కరంట్ అఫైర్స్ – జూలై 23, 2020

ఉస్మానియా హాస్పిటల్ పాత భవనం సీజ్ కూల్చివేతకు సిద్ధం ?

పూర్తిగా శిథిలావస్థకు చేరిన హైదరాబాద్ లోని చారిత్రక ఉస్మానియా ఆసుపత్రిలోని పాత భవనాన్ని ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. భవనాన్ని వెంటనే ఖాళీ చేసి సీల్‌ వేయాలని ఆదేశించారు. కూలేందుకు సిద్ధంగా ఉన్న పాత భవనంలోని రోగులు, ఇతర కార్యాలయాలను వేరే భవనాల్లో సర్దుబాటు చేయాలని సూచించారు.

1925లో ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని నిర్మించారు. నిర్వహణ లోపం వల్ల ఇప్పటికే శిథిలావస్థకు చేరుకున్న ఈ భవనం పై అంతస్తుల్లోని పైకప్పు తరచూ పెచ్చులూడి పడుతోంది. గోడలు బీటలు వారాయి. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. ఉస్మానియా పాత భవనాన్ని యుద్ధ ప్రాతిపదికన కూల్చివేసి అక్కడ కొత్తగా ట్విన్‌ టవర్స్‌ను ఏడాదిలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పాత భవనాన్ని కూల్చి అదే స్థలంలో నిర్మాణం చేపట్టిన తర్వాత మిగతా భవనాలను కూల్చివేయనున్నారు.

పంద్రాగస్టుకు తెలంగాణలో ఖైదీల విడుదల

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని హోంశాఖను ఆయన కోరారు. దీంతో ఆగష్టు 15న సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలన్న సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కారాగారాల్లో అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. కోవిడ్‌ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో తెలంగాణ జైళ్లశాఖ దాదాపు 100 మందికి పైగా ఖైదీలను పెరోల్‌పై విడుదల చేసింది.

చిన్నారుల హక్కుల ఉద్యమకారుడు అచ్యుతరావు కన్నుమూత

బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు పి.అచ్యుతరావు (58) కరోనాతో జూలై 22 కన్నుమూశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లికి చెందిన అచ్యుతరావు చిన్నతనంలోనే కమ్యూనిస్టు ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యారు. 1985లో ఆయన బాలల హక్కుల సంఘాన్ని స్థాపించారు. బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. బాలల హక్కులపై న్యాయస్థానాల్లోనూ పోరాటం చేశారు. ఆయన లేవనెత్తిన పలు అంశాలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ సహా హైకోర్టును కూడా కదిలించాయి. బాలల హక్కుల పరిరక్షణ కమిటీ (ఎస్‌సీపీసీఆర్‌) సభ్యుడిగానూ ఆయన సేవలందించారు.

ఏపీలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమం ప్రారంభం

తెలంగాణలోని హరితహారం తరహాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా వన మహోత్సవానికి శ్రీకారం చుట్టింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని గాజులపేటలో ‘వనం మనం’ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి…. జగనన్న పచ్చతోరణం పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేదల కోసం ఏర్పాటు చేసిన ఇళ్ల లే అవుట్‌లో వేప, రావి మొక్కలు నాటి, నీరు పోశారు. వన మహోత్సవంలో భాగంగా 20 కోట్ల మొక్కల్ని నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు.

కోడి గుడ్ల ఉత్పత్తిలో దేశంలో ఏపీ టాప్

కోడి గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలో తొలి స్థానంలో ఉన్నట్లు కేంద్ర పశుసంవర్థక, పాడి పరిశ్రమ శాఖ పేర్కొంది. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న గుడ్లలో 19.1 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నట్లు తెలిపింది. 18.2 శాతంతో తమిళనాడు రెండో స్థానంలో ఉండగా… 13.2 శాతం ఉత్పత్తితో తెలంగాణ 3వ స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. ఆ తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్, హర్యానా ఉన్నట్లు వెల్లడించింది. 5 రాష్ట్రాలే దేశంలో సుమారు 65 శాతం గుడ్లను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది.

