Daily Current Affairs – October 12 – 2018

తిత్లీతుపాను బీభత్సం.. శ్రీకాకుళం అతలాకుతలం

తిత్లీ తుపాన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో విధ్వంసం సృష్టించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తిత్లీ తుపాను అక్టోబర్ 11న ఉదయం 4:30 నుంచి 5:30 మధ్య శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పల్లెసారథి గ్రామం వద్ద గంటకు 150 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని దాటింది. అనంతరం బలహీనపడింది.

 • శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానంపై తిత్లీ తుపాను తీవ్ర ప్రభావం చూపింది. తీవ్ర నష్టం వాటిల్లింది. దాదాపు 2 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. జిల్లావ్యాప్తంగా 3 లక్షల కొబ్బరి చెట్లు నేలకూలాయి.

 • తుపాన వల్ల మొత్తంగా రూ.1,500 కోట్ల ఆస్తి నష్టం సంభవించిందని ప్రాథమిక అంచనా.

ఉత్తరాఖండ్ సీజేగా జస్టిస్ రమేశ్ రంగనాథన్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్.. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగోయ్, జస్టిస్ మదన్ బి. లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ లతో కూడిన కొలీజియంఈ మేరకు సిఫారసు చేసింది.

 • జస్టిస్ రమేశ్ రంగనాథన్.. 2016 జూలై 30 నుంచి 2017 జూన్ 30 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.

 • జస్టిస్ రమేశ్ రంగనాథన్ బెంగళూరు యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1985లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు.

 • 1996 నుంచి 2000 వరకు ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు.

 • 2000-2004 వరకు ఏపీ అదనపు అడ్వొకేట్ జనరల్ గా వ్యవహరించారు.

జమ్ము పోలీస్ అహ్మద్ కు శౌర్య చక్ర

తీవ్రవాదులతో జరిగిన పోరులో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించి అమరుడైన జమ్ము కశ్మీర్ పోలీస్ కానిస్టేబుల్ మన్జూర్ అహ్మద్ నాయక్ కు కేంద్ర హోంశాఖ శౌర్య చక్రప్రకటించి గౌరవించింది.

 • బారాముల్లా జిల్లా ఊడీ ప్రాంతానికి చెందిన మన్జూర్.. దక్షిణ కశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో 2017 మే 5న మిలిటెంట్లతో జరిగిన కాల్పుల్లో మరణించారు.

మరణ శిక్ష రద్దుకి మలేసియా కేబినెట్ నిర్ణయం

తీవ్రమైన నేరాలకు పాల్పడే దోషులకు విధించే మరణ శిక్షను త్వరలోనే రద్దు చేసే దిశగా మలేసియా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రధాని ముహతీర్ మొహమ్మద్ అధ్యక్షతన అక్టోబర్ 10న జరిగిన కేబినెట్ సమావేశంలోమరణ శిక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

 • ఈ మేరకు మరణ దండనకు సంబంధించిన చట్టంలో సవరణలు చేస్తూ త్వరలో కొత్త బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెడతామని మలేసియా ప్రభుత్వం ప్రకటించింది.

 • తాజా నిర్ణయంతో త్వరలో మరణశిక్ష అమలు కానున్న 1,200 మందికిపైగా ఖైదీలకు ఊరట లభించింది.

 • ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 142 దేశాలు మరణ శిక్షను తిరస్కరిస్తున్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యదర్శి కుమీ నైదూ వెల్లడించారు. భారత్, సింగపూర్, చైనా, ఇండోనేషియా, థాయ్ లాండ్, వియత్నాం దేశాలు శిక్షను ఇంకా అమలు చేస్తున్నాయి.

మహారాష్ట్రలో 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రం

ప్రపంచ ఆర్థిక ఫోరమ్.. 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రం(Fourth Industrial Revolution Centre) వేదికగా భారత్ ను ఎంచుకుంది. మహారాష్ట్రలో ఏర్పాటు కానున్న ఈ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 11న న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు.

 • డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీలను తొలి మూడు ప్రాజెక్టులుగా అమలు చేస్తారు.

 • వీటిలో ముందుగా ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్, బ్లాక్ చెయిన్ పై ఎక్కువగా దృష్టి పెట్టనున్నట్లు World Economic Forum – WEF ప్రకటించింది.

 • ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూమొదటి రెండు పారిశ్రామిక విప్లవాల సమయంలో భారత్ స్వతంత్ర దేశం కాదని.. మూడో పారిశ్రామిక విప్లవం సందర్భంలో సవాళ్లను ఎదుర్కునే క్రమంలో ఉందని అన్నారు. ఇప్పుడు నాలుగో పారిశ్రామిక విప్లవానికి భారత్ సమర్థవంతంగా లీడ్ చేస్తుందని భరోసా వ్యక్తం చేశారు.

