కరెంట్ అఫైర్స్ – ఆగస్టు 3, 2020

జాబిలిపై ప్రజ్ఞాన్ రోవర్ కదలికను గుర్తించిన సుబ్రమణియన్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి దశలో చంద్రుడి ఉపరితలాన్ని ఢీ కొని నాశనమైందని భావిస్తున్న ప్రజ్ఞాన్ రోవర్‌.. నిజానికి ధ్వంసం కాలేదని చెన్నైకి చెందిన టెకీ షణ్ముగ సుబ్రమణియన్ పేర్కొన్నారు. అందుకు సాక్ష్యాలుగా కొన్ని ఫొటోలతో ట్వీట్లు చేశారు. సుబ్రయణియన్ పరిశీలన ప్రకారం

  • ల్యాండర్‌ నుంచి విడివడిన ప్రజ్ఞాన్ కొద్ది మీటర్ల దూరం దొర్లుకుంటూ వెళ్లి నిలిచిపోయింది.

  • ప్రస్తుతం అది చంద్రుడి ఉపరితలంపై క్షేమంగా ఉంది.

  • చంద్రుడి ఉపరితలంపై కూలిపోయిన తరువాత కూడా ల్యాండర్‌కు భూమి నుంచి సందేశాలు అంది ఉండవచ్చు. అయితే, అది మళ్లీ తిరిగి సమాధానం ఇవ్వలేకపోయి ఉండవచ్చు.

  • రోవర్‌ ఇంకా పనిచేస్తూ ఉందని కచ్చితంగా చెప్పలేము.

గతంలో మూన్ ల్యాండర్‌ ‘విక్రమ్‌’ శకలాలను కూడా సుబ్రమణియన్ గుర్తించారు. ఆ విషయాన్ని నాసా కూడా నిర్ధారించింది. సుబ్రమణియన్ అందజేసిన సమాచారానికి సంబంధించిన ఆధారాలను అధ్యయనం చేస్తున్నామని ఇస్రో చైర్మన్ కే శివన్ తెలిపారు. 2019, సెప్టెంబర్ లో ల్యాండర్‌ విక్రమ్‌ చంద్రుడి ఉపరితలంపైకి చేరే క్రమంలో వేగం అదుపు తప్పి కుప్పకూలిందని ఇస్రో ప్రకటించింది.

ఏఎంఆర్‌డీఏ కమిషనర్ గా పి. లక్ష్మీనరసింహ

ఏపీసీఆర్‌డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్‌ అధారిటీ (ఏఎంఆర్‌డీఏ)ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11 మందితో ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌గా ఉన్న పి.లక్ష్మీనరసింహంను ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌గా నియమిస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. చైర్‌పర్సన్ గా పర్యావరణ మండలిలో సభ్యునిగా పనిచేసిన లేదా పట్టణ గవర్నెన్స్, ప్లానింగ్, రవాణా రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పనిచేసిన వ్యక్తిని నియమించనుంది.

☛ 4వ విడత స్మార్ట్ ఇండియా హ్యాకథాన్

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆగస్టు 1న స్మార్ట్‌ ఇండియా ఆన్ లైన్ హ్యాకథాన్ నాలుగో ఎడిషన్ ను నిర్వహించింది. ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలకు విద్యార్థులు పరిష్కార మార్గాలు చూపడమే దీని ఉద్దేశం. 2020 ఏడాది 243 సమస్యల పరిష్కారానికి 10 వేల మందికిపైగా పోటీపడ్డారు. విజేతలకు నగదు బహుమతి అందజేశారు. హ్యాకథాన్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ…. ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్లు కాదు.. ఉద్యోగాలు ఇచ్చేవాళ్లను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం నూతన విద్యా విధానం–2020ని ప్రకటించిందన్నారు.

☛ కరోనా బాధితుల రిజిస్ట్రీ ఏర్పాటుకు నిర్ణయం

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ బారినపడి, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల సమగ్ర సమాచారంతో ఒక రిజిస్ట్రీని ఏర్పాటు చేయాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) నిర్ణయించింది. దీనిద్వారా వారికి అందిస్తున్న చికిత్సను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, మరింత చికిత్స అందించేందుకు వీలవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ, ఢిల్లీ ఎయిమ్స్‌ భాగస్వామ్యంతో నేషనల్‌ క్లినికల్‌ రిజిస్ట్రీని ఐసీఎంఆర్‌ ఏర్పాటు చేయనుంది. ఆసుపత్రుల్లోని బాధితుల సమాచారాన్ని 15 జాతీయ స్థాయి సంస్థలు సేకరించి, రిజిస్ట్రీకి అందజేస్తాయి.

☛ 2021లో పూర్తికానున్న ప్రపంచంలోనే అతిఎత్తైన రైల్వే వంతెన

జమ్మూకశ్మీర్‌లో చీనాబ్‌ నదిపై నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిఎత్తైన రైల్వే వంతెన పనులు 2021 ఏడాదికి పూర్తికానున్నాయి. కశ్మీర్‌ను మిగతాదేశంతో కలిపే ఈ వారధిపై 2022 డిసెంబర్‌లో మొట్టమొదటి రైలు ప్రయాణం చేసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. 359 మీటర్ల ఎత్తులో 467 మీటర్ల పొడవైన ఈ వారధి ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే వంతెన. గంటకు 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను సైతం తట్టుకునేలా వంతెన డిజైన్ చేశారు. 2018 వరకు ప్రాజెక్టు అంచనా వ్యయంలో 27 శాతమే ఖర్చు కాగా ఆ తర్వాత 54 శాతం మేర వెచ్చించారు.

☛ హాజ్ ఆఫ్ లార్డ్స్ లో సభ్యునిగా ఇయాన్ బోథమ్

ఇంగ్లండ్‌ క్రికెట్‌ దిగ్గజం ఇయాన్ బోథమ్‌కు అరుదైన గౌరవం దక్కింది. బ్రిటిష్‌ పార్లమెంట్‌ హౌజ్‌ ఆఫ్‌ లార్డ్స్‌ సభలో సభ్యునిగా 64 ఏళ్ల బోథమ్‌ ఎన్నికయ్యాడు. తాజాగా 36 మందిని ప్రభుత్వం ఈ సభకు ఎంపిక చేయగా అందులో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్ బోథమ్‌కు కూడా చోటు దక్కింది. 2011లో ఇంగ్లండ్‌ మహిళల కెప్టెన్ రాచెల్‌ ఫ్లింట్‌ తర్వాత ఈ గౌరవం పొందిన తొలి క్రికెటర్‌ బోథమ్‌ కావడం విశేషం. ఇంగ్లండ్‌ తరఫున 1977–1992 మధ్య కాలంలో 102 టెస్టులు ఆడిన బోథమ్‌…1981లో ఆసీస్‌ను ఓడించి యాషెస్‌ సిరీస్‌ దక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించాడు.

☛ చైనీస్ యాప్ స్టోర్ నుంచి 29 వేల యాప్ లను తొలగించిన యాపిల్

చైనీస్‌ యాప్‌ స్టోర్‌ నుంచి ఆగస్టు 1న అకస్మాత్తుగా 29,800యాప్‌లనుస్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజ సంస్థ యాపిల్‌ తొలగించింది. ఇందులో 26 వేలకు పైగా గేమ్‌ యాప్‌లే కావడం గమనార్హం. లైసెన్స్ గేమ్‌ యాప్‌లపై చైనా అధికారులు చర్యలు తీసుకుంటున్నందునే యాపిల్‌ ఇలా చేసినట్లు క్విమై అనే పరిశోధన సంస్థ తెలిపింది. చైనా ఆండ్రాయిడ్‌ యాప్‌ స్టోర్స్‌ ప్రభుత్వ నిబంధనలకు లోబడే చాలాకాలంలో పనిచేస్తున్నాయి.

☛ టిక్‌టాక్‌ను నిషేధిస్తాం: ట్రంప్

చైనాతో విభేదాలు ముదురుతున్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన కంపెనీలపై అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి కొరడా ఝళిపించారు. చైనాకే చెందిన వీడియో యాప్‌ టిక్‌టాక్‌పై అమెరికాలో నిషేధం విధించనున్నట్లు ట్రంప్‌ జూలై 31న ప్రకటించారు. అమెరికన్ల వ్యక్తిగత గోప్యత, భద్రతకు ప్రమాదకరంగా మారిందంటూ టిక్‌టాక్‌పై విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో విమర్శలు చేస్తున్నారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments