జన్ ధన్ ఓవర్ డ్రాఫ్ట్ రూ.10 వేలకు పెంపు
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకం కింద ప్రస్తుతం రూ.5 వేల పరిమితితో ఉన్న ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని రూ.10 వేలకు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 5న ప్రకటించింది. అలాగే పథకానికి అర్హతకు గరిష్ట వయసుని 60 నుంచి 65 ఏళ్ల పెంచారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. పథకానికి మంచి ఆదరణ లభిస్తుందన్నందున.. కొనసాగించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. రూ. 2 వేల వరకు ఓవర్ డ్రాఫ్ట్ పొందేందుకు ఎలాంటి షరతులు ఉండవని వివరించారు.
ఇవీ జన్ ధన్ లెక్కలు
-
జన్ ధన్ యోజన కింద నాలుగేళ్లలో 32.41 కోట్ల ఖాతాలు తెరిచారు.
-
వీటిలో రూ.81,200 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి.
-
30 లక్షల మంది ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు.
-
2014 ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ జన్ ధన్ యోజన పథకాన్ని ప్రారంభించారు.
2018-19 తొలి 5 నెలల్లో తెలంగాణ వృద్ధి 21.96 శాతం
తెలంగాణ రాష్ట్రం గడచిన నాలుగేళ్లుగా గణనీయమైన ఆదాయ అభివృద్ధిని సాధిస్తూ వస్తోంది. ఇందుకు అనుగుణంగానే 2018-19 ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో(ఏప్రిల్ – ఆగస్టు) రాష్ట్రం 21.96 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. అంటే.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో తొలి ఐదు నెలల్లో రూ.21,642.02 కోట్ల ఆదాయం సమకూరగా… 2018-19లో ఇదే కాలానికి రూ.26,394.18 కోట్ల ఆదాయం వచ్చిందని ప్రభుత్వం ప్రకటించింది. ఇది కేంద్ర ప్రభుత్వం మదింపు చేసిన గణాంకాలని ప్రకటనలో పేర్కొంది.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలి నాలుగేళ్లలో ఏడాదికి సగటున 17.17 ఆదాయ వృద్ధి రేటు నమోదు చేస్తోంది. దేశంలో మరే రాష్ట్రం ఈ స్థాయిలో గణాంకాలు నమోదు చేయడం లేదు.
మత్స్య అభివృద్ధి పథకాన్ని ప్రారంభించిన తలసాని
తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని ప్రారంభించింది. సెప్టెంబర్ 5న హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ పథకం రెండేళ్ల పాటు అమల్లో ఉంటుంది. ఇందులో భాగంగా 855 మంది మత్స్యకారులకు ద్విచక్ర వాహనాలు, 12 మందికి లగేజ్ ఆటోలు, 8 మంది లబ్ధిదారులకు సంచార విక్రయ కేంద్రాలు అందజేశారు. 2 మహిళా మత్స్య సంఘాలకు రూ.5 లక్షల చొప్పున గ్రాంట్ అందజేశారు.
మాదిరి ప్రశ్నలు
2018-19 ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఎంత శాతం వృద్ధి రేటు నమోదు చేసింది ?
1)17.17
2)21.96
3)24.12
4)9.7
జవాబు: 21.96 శాతం
కేంద్ర ప్రభుత్వం జన్ ధన్ యోజన పథకం కింద ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని ఎన్ని వేలకు పెంచింది ?
-
రూ. 15 వేలు
-
రూ. 10 వేలు
-
రూ.5 వేలు
-
రూ.7 వేలు
జవాబు: రూ.10 వేలు
తెలంగాణలో సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు ?
-
ఈటల రాజేందర్
-
హరీశ్ రావు
-
తలసాని శ్రీనివాస్ యాదవ్
-
నాయిని నర్సింహారెడ్డి
జవాబు: తలసాని శ్రీనివాస్ యాదవ్