కరెంట్ అఫైర్స్ – జూలై 30, 2020

☛ నూతన జాతీయ విద్యా విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం

కొత్త జాతీయ విద్యా విధానానికి కేంద్ర కేబినెట్ (బుధవారం,జులై-29) ఆమోదం తెలిపింది. పాఠశాల విద్యకు సంబంధించిన పాఠ్యాంశాల దగ్గర నుంచి ఎంఫిల్ డిస్ కంటిన్యుయేషన్ వరకు విద్యా విధానంలో మార్పులు చేశారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే విధంగా విధివిధానాలను మార్చారు. విద్యార్థులకు అత్యున్నత విద్యను అందించడం, భారత్ ను నాలెడ్జ్ సూపర్ పవర్ గా తయారు చేయడం వంటి లక్ష్యాలతో ఈ నూతన విధానాన్ని రూపొందించారు.

ఇప్పటి వరకు డీమ్డ్ యూనివర్శిటీలు, సెంట్రల్ యూనివర్శిటీలు, ఇతర యూనివర్శిటీలకు వివిధ నిబంధనలు ఉన్నాయని చెప్పారు కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అమిత్ ఖర్గే. అయితే, నాణ్యమైన విద్యను అందించే క్రమంలో… నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం అన్ని విద్యా సంస్థలకు ఒకే విధమైన నిబంధనలు ఉండబోతున్నాయని తెలిపారు.

 • కొత్త జాతీయ విద్యా విధానంలో కీలక అంశాలు:
  యాంత్రికంగా పాఠాలను చదువుకునే పద్ధతికి ముగింపు పలకడం. ప్రాక్టికల్ విద్యా విధానానికి పెద్ద పీట వేయడం.

 • ఎంఫిల్ కోర్సులను నిలిపివేయడం.

 • న్యాయ, వైద్య కాలేజీలు మినహా మిగిలిన అన్ని ఉన్నత విద్యాసంస్థలను ఒకే రెగ్యులేటర్ కిందకు తీసుకురావడం.

 • యూనివర్శిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలకు కొత్త విద్యా విధానం ప్రకారం కామన్ ఎంట్రెస్ పరీక్షలను నిర్వహించడం.

 • పాఠశాల పాఠ్యాంశాలను ప్రాధాన్యతా స్థాయికి తీసుకురావడం. 6వ తరగతి నుంచి వొకేషనల్ విద్యతో అనుసంధానం చేయడం.

 • 2035 నాటికి హైస్కూల్ విద్యార్థుల్లో 50 శాతం మందికి ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చేలా చేయడం.

 • జీడీపీలో 6 శాతాన్ని విద్యకు కేటాయించాలని కేబినెట్ ఆమోదించింది. ప్రస్తుతం జీడీపీలో 4 శాతాన్ని మాత్రమే విద్యకు కేటాయిస్తున్నారు.
 • విద్యా సంస్థల ఫీజులకు ఒక పరిమితిని విధించడం.
 • 2030 నాటికి ప్రాథమిక పాఠశాలల నుంచి సెకండరీ లెవెల్ స్కూళ్ల వరకు 100 శాతం నమోదు నిష్పత్తి ఉండేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుంటుంది.

 • ఐదో తరగతి వరకు మాతృ భాష కూడా ఒక మీడియంగా ఉండాలని నిర్ణయించారు. రిపోర్ట్ కార్డుల్లో మార్కులతో పాటు విద్యార్థుల నైపుణ్యాలు, సామర్థ్యాలను తెలపడం.

☛ భారత్ కు చేరుకున్న రాఫెల్ యుద్ధ విమానాలు

భారత వాయుసేన సరికొత్త అస్త్రం రాఫెల్ యుద్ధ విమానాలు రెండు రోజుల క్రితం ఫ్రాన్స్ నుంచి బయలుదేరి, 7 వేల కిలోమీటర్లు ప్రయాణించి జూలై 29న భారత్ చేరుకున్నాయి. ఐదు యుద్ధ విమానాలు హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరంలో ల్యాండ్ అయ్యాయి. చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్, ఎయిర్ ఛీప్ మార్షల్ భదొరియాతో పాటు భారత వైమానిక దళ ఉన్నతాధికారులు రాఫెల్ యుద్ధ విమానాలకు స్వాగతం పలికారు.

ఫ్రాన్స్ లోని దసో ఏవియేషన్ తయారు చేసిన 36 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయడానికి 2016లో ఎన్డీఏ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

 • 17వ స్కాడ్రన్‌ తొలి బ్యాచ్‌ రాఫెల్‌ యుద్ధ విమానాలకు భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌)లోని వింగ్‌ కమాండర్‌, గ్రూప్‌ కెప్టెన్‌ హర్కిరాత్‌ సింగ్‌ తొలి కమాండింగ్‌ ఆఫీసర్‌గా చరిత్ర సృష్టించనున్నారు. సింగ్‌తో పాటు వింగ్‌ కమాండర్లు ఎంకే సింగ్‌, ఆర్‌ కతారియా, సిద్దు, అరుణ్‌ కూడా పాలుపంచుకోనున్నారు. 2001లో ఐఏఎఫ్‌లో ప్రవేశించిన సింగ్‌ తన 19 ఏండ్ల కెరీర్‌లో ఎన్నో విజయాలను సాధించారు. ఆయనకు 2009లో మూడో అత్యుత్తమ గ్యాలంట్రీ శౌర్య చక్ర పురస్కారం లభించింది.

☛ పార్లమెంట్ భవన నిర్మాణం కోసం సుప్రీంలో కేంద్రం అఫిడవిట్

కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ప్రస్తుత పార్లమెంటు భవనం పురాతనమైనదని, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా లేదని అందులో పేర్కొన్నది. ‘సెంట్రల్‌ విస్తా రెనోవేషన్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు’లో భాగంగా కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించడానికి కేంద్రం సంకల్పించగా.. ప్రాజెక్టు అవశ్యకతను సవాలు చేస్తూ నిఖిల్‌ సూరి అనే లాయర్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు.

కేంద్రం ప్రభుత్వం దాదాపు రూ. 1000 కోట్లతో కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించనున్నది. త్రికోణాకృతిలో నిర్మించనున్న ఈ భవనాన్ని 2022 అగస్టు 15 లోపు నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.

 • ప్రస్తుతం లోక్‌సభ మొత్తం సభ్యుల సంఖ్య 545. రాజ్యసభ సభ్యుల సంఖ్య 245. 2026లో డీలిమిటేషన్‌ తర్వాత ఉభయసభల్లో మొత్తం సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అప్పటికి లోక్‌సభ సీట్ల సంఖ్య 876కు పెరగవచ్చని కేంద్రం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత భవనం కార్యకలాపాలకు సరిపోదని కేంద్రం పేర్కొన్నది. కొత్త భవనం అవసరమని సుప్రీం కోర్టుకు తెలిపింది.

 • ప్రస్తుత పార్లమెంటు భవన నిర్మాణాన్ని 1921లో బ్రిటిష్‌ ప్రభుత్వం హయాంలో ప్రారంభించారు. దీనికి ఎడ్విన్‌ ల్యూటెన్స్‌, హెర్బర్ట్‌ బేకర్‌ డిజైన్‌ చేశారు. 1927 జనవరి 18న ప్రారంభమైన నిర్మాణం ప్రారంభమైంది. అప్పటి వైశ్రాయ్‌ లార్డ్‌ ఇర్విన్‌ శంకుస్థాపన చేశారు. 1937లో నిర్మాణం పూర్తైంది. ఇది 6 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. తర్వాతి కాలంలో పార్లమెంటు కార్యకలాపాలు పెరిగాయి. 1956లో మరో రెండు అంతస్తులు పెంచారు.

☛ వన్ డిస్ట్రిక్ వన్ ప్రొడక్ట్ పై తెలంగాణకు కేంద్రం సూచనలు

వన్‌ డిస్ట్రిక్‌.. వన్‌ ప్రొడక్ట్‌(ఓడీవోపీ) లక్ష్యంతో ఒక్కో జిల్లాకు ఒక్కో ప్రధాన పంట సాగును ఎంపికచేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు లేఖ రాసింది. తెలంగాణలో ఇప్పటికే డిమాండ్‌ ఉన్న పంటలనే సాగుచేయాలని రైతాంగానికి సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో జిల్లా భౌగోళిక పరిస్థితులు, నేల స్వభావం, మార్కెట్‌ డిమాండ్‌ తదితర సమగ్ర సమాచారంతో నియంత్రితసాగులో మున్ముందుకు సాగుతున్న వ్యవసాయశాఖ ఇప్పుడు జిల్లాలవారీగా ప్రధాన పంటల జాబితాలను సిద్ధంచేస్తున్నది. ఏ జిల్లాలో ఏ పంట ఎక్కువగా పండుతుంది? దాని ప్రత్యేకత ఏమిటి? తదితర వివరాలను వ్యవసాయ, ఉద్యానశాఖలు సేకరిస్తున్నాయి.

