తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బిజినెస్ రిఫార్మర్ పురస్కారం
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్-2018 అవార్డు లభించింది. ఈ మేరకు టైమ్స్ గ్రూపు ఎండీ వినీత్ జైన్ సెప్టెంబర్ 5న ప్రకటించాడు. ముంబైలో అక్టోబర్ 27న జరిగే కార్యక్రమంలో కేసీఆర్‌కు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ 2014 నుంచి 2017 వరకు సగటున ఏడాదికి 17.17 శాతం చొప్పున, 2018 మొదటి ఐదు నెలల్లో 21.96 శాతం ఆదాయాభివృది సాధించిందని కేసీఆర్ తెలిపారు. అలాగే టీఎస్ ఐపాస్ సింగిల్ విండో పారిశ్రామిక అనుమతుల విధానం ద్వారా ఇప్పటివరకు 7,000 పరిశ్రమలు అనుమతులు పొందాయని వివరించారు.
అక్టోబర్ 2 నుంచి నల్సా పరిహార పథకం అమలు
అత్యాచారాలు, దాడులకు గురైన మహిళలకు న్యాయం చేయడానికి జాతీయ న్యాయ సేవల సంస్థ (నల్సా) రూపొందించిన ‘పరిహార పథకం’ అక్టోబర్ 2 నుంచి అమల్లోకి రానుంది. కేంద్ర ప్రభుత్వ నూతన చట్ట నిబంధనలు కార్యరూపం దాల్చే వరకు పరిహార పథకంలోని అంశాలను ప్రత్యేక న్యాయస్థానాలు పరిగణనలో తీసుకోవాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 5న ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు లైంగిక దాడికి గురైన మైనర్ బాధితులకు రూ. 4 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు పరిహారం అందుతుంది. లైంగిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధితులు, సామూహిక లైంగిక దాడికి గురైన బాధితుల కుటుంబాలు రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు పరిహారం పొందుతాయి. యాసిడ్ దాడికి గురైన మహిళలకు రూ.3 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు పరిహారంగా అందుతాయి. ప్రభుత్వం పోక్సో చట్టంను సవరించే వరకు మైనర్ బాధితులు ఈ పరిహారం పొందేందుకు అర్హులని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
మంజీర ఎత్తిపోతలకు రూ.476.25 కోట్లు
మంజీర ఎత్తిపోతలకు రూ.476.25 కోట్లు మంజూరు చేస్తు తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 4న ఉత్తర్వులు జారీ చేసింది. నిజాంసాగర్ మండలం మల్లూరు గ్రామ సమీపంలో ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించనున్నారు. నిజాం సాగర్ కింద మంజీరా నదిపై పిట్లం, బిచ్కుంద మండలాల పరిధిలోని 21 గ్రామాల్లో 30 వేల ఎకరాలకు నీరివ్వాలన్నది లక్ష్యం. ఈ ఎత్తిపోతలకు 2.90 టీఎంసీల నీటిని వినియోగించనున్నారు.
ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్ లో ఓం ప్రకాశ్ కు స్వర్ణం
దక్షిణ కొరియాలో జరిగిన ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్ లో భారత పిస్టల్ షూటర్ ఓం ప్రకాశ్ మిథర్వాల్ స్వర్ణం గెలుచుకున్నాడు. కొరియాలోని చాంగ్ వాన్ నగరంలో జరిగిన ఈ పోటీల్లో 50 మీటర్ల పిస్టల్ విభాగంలో 23 ఏళ్ల ఓం ప్రకాశ్ 564 పాయింట్లు స్కోర్ చేసి తొలి స్థానంలో నిలిచాడు. తద్వారా స్వర్ణం నెగ్గాడు. దీంతో ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో స్వర్ణం గెలిచిన నాలుగో భారతీయుడిగా ప్రకాశ్ గుర్తింపు సాధించాడు. గతంలో 2006లో అభినవ్ బింద్రా, 2006లో మానవ్ జిత్ సింధు, 2010లో తేజస్విని సావంత్ మాత్రమే ఈ ఘనత సాధించారు.
ఈ ఏడాది జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో ఓం ప్రకాశ్ 10 మీటర్లు, 50 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగాల్లో కాంస్యాలు గెలుచుకున్నాడు.
పాకిస్తాన్ అధ్యక్షడిగా ఆరిఫ్ అల్వీ
పాకిస్తాన్ నూతన అధ్యక్షుడిగా.. అధికార తెహ్రిక్ – ఇ – ఇన్సాఫ్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన డాక్టర్ ఆరిఫ్ అల్వీ ఎన్నికయ్యారు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరిగిన పోలింగ్ లో నేషనల్ అసెంబ్లీ, సెనేట్ కు సంబంధించిన 430 ఓట్లు ఉన్నాయి. ఇందులో అల్వీకి 212 ఓట్లు వచ్చాయి. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఆరీఫ్ అల్వీ సన్నిహితుడు.
లక్ష కోట్ల డాలర్ల కంపెనీగా అమెజాన్
ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ కంపెనీ లక్ష కోట్ల డాలర్ల కంపెనీగా అవతరించింది. సెప్టెంబర్ 4న న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్ లో అమెజాన్ షేర్ 2 శాతం లాభంతో 2,050 డాలర్లను తాకింది. ఈ ధర వద్ద కంపెనీ మార్కెట్ క్యాప్ లక్ష కోట్ల డాలర్ల మార్కును అధిగమించింది. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో కంపెనీగా అమెజాన్ నిలిచింది.
యాపిల్ సంస్థ ఇటీవలే లక్ష కోట్ల డాలర్ల మార్కుని దాటి ఈ ఘనత సాధించిన తొలి కంపెనీగా రికార్డు నమోదు చేసింది.
మాదిరి ప్రశ్నలు
అత్యాచారాలు, దాడులకు గురైన మహిళలకు న్యాయం చేయడానికి ఉద్దేశించిన “పరిహార పథకం” ను ఎవరు రూపొందించారు ?
-
జాతీయ న్యాయ సేవల సంస్థ
-
జాతీయ మహిళా కమిషన్
-
జాతీయ దర్యాప్తు సంస్థ
-
నీతి ఆయోగ్
జవాబు: జాతీయ న్యాయ సేవల సంస్థ
ఎకనామిక్ టైమ్స్ నుంచి ఇటీవల బిజినెస్ రిఫార్మర్ – 2018 పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
-
నారా చంద్రబాబు నాయుడు
-
నితీశ్ కుమార్
-
కే. చంద్రశేఖర్ రావు
-
శివరాజ్ సింగ్ చౌహాన్
జవాబు: కే. చంద్రశేఖర్ రావు
తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన తలపెట్టిన మంజీరు ఎత్తిపోతల పథకానికి కింది వాటిలోని ఏ ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకుంటారు ?
1)శ్రీరాం సాగర్
2)నిజాం సాగర్
3)నాగార్జున సాగర్
4)జూరాల
జవాబు: నిజాం సాగర్
ఇటీవల దక్షిణ కొరియాలోని చాంగ్ వాన్ నగరంలో జరిగిన ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో స్వర్ణం గెలిచిన వారు ఎవరు ?
-
ఓం ప్రకాశ్ మిథర్వాల
-
దమిర్ వికెట్
-
డెమ్యుంగ్ లీ
-
జీతూ రాయ్
జవాబు: ఓం ప్రకాశ్ మిథర్వాల
కింది వారిలో ఇటీవల ఎవరు పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ?
-
ఆరీఫ్ అల్వీ
-
ఇమ్రాన్ ఖాన్
-
మౌలానా ఫజల్ – ఉర్ – రహ్మాన్
-
ఐత్ తాజ్ అహ్సాన్
జవాబు: ఆరీఫ్ అల్వీ
ఇటీవల అమెజాన్ లక్ష కోట్ల డాలర్ల కంపెనీగా ఘనత సాధించిన రెండో సంస్థగా నిలిచింది. అయితే మొదటి కంపెనీ ఏది ?
1)యాపిల్
2)ఫ్లిప్ కార్ట్
-
హెచ్ డీఎఫ్ సీ
-
గూగుల్
జవాబు: యాపిల్