☛ బిగ్ బాస్ – 2 విన్నర్ కౌశల్
స్టార్ మాలో ప్రసారమైన తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 2 కౌశల్ నిలిచారు. సెప్టెంబర్ 30న జరిగిన ఫైనల్లో కౌశల్ టైటిల్ విజేతగా.. గీతా మాధురి రన్నరప్ గా నిలిచారు. ఫైనల్ కు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ హీరో వెంకటేశ్.. కౌశల్ కు ట్రోఫీతో పాటు రూ.50 లక్షల బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా కౌశల్ మాట్లాడుతూ… బహుమతి మొత్తాన్ని క్యాన్సర్ బాధితుల కోసం విరాళంగా ఇస్తానని ప్రకటించారు.
-
హీరో నాని ఈ షోకి హోస్ట్ గా వ్యవహరించారు. 2018 జూన్ 10న ప్రారంభమైన బిగ్ బాస్ – 2, 113 రోజుల పాటు జరిగింది.
☛ జాతీయ గాంధీ మ్యూజియంలో గాంధీ హృదయ స్పందన
న్యూఢిల్లీలోని జాతీయ గాంధీ మ్యూజియంలో మహాత్మా గాంధీ హృదయ స్పందనలను ఏర్పాటు చేశారు. 2018 అక్టోబర్ 2న గాంధీ 150వ జయంతి ఉత్సవాలు ప్రారంభవుతున్న నేపథ్యంలో.. ఈ ఏర్పాటు చేశారు. గాంధీ జివించి ఉన్న రోజుల్లో వివిధ సందర్భాల్లో సేకరించిన ECG(Electro Cardio Graphy) ఆధారంగా ఆయన హృదయ స్పందనలను పునర్ సృష్టి చేశారు. డిజిటల్ మోడల్ లో వాటిని ప్రజలు వినేందుకు ఏర్పాటు చేశారు.
☛ మధ్యప్రదేశ్ లో గోవుల మంత్రిత్వశాఖ
మధ్యప్రదేశ్ లో గోవుల మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సెప్టెంబర్ 30న వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న Madhya Pradesh Gaupalan Evam Pashudhan Samvardhan (MPGEPS) బోర్డుకి కొన్ని పరిమితులు ఉన్న నేపథ్యంలో దీని స్థానంలో కొత్త మంత్రిత్వశాఖను తీసుకొచ్చారు.
-
దేశంలో గోవుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రంగా రాజస్థాన్ గుర్తింపు పొందింది.
☛ రష్యా గ్రాండ్ ప్రీ విజేత హామిల్టన్
2018 ఫార్ములా వన్ సీజన్ లో మెర్సిడిస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ 8వ టైటిల్ ను గెలుచుకున్నాడు. సెప్టెంబర్ 30న జరిగిన రష్యా గ్రాండ్ ప్రీ లో 53 ల్యాప్ ల రేసుని అందరికన్నా ముందు పూర్తి చేసిన హామిల్టన్… రేసు విజేతగా నిలిచాడు. కాగా తన కెరీర్ లో ఇది 70వ విజయం.
-
మెర్సిడిస్ జట్టుకే చెందిన బొటాస్ రెండో స్థానంలో, ఫెరారీ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ మూడో స్థానంలో నిలిచారు.