ఓడీవోపీలో భాగంగా కేంద్రం కొన్ని పంటలను ఇప్పటికే సూచించింది. ఈ పంటలు ఆయా జిల్లాలకు సరిపోని పక్షంలో మార్పుచేసి పంపాలని సూచించింది. ఇంకా ఏమైనా అదనపు పంటలున్నా పంపించాలని రాష్ర్టాలను కోరింది.

ఓడీవోపీ ప్రకారం నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, వరంగల్‌, నల్లగొండ, జిల్లాలకు వరి పంటను కేంద్రం సూచించింది. రంగారెడ్డి, మహబూబాబాద్‌ జిల్లాలు మామిడి పంటకు అనుకూలమని పేర్కొన్నది.

 • రాష్ట్ర ఉద్యానశాఖ మామిడి పంటకు రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వరంగల్‌, మహబూబాబాద్‌, జగిత్యాల, వనపర్తి జిల్లాలను ప్రతిపాదించింది.

 • మిర్చి సాగుకు ఖమ్మం, వరంగల్‌ జిల్లాలను, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో పసుపు, నల్లగొండకు నిమ్మజాతి పండ్ల తోటలు, సంగారెడ్డి జిల్లాకు అల్లం పంటను, సిద్దిపేట జిల్లాకు పచ్చిమిర్చి పంటను సూచించింది.

 • నారాయణపేట, వికారాబాద్‌ జిల్లాలకు కంది, నారాయణపేట, గద్వాల్‌ జిల్లాలకు పల్లికాయ (గ్రౌండ్‌నట్‌) పంటలను సూచించింది.

 • మహబూబ్‌నగర్‌ జిల్లాకు జొన్న, సజ్జ పంటలను రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రతిపాదించింది.

 • జిల్లాకో ప్రధాన పంటను గుర్తించడం వల్ల ఆ పంటలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించే అవకాశం ఉన్నది. ఆ పంట ఎగుమతులను ప్రొత్సహించేందుకు వాల్యూ అడిషన్‌ చేయనున్నారు. ఈ ప్రతిపాదనలు ఇంకా ప్రాథమికదశలోనే ఉన్నాయి. జాబితాను కేంద్రానికి పంపిన తర్వాత అంగీకారం వస్తే కార్యాచరణ మొదలు పెట్టనున్నారు. వన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రొడక్ట్‌కు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయింపులేమీ ఉండబోవని సమాచారం.

☛ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్

వెస్టిండీస్ తో మూడో టెస్ట్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి ఎగబాకాడు. జూలై 29 ప్రకటించిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ బౌలర్ల విభాగంలో బ్రాడ్‌ ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకాడు. బుమ్రా ఎనిమిదో ర్యాంక్‌లో నిలిచాడు. ప్యాట్‌ కమిన్స్‌ (ఆస్ట్రేలియా) టాప్‌లో ఉండగా, నీల్‌ వాగ్నర్‌ (న్యూజిలాండ్‌) రెండో స్థానంలో ఉన్నాడు. బ్యాటింగ్‌లో కోహ్లీ రెండో ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. పుజార, రహానె 7, 9 స్థానాల్లో ఉన్నారు. స్టీవ్‌ స్మిత్‌ (ఆస్ట్రేలియా) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాల్లో రవీంద్ర జడేజా మూడో ర్యాంక్‌లో, అశ్విన్‌ ఆరో స్థానంలో ఉన్నారు.

☛ కరోనా వ్యాక్సిన్ కంపెనీలతో బ్రిటన్ ఒప్పందం

టీకాలు కనిపెట్టే పనిలో ఉన్న కంపెనీలతో బ్రిటన్ ముందస్తు ఒప్పందం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే సనోఫీ, గ్లాక్సోస్మిత్ క్లైన్ కంపెనీతో భారీ అగ్రిమెంట్‌ చేసుకుంది. టీకా విజయవంతమైతే 60 మిలియన్ల వ్యాక్సిన్లు తమ దేశానికి ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆ దేశం జూలై 29. కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభమైప్పటినుంచి ఈ దేశం టీకా కోసం చేసుకున్న నాలుగో ఒప్పందం ఇది. కాగా, ఈ టీకాల కోసం సనోఫీ, గ్లాక్సోస్మిత్‌క్లైన్‌కు ఎంత మొత్తం చెల్లిస్తున్నదో బ్రిటన్‌ వెల్లడించలేదు. అయితే, తమ టీకాకు రెగ్యులేటరీ ఆమోదం లభించిందనీ, క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతమైతే 2021 జూన్‌ వరకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని సనోఫీ, గ్లాక్సోస్మిత్‌క్లైన్‌ తెలిపింది.

☛ మరో రెండు కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తికి రష్యా ఒప్పందం

ఆగస్టు 10లోగా తొలి కరోనా వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించిన రష్యా తాజాగా మరో రెండు కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తికి సంబంధించిన పనులను సెప్టెంబర్, అక్టోబర్‌లలో ప్రారంభించాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది. క‌రోనా ఔష‌ధ‌ ఫార్ములాను అభివృద్ధి చేయడానికి ప‌లు పరిశోధనలు చేస్తున్నట్లు రష్యా తెలిపింది. అధ్యక్షుడు పుతిన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉపప్రధాని టాట్యానా గోలికోవా మరో రెండు కరోనా వ్యాక్సిన్లను రూపొందించే ఒప్పందంపై సంతకం చేశారు. ఈ వ్యాక్సిన్‌ను మాస్కో, సైబీరియా సంయుక్తంగా అభివృద్ధి చేయ‌నున్నాయి. మొదటి టీకా సెప్టెంబరులో ఉత్పత్తిని ప్రారంభించడానికి ప్రణాళిక రూపొందించారు. దీనిని మాస్కోకు చెందిన గమాలయ ఇన్‌స్టిట్యూట్, రక్షణ మంత్రిత్వశాఖ పరీక్షించనున్నాయి. రెండవ టీకా ఉత్పత్తిని అక్టోబర్‌లో సాకేరియాకు చెందిన వ్యాకేటర్ స్టేట్ లాబొరేటరీ అభివృద్ధి చేయ‌నుంది.

☛ కరోనా చికిత్సకు హెటిరో ‘ఫావివిర్‌టాబ్లెట్లు

కరోనా చికిత్స కోసం హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ హెటిరో ల్యాబ్స్‌ ‘ఫావివిర్‌పేరుతో ట్యాబ్లెట్లను విడుదలచేసింది. ఒక్కో ట్యాబ్లెట్‌ ధర రూ.59గా పేర్కొన్నది. ఇవి అన్ని మెడికల్‌ షాపుల్లో అందుబాటులోకి వచ్చాయని వెల్లడించింది. డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ మీద మాత్రమే దీనిని విక్రయిస్తారన్నది. కొవిడ్‌ బాధితులు కోలుకోవడంలో యాంటీవైరల్‌ డ్రగ్‌ ఫావిపిరవిర్‌ సమర్థంగా పనిచేస్తున్నదని ఇప్పటికే నిరూపితమైంది. ఈ నేపథ్యంలో దీనికి జెనరిక్‌ వెర్షన్‌గా హెటిరో.. ఫావివిర్‌ను ఆవిష్కరించింది. ఈ సంస్థ ఇప్పటికే కోవిఫర్‌ పేరుతో రెమ్‌డెసివిర్‌ జెనరిక్‌ వెర్షన్‌ను విడుదలచేసింది.

☛ “కామెట్‌ నియోవైస్‌’ కనులవిందు

వినీలాకాశంలో కొత్త అతిథి సందడి చేస్తోంది. దాదాపు 460 కోట్ల ఏళ్ల క్రితం నాటి దుమ్ము, ధూళితో నిండిన “కామెట్‌ నియోవైస్‌’ తోకచుక్క భూమి ఉత్తర ధృవప్రాంతంలో ఆకాశంలో కనువిందు చేస్తోంది. ఈ తోకచుక్కను 2020 మార్చిలో నాసాకు చెందిన నియోవైస్‌ ఇన్‌ఫ్రారెడ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ గుర్తించింది.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments