కరెంట్ అఫైర్స్ – జూలై 29, 2020

ప్రపంచంలో 75 శాతం పులులు భారత్ లోనే

జూలై 29న గ్లోబల్‌ టైగర్‌ డే సందర్భాన్ని పురస్కరించుకొని 2018లో చేపట్టిన పులుల గణన ఆధారంగా కేంద్రం జూలై 28 ఒక నివేదిక విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 50 టైగర్‌ రిజర్వ్‌లలో ఉత్తరాఖండ్‌లో కార్బెట్‌ టైగర్‌ రిజర్వ్‌లో అత్యధికంగా 231 పులులు, ఆ తర్వాత కర్ణాటకలోని నాగర్‌హోల్‌లో 127, బందీపూర్‌లో 127 పులులు ఉన్నట్టు వెల్లడించింది. మిజోరంలోని డంపా, బెంగాల్‌లోని బుక్సా, జార్ఖండ్‌లో పాలమూ రిజర్వ్‌లలో ఒక్క పులీ మిగల్లేదు. 2018 పులుల గణన ప్రకారం దేశవ్యాప్తంగా 2,967 పులులు ఉన్నాయి. 1973లో కేవలం తొమ్మిది మాత్రమే టైగర్‌ రిజర్వ్‌లు ఉన్న మన దేశంలో ఇప్పుడు వాటి సంఖ్య 50కి చేరుకుందని దేశంలో ఉన్న అన్ని టైగర్‌ రిజర్వ్‌లూ నాణ్యతాపరంగా బాగున్నాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు. అడవుల కొరత, సమృద్ధిగా వర్షపాతం లేకపోయినప్పటికీ భారత్‌ పులుల సంఖ్యను పెంచడానికి తీసుకున్న చర్యలతో ప్రపంచ జీవవైవిధ్యంలో 8% పెరిగిందన్నారు.

75% పులులు భారత్‌లోనే..
ప్రపంచవ్యాప్తంగా
13 దేశాల్లో పులులు ఉన్నాయి. ఈ దేశాల్లోని మొత్తం పులుల్లో 75 శాతం భారత్‌లోనే ఉన్నాయి. బంగ్లాదేశ్, భూటాన్, కంబోడియా, చైనా, ఇండోనేసియా, మలేసియా, మయన్మార్‌ వంటి దేశాల్లో పులులు బాగా కనిపిస్తాయి. 2018లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పులుల గణన గిన్నిస్‌ రికార్డులకు కూడా ఎక్కింది. కెమెరాల ద్వారా అతి పెద్ద వన్యప్రాణి సర్వేగా దీనిని గుర్తిస్తూ గిన్నిస్‌బుక్‌ ధ్రువీకరణ పత్రం కూడా జారీ చేసిన విషయం తెలిసిందే.

ఏపీ, తెలంగాణలో ఎక్కడెన్నీ..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 68 పులులు ఉండగా.. అప్పటికీ ఇప్పటికీ రెండు రాష్ట్రాల్లో 6 పులులు పెరిగాయి. నాగార్జునసాగర్‌(ఏపీ) టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతంలో 43 పులులు సంచరిస్తుండగా.. ఇందులో టైగర్‌ రిజర్వ్‌లోపలే 38 ఉన్నట్టు నివేదిక తెలిపింది. తెలంగాణలోని ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతంలో 9 ఉండగా.. రిజర్వ్‌ లోపలి ప్రాంతంలో 7 ఉన్నట్టు నివేదిక తెలిపింది. కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌లో 1 ఉన్నట్టు నివేదిక తెలిపింది. ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతంలో ఉన్న పులుల వయస్సు తక్కువని వివరించింది.

రఫేల్‌ నడిపిన తొలి భారతీయ పైలట్ హిలాల్ అహ్మద్ రాథోడ్

ప్రతిష్టాత్మక రఫేల్‌ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి భారతీయ పైలట్‌గా ఎయిర్‌ కామండొర్‌ హిలాల్‌ అహ్మద్‌ రాథోడ్‌ చరిత్ర సృష్టించారు. కశ్మీర్‌కు చెందిన హిలాల్‌ అహ్మద్‌ ఫ్రాన్స్‌ నుంచి వస్తున్న తొలి బ్యాచ్‌ రఫేల్‌ యుద్ధ విమానాన్ని నడిపే అవకాశం పొందారు. భారతీయ అవసరాలకు అనుగుణంగా రఫేల్‌ను మార్చే ప్రక్రియలోనూ ఆయన పాలు పంచుకున్నారు. భారత వైమానిక దళ అధికారిగా మిరేజ్‌ 2000, మిగ్‌ 21, కిరణ్‌ యుద్ధ విమానాలపై 3 వేల ఫ్లైయింగ్‌ అవర్స్‌ను విజయవంతంగా, ప్రమాద రహితంగా ముగించిన చరిత్ర ఆయనది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫ్లయింగ్‌ ఆఫీసర్‌గా ఘనత సాధించారు.

దక్షిణ కశ్మీర్లోని అనంత్‌నాగ్‌లో హిలాల్‌ జన్మించారు. ఆయన తండ్రి మొహమ్మద్‌ అబ్దుల్లా రాథోడ్‌ జమ్మూకశ్మీర్‌ పోలీస్‌ విభాగంలో డీఎస్పీగా పనిచేశారు. తన కెరీర్‌లో వాయుసేన మెడల్, విశిష్ట సేవ మెడల్‌ను హిలాల్‌ సాధించారు.

ఐక్యరాజ్య సమితిలో భారత మహిళా పర్యావరణవేత్త

భారత్‌కు చెందిన మహిళా యువ పర్యావరణవేత్త అర్చన సొరెంగ్‌(24)… ఐక్యరాజ్యసమితి చీఫ్‌ ఆంటోనియో గుటెరస్‌ సలహా మండలికి ఎంపికయ్యారు. రోజు రోజుకూ దారుణంగా మారుతున్న పర్యావరణ పరిస్థితిని మెరుగు పరిచేందుకు అవసరమైన సలహాలను వీరు యూఎన్‌ చీఫ్‌కు అందిస్తారు. ఈ మండలికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఏడుగురు (18–28 ఏళ్ల వారు) ఎంపికయ్యారు. పర్యావరణాన్ని సమతులంగా ఉంచేందుకు ఆదివాసులు ఉపయోగిస్తున్న పద్ధతులను, వారి సంప్రదాయ నైపుణ్యాన్ని పరిరక్షించేందుకు అర్చన పరిశోధనలు సాగిస్తున్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది.

అర్చన టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ ముంబై (టిస్‌) నుంచి రెగ్యులేటరీ గవర్నెన్స్‌ పూర్తి చేశారు. టిస్‌ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా పనిచేశారు.

ఆస్ట్రేలియా కార్చిచ్చు – 300 కోట్ల వన్య ప్రాణులు మరణాలు/వలసలు

దాదాపు 300 కోట్ల వన్య ప్రాణులు మరణాలు/వలసలకు ఆస్ట్రేలియాలో చెలరేగిన భీకర కార్చిచ్చు కారణమని తాజా నివేదికలో వెల్లడించింది. యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీ, యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ వేల్స్, యూనివర్సిటీ ఆఫ్‌ న్యూ కసెల్, చార్లెస్‌ స్టర్ట్‌ యూనివర్సిటీ, బర్డ్‌ లైఫ్‌ ఆస్ట్రేలియాలు కలసి వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌)లు సంయుక్తంగా 11.46 మిలియన్ల హెక్టార్ల పరిధిలోని కార్చిచ్చుతో ధ్వంసమైన అటవీ ప్రాంతం, జనావాసాలపై పరిశోధన నిర్వహించి నివేదికను వెల్లడించాయి. 143 మిలియన్ల పాలిచ్చే జంతువులు, 246 కోట్ల పాకే జంతువులు, 180 మిలియన్ల పక్షులు, 5.1 కోట్ల కప్పలు మరణించినట్లు డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ చెప్పింది.