భారత్ లో పెట్టుబడులు పెట్టండి అమెరికా కంపెనీలతో ప్రధాని మోదీ

భారత్‌లోని ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, రక్షణ, ఇంధన, వ్యవసాయం, బీమా రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలంటూ అమెరికా కంపెనీలకు ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం పలికారు. భారత్‌ ఎన్నో అవకాశాలను కల్పిస్తోందన్నారు. ‘‘నేడు భారత్‌ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆశావాదం నెలకొంది. ఎందుకంటే భారత్‌ ఎన్నో అవకాశాలను, ఎంపికలను కల్పించడంతోపాటు తలుపులు తెరుస్తోంది’’ అంటూ అమెరికా–భారత్‌ వాణిజ్య కౌన్సిల్‌ను ఉద్దేశించి జూలై 22 మాట్లాడుతూ మోదీ పేర్కొన్నారు.

దేశీయంగా తొలిసారి రూ.50 వేలు దాటిన బంగారం ధర

పసిడి ధర దేశీయంగా తొలిసారి రూ.50,000 మార్కు దాటేసింది. మల్టీకమోడిటీ ఎక్స్ంజీ (ఎంసీఎక్స్‌)లో జూలై 23 రూ. 49,931 (10 గ్రాములు) వద్ద ప్రారంభమైన పసిడి ఫ్యూచర్స్‌ ఆ తర్వాత రూ. 50,085 రికార్డు స్థాయిని తాకింది. న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్లో మేలిమి బంగారం ధర రూ. 430 పెరిగి రూ. 50,920ని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్సుకు (33.3 గ్రాములు) 1,860 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. క్రమంగా 2011 సెప్టెంబర్‌లో ఇంట్రాడేలో నమోదైన 1,911.60 డాలర్ల ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి దిశగా బంగారం రేటు పరుగులు తీస్తోంది. అమెరికాలో కరోనా వైరస్‌ కేసులు భారీగా పెరుగుతుండటంతో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పసిడికి డిమాండ్‌ పెరుగుతోందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్టు (కమోడిటీస్‌) తపన్‌ పటేల్‌ చెప్పారు.

ప్రపంచ ధనవంతుల్లో 5వ స్థానంలో ముకేశ్ అంబానీ

ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ముకేశ్‌ అంబానీ ఐదో స్థానానికి ఎగబాకారు. ఫోర్బ్స్‌ రియల్‌ టైం రిచ్‌ లిస్ట్‌ ప్రకారం … జూలై 23 నాటికి ఆయన సంపద 7,510 కోట్ల డాలర్లకు పెరిగింది. ప్రస్తుత మారకం రేటు (డాలర్‌కు రూ.74.76) ప్రకారం.. మన కరెన్సీలో ఈ విలువ రూ.5,61,447 కోట్లు.

అంతర్జాతీయ ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బేజోస్‌ 18,490 కోట్ల డాలర్ల నెట్‌వర్త్‌తో ఈ కుబేర జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌ (11,350 కోట్ల డాలర్లు) రెండు, లూయిస్‌ విట్టన్‌ చైర్మన్‌, సీఈఓ బెర్నార్డ్‌ అర్నాల్ట్‌ అండ్‌ ఫ్యామిలీ మూడో స్థానంలో ఉన్నారు. ఫేస్‌బుక్‌ సహ వ్యవస్థాపకులు, సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ 8,790 కోట్ల డాలర్ల ఆస్తితో నాలుగో స్థానంలో ఉన్నారు.

ధ్రువాస్త్ర క్షిపణి ప్రయోగం విజయవంతం

దేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీట్యాంక్‌ గైడెడ్‌ (శత్రువుల ట్యాంకులను పేల్చివేసే) క్షిపణి .. ధ్రువాస్త్ర ప్రయోగపరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి జూలై 23 ఈ క్షిపణిని ప్రయోగించామని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) తెలిపింది.

కాక్రపార్‌ అణు విద్యుత్‌ ప్లాంట్‌-3ఉత్పత్తికి సిద్ధం

అణువిద్యుత్‌ చరిత్రలో భారత్‌ మరో మైలురాయిని దాటింది. గుజరాత్‌లోని కాక్రపార్‌ అణు విద్యుత్‌ ప్లాంట్‌-3లోని రియాక్టర్‌ ఉత్పత్తి కార్యకలాపాలను ప్రారంభించేందుకు అవసరమైన క్రిటికాలిటీ దశలో విజయం సాధించింది. దీంతో 700 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్‌లో అణు విద్యుత్‌ ఉత్పత్తికి మార్గం సుగమమైంది. ఈ సందర్భంగా భారత అణు శాస్త్రవేత్తలను అభినందిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ జూలై 23 ట్వీట్‌ చేశారు. స్వదేశీ పరిజ్ఞానంతో కాక్రపార్‌ ప్లాంట్‌ను అభివృద్ధిచేయడం ద్వారా ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు నిలువెత్తు ప్రతీకగా నిలిపారని వారిని కొనియాడారు.

చైనా కాన్సులేట్ మూసివేతకు ట్రంప్ ఆదేశం

అమెరికాలోని హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్‌ జనరల్‌ గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతోందన్న ఆరోపణలతో అమెరికా ప్రభుత్వం కాన్సులేట్‌ను మూసివేయాల్సిందిగా చైనాని ఆదేశించింది. అమెరికా మేధో సంపత్తిని, ప్రైవేటు సమాచారాన్ని కాపాడుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మోర్గా ఓర్టాగస్‌ జూలై 21 తెలిపారు. అయితే చైనా ఏ తరహా గూఢచర్యానికి దిగిందో ఆమె స్పష్టంగా వెల్లడించలేదు.

ఎందుకీ మూసివేత ?
అమెరికా, చైనా మధ్య కోవిడ్‌ వ్యాక్సిన్‌ అధ్యయనాల హ్యాకింగ్‌ చిచ్చు కాన్సులేట్‌ మూసివేత ఆదేశాల వరకు వెళ్లినట్టుగా అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు అభిప్రాపడుతున్నారు. కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన అధ్యయన వివరాలను తస్కరించారంటూ అమెరికా న్యాయశాఖ ఇద్దరు చైనా జాతీయుల్ని వేలెత్తి చూపిన రోజే హ్యూస్టన్‌లో కాన్సులేట్‌ మూసివేతకు ఆదేశాలు వెలువడ్డాయి. ఆ ఇద్దరు వ్యక్తులు అమెరికాలో జరుగుతున్న కరోనా వ్యాక్సిన్‌ అధ్యయనాలను తస్కరించడానికి ప్రయత్నించారని అమెరికా ఆరోపిస్తోంది.

సింగపూర్ లో భారత నర్సుకి అవార్డు

సింగపూర్‌లో భారత సంతతి నర్సు కళా నారాయణస్వామి(59) ప్రతిష్ఠాత్మక ప్రెసిడెంట్స్‌ అవార్డు అందుకున్నారు. కొవిడ్‌పై పోరులో అవిశ్రాంత సేవలందించిన ఐదుగురు నర్సులకు ఈ అవార్డు ఇవ్వగా వారిలో ఆమె ఒకరు. అధ్యక్షుడు హలీమా యాకూబ్‌ సంతకం చేసిన సర్టిఫికెట్‌, ట్రోఫీతో పాటు రూ.5.39 లక్షల నగదు బహుమతి అందుకున్నారు. వుడ్‌లాండ్స్‌ హెల్త్‌ క్యాంపస్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా కళా నారాయణస్వామి పనిచేస్తున్నారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments