కరెంట్ అఫైర్స్ – జూలై 28, 2020

☛బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ పదవీకాలం పూర్తి

బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ పదవీకాలం జూలై 27తో ముగిసింది. బోర్డు చీఫ్‌గా గత అక్టోబరులో ఏకగ్రీవంగా ఎన్నికైన గంగూలీ.. పరిపాలనవేత్తగా ఆరు సంవత్సరాల పదవీకాలం పూర్తి చేశాడు. గతంలో అతడు బెంగాల్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగా పని చేసిన సంగతి తెలిసిందే. బోర్డు కొత్త రాజ్యాంగం ప్రకారం అటు రాష్ట్ర సంఘంలోగానీ ఇటు బీసీసీఐలో గానీ వరుసగా ఆరేళ్లు పదవిలో ఉంటే.. మూడేళ్లు విరామం తీసుకోవాలి. ఈ నిబంధనతో బోర్డు కార్యదర్శి జై షా ఇప్పటికే వైదొలగగా.. ప్రస్తుతం దాదా వంతైంది.

☛చైనా, పాకిస్తాన్ మధ్య రహస్య ఒప్పందాలు

చైనా, పాకిస్తాన్‌ దేశాలు రహస్య బయోవార్‌(జీవ, రసాయనిక) ఒప్పందాలు కుదుర్చుకున్నాయని ఆస్ట్రేలియాకు చెందిన ఆంథోనీ క్లాన్‌ అనే జర్నలిస్ట్‌ సంచలన కథనంతో విశ్లేషించారు. అయితే వూహాన్‌లో కరోనాను గుర్తించిన నేపథ్యంలో చైనా సరియైన సమాచారం ఇవ్వలేదని ప్రపంచ వ్యాప్తంగా చైనాపై అనుమానాలు మొదలయ్యాయి. క్లాన్‌ వెల్లడించిన కథనంలో వూహాన్‌(చైనా)ల్యాబ్‌, పాకిస్తాన్‌ సంయుక్తంగా ఆంత్రాక్స్‌ (బ్యాక్టీరియా) లాంటి పాథోజెన్స్‌(వ్యాధి కారకం)ను సృష్టించబోతున్నాయని ఆస్ట్రేలియా జర్నలిస్ట్‌ తెలిపారు. మరోవైపు బయో రీసెర్చ్‌ను పాక్‌లో రహస్యంగా పరిశోధించడానికి, చైనా ఆర్థికంగా సహకరిస్తుందని తెలిపారు. కాగా సమాజానికి మాత్రం అంటువ్యాధుల పరిశోధన అంటూ చైనా, పాక్‌ చెప్పబోతున్నట్లు తెలిపారు.

☛మరో 47 యాప్ లను నిషేధించిన కేంద్రం

నిషేధిత యాప్‌లను అనుకరిస్తూ(క్లోనింగ్‌).. వాటి సేవలే అందిస్తున్న 47 స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. నెల రోజుల క్రితం చైనాకు చెందిన 59 యాప్‌లపై కేంద్రం వేటు వేసింది. వాటి పేరుతోనే టిక్‌టాక్‌ లైట్‌, షేర్‌ ఇట్‌ లైట్‌ తదితర యాప్‌లూ సేవలందిస్తున్నాయని, అందుకే చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. దీంతో నిషేధిత యాప్‌ల సంఖ్య 106కు చేరింది. త్వరలో పబ్‌జీ, లూడో కింగ్ సహా మరో 258 యాప్‌లపైనా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. కొరియాకు చెందిన పబ్‌జీకి చైనా సాంకేతిక సేవలు అందిస్తోంది.

☛యూఏఈలో ఐపీఎల్ – 2020 నిర్వహణకు అనుమతి

ఐపీఎల్‌-2020ను యూఏఈలో నిర్వహించడానికి బీసీసీఐ సుముఖత వ్యక్తం చేసిందని ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) జూలై 27 ప్రకటించింది. ఈ మేరకు భారత బోర్డు అధికారికంగా పంపిన లేఖ అందిందని ఈసీబీ జనరల్‌ సెక్రటరీ ముబాషిర్‌ ఉస్మానీ చెప్పారు. యూఏఈ వేదికగా ఈ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకు ఐపీఎల్‌ నిర్వహించనున్నట్టు ఐపీఎల్‌ చైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ ఇదివరకే వెల్లడించారు.

☛2023 వరల్డ్ కప్ అర్హత టోర్నీ షెడ్యూల్ విడుదల

భారత్‌ వేదికగా జరగాల్సిన 2023 వన్డే ప్రపంచ కప్‌నకు అర్హత కోసం సూపర్‌ లీగ్‌ టోర్నీని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అధికారికంగా ప్రకటించింది. జూలై 30న ఇంగ్లండ్‌తో ఐర్లండ్‌ జట్టు తలపడే మూడు వన్డేల సిరీస్‌తో సూపర్‌ లీగ్‌ మొదలుకానుంది. 12 ఐసీసీ సభ్యదేశాలతో పాటు నెదర్లాండ్స్‌.. మొత్తంగా 13 జట్లు ఈ సూపర్‌ లీగ్‌లో పోటీపడతాయి.

లీగ్‌లో భాగంగా ప్రతి జట్టు స్వదేశంలో నాలుగు, విదేశంలో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ చొప్పున ఆడాల్సి ఉంటుంది. ఇవి మూడు మ్యాచ్‌ల సిరీస్‌గా జరగనున్నాయి. సూపర్‌ లీగ్‌లో మ్యాచ్‌ గెలిచిన ఒక్కో జట్టుకు 10 పాయింట్లు దక్కుతాయి. మ్యాచ్‌ రద్దయినా, టై అయినా ఇరుజట్ల ఖాతాలో ఐదేసి పాయింట్లు చేరుతాయి. మొత్తం పది దేశాలు పాల్గొనే ప్రపంచకప్‌లో పూర్తిస్థాయి సభ్యత్వం కలిగిన టాప్‌ ఏడు జట్లు, ఆతిథ్య హోదా దేశంతో కలిపి మొత్తంగా ఎనిమిది జట్లు నేరుగా మెగా టోర్నీకి అర్హత సాధిస్తాయి. మిగిలిన రెండు జట్ల కోసం ఈ క్వాలిఫికేషన్‌ రౌండ్‌ నిర్వహిస్తున్నారు. ఈ వన్డే సూపర్‌ లీగ్‌ 2022 చివరిదాకా కొనసాగనుంది.

☛పాక్ పార్లమెంట్ లో జాధవ్ ఆర్డినెన్స్

గూఢాచర్యం, ఉగ్రవాదం ఆరోపణలపై మరణ శిక్ష ఎదుర్కొంటున్న భారతీయుడు కుల్ భూషణ్ జాధవ్ కు సంబంధించిన ఒక ఆర్డినెన్స్ ను జూలై 27న పాకిస్తాన్ పార్లమెంట్ దిగువ సభలో ప్రవేశపెట్టారు. జాధవ్ కు ఉరిశిక్ష విధిస్తూ పాకిస్తాన్ మిలటరీకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇస్లామాబాద్ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలుకు వీలు కల్పించేదే ఆ ఆర్డినెన్స్. జాధవ్ కు ఉరిశిక్ష విధిస్తూ పాక్ మిలటరీకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ భారత్ వేసిన పిటిషన్ పై అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ఆర్డినెన్స్ ను పాక్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చిన 60 రోజుల్లోగా జాధవ్ ఇస్లామాబాద్ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది.

☛2019–20 జీఎస్టీ పరిహారంగా ఏపీకి రూ. 3,028 కోట్లు

2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీ పరిహారంగా రాష్ట్రానికి రూ.3,028 కోట్లు చెల్లించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్ని రాష్ట్రాలకూ జీఎస్టీ పరిహారంగా రూ.1,65,302 కోట్లు చెల్లించినట్టు నిర్మలా సీతారామన్‌ ట్వీట్‌ చేశారు. వాస్తవంగా జీఎస్టీ పరిహారం కోసం విధించే సెస్‌ రూ.95,444 కోట్లు వచ్చినా, రూ.1.65 లక్షల కోట్లు చెల్లించినట్టు పేర్కొన్నారు. తెలంగాణ రూ.3,054 కోట్లు, కర్ణాటక రూ.18,628 కోట్లు, తమిళనాడు రూ.12,305 కోట్లు పరిహారంగా పొందాయి.

☛హైదరాబాద్ తైక్వాండో ఆటగాడు శ్రావణ్ కు గిన్నిస్ లో చోటు

హైదరాబాద్‌కు చెందిన తైక్వాండో ఆటగాడు లగిశెట్టి శ్రావణ్‌ కుమార్‌.. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. రెండు కాళ్లకు ఐదేసి కిలోల బరువులు ధరించిన అతడు మూడు నిమిషాల్లో 141 సార్లు ఫుల్‌ కాంటాక్ట్‌ స్ట్రైక్‌ చేయడం ద్వారా రికార్డు నెలకొల్పాడు. సుదీర్ఘకాల శిక్షణ అనంతరం తాను ఈ రికార్డు సాధించడంపట్ల శ్రావణ్‌ కుమార్‌ సంతోషం ప్రకటించాడు.

☛ప్రపంచంలో రెండో అతిపెద్ద ఇంధన సంస్థగా ఆర్ఐఎల్

అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) మరో రికార్డును సొంతం చేసుకుంది. మార్కెట్‌ విలువ పరంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద ఇంధన సంస్థగా అవతరించింది. తాజాగా ఈ జాబితాలో ఎక్సాన్‌మొబిల్‌ను వెనక్కి నెట్టి, వరల్డ్‌ నెం.1 ఆయిల్‌ కంపెనీ సౌదీ అరామ్కో తర్వాత స్థానాన్ని ఆక్రమించింది. గుజారాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్‌ మెగా ఆయిల్‌ రిఫైనరీ కాంప్లెక్స్‌ను నిర్వహిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ యూనిట్‌ ఇది.

గత వారాంతపు ట్రేడింగ్‌లో రిలయన్స్‌ మార్కెట్‌ విలువ మరో 800 కోట్ల డాలర్లు పెరిగి మొత్తం 18,900 కోట్ల డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో ఎక్సాన్‌మొబిల్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 100 కోట్ల డాలర్ల మేర క్షీణించడంతో ర్యాంకింగ్స్‌లో మెట్టు కిందికి దిగింది. ఇక సౌదీ అరామ్కో విషయానికొస్తే.. 1.76 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌తో ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆయిల్‌ కంపెనీగా కొనసాగుతోంది.

☛పీఎం కేర్స్ స్వచ్ఛంద నిధి : కేంద్రం

కోవిడ్ – 19 ని ఎదుర్కునేందుకు ప్రజలు, సంస్థల నుంచి స్వచ్ఛందంగా విరాళాలు సేకరించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన నిధి పీఎం కేర్స్అని కేంద్ర ప్రభుత్వం జూలై 27న సుప్రీంకోర్టుకి స్పష్టం చేసింది. ఈ పబ్లిక్ ఫండ్ కు, ఎన్డీఆర్ఎఫ్ ల బడ్జెట్ కేటాయింపులకు ఎలాంటి సంబంధం లేదని వివరించింది. సీపీల్ అనే స్వచ్ఛంద సంస్థ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనానికి కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ వివరణ ఇచ్చారు. అనంతరం తీర్పుని ధర్మాసనం రిజర్వులో పెట్టింది.

☛కృష్ణా ట్రిబ్యునల్ సభ్యుడిగా జస్టిస్ సుభాశిస్ తాళపత్ర

కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ సభ్యుడిగా జస్టిస్ సుభాశిస్ తాళపత్ర నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన త్రిపుర హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. జస్టిస్ బి.పి.దాస్ రాజీనామాతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు జస్టిస్ సుభాశిస్ ను భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్. . బాబ్డే నామినేట్ చేశారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments