కరెంట్ అఫైర్స్ – జూలై 25, 2020

చెన్నైలోని ఫాక్స్ కాన్ ప్లాంట్లో ఐఫోన్ 11 తయారీ

ఆపిల్ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ఐఫోన్ 11ను చెన్నైలోని ఫాక్స్‌కాన్‌ ప్లాంట్లో తయారు చేయడం ప్రారంభించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ జూలై 24 ట్విటర్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. దేశంలో మేకిన్‌ ఇండియాలో ఇదో కీలకమైన పురోగతి అని ఆయన పేర్కొన్నారు. దేశంలో మొట్ట మొదటిసారిగా టాప్ఆఫ్దిలైన్ మోడల్‌ను తీసుకువస్తోందని తెలిపారు. 2017లో ఆపిల్ ఐఫోన్ ఎస్‌ఈ 2016 దేశీయ తయారీని బెంగళూరు ప్లాంట్‌లో ప్రారంభించింది.

వెస్టిండీస్‌– ఇంగ్లండ్‌ జట్ల మధ్య ‘రిచర్డ్స్‌–బోథమ్‌ ట్రోఫీ’

బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ, చాపెల్‌–హ్యడ్లీ ట్రోఫీ, వార్న్‌–మురళీధరన్‌ ట్రోఫీ తరహాలో ఇప్పుడు మరో సిరీస్‌ను ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల పేర్లతో వ్యవహరించనున్నారు. వెస్టిండీస్‌– ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఇకపై జరిగే టెస్టు సిరీస్‌లను ‘రిచర్డ్స్‌–బోథమ్‌ ట్రోఫీ’ పేరుతో వ్యవహరిస్తారు. ప్రపంచ క్రికెట్‌పై తమదైన ప్రత్యేక ముద్ర వేసిన ఇద్దరు స్టార్లను తగిన విధంగా గౌరవించుకునేంందుకు ఇరు బోర్డులు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాయి. వెస్టిండీస్‌–ఇంగ్లండ్‌ మధ్య జరిగే తర్వాతి టెస్టు సిరీస్‌ నుంచి ఈ ట్రోఫీ పేరును ఉపయోగిస్తారు. ఇరుజట్ల మధ్య జరిగే సిరీస్‌ను ఇప్పటి వరకు ‘విజ్డన్‌ ట్రోఫీ’గా వ్యవహరిస్తున్నారు. ‘క్రికెట్‌ బైబిల్‌’గా గుర్తింపు పొందిన ప్రఖ్యాత మ్యాగజైన్‌ ‘విజ్డన్‌’ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 1963లో ఇరు జట్ల బోర్డులు కలిపి పెట్టిన పేరు ఇన్నేళ్లు కొనసాగింది. ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్టు ‘విజ్డన్‌ ట్రోఫీ’లో చివరిది కానుంది.

వైరస్ కిల్లర్ పరికరాన్ని ఆవిష్కరించిన తెలంగాణ మంత్రి ఈటల

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం కోసం ప్రపంచమంతా యుద్ధప్రాతిపదికన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే తయారుచేసి వైరస్ కిల్లర్‌ అనే పరికరాన్ని జూలై 24న తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆవిష్కరించారు. ప్రపంచాన్ని సార్స్, ఎబోలా పట్టి పీడిస్తున్న తరుణంలో వాటిని అంతం చేయడానికి దక్షిణ కొరియా ఈ పరికరాన్ని రూపొందించింది. ఇది గాలిలో ఉన్న వైరస్‌ను తనలోకి లాక్కొని వాటిని అంతం చేయడం ద్వారా దానిని నిర్మూలిస్తుంది. ఈ పరికరానికి సంబంధించి ఉర్జా క్లీన్‌ టెక్‌ సంస్థ దేశవ్యాప్తంగా సేల్స్‌ అండ్‌ సర్వీస్‌ సేవలు అందిస్తోంది.

కోవిడ్ చికిత్సకు రూ. వెయ్యి కోట్లు : ఏపీ సీఎం

కోవిడ్‌–19 వైరస్‌ సోకిన వారికి సత్వర, మెరుగైన వైద్య సేవలు అందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అవసరాలకు అనుగుణంగా కోవిడ్‌ కోసం ప్రత్యేకంగా చికిత్స అందించే ఆసుపత్రుల పెంపు, అందులో మౌలిక సదుపాయాల కల్పనకు వచ్చే 6 నెలల్లో దాదాపు రూ.1000 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు.

2020లో భారీగా పెరగనున్న మొండి బకాయిలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో బ్యాంకు ల స్థూల మొండి బకాయిలు (జీఎన్‌పీఏ) భారీగా పెరిగే ప్రమాదముందని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) వెల్లడించింది. కరోనా దెబ్బకు దేశ ఆర్థిక పరిస్థితి నానాటికి కుదేలవుతుండటంతో పారిశ్రామిక రంగంలోని కంపెనీల పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటమే ఇందుకు కారణమని ఆర్‌బీఐ తన తాజా ద్రవ్య స్థిరత్వ నివేదిక (ఎఫ్‌ఎస్ఆర్‌)లో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొన్ని కంపెనీలు.. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించే పరిస్థితి ఏ మాత్రం కనిపించటం లేదని తెలిపింది. దీంతో వచ్చే ఏడాది మార్చి నాటికి బ్యాంకుల స్థూల మొండి బకాయిల భారం ఏకంగా 12.5 శాతానికి చేరుకునే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది. జీఎన్‌పీఏలు ఈ స్థాయికి చేరనుండటం 20 ఏళ్లలో ఇదే మొదటిసారి కావటం గమనార్హం. అయితే పరిస్థితులు మరింతగా విషమిస్తే జీఎన్‌పీఏ 14.7 శాతానికి చేరే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది. కాగా 2019-20 ఆర్థి క సంవత్సరంలో బ్యాంకుల మొత్తం రుణాల్లో జీఎన్‌పీఏలు 8.5 శాతంగా ఉన్నాయి.

స్వాతంత్య్ర సమరయోధుడు రామదాసు కన్నుమూత

స్వాతంత్య్ర సమరయోధుడు, శతాధిక కమ్యూనిస్టు నేత వీరపనేని రామదాసు(101) జూలై 24 తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఆరు రోజుల క్రితమే ఆయన భార్య వెంకటసుబ్బమ్మ కూడా అనారోగ్యంతో మరణించారు. దీంతో అప్పటి నుంచి ఆయన తీవ్ర మనోవేదనకు గురవడంతో ఆరోగ్యం క్షీణించి మృతి చెందారు. కృష్ణా జిల్లా గన్నవరం తాలూకా కోయగూరప్పాడుకు చెందిన రామదాసు 60 ఏళ్ల క్రితం కుటుంబంతో పాటు ములుగు జిల్లా గోవిందరావుపేటకు వచ్చి స్థిరపడ్డారు. కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్యకు ఆయన ప్రధాన అనుచరుడిగా వ్యవహరించారు.

టీఎస్ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ విద్యార్థులంతా పాస్

తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (స్టేట్‌ ఓపెన్‌ స్కూల్‌)లో పదోతరగతి, ఇంటర్‌ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవారందరినీ పాస్‌ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జూలై 24 ఉత్తర్వులు జారీచేసింది. ఈ అంశంపై ప్రభుత్వం నియమించిన 8 మంది సభ్యులతో కూడిన కమిటీ ఈనెల 16న సమావేశమై ప్రభుత్వానికి నివేదిక అందించిందని, దాని ఆధారంగా అందరినీ పాస్‌ చేస్తున్నట్టు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రాంచంద్రన్‌ ఉత్తర్వులో తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో 43 వేల పదోతరగతి, 32వేల ఇంటర్‌ విద్యార్థులు.. మొత్తం 75వేల మంది ఉత్తీర్ణత సాధించారని అధికారవర్గాలు తెలిపాయి.

అమెరికా దౌత్య కార్యాలయాన్న మూసివేయాలన్న చైనా

తమ దేశంలోని చెంగ్డూలో అమెరికా దౌత్య కార్యాలయాన్ని మూసివేయాలని అమెరికాకు చైనా జూలై 24 స్పష్టం చేసింది. టెక్సా్‌సలోని వైద్య పరిశోధనలతో పాటు ఇతర సమాచారాన్ని కూడా చైనా చోరీ చేస్తోందని ఆరోపిస్తూ.. హూస్టన్‌లోని చైనా దౌత్యకార్యాలయాన్ని మూసివేయాలని జూలై 21న అమెరికా ఆదేశించిన నేపథ్యంలో.. ప్రతిచర్యగా చైనా ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా తప్పుడు నిర్ణయం తీసుకుందని, దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చైనా వాషింగ్టన్‌ను కోరింది. అందుకు అమెరికా స్పందించని నేపథ్యంలో.. తాము ప్రస్తుతం తీసుకున్న చర్య న్యాయమైనదే కాక, అవసరమైనదని చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments