☛ పాక్ లో పురాతన హిందూ దేవాలయానికి అరుదైన గుర్తింపు
పాకిస్తాన్ లోని పెశావర్ లో ఉన్న పంచ్ తీర్థ్ దేవస్థానాన్ని చారిత్రక జాతీయ వారసత్వ సంపదగా గుర్తింపు లభించింది. పాకిస్తాన్ లోని కైబర్ పక్ తున్క్వా ప్రావిన్స్ ప్రభుత్వం ఈ మేరకు దేవాలయాన్ని చారిత్రక వారసత్వ సంపదగా ప్రకటించింది. కేపీ ఆంక్విటీస్ యాక్ట్ 2016 ప్రకారం ఉత్తర్వులు జారీ చేసింది.
-
ఈ దేవాలయం వద్ద 5 చిన్నపాటి సరస్సలు ఉన్నాయి. అందుకే పంచ్ తీర్థ్ అనే పేరు వచ్చింది.
-
మహాభారతం ప్రకారం పాండు రాజు ఈ ప్రాంతానికి చెందిన వారు. కార్తీక మాసంలో ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరించేందుకు అనేక మంది భక్తులు వచ్చే వారట.
☛ తెలంగాణ నీటిపారుదల శాఖకు CBIP అవార్డు
తెలంగాణ రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖకు ప్రతిష్టాత్మక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (CBIP) పురస్కారం దక్కింది. న్యూఢిల్లీలో జనవరి 4న జరిగిన సీబీఐపీ 91వ వార్షికోత్సవం, అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు.
-
సాగునీటి వనరుల నిర్వహణలో మెరుగైన పనితీరు ప్రదర్శన, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణకు గానూ ఈ అవార్డు దక్కింది.
☛ MOB ని రూపొందించిన చైనా
‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’(MOB) పేరుతో అమెరికా రూపొందించిన శక్తిమంతమైన అణ్వస్తేత్రర ఆయుధానికి పోటీగా చైనా రక్షణ సంస్థ ‘నారిన్కో’ ఒక భారీ బాంబును రూపొందించింది. ‘చైనీస్ వర్షన్ ఆఫ్ మదర్ బాంబ్’గా పిలిచే ఈ ఆయుధాన్ని హెచ్-6కే బాంబర్ సహాయంతో జనవరి 4న నారిన్కో ప్రయోగించింది. ఈ బాంబు అసలు పేరు ‘మ్యాసివ్ ఆర్డ్‌నెన్స్ ఎయిర్ బ్లాస్ట్’ (ఎంవోఏబీ) కాగా మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌గా వర్ణిస్తున్నారు.
-
2017లో అమెరికా సైన్యం అఫ్గానిస్థాన్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల స్థావరాలపై ఎంవోఏబీను ప్రయోగించిన విషయం తెలిసిందే.
-
విధ్వంసక శక్తి విషయంలో అణ్వస్త్రాల తర్వాతి స్థానంలో ఎంవోఏబీలు ఉన్నాయి.
☛ కాకినాడ సెజ్‌లో పెట్రోకెమికల్ ప్రాజెక్టు
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జీఎంఆర్ గ్రూపునకు చెందిన కాకినాడ సెజ్‌లో పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. టీజీవీ గ్రూపు సంస్థ అయిన హల్దియా పెట్రోకెమికల్స్ లిమిటెడ్‌తో రాష్ట్ర ప్రభుత్వం జనవరివ 4న ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కాంప్లెక్స్ వల్ల రూ.60 వేల కోట్ల పెట్టుబడులు, వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వ అంచనా వేస్తోంది.
☛ కాకినాడ గేట్‌వే పోర్ట్‌కు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వద్ద గల కోన గ్రామంలో జీఎంఆర్ కాకినాడ గేట్‌వే పోర్ట్ లిమిటెడ్ నిర్మించనున్న నౌకాశ్రయంకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జనవరి 4న శంకుస్థాపన చేశారు. రూ.3,000 కోట్ల వ్యయంతో డీబీఎఫ్ఓటీ (డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్) పద్ధతిలో ఈ నౌకాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. ఈ నౌకాశ్రయం ద్వారా బొగ్గు, నిత్యావసరాలు ఎగుమతి – దిగుమతులు చేస్తారు.
☛ పోలవరం ప్రాజెక్టుకు CBIP అవార్డు
ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (సీబీఐపీ) అవార్డు లభించింది. న్యూఢిల్లీలో జనవరి 4న జరిగిన కార్యక్రమంలో ఏపీ జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.
-
పోలవరంను అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మిస్తున్నందుకు ఈ అవార్డు అందించినట్లు సీబీఐపీ వెల్లడించింది.