 • ప్రస్తుతం దేశంలో 120 కోట్ల మందికి ఆధార్ ఉందని.. 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్ త్వరలో పూర్తవుతుందని ప్రధాని మోదీ వెల్లడించారు.

గంగా ఉద్యమగారుడు అగర్వాల్ కన్నుమూత

గంగా నదిని ప్రక్షాళన చేసి.. కాలుష్య రహితంగా మార్చాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షకు దిగిన ప్రముఖ పర్యావరణ వేత్త, ఐఐటీ కాన్పూర్ మాజీ ప్రొఫెసర్, స్వామి జ్ఞానస్వరూప్ సనంద కన్నుమూశారు. జూన్ 22న నిరశన దీక్ష ప్రారంభించిన ఆయన అక్టోబర్ 11న తుదిశ్వాస విడిచారు. ఆయన 111 రోజులుగా కేవలం తేనె కలిపిన నీటినే ఆహారంగా తీసుకుంటున్నారు.

 • దీక్ష ప్రారంభించిన 19 రోజుల తర్వాత అగర్వాల్ ను పోలీసులు బలవంతంగా దీక్షాస్థలి నుంచి తరలించారు. నాటి నుంచి ఆయన రహస్య ప్రాంతంలో దీక్ష కొనసాగించారు.

 • గంగా నదిని శుభ్రం చేయాలని, ఉత్తరాఖండ్ లోని గంగోత్రి, ఉత్తర కాశీల మధ్య గంగా నది ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలన్న డిమాండ్ తో అగర్వాల్ దీక్షకు దిగారు.

 • అగర్వాల్ ఐఐటీ కాన్పూర్ లో ప్రొఫెసర్ గా పనిచేశారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిలో సభ్య కార్యదర్శిగా వ్యవహరించారు. యూపీఏ హయాంలో నేషనల్ రివర్ గంగా బేసిన్ అథారిటీ సభ్యుడిగా ఉన్నారు.

 • అగర్వాల్ 2009లోను భాగీరథి నదిపై జలాశయం నిర్మాణానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం దిగివచ్చి డ్యాం నిర్మాణాన్ని నిలిపివేసింది.

 • జీడీ అగర్వాల్.. 1932 జూలై 20న ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ కాండ్లాలో జన్మించారు. రూర్కీ ఐఐటీలో చదివారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోనూ విద్యాభ్యాసం చేశారు.

రష్యా సోయజ్ రాకెట్ కు ప్రమాదం.. వ్యోమగాములు క్షేమం

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఇద్దరు వ్యోమగాములని తీసుకెళ్లేందుకు కజకిస్తాన్ లోని బైకనూర్ కేంద్రం నుంచి రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్ కాస్మోస్ ప్రయోగించిన సోయజ్ రాకెట్ విఫలమైంది. ప్రయోగం అనంతరం భూమికి 50 కిలోమీటర్ల ఎత్తులో బూస్టర్లు మండకపోవడంతో.. రాకెట్ విఫలమైంది. దీంతో.. అందులోను మాడ్యూల్.. 8 వేల కిలోమీటర్ల వేగంతో భూమిమీదకు దూసుకొచ్చింది. కజక్ లో అత్యవసర లాండింగ్ అయింది.

 • ఇద్దరు వ్యోమగాములు నిక్ హాక్(అమెరికా), అలెక్సీ ఓవ్ చీ( రష్యా)క్షేమంగా ఉన్నారు.

 • వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపే క్రమంలో రష్యాకు చెందిన 13 రాకెట్లు విఫలమయ్యాయి. అందులో అత్యధికం సోయెజ్ రాకెట్లే.

హైదరాబాద్ లో అంతర్జాతీయ విత్తన సదస్సు

2019 జూన్ 26 నుంచి జూలై 3 వరకు హైదరాబాద్ లో అంతర్జాతీయ విత్తన సదస్సు జరగనుంది. ఇస్టా కాంగ్రెస్ (International Seed Testing Association) ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుందని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి తెలిపారు. అక్టోబర్ 11న సదస్సు లోగో, కరదీపికలను ఆవిష్కరించారు.

 • 94 ఏళ్ల ఇస్టా చరిత్రలో ఇలాంటి సదస్సుని ఆసియా ఖండంలో నిర్వహించడం ఇదే తొలిసారి.

 • ISTA ను 1924లో స్థాపించారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments