Daily Current Affairs – October 06, 07 – 2018

ఎస్ – 400 పై రష్యాతో భారత్ ఒప్పందం

ఎస్ – 400 ట్రయంఫ్ అధునాతన గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థ కొనుగోలుకు సంబంధించి భారత్ రష్యాతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనలో భాగంగా అక్టోబర్ 5న ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య అంతరిక్షం, రైల్వేలు, అణుశక్తి, విద్య, ఎరువుల తదితర రంగాల్లో 8 ఒప్పందాలు కుదిరాయి. 2022 నాటికి భారత్ చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్ యాన్ కు సాంకేతిక సహకారం అందించేందుకు రష్యా అంగీకరించింది. ఈ మేరకు ఇస్రో.. రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్ కాస్మోస్ ఒప్పందం కుదుర్చుకున్నాయి.

 • ఎస్-400 క్షిపణి వ్యవస్థను రష్యా నుంచి కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు విధిస్తామంటూ ఆమెరికా హెచ్చరికలు జారీ చేసినాభారత్ వాటిని పట్టించుకోకుండా రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా ఇందుకోసం రూపొందించి కాట్సా చట్టాన్ని భారత్ అంతగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోభారత్, రష్యా ఒప్పందంపై అమెరికా ఆచితూచి స్పందించింది.

ఎస్ – 400 విశిష్టతలు

 • ఎస్ – 400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ ఒప్పందం విలువ 5 బిలియన్ డాలర్లు

 • ఎస్ – 400 క్షిపణులను భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగిస్తారు.

 • ఇది శత్రు దేశాల క్షిపణులను అడ్డుకొని ధ్వంసం చేస్తుంది. ఈ వ్యవస్థ ద్వారా ఒకేసారి 36 లక్ష్యాలపైకి 72 క్షిపణులను ప్రయోగించవచ్చు.

 • ఒ‍క్కో వ్యవస్థలో రెండు రాడార్లు, క్షిపణి లాంచర్లు, కమాండ్ పోస్టులు ఉంటాయి.

 • ఒక్కో రాడార్ 100 నుంచి 300 లక్ష్యాలను ఏకకాలంలో గుర్తించగలదు.

 • 600 కీలోమీటర్ల దూరం నుంచే శత్రు క్షిపణులు, ఇతర ప్రయోగాల జాడను ఎస్ – 400 ట్రయంఫ్ గుర్తించగలదు.

 • 400 కిలోమీటర్ల దూరం నుంచి లక్ష్యం పై గురిచపెడుతుంది.

 • పొరుగు దేశాలు పాకిస్తాన్, చైనాలోని అన్ని వైమానిక స్థావరాలు దీని పరిధిలోకి వస్తాయి.

గిర్సింహాల మృతికి కారణం సీడీవీ వైరస్

గుజరాత్ లోని గిర్ అభయారణ్యంలో 23 ఆసియా జాతి సింహాల్లో 5 సింహాల మృతికి కారణాన్ని భారత వైద్య పరిశోధన మండలి, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(NIA-PUNE) గుర్తించాయి. ప్రమాదకర కెనైన్ డిస్టెంపర్ వైరస్(CDA) కారణంగా ఇందులో 5 సింహాలు చనిపోయాయని తెలిపాయి.

 • ఈ ప్రమాదకర వైరస్ కారణంగానే తూర్పు ఆఫ్రికాలో ఉన్న సింహాల్లో 30 శాతం అంతరించిపోయాయని ఎన్ఐఏ పేర్కొంది.

 • గాలితో పాటు ప్రత్యక్షంగా తాకటం వల్ల జంతువుల్లో ఈ వైరస్ సోకుతుంది.

 • ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సీడీవీ టీకాను భారత్ అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది.

 • గుజరాత్ లోని గిర్ అభయారణ్యంలో దాదాపు 600 సింహాలు ఉన్నాయి.

షార్ లో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు అక్టోబర్ 4న ప్రారంభమయ్యాయి. ఇస్రో మాజీ చైర్మన్ కె. రాధాకృష్ణాన్ ఉత్సవాలను ప్రారంభించారు. అక్టోబర్ 5న షార్ నుంచి రోహిణి-200 సౌండింగ్ రాకెట్‌ను ప్రయోగించారు. విద్యార్థులు స్వయంగా వీక్షించడం కోసం ఈ ప్రయోగం చేపట్టారు.

 • అక్టోబర్ 10 వరకు ఈ వారోత్సవాలు జరుగుతాయి

 • అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అంతరిక్ష వారోత్సవాలను నిర్వహిస్తున్నారు.

బ్యూనస్ ఎయిర్స్ లో 3వ యూత్ ఒలింపిక్స్ ప్రారంభం

3వ యూత్ ఒలింపిక్స్ పోటీలు అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో అక్టోబర్ 6న ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 18 వరకు జరిగే ఈ క్రీడల్లో బ్రేక్‌డ్యాన్సింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, రోలర్ స్పోర్ట్స్‌ అండ్ కరాటే, బీఎం ఎక్స్ ఫ్రీస్టయిల్, కైట్ బోర్డింగ్, బీచ్ హ్యాండ్‌బాల్, ఫుట్సల్, అక్రోబటిక్ జిమ్నాస్టిక్స్ తదితర అంశాలను కొత్తగా చేర్చారు.

 • ఈ ఒలింపిక్స్‌లో 32 క్రీడాంశాల్లో 4000 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు.

 • ఒలింపిక్స్‌లో తొలిసారిగా ‘లింగ సమానత్వం’ అనే నేపథ్యాన్ని ఈ క్రీడల్లో చేర్చారు. దీని ప్రకారం పోటీల్లో పాల్గొనే ఆటగాళ్లలో పురుషులు, మహిళల సంఖ్య సరిగ్గా సమానంగా ఉంటుంది.

 • యూత్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత పతాకధారిగా షూటర్ మను భాకర్ వ్యవహరించింది. భారత్ తరఫున యూత్ ఒలింపిక్స్‌లో 13 క్రీడాంశాల్లో కలిపి మొత్తం 47 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు.

 • 2014 యూత్ ఒలింపిక్స్‌లో ఒక రజతం, ఒక కాంస్యం నెగ్గి రెండు పతకాలతో భారత్ 64వ స్థానంలో నిలిచింది.

 • 2010లో మొదటి యూత్ ఒలింపిక్స్ సింగపూర్‌లో జరగగా 2014లో చైనాలోని నాన్‌జింగ్‌లో జరిగాయి.

 • ప్రస్తుతం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడిగా థామస్ బాచ్ ఉన్నారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments