ఇండస్ వాటర్ ఒడంబడిక – భారత్, పాక్ మధ్య అవగాహన
ఇండస్ వాటర్ ఒడంబడిక 1960కి అనుగుణంగా రెండు దేశాల్లో ఆయా దేశాల నీటి కమిషనర్ల పర్యటనకు భారత్, పాకిస్తాన్ అంగీకరించాయి. భారత్ లో జమ్ము అండ్ కశ్మీర్ లో చేపడుతున్న జల విద్యుత్ ప్రాజెక్టులపై పాకిస్తాన్ అభ్యంతరం చెబుతోంది. ఈ నేపథ్యంలో.. ఈ వివాదాల పరిష్కారం కోసం రెండు దేశాల ప్రతినిధులు ఇరు ప్రాంతాల్లో పర్యటించి.. సమస్యలను అధ్యయనం చేసేందుకు, వాటిని పరిష్కరించేందుకు రెండు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. ఈ మేరకు భారత్, పాకిస్తాన్ మధ్య ఇటీవల అత్యున్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు పాకిస్తాన్ లాహోర్ లో జరిగాయి. పాకిస్తాన్ నూతన ప్రధాన మంత్రిగా పాకిస్తాన్ తెహ్రీక్ – ఈ – ఇన్సాఫ్(PTI) అధినేత ఇమ్రాం ఖాన్ గత నెలలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి జరిగిన చర్చల్లో ఈ అవగాహన కుదిరింది. అలాగే శాశ్వత ఇండస్ కమిషన్ (PIC)ను బలోపేతం చేయాలని నిర్ణయించాయి.
వెయ్యి మెగా వాట్ల సామర్థ్యంతో కూడిన పాకల్ దుల్, 48 మెగావాట్ల లోయర్ కాల్నాయ్ జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంపై పాకిస్తాన్ లేవనెత్తిన అభ్యంతరాలను భారత్ తోసిపుచ్చింది. చెనాబ్ నదిపై నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టులని సందర్శించాల్సిందిగా పాకిస్తాన్ ప్రతినిధులను అహ్వానించింది. తదుపరి పీఐసీ సమావేశంలో భారత్ లో జరగనుంది.
ఇండస్ వాటర్ ఒడంబడిక
ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్తాన్ మధ్య ఇండస్ వాటర్ ఒడంబడిక కుదిరింది. ఇండస్ కింద ఆరు నదులు ఉన్నాయి. అవి బియాస్, రవి, సట్లెజ్, ఇండస్, చెనాబ్, జెలమ్. రవి, బియాస్, సట్లెజ్ నదులు భారత్ నియంత్రణ… ఇండస్, జెలమ్, చెనాబ్ నదులపై పాకిస్తాన్ నియంత్రణ ఉండేలా ఒడంబడిక జరిగింది. అలాగే భారత్ మీదుగా ప్రవహించే ఇండస్ నదిలో సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి కోసం కేవలం 20 శాతం నీటిని మాత్రమే భారత్ ఉపయోగించుకోవాలి. ఈ మేరకు 1960 సెప్టెంబర్ 19న అప్పటి భారత్ ప్రధాన మంత్రి జవహార్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ సంతకం చేశారు. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన నీటి ఒడంబడికగా ఇండస్ వాటర్ ట్రీటీ గుర్తింపు పొందింది.
IBA చైర్మన్గా సునీల్ మెహతా
2018-19 కాలానికి గాను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) చైర్మన్గా పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డెరైక్టర్ సునీల్ మెహతా ఎంపికయ్యారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ దీనబంధు మొహపాత్ర ఐబీఏ డిప్యూటీ చైర్మన్గా ఎంపికయ్యారు.
- ప్రస్తుతం ఐబీఏ డిప్యూటీ చైర్మన్లుగా ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్, ఫెడరల్ బ్యాంక్ ఎండీ శ్యామ్ శ్రీనివాసన్ ఉన్నారు.
- ఐబీఏ.. భారత బ్యాంకులు, ఆర్థిక సంస్థల సంఘం. దీనిని 1946 సెప్టెంబర్ 26న ఏర్పాటు చేశారు. కేంద్ర కార్యాలయం ముంబైలో ఉంది.
- ప్రస్తుతం ఐబీఏలో 237 మంది సభ్యులు ఉన్నారు.
రాక్సౌల్ – కఠ్మాండు రైల్వే పై భారత్ – నేపాల్ మధ్య ఒప్పందం
బిహార్ లోని రాక్సౌల్ నగరాన్ని నేపాల్ రాజధాని కఠ్మాండుతో అనుసంధానించే రైల్వే లైన్ నిర్మాణానికి భారత్, నేపాల్ మధ్య ఒప్పందం కుదిరింది. నేపాల్ రాజధాని కఠ్మాండులో ఆగస్టు 30-31 వరకు జరిగిన 4వ బిమ్ స్టెక్ (BIMSTEC) సమావేశంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ… అనంతరం నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇందులో భాగంగా రాక్సౌల్, కఠ్మాండు మధ్య రైల్వే లైన్ నిర్మాణంపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఏడాదిలోనే భారత్, నేపాల్ మధ్య ట్రాన్సిట్ ట్రీటీ కూడా కుదిరింది.
నేపాల్ – భారత్ మైత్రి భవన్ ప్రారంభం
నేపాల్ రాజధాని కఠ్మాండులోని పశుపతినాథ్ శివాలయంలో భారత ఆర్థిక సహాయంతో నిర్మించిన 400 పడకల భక్తుల వసతి కేంద్రాన్ని నేపాల్ ప్రధానితో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆసియాలోని నాలుగు ప్రముఖ శైవ క్షేత్రాల్లో పుశుపతినాథ్ ఆలయం ఒకటి.
డా.బీ.కే. మిశ్రాకు బీ.సీ.రాయ్ జాతీయ అవార్డు – 2018
ముంబైకి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ బీ.కే. మిశ్రా.. ప్రతిష్టాత్మక డాక్టర్ బీ.సీ. రాయ్ జాతీయ అవార్డు – 2018 ఎంపికయ్యారు. ఎమినెంట్ మెడికల్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ కింద ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 2019 జూలై 1న వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ మిశ్రా.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డుని అందుకుంటారు.
· బీసీ రాయ్ అవార్డు.. భారత వైద్య రంగంలో అందించే అత్యున్నత పురస్కారం.
· బీసీ రాయ్ అవార్డుని 1976లో భారతీయ మెడికల్ కౌన్సిల్ నెలకొల్పింది.
· ప్రముఖ వైద్యుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బిధన్ చంద్ర రాయ్ పేరిట ఈ అవార్డుని ఏర్పాటు చేశారు.
· ఆరు రంగాల్లో ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.
కఠ్మాండులో 4వ బిమ్స్ టెక్ సమావేశం
4వ బిమ్స్ టెక్ సమావేశం నేపాల్ రాజధాని కఠ్మాండులో ఆగస్టు 30 – 31 తేదీల్లో జరిగింది. ఈ సమావేశానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన మోదీ.. ఉగ్రవాదం, మాదక ద్రవ్యాలపై పోరులో బిమ్స్ టెక్ దేశాలు సహకరించుకోవాలని అన్నారు. సభ్య దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక, రవాణా, డిజిటల్ సంబంధాలను మెరుగుపరిచేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
- బిమ్స్ టెక్ (బంగాళాఖాత దేశాల ఆర్థిక సహకార సంస్థ)లో భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయ్ లాండ్, భూటాన్, నేపాల్ సభ్య దేశాలుగా ఉన్నాయి.
- ప్రపంచ జనాభాలో ఈ దేశాల మొత్తం వాటా 22 శాతంగా ఉంటుంది.
- బిమ్స్ టెక్ దేశాల జీడీపీ 2.8 ట్రిలియన్ డాలర్లు.
మాదిరి ప్రశ్నలు
1. భారత్, పాకిస్తాన్ ల మధ్య ఇండస్ వాటర్ ఒడంబడిక ఏ సంవత్సరంలో కుదిరింది ?
1)1960
2)1975
3)1947
4)1945
జవాబు : 1960
2. 4వ బిమ్స్ టెక్ సమావేశంలో ఇటీవల ఈ కింది వాటిలోని ఏ నగరంలో జరిగింది ?
1)కఠ్మాండు
2)న్యూఢిల్లీ
3)ఢాకా
4)బ్యాంకాక్
జవాబు: కఠ్మాండు
3. ఎమినెంట్ మెడికల్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ – 2018 గా ప్రతిష్టాత్మక బీసీ రాయ్ అవార్డుకి ఎంపికైన ప్రముఖ వైద్యుడు ఎవరు ?
- డాక్టర్ బిధిన్ చంద్ర రాయ్
- డాక్టర్ బీ.కే. మిశ్రా
- డాక్టర్ నాగేశ్వరరావు
- డాక్టర్ గోఖలే
జవాబు: డాక్టర్ బీ.కే. మిశ్రా
4. భారత్ లోని రాక్సౌల్, నేపాల్ రాజధాని కఠ్మాండు మధ్య రైల్వే లైన్ నిర్మాణానికి ఇటీవల రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. రాక్సౌల్ నగరం ఏ రాష్ట్రంలో ఉంది ?
1)సిక్కిం
2)బిహార్
3)అసోం
4)మిజోరం
జవాబు: బిహార్
5. 2018-19 కాలానికి గాను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్ గా ఎవరు ఎంపికయ్యారు ?
- సునీల్ మోహతా
- రజనీష్ కుమార్
- దీనబంధు మొహపాత్ర
- శ్యామ్ శ్రీనివాసన్
జవాబు: సునీల్ మోహతా