ఛా సూచీ(Economic Freedom Index)-2018 లో భారత్ 96వ స్థానంలో నిలిచింది. 162 దేశాల ర్యాంకింగ్స్ తో ఈ సూచీ విడుదలైంది.

 • హాంకాంగ్ తొలి స్థానంలో నిలవగా, సింగపూర్ రెండో స్థానంలో నిలిచింది.

 • 2017కు సంబంధించి ఇదే నివేదికలో భారత్ కు 98వ స్థానం దక్కింది.

విజయ్ పాటిల్ కు లతా మంగేష్కర్ అవార్డు – 2018

మహారాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక లతా మంగేష్కర్ అవార్డు” 2018కి ప్రముఖ సంగీత దర్శకుడు విజయ్ పాటిల్ ఎంపికయ్యారు. రామ్ లక్ష్మణ్ గా ప్రసిద్ధి చెందిన ద్వయంలో విజయ్ పాటిల్ లక్ష్మణ్ గా గుర్తింపు పొందారు. అవార్డు కింది రూ.50 వేల నగదు బహుమతిని అందజేస్తారు.

 • భారత రత్న, దిగ్గజ గాయని లతా మంగేష్కర్ పుట్టిన రోజుని పురస్కరించుకొని ఏటా మహారాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డు ప్రదానం చేస్తుంది.

స్త్రీలకు శబరిమల ప్రవేశం కల్పించాలి: సుప్రీంకోర్టు

అన్ని వయసుల స్త్రీలకు శబరిమల ఆలయ ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 28న సంచలన తీర్పు ఇచ్చింది. రుతుస్రావాన్ని కారణంగా చూపుతూ ప్రస్తుతం 10 నుంచి 50 ఏళ్ల మహిళలను ఆలయంలోకి ప్రవేశకుండా నిషేధించడం రాజ్యాంగ విరుద్ధమని వెల్లడించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4: 1 తో తీర్పు వెల్లడించింది. భక్తిలో వివక్ష చూపలేమని పేర్కొంది.

తీర్పుకి అనుకూలం తీర్పుకి ప్రతికూలం

 • జస్టిస్ దీపక్ మిశ్రా జస్టిస్ ఇందు మల్హోత్రా

 • జస్టిస్ నారిమన్

 • జస్టిస్ ఏఎం ఖన్విల్కర్

ఆసియా క్రికెట్ కప్ – 2018 విజేత భారత్

యూఏఈలోని దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా క్రికెట్ కప్ – 2018 టైటిల్ ను భారత్ గెలుచుకుంది. సెప్టెంబర్ 28న బంగ్లాదేశ్ తో జరిగిన ఫైనల్లో భారత్ 3 వికెట్ల తేడాతో గెలుపొంది… 7వ సారి ఆసియా కప్ ను సొంతం చేసుకుంది.

 • ఈ మ్యాచ్ లో సెంచరీ సాధించిన బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ లితన్ దాస్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

 • సీరీస్ అందరికీ కంటే ఎక్కువ పరుగులు సాధించిన భారత బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ కు మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అవార్డు దక్కింది.

 • ఆసియా కప్ – 2018లో మొత్తం 6 జట్లు పోటీ పడ్డాయి. అవి.. భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, హాంకాంగ్

37 ఏళ్ల రికార్డుని బద్దలు కొట్టిన అథ్లెట్ అవినాశ్

ఒడిశాలోని భువనేశ్వర్ లో జరిగిన జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో అరుదైన రికార్డు నమోదైంది. చాంపియన్ షిప్ లో భాగంగా సెప్టెంబర్ 28న జరిగిన 3000 మీటర్ల స్టీపుల్ చేజ్ లో సర్వీసెస్ తరపున బరిలో దిగిన అవినాశ్.. 8 నిమిషాల 29.80 సెకన్లలో పూర్తి చేసి 37 ఏళ్ల జాతీయ రికార్డుని తిరిగరాశాడు. 1981 టోక్యో అథ్లెటిక్స్ మీట్ లో గోపాల్ సైనీ 8 నిమిషాల 30.88 సెకన్లలో పూర్తి చేసిన నెలకొల్పిన రికార్డుని అవినాశ్ తుడిచివేశాడు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అనిల్ చంద్ర పునేత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అనిల్ చంద్ర పునేత నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్ దినేష్ కుమార్ పదవి కాలం ముగియటంతో ఆయన స్థానంలో పునేతను నియమిస్తూ సెప్టెంబర్ 28న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1984 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన పునేత తొలుత కడప జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలు మొదలు పెట్టారు. ఆయన 2019 మే నెల వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతల్లో ఉంటారు.

ఘనంగా పరాక్రమ్ పర్వ్

భారత్ సైన్యం పాకిస్తాన్ తో నియంత్రణ రేఖ వెంట ఆ దేశ సైనిక స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ ( మెరుపు దాడులు) ను విజయవంతంగా పూర్తి చేసి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు పరాక్రమ్ పర్వ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 28న రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో పరాక్రమ్ పర్వ్ ప్రదర్శనలో ప్రధాని నరేంద్ర మోదీ సైనిక వందనం స్వీకరించారు.

 • పరాక్రమ్ పర్వ్ లో భాగంగా సెప్టెంబర్ 28 – 30 వరకు న్యూఢిల్లీలోని రాజ్ పథ్ లాన్స్ లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఏపీలో రేషన్ లో రాగులు, జొన్నలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీపీఎల్ కుటుంబాలకు ప్రతి నెలా అందజేసే రేషన్ లో రాగులు, జొన్నలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఒక్కో కార్డుకి గరిష్టంగా 3 కిలోల చొప్పున రాగులు, జొన్నలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్రంలో చిత్తూరు, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో వీటిని పంపిణీ చేస్తుండగా.. అక్టోబర్ నుంచి రాష్ట్రమంతటా ఇవ్వాలని నిర్ణయించారు.

 • బియ్యం తరహాలోనే కిలో రూపాయికే అందిస్తారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments