☛ హైదరాబాద్ కు “యాంథెమ్” సంస్థ
వైద్య రంగంలో అత్యాధునిక సదుపాయాల కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి మరో అంతర్జాతీయ సంస్థ వస్తోంది. అమెరికాలోని ఇండియానా పోలీస్ కేంద్రంగా హెల్త్ కేర్ సేవలు అందిస్తోన్న “యాంథెమ్” సంస్థ హైదరాబాద్ లో తన కార్యకలాపాలు ప్రారంభించనుంది. దీని ద్వారా 2 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది.
☛ జీహెచ్ఎంసీకి జాతీయ పర్యాటక అవార్డు
నగరంలో పర్యాటక ప్రాంతాల్లో ఉత్తమ పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి వసతి, రోడ్ల విస్తరణ తదితర కార్యక్రమాల్లో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు గాను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ – జీహెచ్ఎంసీ 2016-17 సంవత్సరానికి జాతీయ పర్యాటక పురస్కారం దక్కించుంది. ఈ మేరకు సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర పర్యాటక శాఖ న్యూఢిల్లీలో అవార్డులు ప్రదానం చేసింది.
☛ భారత గిరిజనుల అంబాసిడర్ గా మేరీకోమ్
భారత గిరిజనుల బ్రాండ్ అంబాసిడర్ గా కేంద్ర గిరిజనుల వ్యవహారాల మంత్రితత్వ శాఖ ఐదు సార్లు ప్రపంచ చాంపియన్ బాక్సర్ మేరీకోమ్ ను ఎంపిక చేసింది. ఈ మేరకు ఆమెను ప్రచారకర్తగా నియమిస్తున్నట్లు సెప్టెంబర్ 27న వెల్లడించింది.
-
మోరీకోమ్ గతంలో రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు.
☛ ఇస్మాయిల్ ఫారుఖీ తీర్పుని సమర్థించిన సుప్రీంకోర్టు
ఆయోధ్య రామమందిరం కేసు విషయంలో 1994 నాటి ఇస్మాయిల్ ఫారుఖీ తీర్పుని సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ కేసుని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసేందుకు నిరాకరిస్తూ సెప్టెంబర్ 27న చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం 2 : 1 తేడాతో తీర్పు వెల్లడించింది.
-
ఇస్లాం ప్రకారం ప్రార్థనలు చేసేందుకు మసీదు తప్పనిసరి కాదని 1994లో ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పుని పునర్ సమీక్షించాలంటూ ఎం సిద్ధిఖీ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఇందుకు నిరాకరించింది.
☛ ఐపీసీ సెక్షన్ 497ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
వివాహేతర సంబంధం నేరం కాదని పేర్కొంటు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సెప్టెంబర్ 27న సంచలన తీర్పు వెలువరించింది. ఈ అంశాన్ని నేరంగా పరిగణిస్తున్న ఇండియన్ పీనల్ కోడ్(భారతీయ శిక్షా స్మృతి) సెక్షన్ 497ను కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకాభిప్రాయంతో తీర్పు ఇచ్చింది. రాజ్యాంగ ధర్మాసనంలో ఇతర జడ్జిలు.. జస్టిస్ ఆరఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రా.
తీర్పులోని ముఖ్యాంశాలు
-
ఇష్టపూర్వక శృంగారం మహిళ హక్కు అని, ఈ విషయంలో మహిళకు షరతులు పెట్టలేమని కోర్టు వ్యాఖ్యానించింది. సెక్షన్ 497దీనికి విరుద్ధంగా ఉందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ.. కొట్టివేసింది. వివాహానికి వ్యతిరేకంగా నేరాభియోగాలకు సంబంధించిన క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ లోని 198 సెక్షన్ ను కొట్టివేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.
-
అయితే వివాహేతర సంబంధం నేరం కాకపోయినా.. నైతికంగా తప్పేనని, దీన్ని కారణంగా చూపి వివాహాన్ని రద్దుచేసుకోవచ్చని, విడాకులు కోరవచ్చని పేర్కొంది.
☛ జస్టిస్ రంజనా నేతృత్వంలో లోక్ పాల్ ఎంపిక కమిటీ
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యులతో లోక్ పాల్ ఎంపిక కమిటీని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 27న ఏర్పాటు చేసింది.
-
భారతీయ స్టేట్ బ్యాంక్ మాజీ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య,
-
ప్రసార భారతి చైర్మన్ సూర్య ప్రకాశ్,
-
ఇస్రో మాజీ చైర్మన్ కిరణ్ కుమార్,
-
అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సఖ రామ్ సింగ్ యాదవ్,
-
గుజరాత్ మాజీ డీజీపీ షబ్బీర్ హుస్సనే ఖండ్వాల,
-
రాజస్తాన్ కేడర్ కు చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి లలిత్ పన్వార్,
-
మాజీ సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ లు
ఎంపిక కమిటీలో సభ్యులుగా ఉంటారు.
☛ అవినీతి నిరోధకం కోసం నియమించనున్న లోక్ పాల్ కు చైర్ పర్సన్, ఇతర సభ్యులను ఈ కమిటీ ఎంపిక చేస్తుంది.
☛ లోక్ పాల్ మరియు లోకాయుక్త చట్టం 2013లో ఆమోదం పొందింది. లోక్ పాల్ చట్టం ప్రకారం విపక్ష నేత హోదా ఉన్న వారికి ఎంపిక సంఘంలో అవకాశం ఉంటుంది. లోక్ సభ బలంలో 10 శాతం స్థానాలు కానీ కనీసం 55 స్థానాలు కానీ వచ్చిన పార్టీ నేతకే విపక్ష నేత హోదా లభిస్తుంది. అయితే… 16వ లోక్ సభలో ఏకైక అతిపెద్ద విపక్ష పార్టీగా కాంగ్రెస్ నిలిచినప్పటికీ.. విపక్ష హోదా దక్కేందుకు కావాల్సిన స్థానాలు ఆ పార్టీకి రాలేదు. దీంతో… ఎంపిక సంఘం సమావేశాలకు కాంగ్రెస్ విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ను ప్రత్యేక ఆహ్వానితుడిగా మాత్రమే ఆహ్వానం అందుతోంది. దీంతో… ఖర్గే ఎంపిక సమావేశాలకు హాజరు కావడం లేదు. ఈ నేపథ్యంలోనే… ఆయన పేరు లేకుండానే కేంద్ర ప్రభుత్వం లోక్ పాల్ ఎంపిక కమిటీని ఏర్పాటు చేసింది.
☛ BSF, SSB లకు కొత్త అధిపతుల నియామకం
సరిహద్దు భద్రతా దళం(Boarder Security Force – BSF), సశస్త్ర సీమా బల్(Sashastra Seema Bal – SSB) లకు కొత్త అధిపతులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 27న ఉత్తర్వులు జారీ చేసింది.
బీఎస్ఎఫ్ అధిపతిగా 1984 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ కేడర్ కు చెందిన రజనీకాంత్ మిశ్రాను నియమించింది. ఈయన 2019 ఆగస్టు వరకు పదవిలో ఉంటారు. ప్రస్తుతం బీఎస్ఎఫ్ చీఫ్ గా ఉన్న కేకే శర్మ సెప్టెంబర్ 30న పదవి విరమణ పొందుతారు.
1984 బ్యార్ హరియాణా కేడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్ఎస్ దేశ్వాల్ ఎస్ఎస్ బీ చీఫ్ గా నియమితులయ్యారు. ఈయన 2021 వరకు కొనసాగుతారు.