తిరుపతిలో ‘స్వీకార్ ’
తిరుపతి సమీపంలో అలిపిరి వద్ద శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఫర్ కేన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ రీసెర్చ్ (స్వీకార్) సంస్థను టాటా ట్రస్ట్ నిర్మించనుంది. టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటాతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వీకార్ నిర్మాణానికి ఆగస్టు 31న భూమి పూజ చేశారు. స్వీకార్‌ను తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) బోర్డు విరాళంగా ఇచ్చిన 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.600 కోట్ల వ్యయంతో నిర్మిస్తారు.
దేశవ్యాప్తంగా టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో 124 ఆస్పత్రులు నడుస్తున్నాయి.
రైళ్లలో భద్రతకు ‘రైల్ సురక్ష’ యాప్
రైలు ప్రయాణికులకు ఎదురయ్యే భద్రతా పరమైన సమస్యలను సత్వరమే పరిష్కరించడం కోసం ‘రైల్ సురక్ష’ పేరుతో రైల్వే శాఖ మొబైల్ యాప్‌ను సెప్టెంబర్ 2న రూపొందించింది. ఈ యాప్‌ను సెంట్రల్ రైల్వే పరిధిలోని దూరప్రాంత, లోకల్ రైలు ప్రయాణికులకు సెప్టెంబర్ చివర నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రయాణికులు సురక్ష యాప్‌లో పెట్టిన సమస్య ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌లో ఉన్న కంట్రోల్ రూం(182)కు చేరుతుంది. ఫిర్యాదు వచ్చిన వెంటనే కంట్రోల్ రూం సిబ్బంది రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్)లేదా గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ)లను అప్రమత్తం చేసి ఫిర్యాదు దారుడి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు.
ఆంధ్రప్రదేశ్ లో ‘చేరువ’ కార్యక్రమం
సామాజిక మాధ్యమాలు, సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు రూపొందించిన ‘చేరువ..మీ చెంతకు.. మీ పోలీస్’ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ విజయవాడలో ఆగస్టు 31న ప్రారంభించారు. ఏపీ పోలీసు శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా పోలీసులు ప్రజలు భాగస్వాములై విభిన్న సమస్యలు, అంశాలపై చర్చించనున్నారు. కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరంలో ప్రజలకు చేరువ అయ్యేలా ప్రత్యేక వాహనాన్ని డీజీపీ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా నిర్వహించనున్నారు. సామాజిక మాద్యమాల్లో.. ఏపీ పోలీసులు ప్రజలకు మరింత చేరువయ్యేలా సామాజిక మాద్యమాల్లో అకౌంట్లను డీజీపీ ఠాకూర్ ప్రారంభించారు. 9440900822 వాట్సాప్, ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయడంతోపాటు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్లను ఏర్పాటు చేశారు.
ఓబీసీ జనాభా లెక్కల సేకరణ
స్వాతంత్య్రం తర్వాత దేశంలో జన గణనలో భాగంగా తొలిసారి ఇతర వెనుకబడిన వర్గాల(ఓబీసీ) జనాభా లెక్కలను సేకరించనున్నారు. ఈ మేరకు 2021లో చేపట్టే జనగణనలో ఓబీసీల లెక్కలను సేకరించాలని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 31న నిర్ణయించింది. అలాగే జనగణన తుది నివేదిక వెల్లడించే సమయాన్ని ఏడేళ్ల నుంచి మూడేళ్లకి తగ్గించింది. 2006లో జాతీయ నమూనా సర్వే సంస్థ నివేదిక ప్రకారం దేశ జనాభాలో ఓబీసీలు సుమారు 41 శాతం వరకుఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. జనగణన కోసం సుమారు 25 లక్షల మంది ఎన్యూమరేటర్లకు శిక్షణ ఇస్తున్నారు.
మాదిరి ప్రశ్నలు
1. ఏ సంవత్సరంలో చేపట్టే జనగణనలో ఓబీసీ లెక్కలను సేకరించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది ?
-
2019
-
2020
-
2021
-
2022
జవాబు: 2021
2. రైలు ప్రయాణికులకు ఎదురయ్యే భద్రతా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ఇటీవల ప్రారంభించిన యాప్ ఏది ?
-
రైల్ సురక్ష
-
రైల్ హమారా
-
సురక్ష భారత్
-
రైల్ రక్షక్
జవాబు: రైల్ సురక్ష
3. టాటా ట్రస్టు సంస్థ ఆంధ్రప్రదేశ్ లోని ఏ ప్రాంతంలో స్వీకార్ క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తోంది ?
1)విజయవాడ
2)తిరుపతి
3)కాకినాడ
4)గుంటూరు
జవాబు: తిరుపతి
4. “ చేరువ.. మీ చెంతకు.. మీ పోలీస్” కార్యక్రమాన్ని ఇటీవల ఏ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రారంభించింది ?
-
తెలంగాణ
-
తమిళనాడు
-
కర్ణాటక
-
ఆంధ్రప్రదేశ్
జవాబు: ఆంధ్రప్రదేశ్