☛ ఉద్యోగులకు అత్యంత ఆకర్షణీయమైన కంపెనీగా మైక్రోసాఫ్ట్

దేశంలో ఉద్యోగులకు అత్యంత ఆకర్షణీయమైన కంపెనీల జాబితాలో మైక్రోసాఫ్ట్‌ ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. సామ్‌సంగ్‌ ఇండియా, అమెజాన్‌ ఇండియా వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. ఈ ఏడాదికి గాను విడుదలైన రాండ్‌స్టాడ్‌ ఎంప్లాయర్‌ బ్రాండ్‌ రీసెర్చ్‌ (ఆర్‌ఈబీఆర్‌) సర్వే నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఆర్థిక పరిపుష్టి, మార్కెట్లో పరపతి, ఆధునిక సాంకేతికతల వినియోగం వంటి అంశాల్లో మైక్రోసాఫ్ట్‌ ఇండియాకు గరిష్ఠ మార్కులు లభించాయని రాండ్‌స్టాడ్‌ రిపోర్టు పేర్కొంది.

తమిళనాడులో రేషన్ తో పాటు ఉచిత మాస్కులు

కరోనా మహమ్మారి నుంచి రక్షణకు మాస్క్ తప్పనిసరి కావడంతో.. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ తో పాటు కుటుంబ సభ్యులందరికీ మాస్కులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. తొలి విడతలో భాగంగా రూ. 30 కోట్లతో 69.09 లక్షల కుటుంబాలకు 4.44 కోట్ల పునర్ వినియోగ మాస్కులను రేషన్ తో పాటే అందిస్తోంది. రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికి రెండేసి మాస్కుల చొప్పున ఇస్తోంది. తద్వారా దేశంలో ఈ తరహా కార్యక్రమాన్ని చేపట్టిన తొలి రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది.

తమిళనాడులో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 2.08 కోట్లు. ఈ లెక్కన రాష్ట్రంలో 6.74 కోట్ల మంది ఉచిత మాస్కులు అందుకోనున్నారు.

7వ నిజాం చివరి కుమార్తె బషీరున్నిసా బేగం కన్నుమూత

ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ కడపటి సంతానమైన ఆయన కుమార్తె బషీరున్నిసా బేగం(93) మరణించారు. జూలై 28న హైదరాబాద్ పురానీ హవేలీలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌, ఖదీరా బేగం దంపతులకు ఆమె హైదరాబాద్‌లో 1927 సెప్టెంబరులో పుట్టారు. బషీరున్నిసా భర్త నవాబ్‌ కాజిమ్‌ నవాజ్‌ జంగ్‌(అలీ పాషా) 1998లో మరణించారు. వీరి ఏకైక కుమార్తె రషీదున్నిసా బేగం.

☛ విజ్డెన్ ట్రోఫీ విజేత ఇంగ్లండ్

వెస్టెండీస్ తో జరిగిన 3 టెస్టుల విజ్డెన్ ట్రోఫీ టెస్ట్ సీరీస్ ని ఇంగ్లండ్ 2 – 1 తో గెలుచుకుంది. జూలై 28న ముగిసిన చివరి టెస్టులో ఇంగ్లండ్‌ 269 పరుగుల తేడాతో విజయం సాధించి.. సీరీస్ కైవసం చేసుకుంది. ఇక ఈ ట్రోఫీ శాశ్వతంగా ఈ జట్టు దగ్గరే ఉండబోతోంది. వచ్చే ఏడాది నుంచి ఈ జట్ల మధ్య జరిగే సిరీస్‌ను బోథమ్‌రిచర్డ్స్‌ ట్రోఫీ పేరిట పిలవనున్నారు.

10 వికెట్లతో పాటు అరుదైన 500 వికెట్ల క్లబ్‌లో చేరిన బ్రాడ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు వెస్టిండీస్ ప్లేయర్ ఛేజ్ కు లభించింది.

500 వికెట్ల క్లబ్ లో స్టువర్ట్ బ్రాడ్

ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ టెస్టుల్లో 500 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరాడు. ఈ ఘనత సాధించిన నాలుగో ఫాస్ట్ బౌలర్‌గా 34ఏళ్ల బ్రాడ్ నిలిచాడు. ప్రపంచ క్రికెట్‌లో మొత్తమ్మీద కేవలం ఏడుగురు బౌలర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. వెస్టిండీస్‌తో జరిగిన నిర్ణయాత్మక మూడోటెస్టు రెండో ఇన్నింగ్సులో (జూలై 28) బ్రాడ్ ఈ రికార్డు సాధించాడు. విండీస్ బ్యాట్స్‌మెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ వికెట్‌తో బ్రాడ్ 500 టెస్టు వికెట్లు పూర్తయ్యాయి. టెస్టుల్లో ఈ ఘనత సాధించిన రెండో ఇంగ్లండ్ ఆటగాడు బ్రాడ్.

☛ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో తొలి రెండు స్థానాల్లో కోహ్లీ, రోహిత్

విరాట్‌ కోహ్లీ (871 పాయింట్లు), రోహిత్‌ శర్మ (855) ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాలను నిలబెట్టుకున్నారు. బాబర్‌ ఆజమ్‌ (829) మూడోస్థానంలో ఉన్నాడు. బౌలర్ల జాబితాలో జస్‌ప్రీత్‌ బుమ్రా (719) రెండో స్థానంలో మార్పు లేదు. కివీస్‌ పేసర్‌ బౌల్ట్‌ (722) నెంబర్‌వన్‌ బౌలర్‌గా ఉన్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో బెన్‌ స్టోక్స్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

☛ మలేషియా మాజీ ప్రధానికి 12 ఏళ్ల జైలు శిక్ష

ప్రభుత్వ నిధుల కుంభకోణం కేసులో మలేషియా మాజీప్రధాని నజీబ్‌ రజాక్‌ను దోషిగా తేల్చిన కోర్టు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మరో రెండు కేసులైన విశ్వాస ఉల్లంఘన, మనీలాండరింగ్‌ వ్యవహారాల్లోనూ పదేళ్ల చొప్పున జైలు శిక్షతో పాటు భారీ జరిమానాను మలేసియా కోర్టు విధించిం ది. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. మలేసియా రాజకీయ చరిత్రలో దోషిగా తేలిన తొలి రాజకీయ నాయకుడిగా నజీబ్‌ నిలిచారు.

కశ్మీర్‌ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీకి పాక్ అవార్డు

కశ్మీర్‌ వేర్పాటువాద నాయకుడు, హరియత్‌ కాన్ఫరెన్స్‌ మాజీ చీఫ్‌ సయ్యద్‌ అలీ షా జిలానీకి పాకిస్థాన్‌ అత్యున్నత పౌర పురస్కారం ‘నిషాన్‌పాకిస్థాన్‌’ ఇవ్వాలని పాక్‌ పెద్దల సభ తీర్మానం చేసింది. జిలానీ జీవిత కథను పాఠ్యాంశంలో చేర్చాలని, ఇస్లామాబాద్‌లో జిలానీ పేరుతో ఒక ఇంజనీరింగ్‌ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయాలని పాకిస్థాన్‌ ప్రభుత్వాన్ని కోరింది. 90 ఏళ్ల వృద్ధుడైన జిలానీ 2010 నుంచి చాలా కాలం గృహనిర్బంధంలో ఉన్నారు.

బయోటెక్‌ రంగ ప్రముఖుడు డాక్టర్‌ బీఎస్‌ బజాజ్‌ కన్నుమూత

బయోటెక్‌ రంగ ప్రముఖుడు డాక్టర్‌ బీఎస్‌ బజాజ్‌ (93) జూలై 28 కన్నుమూశారు. ఆయన ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆసియా బయోటెక్‌ అసోసియేషన్స్‌ (ఎఫ్‌ఏబీఏ) వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేశారు. అలాగే హైదరాబాద్‌లో జీనోమ్‌ వ్యాలీ ఏర్పాటుకు, 2019లో జరిగిన బయో–ఆసియా సదస్సుకు ఆయన తీవ్రంగా కృషి చేశారు. 1999లో హైదరాబాద్‌ లో బయోటెక్నాలజీ స్థాపనకు బజాజ్‌ ఒక ప్రమోటర్‌గా పనిచేశారు. రాష్ట్రం లో ఆయన రూపొందించిన బయోటెక్‌ పరిశ్రమ పాలసీ ద్వారా జీనోమ్‌ వ్యాలీ ఏర్పాటుకు, దాని పెరుగుదలకు దోహదపడింది. బయో రంగంలో మందులు, వ్యాక్సిన్ల తయారీలో ఆయన చాలా మంది శాస్త్రవేత్తలకు మార్గనిర్దేశం చేశారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments