ఉగ్రవాద సంస్థ బాస్ లు పాకిస్తానీయులే : ఐరాస
భారత ఉపఖండంలో కార్యకలాపాలు సాగిస్తున్న అల్‌కాయిదా వంటి ఉగ్ర సంస్థలకు పాకిస్తానీ జాతీయులే నాయకత్వం వహిస్తున్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ ది లెవాంట్–ఖొరాసాన్ (ఐఎస్ఐఎల్–కె), తెహ్రిక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) తదితర ఉగ్రసంస్థల నేతల పేర్లను ఆంక్షల జాబితాలో చేర్చలేదని తెలిపింది. ఐఎస్ఐఎల్, అల్‌కాయిదా, వాటి అనుబంధ వ్యక్తులు, ఆస్తులపై ఐరాస ఏర్పాటు చేసిన ఆంక్షల సమీక్ష కమిటీ ఈ విషయాలు వెల్లడించింది. ఐఎస్ఐఎల్–కె అధిపతి అస్లాం ఫరూఖీ అలియాస్ అబ్దుల్లా ఒరాక్జాయ్‌తోపాటు మాజీ అధినేత జియా ఉల్హక్ అలియాస్ అబూ ఒమర్ ఖొరాసానీ, అల్‌కాయిదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ (ఏక్యూఐఎస్) నేత ఒసామా మహ్మూద్ కూడా పాకిస్తాన్‌కు చెందిన వారేననీ,వీరి పేర్లు ఆంక్షల జాబితాలో లేవని ఆ నివేదిక పేర్కొంది. అఫ్గానిస్తాన్‌లోని అతిపెద్ద ఉగ్ర ముఠా టీటీపీ చీఫ్ అమిర్ నూర్ వలీ మెహ్సూద్ కూడా పాకిస్తాన్‌కు చెందిన వాడేనని తెలిపింది.
ఇంధన పొదుపులో ఏపీ బెస్ట్ : బీఈఈ
పారిశ్రామిక ఇంధన పొదుపులో ఆంధ్రప్రదేశ్ పురోగతి సాధిస్తోందని కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) ప్రశంసించింది. రాష్ట్ర ఇంధన శాఖ ఈ విషయాన్ని జూలై 26న విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. పారిశ్రామిక రంగంలో కేంద్రం అమలు చేస్తోన్న ‘పెర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్’ (పాట్) పథకంలో ఏపీ అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు తెలిపింది. పలు పరిశ్రమల్లో రూ.1,600 కోట్ల విలువైన 2,386 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఏపీ పొదుపు చేసిందని వివరించింది.
‘తెలంగాణ ట్వల్వ్’ గార్లపాటి రఘుపతిరెడ్డి కన్నుమూత
స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ పట్టి ఉరికంబం దాకా వెళ్లిన యోధుడు, ‘తెలంగాణ ట్వల్వ్’ కేసులో ఒకరైన గార్లపాటి రఘుపతిరెడ్డి (93) జూలై 26న కన్నుమూశారు. నల్లగొండ జిల్లా రామానుజపురంలోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన భార్య శకుంతల 35 ఏళ్ల క్రితమే మృతిచెందారు. ఈ దంపతులకు నర్మద, నరోత్తంరెడ్డి, విజయకుమార్ రెడ్డి సంతానం. 1948 అక్టోబరులో ప్రత్యేక ట్రైబ్యునల్ ‘అక్కినేపల్లి’ హత్యకేసు విచారణలో ఆయనతోపాటు మరో 11 మంది సాయుధ పోరాట వీరులకు ఉరిశిక్ష విధించింది. 1951 జనవరి 21, 22న వారిని ముషీరాబాద్ జైల్లో ఉరితీసేందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ‘తెలంగాణ ట్వల్వ్’గా పేరు పొందిన ఆ కేసును వాదించేందుకు ఇంగ్లండ్‌కు చెందిన ప్రఖ్యాత న్యాయవాది డీఎన్ ప్రిట్ విచ్చేశారు.
నీతి ఆయోగ్ ర్యాంకుల్లో తెలంగాణ జిల్లాల ప్రతిభ
గ్రామీణాభివృద్ధిలో తరచూ ర్యాంకులు సాధించే తెలంగాణ ఈ సారి నీతి ఆయోగ్ ర్యాంకుల్లోనూ ప్రతిభ చాటింది. నీతి ఆయోగ్ ప్రకటించిన తాజా ర్యాంకుల్లో జాతీయ స్థాయిలో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా 8వ స్థానంలో, జయశంకర్ భూపాపల్లి జిల్లా 14వ స్థానంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 40వ స్థానంలో నిలిచాయి. దేశంలో వెనుకబడిన 115 జిల్లాల్లో వైద్యం, ఆరోగ్యం, పౌష్టికాహారం, విద్య, వ్యవసాయ అనుబంధ రంగాలు, నీటి వసతుల కల్పన, ఆర్థిక స్వావలంభన, నైపుణ్యాల పెంపుదల, మౌళిక వసతుల కల్పన అంశాల్లో జూన్ నాటికి సాధించిన అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుని నీతి ఆయోగ్ ఈ ర్యాంకులను ప్రకటించింది.
బీపీసీఎస్ ఉద్యోగులకు వీఆర్ఎస్
ప్రభుత్వ రంగంలోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ప్రైవేటీకరించడానికి ముందే తన ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించింది. ‘‘వివిధ వ్యక్తిగత కారణాల వల్ల పనిలో కొనసాగలేని ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకం అమలుపరచాలని సంస్థ నిర్ణయించింది, ఈ మేరకు ఎవరైనా ముందుకు వచ్చి తమ దరఖాస్తు అందించవచ్చు’’ అని ఒక అంతర్గత ప్రకటనలో బీపీసీఎల్ తెలిపింది. బీపీ వీఆర్ఎస్-2020 పేరిట ఈ పథకం జూలై 23న ప్రారంభం కాగా ఆగస్టు 13వ తేదీన ముగుస్తుంది.
గ్రీన్ నేషనల్ హైవేస్ కారిడార్‌గా రాజమండ్రి–విజయనగరం జాతీయ రహదారి
రాజమండ్రి–విజయనగరం జాతీయ రహదారి (516–ఈ)ని గ్రీన్ నేషనల్ హైవేస్ కారిడార్‌గా భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) గుర్తించింది. ఈ జాతీయ రహదారి నిర్మాణానికి పునరావాస పునర్నిర్మాణ (ఆర్ అండ్ ఆర్) పనులకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. సామాజిక ప్రభావ అంచనా సర్వే (సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సర్వే) ఇటీవలే పూర్తయింది. ఆర్ అండ్ ఆర్కు మొత్తం రూ.210 కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా. రాజమండ్రి–విజయనగరం జాతీయ రహదారిని ఏజెన్సీ ప్రాంతాల మీదుగా నిర్మించాలని ఎన్హెచ్ఏఐ ఈ ప్రాజెక్టును హరిత కారిడార్ ప్రాజెక్టుగా ప్రకటించింది. గ్రీన్ నేషనల్ హైవే కారిడార్ ప్రాజెక్టులుగా దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్) 782 కి.మీ. హరిత కారిడార్లను అభివృద్ధి చేయనుంది. ఇందులో ఏపీకి సంబంధించి 209 కి.మీ. వరకు తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో రెండు వరుసల రహదారిని నిర్మించనున్నారు.
అంతరిక్షంలోకి నాసా టెలిస్కోప్
అమెరికాకు చెందిన నాసా అంతరిక్షంలోకి టెలిస్కోపును పంపించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఫుట్‌బాల్ స్టేడియం అంత పరిమాణంలో గల భారీ బెలూన్ సాయంతో 2.5 మీటర్ల పొడవైన టెలిస్కోపు ఆస్ట్రోస్‌ను 2023 నాటికి స్ట్రాటో ఆవరణంలోకి పంపించాలని భావిస్తున్నది. టెలిస్కోపును భూవాతావరణం అవతలి పొరల్లోకి పంపించడం ద్వారా వాతావరణంలోకి రాకుండా మిగిలిపోయిన కాంతి, మనిషి కంటికి కనిపించని ఇన్ఫ్రారెడ్ కిరణాలపై పరిశోధనలు జరుపనున్నారు.
అమెరికాలో హన్నా హరికేన్ బీభత్సం
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో హన్నా హరికేన్ బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి వరద సంభవిస్తున్నాయని యూఎస్ నేషనల్ హరికేన్ సెంటర్ (ఎన్‌హెచ్‌సీ) జూలై 25న తెలిపింది. జూలై 26న సాయంత్రం 5 గంటలకు టెక్సాస్‌లోని పాడ్రే ద్వీపం వద్ద హరికేన్ తీరాన్ని దాటింది. తుఫాన్ కారణంగా పోర్ట్ మాన్స్ఫీల్డ్కు ఉత్తరంగా గరిష్టంగా గంటలకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.