తెలంగాణ శాసనసభ రద్దు
తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ రద్దయింది. నిర్ణీత కాల వ్యవధి కన్నా 8 నెలల 26 రోజుల ముందే ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు శాసనసభ రద్దుకి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంత్రిమండలిలో చేసిన తీర్మానాన్ని గవర్నర్ నరసింహన్ కు అందజేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 క్లాజ్ 2(బీ) అనుసరించిన గవర్నర్ శాసనసభను రద్దు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ తర్వాత శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు గవర్నర్ నోటిఫికేషన్ ను ప్రస్తావిస్తు గెజిట్ జారీ చేశారు. ఎన్నికలు జరిగి, తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకు కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.
రాష్ట్రంలో నిర్ణీత కాలం ప్రకారం 2019 ఏప్రిల్ లో ఎన్నికలు జరగాల్సి ఉండగా… టీఆర్ఎస్ అధ్యక్షుడు కే.చంద్రశేఖర్ రావు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ముందుగానే సభను రద్దు చేశారు.
స్వలింగ సంపర్కం నేరం కాదు : సుప్రీంకోర్టు
అంగీకారంతో ఇద్దరు మేజర్లు మధ్య జరిగే స్వలింగ సంపర్కం లేదా స్త్రీ–పురుషుల మధ్య ప్రైవేటుగా జరిగే లైంగిక చర్య నేరం కాదని పేర్కొంటూ సెప్టెంబర్ 6న దేశ అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ మేరకు ఐపీసీ సెక్షన్ 377లోని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం వెల్లడించింది.
తీర్పులోని ముఖ్యాంశాలు
-
జంతువులు, చిన్న పిల్లలు, మైనర్లతో, అలాగే మేజర్లతోనూ పరస్పర అంగీకారం లేకుండా జరిగే లైంగిక కేసుల విషయంలో 377 సెక్షన్‌లోని నిబంధనలు కొనసాగుతాయని కోర్టు పేర్కొంది.
-
సమాజంలో LGBTQ (లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్, క్వీర్)లు దేశంలోని మిగిలిన పౌరుల్లాగే అన్ని రాజ్యాంగబద్ధమైన హక్కులను పొందవచ్చని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.
-
నవ్‌తేజ్ జౌహార్, జర్నలిస్ట్ సునీల్ మెహ్రా, చెఫ్ రితూ దాల్మియా, హోటల్ యజమానులు అమన్నాథ్, కేశవ్ సూరీ, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ అయేషా కపూర్ సహా 20 మంది ఐఐటీ విద్యార్థులు వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ చారిత్రక తీర్పునిచ్చింది.
-
ఈ తీర్పుతో స్వలింగ సంపర్కాన్నీ చట్టబద్ధం చేసిన 26వ దేశంగా భారత్ నిలిచింది.
సెక్షన్ 377 ఏం చెబుతోంది ?
-
377వ సెక్షన్ భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) లోని 16వ అధ్యాయంలో ఉంది. దీన్ని 1838లో థామస్ మెకాలే రూపొందించారు. 1861లో అమల్లోకి వచ్చింది. బ్రిటిష్ సొడొమీ చట్టం(బగ్గరీయాక్ట్ 1533) ఆధారంగా ఇది రూపొందింది. ఈ చట్టం ప్రకారం సహజ విరుద్ధంగా జరిగే ఎలాంటి శృంగారమైనా నేరం. దీన్ని ఉల్లంఘించిన వారికి గరిష్టంగా జీవిత ఖైదు, కనీసం పదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించేందుకు సెక్షన్ 377 వీలు కల్పించింది.
భారత్, అమెరికా మధ్య 2+2 చర్చలు
భారత్, అమెరికా దేశాల విదేశాంగ, రక్షణ శాఖల మంత్రుల తొలి సమావేశం న్యూఢిల్లీలో సెప్టెంబర్ 6న జరిగింది. 2+2 భేటీగాను పిలుస్తోన్న ఈ సమావేశంలో భారత్ నుంచి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్.. అమెరికా తరపున విదేశాంగ మంత్రి మైకేల్ పాంపియో, రక్షణ మంత్రి జేమ్స్ మేటిస్ లు చర్చల్లో పాల్గొన్నారు.
-
ఈ సందర్భంగా… కామ్ కాసా ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా అమెరికా నుంచి భారత్ కు అత్యాధునిక మిలటరీ కమ్యూనికేషన్ పరికరాలు అందుతాయి. ఇది పదేళ్ల పాటు అమల్లో ఉంటుంది.
-
అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేసే యుద్ధ విమానాలు, ఇతర హెలికాప్టర్లలో అమెరికాకు చెందిన అత్యంత భద్రమైన ఎన్ క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థను అమరుస్తారు. సి-17, సి– 130జే, పి-81 విమానాలతో పాటు అపాచె, చింకూర్, హెలికాప్టర్లలో ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఏర్పాటు చేస్తారు.
మాదిరి ప్రశ్నలు
తెలంగాణ తొలి శాసనసభ నిర్ణీత కాల వ్యవధి కంటే ఎన్ని రోజుల ముందు రద్దయింది ?
-
12 నెలలు
-
6 నెలలు
-
8 నెలల 26 రోజులు
-
10 నెలల 30 రోజులు
జవాబు: 8 నెలల 26 రోజులు
స్వలింగ సంపర్కం నేరం కాదని తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు.. ఐపీసీలోని ఏ సెక్షన్ నిబంధనలు రాజ్యాంగానికి విరుద్ధమని ప్రకటించింది ?
-
సెక్షన్ 377
-
సెక్షన్ 420
-
సెక్షన్ 498
-
సెక్షన్ 120
జవాబు: సెక్షన్ 377
భారత్, అమెరికా మధ్య తొలి 2+2 చర్చలు ఇటీవల ఏ నగరంలో జరిగాయి ?
-
న్యూఢిల్లీ
-
వాషింగ్టన్
-
బెంగళూరు
-
న్యూయార్క్
జవాబు: న్యూఢిల్లీ