కార్గిల్ వీరులకి ఘన నివాళి
దేశ సమగ్రత, భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను గుర్తుచేసుకుంటూ కార్గిల్ విజయ్ దివస్ 21వ వార్షికోత్సవాన్ని జూలై 26న దేశం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు ప్రముఖులు కార్గిల్ హీరోలకు ఘనంగా నివాళులు అర్పించారు. 1999లో సరిగ్గా ఇదే రోజున (జూలై 26న) కార్గిల్ –ద్రాస్ సెక్టార్లో పాకిస్తాన్ చొరబాటుదారులు ఆక్రమించిన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు భారత్ ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ విజయ్’ విజయవంతమైంది. కార్గిల్‌లో పాకిస్తాన్ దళాలను గుర్తించడంతో 1999 మే 3 నుంచి జులై 26 వరకూ కార్గిల్ యుద్ధం సాగింది.
రాష్ట్రపతిగా 3 ఏళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకున్న రామ్ నాథ్ కోవింద్
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మూడేళ్ల పదవీకాలాన్ని జూలై 25 నాటికి పూర్తి చేసుకున్నారు. ఈ మూడేళ్ల కాలంలో ఆయన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. దేశ ప్రథమ పౌరుడిగా కరోనాపై పోరాటంలో ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నారని రాష్ట్రపతి కార్యాలయం ఒక ట్వీట్లో వెల్లడించింది. కరోనా సంక్షోభ సమయంలో 7వేల మంది సైనికులు, శాస్త్రవేత్తల్ని కోవింద్ కలుసుకున్నట్టు ఆ ట్వీట్లో వెల్లడించింది. ఈ మూడేళ్లలో ఆయన చేపట్టిన కార్యక్రమాల్లో ముఖ్యమైనవి….
-
రాష్టపతి భవన్లో నిర్వహించే కార్యక్రమాలకు ఆన్లైన్ ద్వారా ఆహ్వానించే ఈ–ఇన్విటేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టారు.
-
పార్లమెంటు పాస్ చేసిన 48 బిల్లులు, రాష్ట్ర ప్రభుత్వాల 22 బిల్లుల్ని ఆమోదించారు.
-
13 ఆర్డినెన్స్‌లు జారీ చేశారు.
-
11 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించారు.
ఉద్యమనేత ఉప్పుటూరి సాంబశివరావు కన్నుమూత
అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన దళిత, బహుజన, ఉద్యమ మేధావి ఉ.సా. (ఉప్పుటూరి సాంబశివరావు) కరోనా కాటుకు బలయ్యారు. ఆయన వయస్సు 70 సంవత్సరాలు. ఆయన హైదరాబాద్ మలక్‌పేటలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఆయన భార్య పద్మావతి ప్రసూనాంబ గతంలోనే మృతిచెందారు. కుమార్తె హిమబిందు ఢిల్లీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా బ్రాహ్మణ కోడూరులో పుట్టిన ఉ.సా. ప్రజాతంత్ర విద్యార్థి సంఘం (డీఎస్వో), యూసీసీఆర్ఐ (ఎంఎల్) పార్టీలో పనిచేశారు. ఆ పార్టీ నాయకులు దేవులపల్లి, తరిమెల నాగిరెడ్డితో సాన్నిహిత్యం పెంచుకున్నారు.
తెహల్కా కేసులో జైట్లీని దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు
రక్షణ పరికరాల అవినీతి కేసులో సమతా పార్టీ మాజీ అధ్యక్షురాలు, రక్షణ శాఖ మాజీ మంత్రి దివంగత జార్జి ఫెర్నాండెజ్ సన్నిహితురాలు జయా జైట్లీని ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. ఈ అవినీతి బాగోతాన్ని తెహల్కా న్యూస్ పోర్టల్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా ‘ఆపరేషన్ వెస్ట్ ఎండ్’ పేరిట 2001లో బట్టబయలు చేసింది. ఈ అవినీతి కేసులో జయా జైట్లీతోపాటు సమతాపార్టీ మాజీ నేత గోపాల్ పచేర్వాల్, మేజర్ జనరల్(రిటైర్డు) ఎస్పీ మురుగైలను దోషులుగా నిర్ధారిస్తూ సీబీఐ ప్రత్యేక జడ్జి వీరేందర్ భట్ జూలై 21న తీర్పు ఇచ్చారు. జూలై 29న శిక్షల ఖరారుపై జడ్జి వాదనలు వింటారు.
భారత సైనికదళానికి చేతిలో ఇమిడే థర్మల్ ఇమేజర్స్ సరఫరా కోసం వీరంతా వెస్ట్ఎండ్ ఇంటర్నేషనల్ పేరుతో ఒక బోగస్ సంస్థను సృష్టించారు. ఈ సంస్థ ప్రతినిధి మాథ్యూ శామ్యూల్ నుంచి జయా జైట్లీ రూ.2 లక్షలు, మురుగై 20వేలు లంచం తీసుకున్నట్లుగా రుజువయ్యింది. నాటి రక్షణ మంత్రి ఫెర్నాండెజ్ అధికార నివాసంలో ఈ అవినీతి కార్యకలాపాలు జరిగాయని కూడా విచారణలో రుజువయ్యింది.
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ కి కోరోనా పాజిటివ్
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేతు శివరాజ్ సింగ్ చౌహాన్ కు కరోనా సోకింది. గత రెండు రోజులుగా తీవ్ర దగ్గు, జలుబుతో బాధపడుతున్న సీఎంకు జూలై 25న నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో భోపాల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీఎంకు పాజిటివ్‌గా తేలడంతో ఆయనతో సమీపంగా మెలిగిన వారంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వైద్యుల సూచనల మేరకు ఆయన్ని కలిసిన అధికారులు, మంత్రులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కాగా దేశంలో కరోనా బారినపడిన తొలి సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ కావడం గమనార్హం.
ఏపీలో పరిశ్రమల్లో మ్యాన్ పవర్ సర్వేకు సమగ్ర పరిశ్రమ సర్వే యాప్
రాష్ట్రంలో పరిశ్రమలకు అవసరమైన నిపుణుల వివరాలను తెలుసుకోవడానికి పరిశ్రమల శాఖ భారీ సర్వేను చేపట్టింది. ఇందుకోసం ‘సమగ్ర పరిశ్రమ సర్వే’ యాప్‌ను అభివృద్ధి చేసింది. దీని ద్వారా రాష్ట్రంలో 900 మెగా, లార్జ్ కంపెనీలతోపాటు 97 వేలకుపైగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) నుంచి వివరాలు సేకరిస్తారు. వచ్చే మూడేళ్లలో ఎంత మంది ఉద్యోగులు అవసరమవుతారు? ఏయే రంగాల్లో నైపుణ్యం ఉన్నవారు కావాలనే వివరాలను నమోదు చేస్తారు.