Daily Current Affairs – October 10, 11 – 2018

2018-19లో భారత వృద్ధి రేటు 7.3 శాతం : ఐఎంఎఫ్

2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి రేటు 7.3 శాతంగా నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(IMF) అంచనా వేసింది. 2019-20లో 7.4 శాతంగా ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు అక్టోబర్ 9‘వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.

 • 2018-19లో భారత్ ‘ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ’ హోదాను దక్కించుకుంటుందని ఐఎంఎఫ్ తెలిపింది.

 • ఇదే సమయంలో ప్రపంచ వృద్ధి రేటును 0.2 శాతం మేర ఐఎంఎఫ్ తగ్గించింది.

సర్ చోటూరామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

హరియాణాకు చెందిన జాట్ నేత, రైతు పోరాట యోధుడు, దీన్‌బంధు సర్ చోటూరామ్ 64 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 9న ఆవిష్కరించారు. రోహ్‌తక్ జిల్లా గర్హి సంప్లాలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. స్వాతంత్య్రానికి ముందు రైతుల కోసం సర్ చోటూరామ్ ఎన్నో ఉద్యమాలు నడిపారని చెప్పారు.

 • హరియాణ పర్యటనలో భాగంగా…. సొనిపట్ జిల్లా బర్హిలో రూ.500 కోట్లతో ఏర్పాటు చేసే రైల్ కోచ్ మరమ్మతు, ఆధునీకరణ కర్మాగారానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. 160 ఎకరాల్లో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు 2020-21కల్లా పూర్తవుతుందని ఉత్తర రైల్వే తెలిపింది.

ఐరాసలో యూఎస్ రాయబారి నిక్కీహేలీ రాజీనామా

ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ తన పదవికి రాజీనామా చేశారు. 2018 చివరి నాటికి బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ఆమె అక్టోబర్ 9న ప్రకటించారు. రాజీనామాకు గల కారణాన్ని మాత్రం తెలియజేయలేదు. అయితే.. 2020లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరపున ప్రచారం చేస్తానని నీక్కీ హేలీ తెలిపారు.

 • నిక్కీ హేలీ ఐరాస అమెరికా రాయబారిగా 2017 జనవరిలో నియమితులయ్యారు.

 • కేవలం 19 నెలల పాటు ఆమె ఈ పదవిలో ఉన్నారు.

 • నిక్కీ హేలీ అంతకముందు సౌత్ కరోలినా గవర్నర్ గా ఉన్నారు.

గూగల్ ప్లస్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించిన గూగుల్

టెక్నాలజీ దిగ్గజం గూగుల్ కి చెందిన సోషల్ మీడియా సైట్ గూగుల్ ప్లస్ ను మూసివేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. సాఫ్ట్ వేర్ పరమైన సాంకేతిక లోపాలతో వినియోగదారుల వివరాలు ఇతరుల చేతికి చేరే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. ఒక బగ్ కారణంగా 5 లక్షల మంది వినియోగదారుల ప్రైవేట్ డేటా బయటి డెవలపర్లకు చేరిందని గుర్తించిన గూగుల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

 • గూగుల్ ప్లస్ ని 2011 జూన్ 28న ప్రారంభించింది.

భీమా పుష్కరాలు ప్రారంభం

తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా మండలంలో ప్రవహిస్తున్న భీమా నది పుష్కరాలు అక్టోబర్ 11న ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ 22 వరకు ఈ పుష్కరాలు కొనసాగుతాయి.

 • తెలంగాణలో కేవలం 7 కిలోమీటర్లు మాత్రమే భీమా నది ప్రవహిస్తోంది.

 • పుష్కరాలను పురస్కరించుకొని తంగిడి, కుసునూర్, శుక్రలింగంపల్లి గ్రామాల్లో పుష్కర ఘాట్లు ఏర్పాటు చేశారు.

 • మహారాష్ట్రలోని పూణె జిల్లాలో గల సహయాద్రి కొండల్లో భీమాశంకర్ దేవాలయం వద్ద భీమా నది ప్రారంభం అవుతుంది.

 • మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మీదుగా ప్రవహించితెలంగాణ, కర్ణాటక సరిహద్దులో కృష్ణా నదిలో కలుస్తుంది.

తిరుపతిలో ఐఐఎస్ఈఆర్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ లోని ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో భారత వైజ్ఞానిక విద్య, పరిశోధన సంస్థ(IISER-Indian Institute of Science and Research) శాశ్వత కేంద్రం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒడిశాలోని బరంపురంలోనూ ఇదే తరహా కేంద్రం ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. 2021 నాటి కల్లా ఆయా కేంద్రాల్లో భవన నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

పాకిస్తాన్ ఐఎస్ఐ అధిపతిగా అసిమ్ మునీర్

పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్ నియమితులయ్యారు. ఈ మేరకు పాకిస్తాన్ ఆర్మీ అక్టోబర్ 10న ప్రకటించింది.

 • ప్రస్తుత చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ నవీద్ ముఖ్తార్ అక్టోబర్ 1న రిటైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో అసిమ్ కొత్త చీఫ్ గా నియమితులయ్యారు.

 • అసిమ్ మునీర్ 2016 నుంచి ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ (DG)గా ఉన్నారు.

మహిళల భద్రతకు వొడాఫోన్ ఐడియా సఖి

మహిళల భద్రత కోసం టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా ‘వొడాఫోన్ సఖి’ పేరుతో మొబైల్ ఆధారిత సేఫ్టీ సేవలను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ.సింధు అక్టోబర్ 10న వొడాఫోన్ సఖిని ఆవిష్కరించారు.

 • ఈ కార్యక్రమంలో భాగంగాకస్టమర్లు అత్యవసర సమయంలో 1800123100 టోల్‌ ఫ్రీ నంబరు ద్వారా సఖి సేవలు పొందవచ్చు.

 • దీని ద్వారా కస్టమర్ ఉన్న ప్రాంతం (లొకేషన్) వివరాలు ముందుగా నమోదు చేసుకున్న 10 కాంటాక్ట్ నంబర్లకు వెళ్తుంది.

 • మొబైల్‌లో బ్యాలెన్స్ లేనప్పటికీ 10 నిముషాలపాటు కాల్స్ చేసుకోవచ్చు.

 • రిటైల్ ఔట్‌లెట్ వద్ద నంబర్ గోప్యత కోసం 10 అంకెల డమ్మీ నంబరును కస్టమర్‌కు కేటాయిస్తారు.

 • స్మార్ట్‌ఫోన్లతోపాటు ఫీచర్ ఫోన్ లలోనూ ఈ సేవలు పనిచేస్తాయి.

మోస్ట్ పవర్ ఫుల్ పాస్ పోర్ట్ గా.. జపాన్ పాస్ పోర్ట్

అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్ట్ గా.. జపాన్ పాస్ పోర్ట్ నిలిచింది. ఇటీవల జపాన్ దేశస్తులు వీసా అవసరం లేకుండా వెళ్లే 190వ దేశంగా మయన్మార్ గుర్తింపు పొందడంతోజపాన్ పాస్ పోర్ట్.. అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్టు అయ్యింది. 189 దేశాలతో సింగపూర్ రెండో స్థానంలో, 188 దేశాలతో ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణాఫ్రికా దేశాలు 3వ స్థానంలో ఉన్నాయి.

 • ఏ దేశానికైతే అత్యధిక విదేశాలకు వెళ్లడానికి వీసా అవసరం లేదో.. ఆ దేశ పాస్ పోర్ట్ ను అత్యంత శక్తిమంతమైనదిగా పరిగణిస్తారు.

 • ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా దేశాల మధ్య ఈ సదుపాయం ఏర్పడుతుంది.

 • ఈ జాబితాలో భారత్ 76వ స్థానంలో ఉంది. భారత పాస్ పోర్టుతో వీసా లేకుండా కానీ, వీసా ఆన్ అరైవల్ విధానం ద్వారా కానీ 59 దేశాలకు వెళ్లవచ్చు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments